Thursday, May 22, 2008

సుప్రజ..5 ..The End

ఇటు మా వ్యాపారం కూడా పుంజుకుంది. మా కంపెనీ ప్రారంభించి
అప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది. రాజు, రంగమ్మ ఇద్దరూ
అద్భుతంగా పని చేస్తున్నారు. రాజు బయట నుంచి ఆర్డర్‌లు
బాగా తీసుకొచ్చేవాడు.అంతకుముందు ఆటపట్టించిన అమ్మాయిలే
ఇప్పుడు రాజు పట్ల అభిమానం, గౌరవం చూపిస్తున్నారు.
మా ఉత్పత్తులకి ఆదరణ పెరిగి, మంచి పేరు వచ్చింది. ఇతర
రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఇంకా చాలా మంది
మహిళలు మాతో కలిసారు. కొందరైతే పొరుగూరు నుంచి
కూడా ఇక్కడకి వచ్చి పని చేస్తున్నారు. చిన్నగా ప్రారంభించిన
మా కంపెనీ ఎనిమిది నెలలలోనే పదిహేను లక్షల టర్నోవర్‌ని
చేరుకుంది. ఒక ప్రముఖ దినపత్రిక మా కంపెనీ గురించి ఆర్టికల్
వేసింది. నా ఫోటో, రంగమ్మ, రాజుల ఫోటోలు కూడా వేసారు.
మా ఊరి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు
చేసారు. మమల్ని అభినందించటానికి రామ్మూర్తి మామయ్య,
అత్తయ్య వచ్చారు. సభలో రాజు ఎందుకో కొంచం నీరసంగా, ఎక్కడో
కోల్పోయినట్లుగా అనిపించాడు. నేను, రంగమ్మ మాట్లాడాక
రాజుని ప్రసంగించమని అడిగారు. రాజు తడబడుతూ మైకు
అందుకున్నాడు. ఒక రెండు నిమిషాలు నోరు పెగల్లేదు. అప్పుడు
అర్థమయ్యింది-రాజు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడని. "ఒకప్పుడు
నేను అసలు మనిషినే కాదు. పశువులా ప్రవర్తించి జైలుకి కూడా
వెళ్లాను. ఇప్పుడు నేను మైకు అందుకుంటే ‘మన రాజుగాడు రా!..
మన రాజు గాడు!!’ అని ఎంతోమంది అభిమానంతో చూస్తున్నారు.
నా పేరు పేపర్లోకి ఎక్కింది. మా అమ్మా, నాన్నా వచ్చారు నన్ను
చూడటానికి." తన కంటి నుంచి నీరు తన్నుకొస్తుంది.
ఏడ్చేస్తున్నాడు. నేను దగ్గరకి వచ్చి తన భుజం మీద చెయ్యి వేసాను.
రాజు సర్దుకొని మళ్లీ మైకు అందుకొని, "నేను ఇప్పుడిలా
మారడానికి కారణం ఓ స్త్రీ మూర్తి. నా సంకుచిత దృష్టిని
విశాలం చేసి, నా జీవితాన్ని ఆనందమయం చేయటానికి తన
ఉద్యోగాన్ని సైతం వదులుకొని వచ్చిన ఆమె మరెవరో కాదు. మన
మ్యానేజింగ్ డైరెక్టర్-సుప్రజ." నాకేమి అర్థం కాకుండా అలాగే
నిలబడ్డాను. రాజు నాదగ్గరికి వచ్చి, "నన్ను క్షమించు" అని
నా కాళ్ల మీద పడబోయాడు. నేను " ఏంటి బావా ఇది? చిన్న
పిల్లాడిలా.." అని భుజాలు పట్టుకొని తనని ఆపేసాను.
ఆశ్చర్యంగా నా కళ్లు కూడా వర్షించేస్తున్నాయి. వాటిని
తుడుచుకుంటూ రంగమ్మని చూసాను. రంగమ్మ నిండుగా నవ్వింది.
వంశీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. వంశీకి ఎప్పటికప్పుడు
ఇక్కడి విషయాలు తెలియజేస్తూ ఉంటాను. తను "సుప్రజా!..
నిన్నుచూస్తుంటే నాకు గర్వంగా ఉంది." అన్నాడు.
నాకు భలే అనిపించింది.

పిల్లలందరూ చుట్టూ చేరేసరికి నేను గతంలోంచి బయటకి వచ్చాను.
"రాజు వెళ్లిపోయాడు. ప్యాకెట్‌లో ఏముందో చూడు." అని పిల్లలు
గోల చేస్తుంటే ప్యాకెట్ తెరచి చూసాను. చూస్తే, కర్రతో చేసిన
వంశీకృష్ణుని బొమ్మ. చాలా బాగుంది. ఇంతలో వంశీ బస్సు దిగాడు.
కృష్ణుని బొమ్మ ముఖానికి అడ్డం పెట్టుకొని మెల్లగా బొమ్మని జరిపి
ఒక కన్నుతో చూసాను- ఎదురుగా నా వంశీకృష్ణుడు.

...................................శుభం.........................................

సుప్రజ..4

రాజు వసతి మా చిన్నాన్న గారి దగ్గర పెట్టించాను. మా చిన్నాన్న
వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లు. మనుషులే కాకుండా, చెట్లు,
పక్షులు, కుందేళ్లు అన్నీ ఆనందంగా సహజీవనం చేస్తాయి అక్కడ.
చిన్నాన్న మా ఊరి ప్రాధమిక పాఠశాల హెడ్‌మాస్టరు.
అప్పుడప్పుడు ఊరి ప్రజలకోసం ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తుంటారు.
రాజు గురించి చిన్నాన్న వాళ్లకి చూచాయగా చెప్పాను. ఇంక మా
ఆఫీషులో అందరూ ఆడవాళ్లే ఒక్క రాజు తప్పించి. అందులోనూ
యువత శాతం సగానికి పైగానే. ఎప్పుడూ అమ్మాయిలతో పెద్దగా
మాట్లాడని రాజు ఇప్పుడు ఈ పల్లెటూర్లో.. మా మహిళల మధ్య
ఉద్యోగిగా ..ఎలా వుంటాడో, అది తనకి మంచి చేస్తుందో లేదో
అని నాకు సందేహాలు ఉన్నా రెండు కారణాలు నాలో
విశ్వాసాన్ని నింపేవి. ఒకటి మా లిల్లీస్ గ్రూపు లీడర్ రంగమ్మ.
మరొకటి స్వచ్ఛమైన మా పల్లెటూరి వాతావరణం.

రంగమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తనని చూస్తే
పరిచయం లేకపోయినవారికైనా ఆత్మీయరాలుగా కనపడుతుంది.
మన బాధలన్నీ తనతో పంచుకోవాలనిపిస్తుంది. నాకైతే
తను ఒక మనిషిని చూస్తే ఆ వ్యక్తి యొక్క అలోచనలు,
భయాలు, అభద్రతా భావాలు ఇవన్నీ మరుక్షణం తనకి
తెలిసిపోతాయెమో అనిపిస్తుంది. ఎప్పుడూ చాలా సంతృప్తిగా
కనపడుతుంది. ఒకే సమయంలో చలాకీగానూ, నిర్మలంగానూ
ఉండటం తనకే చెల్లుతుందేమో. తను ఊర్లో ఉత్సవాలకి
బుర్రకధలు చెబుతుంది. ఊర్లో వాళ్లందరూ బుర్రకథలు
చెప్పాలంటే రంగమ్మే అంటారు. ఇంక రంగమ్మ, వాళ్లాయన
ఇద్దరినీ కలిసి చూడాలి. ఇద్దరూ చిన్నపిల్లల్లా ఆటలూ,
పాటలూ, అలకలూ, కోట్లాటలూ.. ఏమంటే, "మాకు పిల్లలు
లేరు కదమ్మా. అందుకే తనకు నేను, నాకు తను
చిన్నపిల్లలమైపోతాము." అంటారు.

ఆలాగే మా ఊరు కూడా. ఇంకా పట్నపు వాసనలు సోకని
పదహారణాల పల్లె మాది. ఒకరి ఇంట్లో చిన్న సమస్య వస్తే
అది వీధిలో అందరి సమస్య అవుతుంది. ఎప్పుడూ ఏదో సందడి
వాతావరణమే. పండగలు,తిరునాళ్లు, వ్రతాలు, మహాశివరాత్రి,
భీష్మ ఏకాదశి, రథసప్తమి ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే
ఉంటుంది. పిల్లలు చాలా స్వేచ్ఛగా ప్రకృతి ఒడిలో పెరుగుతారు.
ఆత్మీయతలూ, అనుబంధాలు ఇంత అందంగా ఉంటాయని
మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇంకొకరితో మాటలు కలపడానికి
సందేహించటం, లోపల ఒకలా, బయట మరొకలా ఉండటం..
ఇలాంటివి ఎలా ఉంటాయో కూడా చాలామందికి తెలియదు.

మొదట్లో రాజు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కేవలం ఆఫీషు
విషయాల గురించే మాట్లాడేవాడు-అదీ నాతోనే. నేను తనని
ఒక దోషిగా చూస్తున్నట్టు భావించేవాడు. మా కంపెనీలో తన
ఉద్యోగం మీద కూడా తనకి చులకన భావమే ఉంది. నేను కూడా
ఆఫీషు పనుల గురించే మాట్లాడేదాన్ని. "ఇంకా వివరాలు
కావాలంటే, రంగమ్మని అడుగు." అని చెప్పేదాన్ని. అలా రంగమ్మతో
మాట్లాడేవాడు. చిన్నాన్న వాళ్ల ఇంట్లో కూడా అంతే. కానీ చిన్నాన్న,
పిన్నీ విసుగు పడకుండా చక్కగా చూసుకునేవారు. ముభావంగా
ఉండటం వలన కొన్నాళ్లకి చుట్టుపక్కల వాళ్లు రాజుని
ఏడిపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వీధిలోని అల్లరి పిల్లలు
ఇంక ఆఫీషులో అమ్మాయిలు. ఈ ఏడిపించటం రోజురోజుకీ
ఎక్కువయ్యింది. ఆఫీషులో శృతిమించకుండా రంగమ్మ చూసుకొనేది.
కానీ వీధిలో పిల్లలు మాత్రం అస్సలు క్షమించేవారు కాదు. వీధిలో
రాజు నడుస్తూ ఉంటే, వెనకాల పిల్లల గ్యాంగు తన మీద ఏదో
పాట కట్టి ఏడిపించేవారు. రాజులో కూడా ఈ విషయంలో విసుగు,
చికాకు పెరుగుతున్నట్టు గమనించాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని
సందేహించసాగాను. రంగమ్మతో చర్చిస్తే కొంచం ఓపిక
పట్టమంది.

అది గాలిపటాల సీజను. వీధిలో పిల్లలందరూ గాలిపటాలు
ఎగరేస్తున్నారు. గౌతమ్ (మా చిన్నాన్న చిన్న కొడుకు) గాలిపటం
చెట్టుకొమ్మకి చుట్టుకొని తెగిపోయింది. అది చూసి రాజు వాడికోసం
తనే సొంతంగా ఒక గాలిపటాన్ని తయారు చేసాడు. ఆ గాలిపటం
డిజైన్ అదీ కొత్తగా ఉండి వీధిలో అందరి గాలిపటాల కన్నా
ఎత్తుగా ఎగిరింది. దాంతో పిల్లలందరూ "నాకొకటి చెయ్యవా?"
అంటూ రాజు వెంటపడ్డారు. రాజు వాళ్లందరికీ మంచి మంచి
డిజైన్లు, రంగులతో కొత్త, కొత్త గాలిపటాలు తయారు
చేసిచ్చాడు. వాళ్లకీ తయారు చెయ్యడం నేర్పించాడు. దీంతో వీధి
పిల్లలందరికీ రాజు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. తనని
ఏడిపించడం మానెయ్యడమే కాదు, ఇప్పుడు దేనికైనా
రాజు, రాజు అంటూ వెంటతిరుగుతున్నారు. రాజు కూడా మెళ్లగా
వాళ్లకి క్రికెట్ బ్యాట్‌లు తయారు చేసి ఇవ్వడమూ, వాళ్లతో
అప్పుడప్పుడూ క్రికెట్ ఆడటమూ మొదలుపెట్టాడు. రాజులో
ఇదివరకటి విసుగు లేదు. కొన్నాళ్లకి ఊర్లో గ్రామదేవత
ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలన్నిటి
కన్నామన ఊర్లో బాగా జరగాలన్నట్టు అందరూ సన్నాహాలు
చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ మా చిన్నాన్న చేపట్టారు. రాజుకి
అక్కడి లైటింగు ఏర్పాట్లు అస్సలు నచ్చలేదు. తను చేస్తానన్నాడు.
చిన్నాన్న "సరే" అన్నారు. రాజు సిటీకి వెళ్లి, కావల్సినవన్నీ
కొనుక్కొని, ఇక్కడ పిల్లలు, కొందరు ఆర్టిస్ట్‌లతో కలిసి
కర్రలతో పెద్ద పెద్ద దేవుళ్ల ఆకారాలు చేసి దానికి లైటింగు
ఏర్పాట్లు చేసాడు. చాలా అద్భుతంగా వచ్చింది. ఊరు ఊరంతా
రాజు పేరు మార్మోగిపోయింది. ఈ రెండు సంఘటనలు రాజుని
బాగా ప్రభావితం చేసాయి.మొదట వీధిపిల్లలతో ఆటలు.. నెమ్మదిగా
తన ఈడు వారితోనూ, పెద్దలతోనూ ఊర్లో చిన్న చిన్న
కార్యక్రమాల నిర్వహణ.. ఇలా కలుపుగోలుగా మారాడు. ఆఫీసు
పని కూడా ఉత్సాహంగా చేస్తున్నాడు. ఆఫీసులో అమ్మయిలతో
కూడా కొద్ది, కొద్దిగా మాట్లాడసాగాడు. రంగమ్మ, తను అయితే
స్నేహితుల్లా కలిసిపోయారు. రాజులో ఏదో కొత్త వెలుగు.
తనని తాను సరికొత్తగా తెలుసుకుంటుండటం వల్లనేమో.

సుప్రజ..3

నేను రాజు ఎందుకిలా తయారయ్యాడు అని ఆలోచించసాగాను.

వంశీ, నేను కలిసి మా అత్తా, మామయ్యలతోనూ, తన ఫ్రెండ్స్‌

తోనూ తనని గురించి విచారించాము. మా అత్తా, మామయ్యలకు

తను ఒక్కడే కొడుకు. రాజు వాళ్ల నాన్న అంటే మా రామ్మూర్తి

మామయ్య పెళ్లైన కొత్తలోనే బంధువులందరూ ఉన్నమా ఊరు

వదిలి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మేమందరమూ మా

ఊర్లో కలుపుగోలుగా చాలావరకూ సత్సంబంధాలతో ఉంటాము .

రామ్మూర్తి మామయ్యకీ మిగిలిన బంధువులకీ మధ్య రాకపోకలు

కూడా తక్కువే. అవసరమయితేనే కనపడతాడు అని చెబుతూ
ఉంటారు. ఇక రాజు పెరిగిన తీరు విషయానికి వస్తే, మా అత్తా,

మామయ్యలు ఎప్పుడూ ‘చదువు, చదువు’ అని బలవంతపెట్టటమే

కానీ ‘పిల్లలు వ్యక్తిత్వపరంగా ఎలా ఎదుగుతున్నారు? వాళ్ల

భావోద్వేగాలు ఏంటి?’ అని పట్టించుకొనే వాళ్లుగా నాకు

అనిపించలేదు. రాజు క్లాస్‌మేట్స్‌నీ, కొలీగ్స్‌నీ విచారిస్తే వాళ్లు

తను చాలా రిజర్వ్‌గా ఉంటాడనీ, తన ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు

ఎవ్వరూ లేరని చెప్పారు.దానికి తోడు రాజు ఇంటర్‌మీడియట్

వరకూ కో‌ఎడ్యుకేషన్ విధానంలో చదువుకోలేదు. తనకి

కొంచం దగ్గరయిన ఒక ఫ్రెండ్‌ని అడిగితే రాజు తనతో

అమ్మాయిలు ఎవ్వరూ మాట్లాడరని బాధపడుతుంటాడని చెప్పాడు. రాజు
భవిష్యత్తు ఏంటని అప్పుడు ఆలోచిస్తే, తను హైదరాబాద్‌లో ఇంక
కొన్నాళ్లవరకూ ఉద్యోగం చెయ్యలేడని అనిపించింది. పొనీ వేరే
సిటీలో ఉద్యోగం చూసుకున్నా, ఆ రోజు జరిగిన సంఘటనలు,
వాటి పరిణామాలు (తను జైలుకెళ్లడం, ఉద్యోగం పోవడం)
వీటన్నింటివలన తను అమ్మాయిలని మరింత ద్వేషించుకుంటాడు.
అమ్మాయిల పట్ల తనకున్న అపోహలు, ఆత్మన్యూనతా భావము
అలానే ఉండిపోతాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయం
తీసుకున్నాను. వంశీకి చెప్పాను. అది చాలా రిస్క్ అని తను
మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పించగలిగాను. తర్వాత ఈ
విషయం గురించి మా అత్తా, మామయ్యలతో మాట్లాడాము. వారు
నిర్లప్తంగా ‘సరే’ అన్నారు. నేను రాజు దగ్గరికి వెళ్లి "నీకు మా
ఊర్లో ఉద్యోగం ఇప్పిస్తాను. నాతో వస్తావా?" అనడిగాను. కాసేపు
మౌనంగా ఉండి, ‘సరే, వస్తాన’న్నాడు. ‘ఏ ఉద్యోగం?
ఎలాంటి పని?..’ లాంటి కనీస వివరాలు కూడా అడగలేదు.

ఇంక మా ఊరు వచ్చి నేను ఒక చిన్న కంపెనీ ప్రారంభించాను.
నాకు ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉన్నా అంత త్వరగా
చేస్తాననుకోలేదు. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలలోని
నాకు తెలిసిన ఒక ఇరవై మంది సభ్యులుగా చేరారు. రంగమ్మ
వీళ్ల గ్రూపు లీడరు. మొదట ఉన్ని ఉపయోగించి శాలువాలు
తయారుచెయ్యడం, వాటి మీద ఆర్ట్ వర్క్ వెయ్యటం, కర్ర మరియు
గ్లాసు ఉపయోగించి గృహాలంకరణ వస్తువులు, అందమైన
హాండ్‌బ్యాగులు తయారుచెయ్యటం తదితర అంశాలపై శిక్షణ
ప్రారంభించాము. మా కంపెనీకి ‘లిల్లీస్’ అని పేరు పెట్టాము. రాజు
మా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముభావంగానే
బాధ్యతలు చేపట్టాడు. వంశీ ఉద్యోగనిమిత్తము యూరప్ వెళ్లవలసి
వచ్చింది. మా ప్రేమ విషయం తను అటునుంచి వచ్చాక ఇరువర్గాల
పెద్దలకీ చెబుదామనుకున్నాము.

సుప్రజ...2

"ఏంటి వంశీ కోసం వెయిటింగా?" అనడిగాడు. అవునన్నట్టు


నవ్వాను. "నువ్వేంటి ఇక్కడ .. ఇలా?" అనడిగాను.


"నీకోసమే" అన్నాడు. రాజు ఎప్పుడూ అలా మాట్లాడడు.


అప్పుడు గమనించాను రాజు కళ్లు చాలా అశాంతిగా కనిపించాయి.


చూపులు అటూ, ఇటూ కదులుతున్నాయి. "ఊ.. చెప్పు బావ..
ఏంటి సంగతులు?" అనడిగాను. కాసేపాగి


"సుప్రజా!!, హాపీ వాలెంటైన్స్ డే." అన్నాడు. ఆశ్చర్యంగా, రాజు


గొంతు వణుకుతోంది. అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నా వంతు


అయ్యింది. కొంచం నవ్వడానికి ప్రయత్నిస్తూ థాంక్స్ చెప్పి,


"ఏంటి బావా.. అలా ఉన్నావు?" అని అనునయంగా భుజం మీద


చెయ్యి వేసి అడిగాను. "వద్దూ!!" అంటూ ఒక్కసారిగా నా చెయ్యి


విదిల్చేసాడు. "ఇలా మాట్లాడే నువ్వు నన్ను మోసం చేసావు."


రాజు ఊగిపోతూ ‘నన్ను మోసం చేసావు’ అన్న అదే మాట మళ్లీ
మాట్లాడుతున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. మెదడు పనిచెయ్యటం


ఆగిపోయినట్లుగా ఉంది. కొంచం సంభాళించుకొని, "ఏంటి బావా..


నేను మోసం చెయ్యడమేంటి.. ఏమి మాట్లాడుతున్నావు నువ్వు?"
అన్నాను. "ఆపు!!" అంటూ చేతుల్ని గాలిలోకి బలంగా కొట్టాడు.


"ఏమీ తెలియనట్టు ఈ అమాయకపు నటనలు వద్దు. వద్దుఇంక..


అసలు మీ ఆడవాళ్లందరూ ఇంతే. అంతా చేసి చివరికి నేను


నీ గురించి అలా ఫీలవ్వలేదంటారు." అని వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.


నేను అలా స్తబ్దుగా ఉండిపోయాను. ఇంతలో వంశీ మెసేజ్


వచ్చింది-‘ఇంకొక 10 నిమిషాలు లొ వచ్చేస్తాను అని’. "నేనంటే నీకు


ఇష్టమే కదా" అన్న మాటలు వినపడి చూస్తే మళ్లీ రాజు.


"చూడు బావ.. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నావు.


మొదట నువ్వు నిదానంగా ఉండు.." అని ఇంకా చెప్పబోతుంటే,


"మరి నాకు ఫోన్ చేసి అభిమానంగా ఎందుకు మాట్లాడతావు?


నా బర్త్‌డేకి గ్రీటింగు, గిఫ్టులు ఎందుకు తెచ్చావు? గ్రీటింగులో
నేను ‘వెరీ స్పెషల్’ అని లేదూ.. అంటే దాని అర్థమేమిటి .. చెప్పూ..


ఇవన్నీ ఇష్టం లేకుండానే చేసావా?.. నాకున్నది నువ్వొక్కదానివే


అనుకున్నాను. నువ్వు కూడా నన్ను మోసంచేసావు!!.." అని


ఆవేశంగా ఏవేవో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు తన సమస్య


కొంచం అర్థమవ్వసాగింది. "నేను ఇక్కడికి వచ్చాక హైదరాబాద్‌లో


నాకున్న బంధువులు మీరొక్కరే. మరి మీతో కాకుండా మరెవరితో


మాట్లాడతాను? నువ్వు బాగా చదువుతావని, మంచి క్రమశిక్షణతో


నడచుకుంటావని నాన్న నీ గురించి చెబుతుండటం వలన నాకు నీ


మీద చాలా మంచి అభిప్రాయం, గౌరవం, అలాగే బావవన్న అభిమానం


ఉన్నాయి. అందుకే బర్త్‌డేకి గ్రీటింగ్ కార్డ్స్ అవీ ఇచ్చాను. ఇంక


గ్రీటింగ్ కార్డ్‌లో వెరీ స్పెషల్ అని ఉండటం చాలా క్యాజువల్. దానిని


నువ్వు వేరే విధంగా.." ఇంకా ఏదో చెప్పబోతుండగా తను దగ్గరగా


ముఖం మీదకు వచ్చి, నా మాటలను కట్ చేస్తూ, "క్యాజువలా.. ఆ వెరీ


స్పెషల్ అన్నమాట నన్ను ఎన్ని ఊహల్లో ఎగరేసిందో.. నా ప్రపంచాన్ని


ఎంతలా మార్చేసిందో నువ్వు కనీసం ఊహించావా.. అయినా దాని


అర్థం నీకు మాత్రం తెలియదూ.. ప్లీజ్ సుప్రజా!!.. నన్నర్థం చేసుకో.


నాకు నువ్వు కావాలి. ఇంతవరకూ నాకు దగ్గరయ్యింది నువ్వొక్కదానివే.


నువ్వు నాకు కావాలి." అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు. తను


ఆవేశంతో గట్టిగా మాట్లాడటం వలన చుట్టుపక్కల వాళ్ల దృష్టి


మా మీద పడింది. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. నాకు చాలా


ఇబ్బందిగా అనిపించింది. నేను కోపంగా చెయ్యి విదిల్చి, దూరం


జరగబోయాను. తను నా చున్నీ పట్టుకొని నన్ను దగ్గరకు


లాగాడు. ఆ హఠాత్పరిణామానికి గట్టిగా అరిచాను. నా చున్నీ తన


చేతులోకి వచ్చేసింది. రాజు మృగంలా మారిపోయాడు. నేను


అరవటం గమనించిన రాజు నన్ను పట్టుకొని నా నోరు


నొక్కేయబోయాడు. నేను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే,


నా రెండు చేతులూ బలవంతంగా వెనక్కి విరిచి, ఒక చేత్తో వాటిని


పట్టుకొని మరొక చేత్తో నా నోరు నొక్కేస్తూ "అరవకు.

చంపేస్తాను" అని బెదిరించాడు. నేను తన కబంధ హస్తాల్లో

గింజుకుంటున్నాను. ఈలోపు చుట్టుపక్కల వాళ్లు వచ్చి, రాజుని

నా నుంచి విడదీసి తనకి దేహశుద్ధి చేయసాగారు. నేను

అవమానంతో అక్కడే కూలబడిపోయాను. ఇంతలో నా భుజం

మీద ఒక చెయ్యి పడింది. తలెత్తి చూస్తే వంశీ. ఒక్క ఉదుటన

తనని కావలించుకొని భోరున ఏడ్చేసాను. కాసేపటికి

పోలీసులు వచ్చారు. రాజుని తీసుకెళ్లారు. మమ్మల్ని తరువాత

రమ్మన్నారు.


రాజు మీద ఈవ్ టీజింగ్ మరియు హత్యాప్రయత్నము నేరాల మీద

కేసు నమోదు అయ్యింది. కొంత జరిమానా, కొన్ని రోజుల జైలు

శిక్ష పడింది. మర్నాడు ప్రముఖ వార్తాపత్రికల జిల్లా ఎడిషన్‌లలో

ఈ వార్త రాజు ఫోటోలతో సహా పడింది. రాజుని వాళ్ల కంపెనీ

ఉద్యోగంలోంచి తొలగించింది. మామయ్య తనని బెయిల్ మీద

విడిపించారు. మరుసటి రోజు తను ఆత్మహత్యా ప్రయత్నం చేసి

హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి నేను, వంశీ వెళ్లాము. రాజు ఆపరేషన్

రూంలో ఉన్నాడు. ఏం జరిగిందని మామయ్యని అడిగాను. రాజు

ఇంటికి వచ్చాక ‘నన్ను ఎక్కడికైనా పంపించెయ్య’మని అడిగాడట .

‘నువ్వు చేసిన పనికి ఇక్కడే ఉండి అనుభవించు’ అని మామయ్య

నిష్ఠూరంగా అన్నారట . తరువాత చూస్తేబాత్‌రూంలో పురుగుల

మందు తాగేసి పడి ఉన్నాడట. రాజు హాస్పిటల్ నుంచి డిస్‌ఛార్జ్

అయ్యేవరకూ అత్తకు తోడుగా నేనూ తనకి సేవలు చేసాను.

సుప్రజ...1

మనోహరంగా నిద్రలేచాను.. ఈ రోజు వంశీ వస్తున్నాడు. తన
ఆలోచనలతోనే పడుకున్నాను. వాటితోనే నిద్ర లేచాను. వాకిలి
తలుపులు తెరచి బయటకు వచ్చాను. జనవరి మాసపు
ఉదయం ఐదు కావస్తూంది. చల్లగాలి చెలికత్తెలా సంబరంగా
చుట్టుముట్టింది. నక్షత్రాలు అందమైన స్మృతులను
గుర్తుతెచ్చుకొని తమలో తాము నవ్వుకుంటునట్లుగా ఉన్నాయి.
కళ్లాపు చల్లి ముగ్గువెయ్యటం మొదలుపెట్టాను. ముగ్గు వేసానో
లేక నా మనసే గీసానో, వేసాక చూసుకొని గారాలు పోయాను.
ఎందుకో ప్రతీ పనీ ఎంతో అపురూపంగా మురిసిపోతూ చేస్తున్నాను.
పూలు కోసాను. ఆ వంశీకృష్ణునికో ... నా వంశీ కృష్ణునికో..
స్పష్టంగా చెప్పలేను. ఇంక తలంటు స్నానం ... నీ ప్రేమ నన్ను
ఏంచేసిందో గానీ నన్ను నేను మరింతగా ఇష్టపడుతున్నాను.
ఎంత గొప్ప అనుభవమో ఇది!!. స్నానం చేసాక లంగా, వోణీ
వేసుకొని, తడిచిన జుత్తుని తువాలులో చుట్టి, ముడివేసి,
కాళ్ల పట్టీల మువ్వలు సవ్వడి చేస్తుండగా వాకిలి తెరచి
తులసి చెట్టు ముందు దీపం వెలిగించాను. కొంచం దూరం
వెళ్లిచూస్తే, తూరుపు తెలతెలవారుతుండగా చిరు దీపపు
కాంతిలో తులసి మా తల్లి ఎంత శోభగా ఉందో. తర్వాత
అమ్మతో కలసి దేవుడి గదిలో పూజ. ఆ తర్వాత జుత్తు
ఆరబోసుకోడానికి అమ్మ సాంబ్రాణి ధూపం వేసింది.
నా ఊహలో నువ్వున్నప్పుడు ఈ దేహం సుగంధంతో
తొణుకుతుంటుంది కదా.. మరి ఈ ధూపాలెందుకు అనిపించింది.
పిచ్చి అమ్మ .. తనకు తెలియదు కదా!. అప్పటికే ఇంట్లో మిగిలిన
పిల్లలూ, పెద్దలూ అందరూ ఒక్కొకరుగా లేవటం మొదలుపెట్టారు.
ఇంక గమ్మున తెళ్లారింది.

నేను కనకాంబ ఆలయం పక్కన రావి చెట్టు దగ్గర నిల్చొని
చూస్తున్నాను. మా ఊరికొచ్చే బస్సులు అక్కడే ఆగుతాయి. రత్నం
మామయ్య, శిరీష అప్పటికే వచ్చేసారు. అన్నట్టు చెప్పడం మరిచాను
కదా..వంశీ నాకు బావ అవుతాడు.. రత్నం మామయ్య కి కొడుకూ
.. శిరీషకి అన్నయ్యానూ. బయట ఆడుకుంటున్న పిల్లలు నా
చుట్టూ మూగారు. ఇంతలో నాగరాజు బావ వచ్చాడు. తనని నేను
రాజు అని పిలుస్తుంటాను. "వంశీ గురించి వెయిటింగా?"
అనడిగాడు. అవునన్నట్టుగా నవ్వాను. తను కవర్‌లోంచి ఒక
ప్యాకెట్ తీసి నా చేతికిచ్చి, “నేను వెళ్లిపోయాక ఓపెన్ చెయ్యు” అని
చెప్పి వెనక్కి మళ్లాడు. నేను వెళ్లిపోతున్న రాజునే చూస్తున్నాను...

గత సంవత్సరపు మాట. నాకు స్పస్టంగా గుర్తుంది-ఆ రోజు
ప్రేమికుల రోజు. నేను వంశీ గురించి ఈరోజులాగే హైదరాబాద్‌లో
నిరీక్షిస్తున్నాను. వంశీ ముంబాయిలో ఒక ప్రముఖ న్యూస్ చానెల్ కి
పనిచేస్తున్నాడు. నేను సైకాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి
ఇక్కడ హైదరాబాద్‌లో ఒక పర్సనల్ కౌన్సిలింగ్ కన్సల్టెన్సీలో
పనిచేస్తున్నాను. కొన్ని నెలల తర్వాత కలవబోతున్నాము. తను
అక్కడ నుంచి బయలుదేరిన ప్రతీ గంటకీ మొబైల్‌కి మెసేజ్
పంపిస్తున్నాడు. ఇంతలో రాజు వచ్చాడు.