Friday, January 23, 2009

విరహ భోగం...

డాబా మీదకి వచ్చాను. వెన్నెల పాలిపోయి ఉంది. చంద్రుని వైపు చూడబుద్ధి కాలేదు. చూస్తే మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతాడు. పక్కగా ఓ గాలి తెమ్మెర వెళ్ళింది. నువ్వు వెనుకగా వచ్చి నడుముకి చేయి జార్చి, చెవుల మీది కురులను సవరించి చెంపకి చెంప ఆనించిన అనుభవాన్ని తట్టి లేపింది. దానిని గమనించనట్టే ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను. ఆ మాత్రం గాలివిసురుకే చున్నీ ఎగిరి పక్కనున్న గులాబీ మొక్కకి చిక్కుకుంది. హే!.. దీనికో పువ్వు పూసింది. ఆప్యాయంగా ముఖాన్ని గులాబీకి దగ్గర చేశాను. ఉచ్ఛ్వాస గులాబీ పరిమళాన్ని పూసుకోగానే గుండె గదుల్లో నీ మందహాస సమ్మోహనం పొగమంచులా ప్రవేశించింది. తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది. ఈ బాధ వలనైనా శరీరానికి కొంచం స్పృహ వస్తుందని అలాగే పట్టిఉంచాను. కానీ నీ మత్తు మహత్తు చేసిన తిమ్మిరికి ఈ నొప్పి ఎలా తెలుస్తుంది.

స్నానం చేసి మనసు కొంచం తేలికపడ్డాక పడుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. షవర్ నీరు కురుల మీదుగా శతాధిక పాయలుగా చీలి తనువంతా పారుతుంటే దేహం కోటి తంత్రుల ఘోషగా మారింది. షవర్ నీటికి ముఖాన్ని ఎదురుగా పెట్టి, చేతులతో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఓసారి తమకంతో నా చేతికండని పంటితో గిచ్చాను. బట్టలు వేసుకుంటున్నప్పుడు చూస్తే, ఆ భాగం ఎర్రగా కంది ఉంది. పదహారణాల సిగ్గుకి పూసంత మురిపెం కలిసి నా ముఖంలో మెరిసింది.

బాహ్యంగా పవళించినా పలవరింతలు మాత్రం ఆగలేదు. కుడి చేయి తివాచీ పరచి ఆహ్వానిస్తున్నట్లుగా పరచుకొని ఉంది (నీకోసమేమీ కాదబ్బాయ్!.). ఏ అధఃపాతాళానికో జారిపోతున్నట్లు గుండెలు నీ ఆసరా కోసం కొట్టుకుంటున్నాయి. నడుము దొంతరల మధ్య నీ చేయి కాకుండా గాలి దూరినందుకు నడుము ఉక్రోషంతో విలవిలపోతోంది. కొంటె ఊహల పీయూషాన్నిఎదబిందెలు పట్టలేకపోతుండడంతో పెదవులు అర్థపావు విచ్చుకొని ఉన్నాయి. ఎద ఎగిసిపడేకొలదీ ప్రతిగా నాభి నడుము లోపలికి పోతోంది. తరంగమైపోతానేమోనని ఇరుపాదాల వేలికొసలని నొక్కిపట్టి దేహానికి జారుముడి వేసాను. అయినా లాభం లేదాయే!.

పరుపు మెత్తదనం శత్రువయ్యిందని కటికనేల మీదకి చేరితే అది నీ బాహువుల కాఠిన్యాన్ని గుర్తుచేసింది. ఇది నిజంగా టార్చర్ తెలుసా. ఇలా కాల్చే కన్నా గుండెల్లో ఓ పిడిబాకుని దింపి ఒక్కసారిగా చంపెయ్యొచ్చుగా. ఇలా మధురూహలతో పోరాడి, అలసి ఎప్పటికో నిద్రపోయాను.

పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. తయారయ్యాక ఏమి చెయ్యాలో తెలియక గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపయ్యిందో అమ్మ తట్టి లేపేవరకూ తెలిసిరాలేదు. ఇది ఏ ధ్యానమో.. పరధ్యానమో!..

ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.