Saturday, July 28, 2007

వేకువ రాగం

అంతా చీకటి. చుట్టూ ఏమీ లేదు సముద్ర ఘోష తప్ప. చంద్రుడు లేని ఆకాశం నల్లని చీర కట్టుకొని, పెద్దగా ఉన్న చీర కొంగుని అలాగే గాలికి వదిలేసి సముద్రపు ఒడ్డున తన ప్రియుని కోసం ఎదురు చూస్తున్న పడుచు లా ఉంది. అక్కడక్కడ మెరుస్తున్న నక్షత్రాలు ఆ చీర కొంగుకు అద్దిన చమ్కీల్లా ఉన్నాయి. తన ప్రియుడు రాబోతున్నాడని ఏ మేఘమో కబురంపినట్లు గా ఉంది దూరం గా తూర్పున ఒక చిన్న వెలుగురేఖ ఆశ లా విచ్చుకొంటోంది. వస్తూనే నన్ను ఎలా చుట్టెస్తాడా అన్న ఊహ వచ్చి బుగ్గలు ఎర్రబడినట్లు ఉన్నాయి. వెలుగురేఖ ఎర్ర నారింజ రంగు లోకి మారింది. ఆ ఊహల్లో ఉంటూండగానే చూసింది - దూరంగా అశ్వారూఢూడై వస్తున్నాడు సఖుడు. అరె! ఆకాశానికి ఎంత హర్షాతిరేకం!!. ఆనందంతో ఎన్ని రంగులు మార్చుకొంటోందో... ఎన్ని హోయలు వొలకబొస్తోందో... అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఏదో ఆహ్లాదమైన రాగాన్ని అందుకున్నట్లు గా ఉంది. నక్షత్రాలు బారులు తీరిన వయొలిన్ విద్వాంసుల్లా ప్రకృతి ఆలాపనకి వాయులీన సహకారం అందిస్తున్నారు. పిల్ళగాలి గాడు ఆ tunes కి అనుగుణంగా ఊగుతున్నాడు. ఆ రాగం.. ఒక క్రొత్త స్వాగతం లా... ఒక నూతన ఒరవడి లా... నిన్నటి బాధల నుంచి నేటి ఆనందాలకి నడిపించే దృక్పధం లా ఉంది.

సముద్ర గర్భం నుంచి భానుడు క్రొద్దిగా బయటకు వచ్చాడు అప్పటి వరకు అమ్మ ఒడిలోనే దాక్కొని పడుకొన్న చoటి బాబు ముఖం మీద దుప్పటి ని తొలగించి బయటకి చూస్తుంటే, అమ్మమ్మ వచ్చి "ఓయ్!! కన్నాలూ.. లెగిసిపోయావా!!" అని అడిగితే సమాధానం గా నవ్వినప్పటి నవ్వు వెలుగు లా ఉన్నాడు సూరీడు. ఇంక గమ్మున తెల్లారింది.

Sunday, July 22, 2007

చిన్న చిన్న ఆనందాలు

స్నేహితుని ఉత్తరం పూర్తిగా 'ఇట్లు నీ స్నేహితుడు, xxxx.' అంత వరకూ చదివాక కూడా మనకు తెలియకుండానే మన కళ్ళు క్రిందన ఇంకా ఏమన్నా రాశాడేమో అని గుడ్డిగా వెతుకుతాయి. ఎంత వెచ్చని గుడ్డి అభిమానం!!. ఆ ఉత్తరం ని చదివాక దానిని ఎంత ఆప్యాయం గా పట్టుకుంటామని!!.

ప్రియురాలి తో కానీ బాగా నచ్చిన వాళ్ళ తో కానీ phone లో మాట్లాడుతున్నప్పుడు, 'bye' చెప్పేసాక కూడా ఒక రెండు క్షణాల వరకు disconnect చెయ్యము. మాటల్లో చెప్పలేని భావం ఏదో ఇంకా మిగిలిపోయి, ఆది చెప్పలేక, call cut చెయ్యలేక హృదయం ఎంత ఆరాటపడుతుందని!!. కాసేపు ఆగి, వెనక్కి వెళ్ళి, ఆ రెండు క్షణాలని తరచి చూస్తే... మనసు ముగ్ధ మూగది అయ్యి, తేటగా అమాయకత్వం తో ఎంత ముద్దు గా కనపడుతుందో!!.

ఇలా చిన్న చిన్న feelings ఎంత అద్భుతమైనవో. ఈ చిన్న చిన్న ఆనందాలే జీవితమేమో.

Saturday, July 21, 2007

ముందు మాట

హాయ్!!,
కాలేజి లో ఎప్పుడు ఒంటరి గా అనిపిన్చలేదు। కానీ, జాబ్ లో చేరాక ఎందుకో చాలా ఒంటరి గా అనిపిస్తుంది. అందుకే ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటున్నాను. మనసు లోని భావాలను చెప్పాలి అని అనిపించినపుడు, మనసు ఎప్పుడూ మాతృభాష లో నే స్పందిస్తుంది. అందుకనే ఇలా తెలుగు లో మీతో మాటలూ... ముచ్చట్లూ...