Monday, September 7, 2009

ఉప్పటి జ్ఞాపకం...

అనంత సాగర గర్భాన్ని దాటుకొని తీరానికి పరుగులెత్తిన అలలా ఈ క్షణం కోసమే ఎన్నో బరువైన దాహపు ఝాముల్ని ఈది వచ్చాను.

వర్షించే క్షణం కోసమే బతికిన మేఘం వర్షించాక మాయమైనట్టు ఈ క్షణం కోసమే.. ఈ క్షణం లోనే గడిపిన మునుపటి కాలమంతా గమ్మున తన అస్తిత్వాన్ని జారవిడుచుకుంది.

నా ఎదురుగా.. సాహితి.

* * * * *

నిండు గుండె వెంటనే తొణకలేనట్లుగా ఆ స్థానే నిశ్వాసలు అధికమై, పొడి పొడి మాటలు పల్లవించాయి.
'వచ్చేసావా?'
'ఊ!.. నీ పరీక్షలు అయిపోయాయా?'
'ఊ..'
ఇద్దరివీ సమాధానం తెలిసిన ప్రశ్నలే. కానీ మనసులు అటూ, ఇటూ ప్రవహించడానికి భౌతికమైన ఏదో సంధి ఏర్పడాలిగా.

ఇద్దరం పక్కపక్కన ఇసుకలో కూర్చున్నాం. మేమెప్పుడూ కలిసే ఏకాంత సాగరతీరమిది. కాసేపటికి నా కాళ్ల మీద తలపెట్టుకొని తను.. ఇంకాసేపటికి తన కాళ్లమీద తల పెట్టుకొని నేను. కాలం కరుగుతోంది. మాటల తలంబ్రాలు, స్పర్శలు రేపే నూనూగు కాంక్షల మేళాల నడుమ హృదయాల కళ్లాపులు.

నా కళ్లకెదురుగా ఆకాశం.. అవధుల్లేకుండా. పగలు, రాత్రి మాలాగే ప్రేమికులై ఇప్పుడే కలుసుకుంటున్నారేమో. ఆకాశంలో అందమైన సంధ్య ఆవిష్కృతమౌతోంది. తన తోడుగా నా ప్రపంచం ఇప్పుడింత అందంగా ఉందన్న విషయం ఒక్కసారిగా అనుభవంలోకి వచ్చింది. ఈ భావన నిజమేనని నిర్ధారించుకోడానికో ఏమో తన అరచేతిని తీసుకొని నా చెంపకి తాకించాను. వెచ్చగా, నిబ్బరంగా అనిపించింది. తనేవో మాట్లాడుతోంది. చెంప మీదున్న అరచేతిని కాస్త ముందుకు జరిపి మనస్పూర్తిగా ముద్దాడాను. మా చూపులు కలిసాయి. తన చేయి నా నుదురు మీదుగా పోయి జుట్టుని నిమిరింది. చెంపకి చేతిని అలానే ఆనించి ఉంచి అడిగాను-
'నా ప్రపంచాన్నిఇంత అందంగా ఎప్పుడు మార్చేసావు?' అని.
'నీ ప్రపంచం ఎక్కడిది. అది నాది కదా!.' అంటూ నవ్వింది.
నేను లేచి, కిందకి జరిగి, తన పాదాల పక్కకి వచ్చి పడుకొని ఆమె అరిపాదాలను నా గుండెల మీద చేతులతో బంధించాను. ఎప్పటినుంచో ఇలా చెయ్యాలని ఉంది. కానీ నేనకున్న ఫీల్ రావట్లేదు. షర్ట్ బటన్స్ విప్పి నగ్నమైన ఛాతి మీద తన పాదాల్ని వేసి రెండు చేతులతో పట్టుకున్నాను. అంతే!.. అనిర్వచనీయమైన సౌందర్యభావన 'నేను' అనే ఉనికిని తటాలున ఖండించింది. నేను లేను.. తనూ లేదు..ఈ ప్రపంచమూ లేదు.. కేవలం అనుభూతి సౌందర్యమే మిగిలింది.. విశ్వమంతా. ఇంతలో తన చేయి నా చెవి వెనుక జుట్టుని బలంగా పట్టి ఒక్క ఉదుటున నా తలని తన ఒళ్ళోకి తెచ్చుకొని ఆమె గుండెల మధ్య బిగపెట్టి కౌగిలించుకొంది. కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయామో లేదా కాలమే స్థంబించిందో తెలియదు.

ఇక టైమవుతుందని విడిపోవడానికి సిద్ధపడ్డాము. సడన్ గా సాహితి సైలంటయిపోయింది. బై చెపుతున్నప్పుడు చూసాను- తన కళ్ళల్లో సన్నని నీటి పొర. తననెప్పుడూ అలా చూడలేదు. ఎప్పుడూ మానసికంగా చాలా స్థైర్యవంతురాలిగా కనపడుతుంది. ఇలా చూసేసరికి ఆందోళనతో దగ్గరకి వచ్చాను. అదే సమయంలో తను నా
కోసమని ఇలా బేలపడిందన్న విషయం గొప్పగా అనిపించింది. నేను గమనించానని గుర్తించగానే తను తలదించుకుంది. కనురెప్పలు వాలాయి. ఎడమకన్ను నుండి ఓ నీటి చుక్క అపురూపంగా కిందకి జారింది. చప్పున పెదవులతో దానిని అందుకున్నాను. నోటికి ఉప్పుగా తగిలింది.

ఎవరు చెప్పారు ఉప్పు తియ్యగా ఉండదని?.