Friday, October 24, 2008

ముసుగు లోపల..

ఉరుకుతూ బస్సెక్కాను. చీర చెమటతో తడిసిపోయింది. పొద్దంతా కూలి చేసి, సాయంత్రం ఆ డబ్బులతో మా చంటోడికి బట్టలు కొని, మా ఊరి బస్సెక్కేసరికి రాత్రి తొమ్మిది దాటింది. కండెక్టరు టికేట్ ఇచ్చాక చేతిలో రెండు రూపాయలే మిగిలాయి. ఊరెళ్ళాక పనికొస్తాయని దాచుకున్నాను. బాగా ఆకలేస్తుంది. పనితో ఒళ్ళు హూనమైనా నిద్ర పట్టట్లేదు. పొద్దుట్నుంచి తిండి లేదు. ఇంకేమీ చెయ్యలేక కళ్లు మూసుకున్నాను. ముందు సీట్లో ఒక బట్టతల ఆయన ప్రక్కవాళ్లకి దేవుని గురించి అందరికీ వినిపించేలా చెబుతున్నాడు. 'మనిషికి భగవంతుని మీద తప్ప మరే విషయం మీద అనురక్తి ఉండకూడదు.' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నా నాకేమీ ఎక్కట్లేదు. వాళ్ళెవరికీ ఆకలి లేదు. నాకుంది. కడుపు నిండాకే దేవుడు.

బస్ లో లైట్లాపేశారు. బయట కూడా చీకటిగానే ఉంది.మధ్యలో ఆగినప్పుడు ఒకాయన బస్సెక్కి నా పక్కన కూర్చున్నాడు. కొంచం కళ్ళెత్తితే ఆయన బూట్లు కనపడ్డాయి. మళ్ళీ చీకటి. కాసేపటికి ఆయన నా వైపుకి ఒరుగుతున్నాడు. నిద్రలో ఉన్నాడో ఏమో. నాకు అతన్ని పక్కకి తోసే ఓపిక ఎంత మాత్రం లేదు. ఆకలిని జయించడానికి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేసాను. ఇంకాసేపటికి అతని చెయ్యి నా ఒంటి మీదకు చేరింది. నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. పైగా వచ్చే స్టాపులో అతని ద్వారా ఏమన్నా తినడానికి దొరుకుతుందన్న ఆశ కలిగింది. నా ఒంటి మీద అతని చెయ్యి కదులుతోంది. ఒళ్ళంతా చెమటతో, కండరాలు పీకుతూ నా శరీరం నాకే అసహ్యంగా ఉంది. కానీ నాకు అసహ్యమైన శరీరమే అతనికి అమృతప్రాయంలా ఉంది. అసలు నిజంగా వెలుగులో నేనతనికి నచ్చుతానా?.. అయినా ఆకలి గా ఉన్నప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. ఒక్కోసారి చీకటి (అజ్ఞానం)లో కూడా ఆనందముంటుంది. ఇంతలో బస్సాగింది. లైట్లు వెలిగాయి. అతని వయస్సు ముప్పై పైనే ఉంటాయి. చామనచాయితో ముఖమంతా మొటిమలున్నాయి. ఆకలేస్తుందని చెప్పాను. రెండు గారెలు, ఒక టీ ఇప్పించాడు. కడుపు తృప్తి పడింది. మళ్ళీ బస్సు కదిలింది. అలాగే అతని చెయ్యి నా ఒంటి మీద. కానీ నాకిప్పుడు అయిష్టం, కంపరం కలుగుతున్నాయి. ఇంతకుముందు 'కొంచం తిండి పెడితే చాలు వీడేమి చేసుకున్నా.' అని భావించిన నేను ఇప్పుడేంటి అస్సలు భరించలేకపోతున్నాను. అవసరం తీరిందనా?.. శారీరక అవసరాలు తీరాక మానసిక అవసరాలు వస్తాయేమో. అతని చేతిని పక్కకి తోసాను. మళ్ళీ చేయి వేయబోయాడు. 'ఏంటిది?' అని గట్టిగా అరిచాను. మానుకున్నాడు.


బస్సు కీచుమంటూ సడెన్ బ్రేకుతో ఆగేసరికి ముందు సీటుకి గుద్దుకునేంత పనయ్యింది. నిద్ర చిటికేసినట్టు ఎగిరిపోయింది. అందరూ ఏంటని అనుకుంటూ ఉండగానే వినపడింది ఓ గాండ్రింపు. చెవులు, గుండె రెండూ అదిరిపదేలా. ఆ గాండ్రింపుకి బస్సు అద్దాలు కూడా వణుకుతున్నాయి. అందరూ నోరెళ్ళబెట్టి అలాగే ఉండిపోయారు. ఎదురుగా హెడ్ లైట్ల వెలుగులో పెద్దపులి. ఆ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండటం వలన పులి ఇలా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిందేమో. అందరి ముఖాలు భయముతో బిగుసుకిపోయి తెల్లగా పాలిపోయాయి. కండక్టరు శబ్దం చెయ్యొద్దని అందరికీ సైగ చేసాడు. పులి గాండ్రింపు ఆపింది. కానీ అక్కడే నిలబడి బస్ వైపు చూస్తూ ఉంది. కండక్టరు నెమ్మదిగా అందరి దగ్గరకు వచ్చి, 'ఎవరూ కదలకండి. అందరూ కలిసి ఉంటే పులి ఏమీ చెయ్యదు.' అని లోగొంతుకలో చెప్పాడు. ఇంజన్ సౌండ్ తప్పించి మరే శబ్దమూ లేదు. ఇంతలొ పులి కదిలింది. మెల్లగా, ఠీవిగా అడుగులేస్తూ బస్ దాటింది. కానీ పులి మా కుడి వైపుకి రాసాగింది. అప్రయత్నంగా మేమంతా ఎడమవైపుకి జరిగాము. ఈ ప్రయత్నంలో కొంత శబ్దమయ్యింది. దేవుని గురించి మాట్లాడిన బట్టతలోడు గాభరాగా ఎడమవైపున్న డోర్ ని చేరుకున్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. ఇంతలో పులి గాండ్రు మంటూ కుడివైపున్న కిటికీని పంజాతో కొట్టింది. అంతేమరుక్షణం బస్సులో ఎవరూ లేరు. అందరూ తలొక దిక్కు పరిగెత్తారు. అందులో ముందున్నది ఆ బట్టతల భక్తుడే. నేను నా మీద చెయ్యి వేసిన ఆ మొటిమలవాడిని అనుసరించాను. కొంతదూరం పరిగెత్తాక ఆయాసంతో రొప్పుతూ ఒక దగ్గర ఆగిపోయాము. వెన్నెలరాత్రి కావడంతో కొంచం కనపడుతోంది. మాకు కొంచం దూరంలో ఒక ముగ్గురు నలుగురి గుంపు కూడా ఆగి సేద తీర్చుకుంటున్నారు. ఇంతలో ఎవరో మా దారినే వస్తున్న శబ్దం వినపడింది. అతికష్టంగా నడుస్తున్నట్టు తెలుస్తూంది. దగ్గరికి వచ్చాక చూస్తే అతనికి ఒక కాలు కొద్దిగా కుంటి. తనని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళమని మొటిమలవాడిని అడిగాడు. కాసేపటికి పదివేలకి బేరం కుదిరింది. డబ్బుకి బదులుగా వంటి మీదున్న బంగారం ఇస్తానన్నాడు. భుజం మీద కుంటివాడిని వేసుకొని మేము బయలుదేరబోతుండగా పులి ఎదురు గుంపు మీద దాడి చేసినట్టుంది. ఒక్కసారిగా పులి ఘర్జనలు, అరుపులు, పరుగులు. మేం కూడా పరుగులంకించుకున్నాం. ప్రాణం మీదున్న తీపికి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా నొప్పి తెలియట్లేదు. కాసేపటికి మొటిమలోడు సంభాలించుకోలేక పడిపోయాడు. దాంతో అతని భుజం మీదున్న కుంటివాడు ఎగిరిపడ్డాడు. దగ్గర్లోని చెట్టుకు తల తగలడంతో 'అమ్మా!.. ' అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతని తల చిట్లి రక్తం కారుతోంది. ఇంతలో మాకు చాలా దగ్గరలోనే పులి గాండ్రింపు వినపడింది. సగం ప్రాణాలు పైకెగిరిపోయినట్టు అనిపించింది. ఏదన్నా చెట్టెక్కమని మొటిమలోడు చెప్పాడు. దగ్గర్లోని చెట్లన్నీ పొడవుగా ఉన్నాయి. ఎక్కడమవ్వట్లేదు. ఇంతలో మొటిమలోడు కుంటివాడి బాడీ ని ఒక చెట్టు కింద పెట్టి వాడి మీద కాలు వేసి చెట్టెక్కాడు. నేను ఘోరమనుకుంటూ నిలబడ్డాను. ఇంతలో మళ్ళీ మా వెనుకగా పులి గాండ్రింపు. భయంతో వెన్ను జలదరించేసరికి నేను కూడా కుంటోడి బాడీ మీదెక్కి చెట్టేక్కేసాను. గుండె మీద కాలు వేస్తున్నప్పుడు అతని నోటి నుండి భళ్ళున రక్తం రావడం నా కంట పడింది. దగ్గర్లో కాసేపు పులి గాండ్రింపులు, జనాల హాహాకారాలు వినపడ్డాయి. కాసేపటికి మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా చెట్టు మీదే ఒక మూడు గంటలు బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాం. క్రిందన కుంటోడి తల నుంచి చిక్కటి నెత్తురు వెన్నెల వెలుగులో నల్లగా కనపడుతోంది. తరువాత చాలా సేపటి వరకూ పులి శబ్దాలు వినిపించకపోవడంతో చెట్టు దిగాము. ముందుగా దిగిన మొటిమలోడు కింద బాడీని చూసి చచ్చిపోయాడని చెప్పాడు. కుంటోడి శ్వాసని కూడా పరీక్షించలేదు. నాకు అనుమానమే.. కానీ అనుమానాన్ని పాతర వేసాను. ఒకవేళ బ్రతికి వుంటే గనుక ఆ కుంటివాడికి నేనే సహాయపడాలి. నా పక్కనున్నోడు పట్టించుకునేలా లేడు. ఇప్పుడా బాధ్యతని తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎందుకీ లేనిపోని తలనొప్పి. అదే చనిపోయాడని మనసుని సర్దిచెప్పుకుంటే .. ఇంకేం చెయ్యలేమని ముందుకి వెళ్ళవచ్చు. అందుకే కనీసం అతనివైపైనా చూడకుండా మొటిమలోడినిఅనుసరించాను. ఒక నాలుగు అడుగులు వేసాక నా ముందు నడుస్తున్న మొటిమలోడు ఆగి వెనక్కు వెళ్ళాడు. నేనూ వెనక్కి తిరిగి చూసాను. బహుశా ఆ కుంటివాడికి హెల్ప్ చేయ్యదానికేమో అనుకున్నా. కాని మొటిమలోడు కుంటివాడి మెడలో ఉన్న రెండు గోల్డ్ చైన్లు, వేళ్లకున్న మూడు ఉంగరాలు జేబులో వేసుకున్నాడు.

అందరం బస్సుని చేరుకున్నాం. ఒక్క కుంటివాడు తప్ప. కుంటివాడిని మేం చూడలేదని చెప్పాం. కాసేపు చూసి బస్సు కదిలింది. తెల్లారేసరికి మా ఊరి దగ్గరకి వచ్చేసాం. అటూ ఇటూ కాకుండా పట్టిన నిద్రకి మనసు కొంచం తేలిక పడింది. ఆ కుంటోడి సంఘటనని మనసులోంచి చేరిపెసాను. నాకు నేనే ఆ కుంటివాడు లేకుండా రాత్రి సంఘటనలని విజువలైజ్ చేసుకొని అవే నిజమని మనసుని హిప్నటైజ్ చేసేసాను. ఎంతలా అంటే నాకు నేనే నమ్మేంతలా. ఇంతలొ ఒకటి గుర్తొచ్చింది. పక్కన కూర్చున్న మొటిమలోడితో కుంటివాడి మెడలోని ఒక చైను నాకిమ్మని బ్లాక్మైల్ చేశాను. వాడు బెదిరి ఇచ్చేసాడు. మనసుకి ఇప్పుడొక కొత్త విజువల్ని ఆడ్ చేశాను - దారిలో నాకీ చైను దొరికినట్టు.


మా ఊరొచ్చింది. నాతోపాటు బట్టతల భక్తుడు, మరికొందరు దిగారు. బట్టతలోడు పక్కవాళ్ళకి ఇదంతా దైవనాటకమని చెబుతున్నాడు. నాకు మనిషి ముసుగేసుకొని ఆడుతున్న నాటకంలా అనిపించింది. ముసుగులోపల మనిషి ఒక ప్రాధమిక జంతువే. ఒక్క క్షణం పాటు నా మీద, మనుషుల మీద విపరీతమైన చీత్కారం కలిగింది. మరుక్షణం బిగ్గరగా నవ్వాను.


బేతాళుడు పట్టువదలని విక్రమార్కుడిని అడిగాడు - 'రాజా!.. కధ విన్నావు కదా. ఇంతకీ ఆవిడ ఎందుకలా నవ్వింది?'.