Sunday, October 14, 2007

కనురెప్పల కావ్యం

నేను నీవైపే చూస్తున్నాను.
నువ్వు కనురెప్పలు సన్నగా వాల్చి, ఆ పైన మెల్లగా వాటిని ఎత్తి నన్ను చూశావు.
ప్రియతమా!, అది నాకొక కావ్యమయ్యింది.

Monday, October 8, 2007

సాహితి - తొలిపరిచయము

ఈ మధ్యన నా బ్లాగు నేనే సాంతం చదువుకున్నాను.
ఎందుకో అంతగా నచ్చలేదు. పెద్ద స్కూలు బ్యాగు మోసుకొని,
ఇసకలొ ఆడుకొని, చింపిరి జుట్టు, చీముడి ముక్కుతో స్కూలు
నుంచి వచ్చిన పాపలా అనిపించింది. నా పాపకి నలుగు పెట్టి,
కుంకుడికాయ రసం తో తలంటు పోసి, పట్టు లంగాజాకెట్టు
వేసి ముస్తాబు చెయ్యాలి అనిపించింది.
ఆ ప్రయత్నమే - ఈ 'సాహితి' సృష్టి.
....
ఆ రోజు కార్తీక ఏకాదశి. Engg. course లో ఈ మధ్యనే జాయిన్
అయ్యాను. చాలా రోజుల తర్వాత నిన్ననే ఇంటికి వచ్చాను. అమ్మ
పొద్దున్న 5 గం.ల కే గుడికి వెళ్ళడానికి నిద్ర లేపేసింది. బయట
చలి, లావుపాటి కంబలి లో కమ్మని వెచ్చదనం, పక్కన పడుకున్న
నాన్న మీద చెయ్యి వేసుకుంటే నాన్న బొజ్జ రిథమిక్ గా శ్వాసని
అనుసరించి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ఇలాంటి ambience ని
వదిలిలేవడానికి అస్సలు మనసు రాలేదు.
'ఇంకొక 5 నిమిషాలు అమ్మా!' అంటూ మళ్లీ ముసుగుతన్నాను.
కాసేపటికి మా చెల్లి మెల్లగా దుప్పటి ముఖం మీద నుంచి తీసి
చల్లని తడి చెయ్యి నా ముఖం మీద పెట్టింది. నేను దిగ్గున
లేచాను. తాను పరిగెత్తిన్ది. ఇంక తప్పదన్నట్లు లేచి టూత్ బ్రష్
అందుకున్నాను. చలిలో వేన్నీళ్ళ స్నానం భలే ఉంది.
...
అమ్మ, నేను, చెల్లి బయలుదేరాము. తూరుపు తెలతెలవారుతోంది.
వీధులు ఇంకా పూర్తిగా లేవలేదు. కొంగలు చెట్ల మీద నుంచి
ఎగురుతున్నాయి. ఆవుల పాకలో పాలవాడు పాలు పితుకుతున్న
శబ్ధం లయబద్ధంగా వినపడుతుంది. వీధి చివర జగ్గడు పందుంపుళ్ల
నోట్లో పెట్టుకొని, కంపలు తెచ్చి చలి మంట కాచుకుంటున్నాడు.
...
మువ్వగోపాలస్వామి గుడి. తొలిపూజ. భక్తులు బాగానే వచ్చారు.
గుడి లోపల అంతా కర్పూరం, చందనం, సాంబ్రాణి ధూపాలతో ఏదో
పవిత్రమైన భావనని కలుగజేసింది. స్వామిని రకరకాల పూమాలలతో
సమ్మోహనంగా అలంకరించారు. పూజ పూర్తయ్యింది. అందరము
గర్భగుడి ముందరి మందిరంలో కూర్చున్నాము. ఇంతలో పూజారి
మైకు తీసుకొని వచ్చాడు. కాసేపటికి 'కస్తూరి తిలకం... లలాట ఫలకే ...'
అంటూ ఒక గొంతు శ్రావ్యంగా పలికింది. ఇంత అందమైన స్వరం
ఎవరిదబ్బా అని చూడబోతుండగా 'అన్నయ్యా!, సాహితి!! ' అంటూ
చెల్లి ఉత్సాహంగా నా చెయ్యిని అదిమింది. ఇద్దరి భక్తుల తలల
మధ్యలోంచి చూశాను. అలా చూస్తూ ఉండిపోయాను. మొదటిసారిగా
sudden గా conceive చెయ్యలేని ఒక అద్భుతం ని కనుగొన్నట్లుగా
ఉండిపోయాను. లీనమై పాడుతూ, మధ్యలో కనురెప్పలు
మూస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉందో!. రెండు సంవత్సరాలుగా
తనని చూడలేదు. ఇప్పుడు ఇలా సడన్ గా చూసినప్పటి అనుభవం
బాగా అనిపించింది.
...
ఇంటికి వచ్చేశాము. మెడ మీదకి వెళ్లాను. పూల మొక్కలని
మంచుబిందువులు ఇంకా అంటిపెట్టుకొనే ఉన్నాయి. మెల్లగా
ఎండకాస్తోంది. చలికాలంలో నీరెండ కాస్తుంటే కమ్మగా ఉంది. పెరట్లో
చెట్ల నుంచి గాలి వీస్తూ నా జుట్టుని రేపుతోంది...
అలాగే జ్ఞాపకాలని కూడా...