Friday, October 24, 2008

ముసుగు లోపల..

ఉరుకుతూ బస్సెక్కాను. చీర చెమటతో తడిసిపోయింది. పొద్దంతా కూలి చేసి, సాయంత్రం ఆ డబ్బులతో మా చంటోడికి బట్టలు కొని, మా ఊరి బస్సెక్కేసరికి రాత్రి తొమ్మిది దాటింది. కండెక్టరు టికేట్ ఇచ్చాక చేతిలో రెండు రూపాయలే మిగిలాయి. ఊరెళ్ళాక పనికొస్తాయని దాచుకున్నాను. బాగా ఆకలేస్తుంది. పనితో ఒళ్ళు హూనమైనా నిద్ర పట్టట్లేదు. పొద్దుట్నుంచి తిండి లేదు. ఇంకేమీ చెయ్యలేక కళ్లు మూసుకున్నాను. ముందు సీట్లో ఒక బట్టతల ఆయన ప్రక్కవాళ్లకి దేవుని గురించి అందరికీ వినిపించేలా చెబుతున్నాడు. 'మనిషికి భగవంతుని మీద తప్ప మరే విషయం మీద అనురక్తి ఉండకూడదు.' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నా నాకేమీ ఎక్కట్లేదు. వాళ్ళెవరికీ ఆకలి లేదు. నాకుంది. కడుపు నిండాకే దేవుడు.

బస్ లో లైట్లాపేశారు. బయట కూడా చీకటిగానే ఉంది.మధ్యలో ఆగినప్పుడు ఒకాయన బస్సెక్కి నా పక్కన కూర్చున్నాడు. కొంచం కళ్ళెత్తితే ఆయన బూట్లు కనపడ్డాయి. మళ్ళీ చీకటి. కాసేపటికి ఆయన నా వైపుకి ఒరుగుతున్నాడు. నిద్రలో ఉన్నాడో ఏమో. నాకు అతన్ని పక్కకి తోసే ఓపిక ఎంత మాత్రం లేదు. ఆకలిని జయించడానికి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేసాను. ఇంకాసేపటికి అతని చెయ్యి నా ఒంటి మీదకు చేరింది. నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. పైగా వచ్చే స్టాపులో అతని ద్వారా ఏమన్నా తినడానికి దొరుకుతుందన్న ఆశ కలిగింది. నా ఒంటి మీద అతని చెయ్యి కదులుతోంది. ఒళ్ళంతా చెమటతో, కండరాలు పీకుతూ నా శరీరం నాకే అసహ్యంగా ఉంది. కానీ నాకు అసహ్యమైన శరీరమే అతనికి అమృతప్రాయంలా ఉంది. అసలు నిజంగా వెలుగులో నేనతనికి నచ్చుతానా?.. అయినా ఆకలి గా ఉన్నప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. ఒక్కోసారి చీకటి (అజ్ఞానం)లో కూడా ఆనందముంటుంది. ఇంతలో బస్సాగింది. లైట్లు వెలిగాయి. అతని వయస్సు ముప్పై పైనే ఉంటాయి. చామనచాయితో ముఖమంతా మొటిమలున్నాయి. ఆకలేస్తుందని చెప్పాను. రెండు గారెలు, ఒక టీ ఇప్పించాడు. కడుపు తృప్తి పడింది. మళ్ళీ బస్సు కదిలింది. అలాగే అతని చెయ్యి నా ఒంటి మీద. కానీ నాకిప్పుడు అయిష్టం, కంపరం కలుగుతున్నాయి. ఇంతకుముందు 'కొంచం తిండి పెడితే చాలు వీడేమి చేసుకున్నా.' అని భావించిన నేను ఇప్పుడేంటి అస్సలు భరించలేకపోతున్నాను. అవసరం తీరిందనా?.. శారీరక అవసరాలు తీరాక మానసిక అవసరాలు వస్తాయేమో. అతని చేతిని పక్కకి తోసాను. మళ్ళీ చేయి వేయబోయాడు. 'ఏంటిది?' అని గట్టిగా అరిచాను. మానుకున్నాడు.


బస్సు కీచుమంటూ సడెన్ బ్రేకుతో ఆగేసరికి ముందు సీటుకి గుద్దుకునేంత పనయ్యింది. నిద్ర చిటికేసినట్టు ఎగిరిపోయింది. అందరూ ఏంటని అనుకుంటూ ఉండగానే వినపడింది ఓ గాండ్రింపు. చెవులు, గుండె రెండూ అదిరిపదేలా. ఆ గాండ్రింపుకి బస్సు అద్దాలు కూడా వణుకుతున్నాయి. అందరూ నోరెళ్ళబెట్టి అలాగే ఉండిపోయారు. ఎదురుగా హెడ్ లైట్ల వెలుగులో పెద్దపులి. ఆ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండటం వలన పులి ఇలా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిందేమో. అందరి ముఖాలు భయముతో బిగుసుకిపోయి తెల్లగా పాలిపోయాయి. కండక్టరు శబ్దం చెయ్యొద్దని అందరికీ సైగ చేసాడు. పులి గాండ్రింపు ఆపింది. కానీ అక్కడే నిలబడి బస్ వైపు చూస్తూ ఉంది. కండక్టరు నెమ్మదిగా అందరి దగ్గరకు వచ్చి, 'ఎవరూ కదలకండి. అందరూ కలిసి ఉంటే పులి ఏమీ చెయ్యదు.' అని లోగొంతుకలో చెప్పాడు. ఇంజన్ సౌండ్ తప్పించి మరే శబ్దమూ లేదు. ఇంతలొ పులి కదిలింది. మెల్లగా, ఠీవిగా అడుగులేస్తూ బస్ దాటింది. కానీ పులి మా కుడి వైపుకి రాసాగింది. అప్రయత్నంగా మేమంతా ఎడమవైపుకి జరిగాము. ఈ ప్రయత్నంలో కొంత శబ్దమయ్యింది. దేవుని గురించి మాట్లాడిన బట్టతలోడు గాభరాగా ఎడమవైపున్న డోర్ ని చేరుకున్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. ఇంతలో పులి గాండ్రు మంటూ కుడివైపున్న కిటికీని పంజాతో కొట్టింది. అంతేమరుక్షణం బస్సులో ఎవరూ లేరు. అందరూ తలొక దిక్కు పరిగెత్తారు. అందులో ముందున్నది ఆ బట్టతల భక్తుడే. నేను నా మీద చెయ్యి వేసిన ఆ మొటిమలవాడిని అనుసరించాను. కొంతదూరం పరిగెత్తాక ఆయాసంతో రొప్పుతూ ఒక దగ్గర ఆగిపోయాము. వెన్నెలరాత్రి కావడంతో కొంచం కనపడుతోంది. మాకు కొంచం దూరంలో ఒక ముగ్గురు నలుగురి గుంపు కూడా ఆగి సేద తీర్చుకుంటున్నారు. ఇంతలో ఎవరో మా దారినే వస్తున్న శబ్దం వినపడింది. అతికష్టంగా నడుస్తున్నట్టు తెలుస్తూంది. దగ్గరికి వచ్చాక చూస్తే అతనికి ఒక కాలు కొద్దిగా కుంటి. తనని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళమని మొటిమలవాడిని అడిగాడు. కాసేపటికి పదివేలకి బేరం కుదిరింది. డబ్బుకి బదులుగా వంటి మీదున్న బంగారం ఇస్తానన్నాడు. భుజం మీద కుంటివాడిని వేసుకొని మేము బయలుదేరబోతుండగా పులి ఎదురు గుంపు మీద దాడి చేసినట్టుంది. ఒక్కసారిగా పులి ఘర్జనలు, అరుపులు, పరుగులు. మేం కూడా పరుగులంకించుకున్నాం. ప్రాణం మీదున్న తీపికి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా నొప్పి తెలియట్లేదు. కాసేపటికి మొటిమలోడు సంభాలించుకోలేక పడిపోయాడు. దాంతో అతని భుజం మీదున్న కుంటివాడు ఎగిరిపడ్డాడు. దగ్గర్లోని చెట్టుకు తల తగలడంతో 'అమ్మా!.. ' అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతని తల చిట్లి రక్తం కారుతోంది. ఇంతలో మాకు చాలా దగ్గరలోనే పులి గాండ్రింపు వినపడింది. సగం ప్రాణాలు పైకెగిరిపోయినట్టు అనిపించింది. ఏదన్నా చెట్టెక్కమని మొటిమలోడు చెప్పాడు. దగ్గర్లోని చెట్లన్నీ పొడవుగా ఉన్నాయి. ఎక్కడమవ్వట్లేదు. ఇంతలో మొటిమలోడు కుంటివాడి బాడీ ని ఒక చెట్టు కింద పెట్టి వాడి మీద కాలు వేసి చెట్టెక్కాడు. నేను ఘోరమనుకుంటూ నిలబడ్డాను. ఇంతలో మళ్ళీ మా వెనుకగా పులి గాండ్రింపు. భయంతో వెన్ను జలదరించేసరికి నేను కూడా కుంటోడి బాడీ మీదెక్కి చెట్టేక్కేసాను. గుండె మీద కాలు వేస్తున్నప్పుడు అతని నోటి నుండి భళ్ళున రక్తం రావడం నా కంట పడింది. దగ్గర్లో కాసేపు పులి గాండ్రింపులు, జనాల హాహాకారాలు వినపడ్డాయి. కాసేపటికి మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా చెట్టు మీదే ఒక మూడు గంటలు బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాం. క్రిందన కుంటోడి తల నుంచి చిక్కటి నెత్తురు వెన్నెల వెలుగులో నల్లగా కనపడుతోంది. తరువాత చాలా సేపటి వరకూ పులి శబ్దాలు వినిపించకపోవడంతో చెట్టు దిగాము. ముందుగా దిగిన మొటిమలోడు కింద బాడీని చూసి చచ్చిపోయాడని చెప్పాడు. కుంటోడి శ్వాసని కూడా పరీక్షించలేదు. నాకు అనుమానమే.. కానీ అనుమానాన్ని పాతర వేసాను. ఒకవేళ బ్రతికి వుంటే గనుక ఆ కుంటివాడికి నేనే సహాయపడాలి. నా పక్కనున్నోడు పట్టించుకునేలా లేడు. ఇప్పుడా బాధ్యతని తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎందుకీ లేనిపోని తలనొప్పి. అదే చనిపోయాడని మనసుని సర్దిచెప్పుకుంటే .. ఇంకేం చెయ్యలేమని ముందుకి వెళ్ళవచ్చు. అందుకే కనీసం అతనివైపైనా చూడకుండా మొటిమలోడినిఅనుసరించాను. ఒక నాలుగు అడుగులు వేసాక నా ముందు నడుస్తున్న మొటిమలోడు ఆగి వెనక్కు వెళ్ళాడు. నేనూ వెనక్కి తిరిగి చూసాను. బహుశా ఆ కుంటివాడికి హెల్ప్ చేయ్యదానికేమో అనుకున్నా. కాని మొటిమలోడు కుంటివాడి మెడలో ఉన్న రెండు గోల్డ్ చైన్లు, వేళ్లకున్న మూడు ఉంగరాలు జేబులో వేసుకున్నాడు.

అందరం బస్సుని చేరుకున్నాం. ఒక్క కుంటివాడు తప్ప. కుంటివాడిని మేం చూడలేదని చెప్పాం. కాసేపు చూసి బస్సు కదిలింది. తెల్లారేసరికి మా ఊరి దగ్గరకి వచ్చేసాం. అటూ ఇటూ కాకుండా పట్టిన నిద్రకి మనసు కొంచం తేలిక పడింది. ఆ కుంటోడి సంఘటనని మనసులోంచి చేరిపెసాను. నాకు నేనే ఆ కుంటివాడు లేకుండా రాత్రి సంఘటనలని విజువలైజ్ చేసుకొని అవే నిజమని మనసుని హిప్నటైజ్ చేసేసాను. ఎంతలా అంటే నాకు నేనే నమ్మేంతలా. ఇంతలొ ఒకటి గుర్తొచ్చింది. పక్కన కూర్చున్న మొటిమలోడితో కుంటివాడి మెడలోని ఒక చైను నాకిమ్మని బ్లాక్మైల్ చేశాను. వాడు బెదిరి ఇచ్చేసాడు. మనసుకి ఇప్పుడొక కొత్త విజువల్ని ఆడ్ చేశాను - దారిలో నాకీ చైను దొరికినట్టు.


మా ఊరొచ్చింది. నాతోపాటు బట్టతల భక్తుడు, మరికొందరు దిగారు. బట్టతలోడు పక్కవాళ్ళకి ఇదంతా దైవనాటకమని చెబుతున్నాడు. నాకు మనిషి ముసుగేసుకొని ఆడుతున్న నాటకంలా అనిపించింది. ముసుగులోపల మనిషి ఒక ప్రాధమిక జంతువే. ఒక్క క్షణం పాటు నా మీద, మనుషుల మీద విపరీతమైన చీత్కారం కలిగింది. మరుక్షణం బిగ్గరగా నవ్వాను.


బేతాళుడు పట్టువదలని విక్రమార్కుడిని అడిగాడు - 'రాజా!.. కధ విన్నావు కదా. ఇంతకీ ఆవిడ ఎందుకలా నవ్వింది?'.

25 comments:

MURALI said...

సమాధానం తెలిసి చెప్పకపోతే తల వెయ్యివక్కలవుతుంది. చెబితే మనసు లక్ష ముక్కలవుతుంది.

మురారి said...

@murali,
baaga cheppaaru.

మోహన said...

"కడుపు నిండాకే దేవుడు."
"ముసుగులోపల మనిషి ఒక ప్రాధమిక జంతువే."
సత్యం!

"ఒక్కోసారి చీకటి (అజ్ఞానం)లో కూడా ఆనందముంటుంది."
అజ్ఞానంలో ఆనందమే కాదు అమాయకత్వం కూడా ఉంటుంది.

"అయినా ఆకలి దొరికినప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. "
ఆకలి వేసినపుడు అని మీ ఉద్దేశం అనుకుంటా..

'అందరం బస్సుని చేరుకున్నాం....' ఈ పారా లో English పదాలు కూలి చేసుకునే వారు మాటల్లో, ఆలోచనల్లో వాడగలరా అని నా అనుమానం.

"ఒక్క క్షణం పాటు నా మీద, మనుషుల మీద విపరీతమైన చీత్కారం కలిగింది."
సృష్ఠిలో అన్నీ spontaneous గా ఉండగలవు ఒక్క మనిషి తప్ప. దానికి కారణాలైన మేధస్సు, జ్ఞాపక శక్తి మానవ జాతికున్న శాపాలు అనుకుంటా...

ఆమె ఎందుకలా నవ్విందో.. murali గారితో ఏకీభవిస్తున్నాను.

Purnima said...

మురళి: బాగా చెప్పారు!

మురారి గారు: నాకు కొత్తగా వచ్చిన ఒక డౌట్‍ని అడిగే అవకాశం ఉందనిపిస్తుందిక్కడ.

How different are narrator and author for a story? (Anyone, who can answer, can answer this please!)

కథ బాగుంది. కానీ ఇంకా మెరుగైన రచనగా చేయ్యచ్చేమో అని నా అభిప్రాయం. కూలి పని చేసుకునే స్త్రీ చెప్తున్న కథలా నడిచినా మధ్యలో హెల్ప్, హిప్నటైజ్, బ్లాక్మెల్ ఇవ్వన్నీ ఆ పాత్రకి సరిపోవేమో అని ఆలోచన. భాష విషయంలో జాగ్రత్త తీసుకోవాలేమో ఆలోచించండి.

నాకు తోచింది చెప్పాను, మీకు తెల్సింది నాతో పంచుకోండి. ఇది ఆ పాత్ర కాకుండా థర్డ్ పార్టీ నరేషన్లో ఉంటే బాగుండేదేమో!

ఏదేమైనా మంచి ప్రయత్నం! అభినందనలు!!

మురారి said...

@మోహన గారు,

>>"అయినా ఆకలి దొరికినప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. "ఆకలి వేసినపుడు అని మీ ఉద్దేశం అనుకుంటా..

కరక్ట్ చేసాను.

>>'అందరం బస్సుని చేరుకున్నాం....' ఈ పారా లో English పదాలు కూలి చేసుకునే వారు మాటల్లో, ఆలోచనల్లో వాడగలరా అని నా అనుమానం.

ఇక్కడ narrator రచయిత యొక్క ఆంగ్లపరిజ్ఞానాన్ని తన భావాలని చెప్పడానికి ఉపయోగించింది(within the author's limitations). అయినా ఒక కూలీ పని చేసే ఆడది తన మనసుని ఇంత స్పష్టంగా చెప్పలేదు కదా. నాకు నేను రచయితగా ఈ 'క్రియేటివ్ వెసులుబాటు' ని తీసుకున్నాను. దీనిని బేతాళుడు చెబుతున్న కధ గా కూడా అన్వయించుకోవచ్చు. బెతాలుడికి ఈ మాత్రం నాలెడ్జ్ ఉండవచ్చు.
@ పూర్ణిమ గారు,
>>How different are narrator and author for a story?
ఇద్దరూ సెపరేట్ గా ఉండాలని ఏమీ లేదు (సమర్ధించు కోవాలి కదా).
>>ఆ పాత్ర కాకుండా థర్డ్ పార్టీ నరేషన్లో ఉంటే బాగుండేదేమో!
మూడవ వ్యక్తీ నేరేషన్ లో చెబితే ఆమె మనసులోతుల్లోని భావాలను ఎలా తెలిపేది? నాకైతే అది చాలా టఫ్ జాబ్.
>>భాష విషయంలో జాగ్రత్త తీసుకోవాలేమో ఆలోచించండి.
ఏదో writerగా ప్రూవ్ చేసుకోవాలని రాయట్లేదు. నా భావాలని పదిమందికీ చెప్పాలన్న ఉద్దేశ్యం మాత్రమె.Thanks.

Motorolan said...

Good work !!!

MURALI said...

మురారి గారు చెప్పినది కరక్టే. మనిషి లోపల మృగాన్ని వేరే వ్యక్తి చెప్పినట్టు చెప్పటం బాగుండదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆకలి కోసం తన శరీరాన్ని అప్పగించింది అనేది తనకు తానుగా మాత్రమే చెప్పగలిగే నిజం. ఒక మనిషి దిగజారుడుతనం తనకి మాత్రమే తెలుస్తుంది. మనిషి తనలోని ముసుగుల్ని తనకి తానే తీసీ చూపించటం వలనే ఈ కధ మనసుని వెంటాడేలా, మెలి పెట్టేలా ఉంది. narrator చెప్పినట్టు ఉంటే ఈ feel ఉండేది కాదేమొ.
భాష విషయంలో జాగర్త తీసుకోవాల్సింది. >>
దీనిని అంగీకరిస్తా. writer గా prove చేసుకోవటానికి కాకపోయినా ఆ పాత్ర కి తగ్గ భాష వాడితే బాగుండేదనే అందరి భావం. అంతేగాని మీరు వ్రాసినదానిలో లోపాలు ఎంచే ప్రయత్నం కాదు.

మురారి said...

@motorolan,
Thanks.

@murali,
ముసుగు లోపలి మనిషిని చూపాలి అని అనిపించాక వెంటనే అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే కంటెంట్ కి అంత ప్రాదాన్యమివ్వకుండా రాసాను. భాష పరంగా కూడా చక్కగా ప్రెజెంట్ చేసుంటే బాగుండేది. నా ఆలోచన చెప్పాలనే తప్ప వేరే ఎక్స్పెక్టేషన్స్ లేవు. మీరు లోపాలు ఎంచుతున్నారన్నది నా భావన కాదు. అసలు మనం రాసింది ఎంత రీచ్ అవుతుందనేది కామెంట్ల వలెనే కదా తెలిసేది.ఫైనల్ గా థాంక్స్.

మురారి said...

@ Purnima,
>>How different are narrator and author for a story?

narrator is one medium for the author to express his point. తన పాయింట్ ని ఎంత ప్రభావశీలంగా చెప్పగలుగుతున్నానన్నదే రచయిత basic concern. At times, I feel narrator can make use of the author's intelligence. Anyways there are no hard n fast rules in this game.

>>భాష విషయంలో జాగ్రత్త తీసుకోవాలేమో ఆలోచించండి.
నిజమే. ఒక్క ఇంగ్లీష్ పదాలేమిటి, ఈ పోస్ట్ లోని చాలా వ్యక్తీకరణలు ఒక కూలి పని చేసుకునే అమ్మాయికి ప్రాక్టికల్ గా సాధ్యం కానివి. కానీ తన మనసులోని భావాల్ని చెప్పడానికి నాకున్న లిమిటేషన్స్ లో, నా ఇంటరెస్ట్ మోతాదుని బట్టి చెప్పాను. I am not sure if there is a bit of arrogance in my previous reply to your comment. If any, Please don't mind.

Purnima said...

మురారి: మరేం ఫర్వాలేదు. It's one of the rare occasions where I get picky. Don't mind it too.

రచయితగా ప్రూవ్ చేసుకోడానికి మనం రాయటం లేదన్నది వాస్తవం. అందుకే మరీ శ్రమపడి రాయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ ఇంకో వైపు నుండి ఆలోచిస్తే.. may be we are wasting some of the best thoughts అని అనిపిస్తూ ఉంటుంది. Writing, especially fiction takes the hell out of you and I understand that better. So, no hard feelings at all. Just ignore it, if you can't find sense in it.


ఇక నరేషన్ విషయానికి వస్తే.. it being in third party would have made your life easier, because that narrator can be as sophisticated as you. Where as when you chose it to be a first party narration, you are supposed to be right under their skin, there way of body language, the dialect and nuances of the language. That would be the toughest part for me, given the exercise.

Here's a li'l info on the third party narration, check out if it helps.

http://en.wikipedia.org/wiki/Third-person_narrative

A BIGGER AND BOLDER NOTE: My knowledge in all these is limited and I could be absolutely wrong. There are better men around and hoping that they could give a hint or two. Please don't mind that I used your post as the platform. (If that's the case, without a second thought you can remove all my comments, I'm fine with it! :-) )

Good Job, keep it up!

ఫణీంద్ర said...

మురారిగారు,

మీరు మనిషిలోని స్వార్థం గురించి మీ భావాలు పంచుకోవాలనో, లేక భేతాళ కథలు చెప్పాలనో ఇది రాస్తే చెప్పేదేం లేదుగానీ, లేదంటే పూర్ణిమ ఈ కథకు ఇచ్చిన సలహాల్లో నూటికి నూరు శాతం రిలవెన్సు ఉంది. అవి నూటికి నూరు శాతం అనుసరణీయాలు; తిరుగు లేదు.

రచయితగా ప్రూవ్ చేసుకోవటం మీ ఉద్దేశ్యం కాకపోయినా, మీ రచనలు పాఠకునిపై మరింత ప్రభావాన్ని చూపాలంటే, మీరు రచనకు సంబంధించిన కొన్ని ప్రాథమిక నియమాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే విధానం సరిగా లేకపోవటం వల్ల మంచి ఊహలు వట్టిపోతాయి.

>> ఇద్దరూ సెపరేట్ గా ఉండాలని ఏమీ లేదు (సమర్ధించు కోవాలి కదా).

ఇది సమర్థన కోసం తయారు చేసుకున్న స్టేట్‌మెంటే అని నాకనిపించింది. రచయిత, నేరేటర్ వేర్వేరు. మీరు మీ కథలో నేరేటర్‌కి రచయిత గొంతు అరువియ్యడం వల్లనే ఇక్కడ (నాతో సహా) కొందరు పాఠకులు కథలో పూర్తిగా ఐక్యం కాలేకపోయారు.

పూర్ణిమ చెప్పినట్టు ఈ కథను "థర్డ్ పెర్సన్ నేరేషన్"లో చెపితే బాగుండేంది.

>>మూడవ వ్యక్తీ నేరేషన్ లో చెబితే ఆమె మనసులోతుల్లోని భావాలను ఎలా తెలిపేది? నాకైతే అది చాలా టఫ్ జాబ్.

"థర్డ్ పెర్సన్ నేరేషన్"లో కూడా ఆమె మనసు లోతుల్లోని భావాల్ని చెప్పవచ్చు. నిజానికి ఇంకా ప్రభావవంతంగా చెప్పవచ్చు. "సర్వసాక్షి కథకుడు" (Omnipresent Narrator) గురించి చదవండి. అలాంటి నేరేషన్ ఈ కథకు సరిపోతుందనిపించింది నాకు. (BTW, writing IS a tough job.)

"మానవ సంబంధాల విలువను నిర్ణయించేది అంతిమంగా స్వార్థమే" అన్న ఒక సార్వజనీన సత్యాన్ని మీరు చెప్పదలచుకున్నారని అర్థమయ్యింది. ఇది మీ వస్తువు. కానీ, నా అభిప్రాయం ప్రకారం, వస్తువులో intrinsic worth ఏమీ ఉండదు. దాన్ని చెప్పిన విధానమే సృజనాత్మక రచనగా దాని విలువను నిర్థారించేది. మనం ఎన్నుకున్న ప్రతీ వస్తువూ తనదైన (తనకు మాత్రమే ప్రత్యేకమైన) విధానాన్ని (లేదా శిల్ప విన్యాసాన్ని) కోరుతుంది; నిజానికి డిమాండ్ చేస్తుంది. దాని డిమాండ్‌ను అర్థం చేసుకుని, తగిన మోతాదులో సప్లయి చేయడం రచయితగా మీ విధి ("నేను రచయితను కాను" అనకండి. రాయాలన్న సంకల్పం ఉన్న ప్రతీ వాడూ రచయితే నా దృష్టిలో).

నాకు తోచింది చెప్తున్నాను; దయచేసి రంథ్రాన్వేషణగా భావించొద్దు.

పూర్ణిమా,

J.D.Salingerని చదివాకా కూడా నీకు Author/ Narrator పాత్రలపై ఇలాంటి అనుమానాలు ఉంటాయనుకోను. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను, Author and Narrator are VERY VERY different.

Purnima said...

Phani: Hmm.. my exploration of Salinger is not yet complete. Honestly, that was not even the question I wanna put.

Salinger definitely differentiates between narrator and author. But are there instances were author and narrator were same in either Telugu / English fiction?

Or leave it alone, when I decide about my question I would ask it! :-)

కొత్త పాళీ said...

పూర్ణిమ, ఫణీంద్ర .. బాగా చెప్పారు.
మురారి .. మీ రచనలో సత్తా వుంది, కానీ ఇటువంటి డీటెయిల్సు మీద శ్రద్ధ పెట్టాలి. మిమ్మల్ని ప్రోత్సహించడమే మా ఉద్దేశం కానీ విమర్శించడం కాదు.
మీ నించి మరిన్ని మంచి రచనల్ని ఆశిస్తూ ...

కొత్త పాళీ said...

"ఏదో writerగా ప్రూవ్ చేసుకోవాలని రాయట్లేదు."
అన్నారు. ఎందుకు రచయితగా నిరూపించుకోవాలని అనుకోవటం లేదు అని నేణు ఎదురు ప్రశ్న వేస్తున్నా. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి.
Anything that is worth doing is worth doing right.

ప్రవీణ్ గార్లపాటి said...

మురారి గారు,

కథా విషయం బాగుంది. రిపిటీషన్ కోసం కాదు కానీ నేను కూడా పైన వ్యాఖ్యాతలు చెప్పిన విధంగానే అనుకున్నాను.
నేను వ్యాఖ్యలు చూడకుండానే చదివాను, కానీ ఆ పాత్ర వాడిన భాష నాకు కూడా కొంత అసహజంగా అనిపించిన మాట వాస్తవం. ముఖ్యంగా టర్మినాలజీలు, ఇంగ్లీషు పదాలు.

మనం చెప్పదలచుకున్న విషయం ఎంత ముఖ్యమో అది చెప్పే తీరు కూడా అంతే ముఖ్యం. (Thats what separates good from the moderate)

మేమందరమూ మీలో మంచి రచయిత కాగలిగే పొటెన్షియల్ ఉన్నందువల్లే ఈ చిన్న తప్పులను ఎత్తి చూపుతున్నాము. ఒక రకంగా విమర్శే కానీ సద్విమర్శలే అనుకోండి.

ఇకపోతే narrator, author రెండూ వేరు వేరు అని నా అభిప్రాయం కూడా. రచయితది ఆలోచన, నేరేటర్ ది అనుభవం.
అంటే రచయిత అనుకున్న ఆలోచనని నేరేటర్ తను అనుభవించినట్లు చెబుతాడన్నమాట. (first party or thirdparty)

రచయిత భావాలు ఆ నేరేటర్ పై పడకుండా చెప్పడమనేది కుదరని పనే అయినా, చెప్పే నేరేటర్ ఎవరు అనేదాని ప్రకారం కథనంలో మార్పులూ చేర్పులూ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా నేరేటర్ కథలో భాగం అయితే గనక.
కథలో భాగమయిన ప్రతీ పాత్రకీ రచయిత ఒక బ్యాక్‌గ్రౌండ్ సృష్టిస్తాడు. ఉదా: ఇక్కడ పాత్రకి ఒక కూలి చేసుకుని బ్రతికే మహిళగా. దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక వ్యక్తిగా.

నేరేషన్ చేసేటప్పుడు రచయిత ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయక తప్పదు.

రాబోయే మీ రచనలకై చూస్తాము...

మోహన said...

@ఫణీంద్ర
"మానవ సంబంధాల విలువను నిర్ణయించేది అంతిమంగా స్వార్థమే"

:)మనఃస్పూర్తిగానే అంటున్నారా? లేక మీ జీవితంలో ఇప్పటి దాకా మీకు కలిగిన frustrated అనుభావల వల్ల ఇలా ఒక నిర్ణయానికి వచ్చారా ?
ఈ రచనలో పాత్రలంతా సహ-ప్రయాణీకులు. వారి మధ్య వేరే బంధాలు, సంబంధాలు ఏమీ లెవు. నిజానికి ఒక ప్రాణి మరో ప్రాణికి సహాయపడటానికి అవేమి అవసరంలేదు. అలా అని ఒకరికొకరు సహాయపడాలని నిర్ధిష్ఠమయిన శాసనం కూడా లేదు కదా..? ఉన్నా అవి మనం పెట్టుకున్నవి?! ఒకామె నాకు స్వార్థంగా కనపడచ్చు. వేరొకరికి కాకపోవచ్చు. అదే మనిషి, చూసే [analyse చేసే] వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని వేరు వేరు అభిప్రాయాలు....

I felt the exposure of raw brain in this writng.

@మురారి గారూ
ఈ రచన వెనుక మీ ఉద్దేశం ఫణి గారు చెప్పినదా??
ఏది ఏమైనా, ఇలాంటి అంశాలపై అభిప్రాయం తెలిపే అవకాశం ఎప్పుడో కానీ రాదు. So, Thank you.

మురారి said...

@ అందరికి,
Let me admit my inability in two aspects with regard to this post.
First one - ఒక కూలి పని చేసే ఆడది ఉపయోగించే భాష మీద నాకంత పట్టు లేదు. ప్రయత్నించవచ్చేమో గాని అంత టైం వెచ్చించి రాసే ఆసక్తి లేదు. I am consciously aware of the fact that I am using English words in her tone.

ఇంక రెండవది - Third party narration. దీని మీద కూడా నాకంత పట్టు లేదు. మీరు నా పాత పోస్ట్ లను గమనించినట్లైతే నేనెప్పుడూ ఈ టెక్నిక్ తో రాయలేదేమో.

ఇలా లిమిటేషన్లు ఉన్నప్పటికీ, వీటివలన రాయకుండా ఉండిపోవటం ఎందుకు అనిపించింది. విమర్శించడాన్ని తప్పుగా నేను భావించట్లేదు.

ఫణీంద్ర said...

@ మోహన,

నా జీవితంలో నాకు frustrated అనుభవాలేమీ ఎదురు కాలేదు. మీకు నా గురించి ఏమీ తెలీదు. "మానవ సంబంధాల విలువను నిర్ణయించేది అంతిమంగా స్వార్థమే" అని ఈ రచనలో చెప్పాలనుకున్నారేమోనని నాకనిపించి ఆ వాక్యం వాడానంతే. రచయిత చెప్పదలచుకున్నది అది కావచ్చు, కాకపోవచ్చు. నాకు అందింది మాత్రం అదే.

మనుషుల్లో స్వార్థం సహజం. నాకు దానితో ఇబ్బంది ఏమీ లేదు. నేను దాంతో సహా మనుషుల్ని ప్రేమిస్తాను. మీ రెండో పేరాలో మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు.

మురారి said...

@Purnima,
>>may be we are wasting some of the best thoughts.
true. They would be more effective when we write properly.
>>Please don't mind that I used your post as the platform.
నా పోస్ట్ మంచి discussions కి platform అయితే నాకూ ఆనందమే.
Thank you.

@Phaneendra,
>>పూర్ణిమ ఈ కథకు ఇచ్చిన సలహాల్లో నూటికి నూరు శాతం రిలవెన్సు ఉంది. అవి నూటికి నూరు శాతం అనుసరణీయాలు.
నిజమే. కానీ ఇతరులని అనుసరించడం నాకంత ఇష్టం ఉండదు. నాకనిపిస్తే తప్ప.
>>ఇది సమర్థన కోసం తయారు చేసుకున్న స్టేట్‌మెంటే అని నాకనిపించింది.
అవును.
>>"థర్డ్ పెర్సన్ నేరేషన్"లో కూడా ఆమె మనసు లోతుల్లోని భావాల్ని చెప్పవచ్చు. నిజానికి ఇంకా ప్రభావవంతంగా చెప్పవచ్చు. "సర్వసాక్షి కథకుడు" (Omnipresent Narrator) గురించి చదవండి.
నేనెప్పుడూ ప్రయత్నించలేదు. Omnipresent Narrator చదవడానికి ప్రయత్నిస్తాను. Thank you.
>>దాని డిమాండ్‌ను అర్థం చేసుకుని, తగిన మోతాదులో సప్లయి చేయడం రచయితగా మీ విధి
I dont believe in duty. I write for a selfish cause - my happiness.
>>దయచేసి రంథ్రాన్వేషణగా భావించొద్దు.
లేదు. Thank you.

మురారి said...

@కొత్త పాళీ గారు,
>>కానీ ఇటువంటి డీటెయిల్సు మీద శ్రద్ధ పెట్టాలి.
Hmm.. I agree. Thank you.

>>మిమ్మల్ని ప్రోత్సహించడమే మా ఉద్దేశం కానీ విమర్శించడం కాదు.
Constructive crticism తప్పేమీ కాదు కదా. మీ ప్రోత్సాహానికి థాంక్స్.

>>ఎందుకు రచయితగా నిరూపించుకోవాలని అనుకోవటం లేదు అని నేణు ఎదురు ప్రశ్న వేస్తున్నా.
ఏమో.. నాకూ తెలియదు.

@ప్రవీణ్ గార్లపాటి గారు ,
Thank you.

@మోహన గారు,
మనిషి తన basic needs n necessities విషయంలో గానీ, తన ఉనికికే ప్రమాదమొచ్చే పరిస్థితుల్లో గానీ ఒక జంతువులానే ప్రవర్తిస్తాడు. అలాగే ఆ పరిస్థితులనుంచి బయటకి వచ్చాక తనని తను ఎలా కన్విన్స్ చేసుకుంటాడు.. ఒక హిపోక్రసీలో ఎలా బ్రతికేస్తూ ఉంటాడు..నీతి,స్వార్థాలను ఎలా బాలన్స్ చేస్తుంటాడు.. చుట్టూ పదిమంది లేనప్పుడు బయటకు వచ్చే స్వార్థం..
ఇవన్నీ చెప్పాలనుకున్నాను. మనల్ని మనం ఊహించుకోమంటే మనం బట్టలతోనే ఊహించుకుంటాము. కానీ నగ్నంగా ఉన్నమనమే నిజం. ఆ స్ప్రహ మనకి ఉండాలి. దానిని హుందాగా తీసుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం.

మోహన said...

@ఫణింద్ర గారు..
"సార్వజనీన సత్యం" అని అంటే, మీదీ అదే భావం అనుకున్నాను. మీరు కేవలం రచన పరం గా మాట్లాడుతున్నారని గ్రహించలేదు.
>>మీకు నా గురించి ఏమీ తెలీదు.
నిజమే..! మీ గురించి నాకు ఏమీ తెలీదు. అందుకే ప్రశ్న అడిగాను. ఓపికగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
>>మీ రెండో పేరాలో మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కాలేదు.
లైట్ తీసుకోండి.

@మురారి గారూ..
నా ప్రశ్నకి చాలా విపులంగా సమాధానం చెప్పారు. Thank you.
>>ఆ స్ప్రహ మనకి ఉండాలి.
ఇది తప్పనిసరరిగా ఉండాలా? లేని మనిషి ఏమైనా కోల్పోతాడా?

మురారి said...

@మోహన గారు,
>>ఇది తప్పనిసరరిగా ఉండాలా? లేని మనిషి ఏమైనా కోల్పోతాడా?

తప్పనిసరి అని చెప్పలేను. నా కధలో స్త్రీపాత్రకి ఈ స్పృహ ఉంటే గనుక ఇంత సంఘర్షణ పడి ఉండదేమో. మనిషి సైన్స్ నేర్చుకున్నా, ఫిలాసఫీ నేర్చుకున్నా తన లోపలి ఈ సంఘర్షణని తేలిక చేసుకోవడానికే.

arunank said...

Mohana garu ,
your story is realistic.Maslwo has explained the importance of basic needs in his motivation theory.It is also applicable here.
one has to satisfy the basic physiological needs first.Then only (s)he can think of other things.

pallavi said...

Its one of the Awesome stories i have ever read!!
manishi avakaasa vaadam entha bhayamkaram ga untundo baaga choopinchindi ee rachana.
one more great thing that makes it special is the great authenticity each role displays when they are nerrating...
there is a lot of courage and meturity in your writing style, which sets you Apart!!
Good luck :)

మురారి said...

@Pallavi,

నేను రాసిన కధల్లో నాకు బాగా నచ్చిన కధ ఇది. మీకు నచ్చినందుకు ఎంతో సంతోషం. ధన్యవాదాలు.