Wednesday, March 4, 2009

ఆత్మ టపా

బ్లాగులో కొత్త టపా (కధ) రాసి చాలా రోజులయ్యింది. ఈ మధ్యన ఐడియాలే రావట్లేదు. 'ఏమిటి.. నా బుర్ర వట్టి పోయిందా..ఇప్పటి వరకూ రాసినవి తప్పితే మరే స్టోరీ ఐడియాలు లేవా?.. రావా?..' ఇలా ఆత్మన్యూనతా భావాలు నన్ను పీడిస్తుంటే పేపరు, పెన్ను పట్టుకుంటే ఏదో ఐడియా తట్టకపోదా అని బలవంతంగా కూర్చున్నాను. రాయక ముందర ఆత్మన్యూనత; రాసాక నచ్చుతుందా, నచ్చదా.. కామెంట్లు వస్తాయా, రావా.. అన్న టెన్సన్లు; నచ్చకపోతే ఫ్రస్ట్రేషన్, నచ్చితే మరింత మంది మెచ్చాలన్నఉబలాటం.. ఇలా టపా రాసే క్రమంలో ఏ దశ కూడా బాగోదు ఒక్క - 'మెరుపులాంటి ఆలోచన మెదలడం, రాయడం' అన్న ఫేజ్ తప్పితే. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు. మరెందుకో ఈ పితలాటకం. కొంచం ఎక్కువ ఆలోచిస్తున్నానిపించింది. మళ్ళీ ఏదో కధ రాయాలన్న విషయం మీద దృష్టి పెట్టాను. బుర్రలో ఏ మెరుపూ మెరవట్లేదు. 'అలా కాకుండా ఎందుకు రాయలేను? ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరి.' అనుకొని ముందుగా ఒక కారెక్టర్ ని సృష్టించాను. మగవాడే. వాడికి 'శీను' అని పేరు పెట్టాను. వాడి కారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే అన్నీ నా లక్షణాలే అగుపిస్తున్నాయి (మెరుపు మెరవకపోతే అలానే ఉంటుంది మరి.). మెల్లగా వాడు నేనయ్యాను.

దూరంగా ఎక్కడో మెరుపు మెరిసింది. నేను ఎప్పటిలాగే కొండని ఎక్కుతూ ఉన్నాను. నాలాగే చాలామంది కొండ శిఖరాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ శిఖరం పేరు విజయం. కొన్నిసార్లు దానిని అందుకుంటాను. కానీ కాసేపు కాగానే నేనున్న ప్లేస్ చదునుగా మారి విజయశిఖరం మరింత ఎత్తులో కనపడుతుంది. చుట్టుపక్కలవారు అప్పటికే ఎక్కేస్తూ ఉంటారు. దాంతో గాభరాగా నేనూ పోటీ పడతాను. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాను. దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యి మరింత తీవ్రంగా ప్రయత్నిస్తుంటాను. కొండని ఎక్కే ప్రయత్నం ప్రారంభించిన మొదట్లో ఉన్నంత స్పష్టత ఇప్పుడు లేదు. నా దృష్టి రానురాను మందగిస్తూ ఉందేమో. ఇలా ఆత్మావలోకనం చేసుకొనే ఆలోచనలు రాకుండా ట్రాఫిక్ శబ్దాలు నన్ను మళ్ళీ రొటీన్ లో పడేస్తాయి. ఇలా జీవితాంతం కష్టపడుతూ, కష్టపడుతూ ఇప్పుడు మృత్యువు అంచుకు చేరుకున్నాను. ఇంకొన్ని ఘడియలే మిగిలాయి. తర్వాత చేసేదేమీ లేదని బోధపడ్డాక ఇప్పుడు చేస్తున్నది నిరర్ధకమనిపించింది. వదిలేసాను. చాలా రిలీవ్డ్ గా ఫీలయ్యా. ఆఖరి క్షణాల్లో విచిత్రంగా దృష్టి మెరుగయ్యింది. విజయం కన్నా వైభవంగా మరొక శిఖరం కనపడింది - ఆనందం. అసలు నేను మొదట బయలుదేరింది దానికోసమే. పోటీలో పడి ఆ విషయమే మర్చిపోయాను. నేనెక్కడ ఉన్నానో తెలుసుకుందామని తలెత్తాను. నాకన్నా చాలామంది ఎత్తులో ఉన్నారు. కిందకి చూస్తే తెలిసింది నేను కూడా చాలామంది కన్నా ఎత్తులో ఉన్నానని. అసలిదంతా సబ్జెక్టివ్ గా అనిపించింది. నేను వచ్చిన మార్గంలో పక్కగా కొన్ని 'సంతృప్తి' మజిలీలున్నాయి. వస్తున్నప్పుడు వాటిని నేనంతగా పట్టించుకోలేదు. నా సహచరులు కొందరు అక్కడే సేదతీరుతున్నారు. విచిత్రంగా వారికి ఆనందశిఖరం అందుతూ ఉంది. నా అంతిమ క్షణాలు సమీపించాయి. చుట్టూ ప్రకాశం అలుముకుంటోంది. ఇంకొక రెండు క్షణాలు ఉందనగా ఆ వెలుగులో నాకు సమాంతరంగా మరొక మార్గం కనపడింది. అక్కడ ఎత్తులు-పల్లాలు లేవు. ఆత్మానందం అనే ఉచ్ఛ స్థితి అది. అక్కడ నడుస్తున్నవారు ఒక గొప్ప విలువకో లేదా పదిమందికి ఉపయోగపడే ఒక ఉన్నతమైన ఆశయానికో లేదా ఒక కళ కోసమో తమని తాము ఆనందంగా కోల్పోయి అంకితమవుతున్నారు. వీరు పాటుపడుతున్న విలువలు మాత్రం జనరేషన్స్ తో సంబంధం లేకుండా భూత భవిష్యత్తులకి వెరవకుండా స్థిరంగా ప్రకాశిస్తున్నాయి. మెల్లగా ప్రపంచమంతా ఒక తెల్లని కాంతిలా మారింది. శీను దేహాన్ని ప్రాణం వీడింది.

నా పెన్ను ఆగింది. రాసిన కధని మళ్ళీ చదువుకున్నాను. 'ఇదొక స్టోరీనా?.. దీనికెవరూ కామెంటు చెయ్యరు.' అనుకొని విసుగ్గా పక్కన పడేసాను. మూడ్ పాడయింది. రాత్రవ్వడంతో ఈరోజుకిక పని కాదనుకొని పక్క మీద వాలాను.

జీవితాంతం విజయం, గుర్తింపు కోసం పాటుపడి సంతృప్తి చెందక చనిపోయిన శీను ఆత్మగా మారాడు. ఈ టపా ద్వారానైనా పదిమందికీ తెలుస్తాను కదా అనుకొని రచయిత పడుకున్నాక రహస్యంగా బ్లాగర్ లోకి లాగిన్ అయి టపాని పబ్లిష్ చేసాడు.

8 comments:

మోహన said...

కథ లోని పాత్ర ప్రాణం పోసుకుని టపాని పబ్లిష్ చెయ్యగలిగే అంత జీవం నింపారుగా...
వ్యాఖ్యలదేముంది లేండి. అన్ని భావాలను, మాటల్లో పెట్టలేం.

ప్రపుల్ల చంద్ర said...

బాగుంది... కథ, ఆలోచన రెండూ :)

dhrruva said...

7/10

Well wisher said...

Hmm.. Idea is fabulous, but execution is nowhere near it.

Please working on the stuff you write!

మోహన said...

>>ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు.

చదివాను. ఒక సారి, రెండు..మూడు సార్లు... ప్రతి సారీ పూర్తిగా చదవట్లేదు. చీకట్లో మెరుపుల వెలుగుల్లా అక్కడో లైను, ఇక్కడో లైను...
కాసేపటికి, మీ టపా నాకో మెరుపు మెరిసేలా చేసింది. రాసేందుకు ప్రేరణ కూడా ఇస్తోంది. మరి ఇక్కడ నా గొప్పతనం ఏంటీ ? :)

మాట్లాడాలంటే ఈ టపాలోని ప్రతి వాక్యం ఎంతో స్కోప్ ఇస్తుంది. అంతటినీ ఈ చిన్ని జాగాలో ఇరికించేసారు. అందుకేనేమో కొంచం ఉక్కబోతగా ఉంది.

నేను ఇంకో రెండు, మూడు సార్లు వ్యాఖ్య చేసినా, ఆశ్చర్యం లేదు. చదివిన ప్రతి సారీ ఏదో ఒక లైన్లో వెళిపోతున్నా మరి...

vatsavi said...
This comment has been removed by the author.
vatsavi said...

vatsavi said...
jeevitamloo vijayam, gurtimpu vatantata avee manishini varinchaalani, manishi vaati venta paditee jeevitaanni soonyam cheesukovadamee avutundani cheppakanee cheppina teeru adbhutam

మురారి said...

@వాత్సవి,
Thank you.