Saturday, July 4, 2009

సంఘర్షణ

చుట్టూ గడియలేసి పహారా కాస్తున్న నా హృదయపు అంతఃపురం లోనికి వెన్నెల్లా నువ్వెప్పుడు వచ్చేసావో!.. పందిరిలా అల్లుకునేసరికి గోడలెపుడు వాటి గంభీర అస్తిత్వాన్ని కోల్పోయాయో!..

నీ ఉనికి తీరాన స్వాంతన పొందుతున్న నా పాదముద్రలు ఎప్పటికప్పుడు చెరిగిపోతున్నా దారిలో ఏరుకున్న గవ్వలు జ్ఞాపకాల పేజీల్ని ఇంకా అలంకరిస్తున్నాయి.

సముద్రంలా నువ్వు లోపల ఉన్నావన్న నిజాన్ని ఆ కాపలావాడు అస్సలు భరించలేడు. లోపలికి ఎవరూ చొరబడలేదన్న భ్రమనే ఇంకా శ్వాసిస్తున్నాడు. నిజానికి కొన్ని భ్రమలే మనల్ని బ్రతికిస్తుంటాయి. లేదంటే నాలోని వాడు ఏమైపోయేవాడో..

నీ అవాజ్యమైన ప్రేమంటే నాకు గొప్ప భయం. ఓపలేను. అందుకే నా వైకల్యం కనపడనీకుండా నీనుంచి తప్పించుకు తిరుగుతుంటాను. కానీ నేను పారిపోతున్నది నానుంచేనని ఎప్పటికప్పుడు మర్చిపోతాను.

'నన్ను పరిహసించదానికే వచ్చావా?.. పో!.. ' అని నిష్టూరమాడుతాను. కానీ నువ్వు నా కసురుని పట్టించుకోనట్లే కనబడతావు. అందుకు నాకు మరీ కోపం.

నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు. వదులుకుందామంటే నా అంత మూర్ఖుడూ లేడు.

14 comments:

...Padmarpita... said...

పట్టుకోకండి.....పట్టుకుంటే వదలకండి...

Purnima said...

Be selfish! Simple! :)
(Being selfish isn't bad.. trust your instincts and hold on to her / it!)

మురారి said...

@Padmarpita,
చాలా సింపుల్ గా చెప్పేసారు. కానీ ఓ నిర్ణయానికి వచ్చేముందు ఇంకెంత సంఘర్షణ ఖర్చవుతుందో!.

@Purnima,
ఇచ్చేది మనమయినప్పుడు selfishness ని justify చేసుకోవచ్చు. కానీ 'ఎక్కువ' తీసుకునేది మనమే అయినప్పుడూ, అదీ ఒక relationship లో.. స్వార్ధం అంత సమర్ధనీయం కాదని నా అభిప్రాయం. సమస్య మరొకరి జీవితమంత పెద్దదయినప్పుడు కేవలం instincts ని నమ్మి నిర్ణయం తీసుకోవచ్చా?

ఉష said...

మీరే అన్నాక సంఘర్షణ అని, మరొక ప్రత్యామ్యాయం లేదిక. ఒకసారి ఒక భావనది పైచేయి మరొకసారి రెండవదానిదీను. ఇరు భావాల్లోనూ న్యాయం, నిజాయితి వుంటుంది. అవి సరైన సమయానికి వెలికి వస్తే మీ బంధం సఫలమౌతుంది.

మురారి said...
This comment has been removed by the author.
మురారి said...

@ఉష,
>>ఇరు భావాల్లోనూ న్యాయం, నిజాయితి వుంటుంది.
బాగా చెప్పారు.

>>అవి సరైన సమయానికి వెలికి వస్తే మీ బంధం సఫలమౌతుంది.
అవతలి వ్యక్తి ప్రేమ చాలా గొప్పదైతే దానిని స్వీకరించలేని భావావేశాన్ని పదాల్లో పెడదామన్నదే నా ఉద్దేశ్యం. ఒకింత స్వానుభవం ఉండవచ్చేమో గానీ పూర్తి వ్యక్తిగతం కాదు.

మోహన said...

let me tell you that this post has been a 3-dimensional beauty.

1.సాహిత్యం:
>>గడియలేసున్న గదిలోకి వెన్నెల చొరబడటం...
>>ఉనికి తీరం, ఏరుకున్న గవ్వలు...
Simply beautiful.
2.భావం:
ఎంతగా హత్తుకునేలా రాసారంటే, చదివిన తరువాత ఒక పది నిమిషాలు స్తబ్ధుగా ఉండిపోయాను. కుడి మెదడు యే మాత్రం సిగ్నల్స్ పంపలేదు!!
Straight from the heart feeling. It touched straight.
3.Psychology:
మనసు గదిని భద్రంగా చూసుకుంటున్న కాపలా వాడు. ఈ కాపలా వాడి శృష్ఠి అద్భుతం. సూక్ష్మమైన విషయాన్ని చాలా తేలికగా అర్థమయ్యేలా చెప్పారు.

ఇన్ని రకాలుగా బాగా రాసారు. అభినందనలు. ఏదో ఒక వైపు ఒరిగిపోకుండా రాసినందుకు ఇంకొన్ని అభినందనలు.

ఇక విషయానికి వస్తే...
>>నిజానికి కొన్ని భ్రమలే మనల్ని బ్రతికిస్తుంటాయి.
భ్రమ బ్రతికించ గలదు. అలాగే కొన్ని సార్లు బ్రతికున్నంత కాలం హింసించగలదు కూడా!!

>>కాపలావాడు..
తెలియకుండానే ఈ కాపలావాడు ఎలా అయితే ప్రత్యక్షమవుతాడో, అలానే ఏదో ఒక రోజు మాయమవుతాడు కూడా... కథానాయకుడు వాడికి ప్రత్యేకించి ఆయుష్షు పొయ్యకుండా ఉంటే.

>>నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు.
పైన మీ వ్యాఖ్యలో చెప్పినట్టు ఇచ్చి పుచ్చుకోవటంలో తేడాలుంటే ఇచ్చేవారికి లోలోపల ఒక బాధ ఉంటుంది. అది లేదన్నట్టయితే, మీ దృష్టి ఎక్కడో
narrow గా ఉందనిపిస్తోంది.
There are different levels of giving and taking. May be you are missing the other person's
perspective. All that matters in a realtion is how well two people are tuned.

>>వదులుకుందామంటే నా అంత మూర్ఖుడూ లేడు.
హహహ... ఇదో పెద్ద భ్రమ.
ఉదా: నేను, నా స్నేహితుడు ఓ రైలెక్కాలి. మా వాడికి చాలా లేట్ అయ్యేలా ఉంది. నాకా, ఊరిలో చాలా అర్జంట్ పని, సో ’నువ్వు వెనక రా’ అని నేను బయలుదేరాను. సిటీ బస్ లో వెళ్తే ఆలస్యం అయిపోతుందని, ఆటో లో స్టేషన్ కు బయలుదేరాను. మార్గ మధ్యంలో ఆటో చెడిపోయింది. వేరే ఆటో దొరకలేదు. బస్ స్టాపు దూరం. సామానుతో నడిచెళ్ళటం కష్టం. వేరే ఆటో దొరికాకా నేను "బండి ఆలస్యంగా నడవాలి దేవుడా!!" అని బోలెడు మొక్కులు మొక్కాను. నేను చేరేసరికి రైలు అప్పుడే స్టేషన్ వదిలి వెళ్ళిపోతోంది, నా కళ్ళముందే!! సిటీ బస్ ఎక్కి వచ్చిన నా స్నేహితుడు రైలులో నుండి కాల్ చేసాడు....

ఇప్పుడు చెప్పండి,
ముందుచూపు వ్యవహరించి నేను ఆటోలో వెళ్ళటం నా స్వార్థమా?
రిస్క్ తీసుకుని బస్ లో వెళ్ళకపోవటం నా మూర్ఖత్వమా?

మర్నాడు న్యూస్ లో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని వింటే?
ఇప్పుడు, పై ప్రశ్నలకు మీ సమాధానాలు?

మనిషి బంధం అనేది ఏర్పరచుకున్నది ఇతరుల ద్వారా తనని తాను నిత్య నూతనంగా అవిష్కరించుకునేందుకు, తనను తాను కనుగొనేందుకు. కొన్ని బంధాలు ప్రాపంచిక దృష్ఠితో చూస్తే అదొక విఫలం అని తోచవచ్చు. నిజానికి ఆ వ్యక్తి ఆ బంధం ద్వారా ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకున్నాడనేది ముఖ్యం. అది నిజం. ఎవరూ గ్రహించకున్నా సరే నిజం ఎప్పుడూ నిజమే కదా..!!
Selfishness and foolishness are very subjective labels. marking one so, for making or not making a choice is a bigger foolish act. If one is patient enough to see a bigger picture, no choice made consciously can ever be a foolish one. When much of it depends on destiny, I trust my instincts.

After all this, if there is still a dilemma, better leave it, with no feeling of being a fool.
Good luck.

మురారి said...

@Mohana,

'ముత్యమంత పసుపు' లా మీ స్పందన నా టపా కి శోభ తెచ్చింది.

>>let me tell you that this post has been a 3-dimensional beauty.
అందం నా రచనదా, లేక చదివిన మీ మనసుదా అని కాసేపు సందేహపడ్డాను.

>>భ్రమ బ్రతికించ గలదు. అలాగే కొన్ని సార్లు బ్రతికున్నంత కాలం హింసించగలదు కూడా!!
మనిషి సాధారణంగా తన స్వాంతన కోసమే భ్రమిస్తాడు. అందువలన భ్రమ తాత్కాలికంగా మనిషికి ఆనందాన్నే ఇస్తుంది. అందులోని అభద్రతా భావం లేదా పలాయనవాదం వలన సబ్కాన్సియస్ లో ఫ్రస్ట్రేట్ అవ్వచ్చేమో గానీ, హింసించే భ్రమని నేనెరుగను.

>>తెలియకుండానే ఈ కాపలావాడు ఎలా అయితే ప్రత్యక్షమవుతాడో, అలానే ఏదో ఒక రోజు మాయమవుతాడు కూడా.
well said.

>>ఇచ్చి పుచ్చుకోవటంలో తేడాలుంటే ఇచ్చేవారికి లోలోపల ఒక బాధ ఉంటుంది.
పుచ్చుకునేవారికి కూడా కొంత అనీజీనెస్ ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికే ఈ టపా రాసింది.

>>నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు. వదులుకుందామంటే నా అంత మూర్ఖుడూ లేడు.
ఇక్కడ తన భావాల్ని చెప్పుకుంటూనే అవతలి వ్యక్తిపై తనకి గల కన్సర్న్ ని రచయిత చెబుతాడు. కేవలం నా స్వార్ధం కోసమే స్వీకరిస్తున్నానా? లేదా వదిలిపెట్టడం ద్వారా తన పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నానా అన్న సందిగ్ధత ని వ్యక్తపరుస్తాడు.

మోహన said...
This comment has been removed by the author.
మోహన said...

>>హింసించే భ్రమని నేనెరుగను.
మనిషి మానసికంగా హింసకు గురయ్యేదే ఎదో ఒక 'భ్రమ' వలన. అయితే అది భ్రమ అన్న స్పృహ ఆ మనిషికి ఉండకపోవచ్చు. భ్రమలు లేని నాడు ఆ మనిషి ఒక ఆనంద రాగం అయిపోతాడు.

>> పుచ్చుకునేవారికి కూడా కొంత అనీజీనెస్ ఉంటుంది.
అవును. అయితే ఇక్కడ రెండు విషయాలు.
1.ఇచ్చేవారికి లోలోపల ఏదో బాధ ఉండటం. ఇది నిజమైతే మీరన్నదానికి నే ఒప్పుకుంటున్నాను.
2.ఇచ్చేవారికి ఇవ్వటం వలన ఇబ్బంది లేకపోవటం. ఇది నిజమైతే, ఆ ఇచ్చే వారు మీ నుండి ఏమి పుచ్చుకుంటున్నారో మీరు గ్రహించలేకపోతున్నారనిపిస్తుంది. అందుకే ఆ 'అనీజీనెస్' అనుకుంటా.. This also is a part of tuning. ఇది నా ఉద్దేశం మాత్రమే!
We see what we wish to see.


>>కేవలం నా స్వార్ధం కోసమే స్వీకరిస్తున్నానా?
Any decision should be made by 'self' for 'self'. It cannot be labelled as "selfishness". Anyway in this context, the decision cannot be complete without the other person's involvement.

>>వదిలిపెట్టడం ద్వారా తన పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నానా?
Again, any decision should be made by 'self' for 'self'. Not for "others". If not, ఏ విషయంలో అయినా ఇలాంటి మానసిక "సంఘర్షణ" తప్పదు.

మురారి said...

@మోహన,
తప్పు, ఒప్పు అంటూ అనలైజ్ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. జస్ట్ ఓ భావోద్వేగాన్ని చెప్పాలనుకున్నా. అంతే.

మోహన said...

:) Ok.

vatsavi said...

bharinchaleni veedananu pondee moorkhatwam kanna yenaleeni aanandaanni panchee swaardhamee jeevitaanni aanandamayam cheestundi idi naa swaanubhavam tappugaa bhaavincharani aasistunnaanu

మురారి said...

@ వాత్సవి,
ఇందులో తప్పుగా భావించడానికి ఏముందండి?.. అక్షరలక్షలు విలువ చేసే మాట చెప్పారు. స్పందనకి థాంకులు.