Monday, September 7, 2009

ఉప్పటి జ్ఞాపకం...

అనంత సాగర గర్భాన్ని దాటుకొని తీరానికి పరుగులెత్తిన అలలా ఈ క్షణం కోసమే ఎన్నో బరువైన దాహపు ఝాముల్ని ఈది వచ్చాను.

వర్షించే క్షణం కోసమే బతికిన మేఘం వర్షించాక మాయమైనట్టు ఈ క్షణం కోసమే.. ఈ క్షణం లోనే గడిపిన మునుపటి కాలమంతా గమ్మున తన అస్తిత్వాన్ని జారవిడుచుకుంది.

నా ఎదురుగా.. సాహితి.

* * * * *

నిండు గుండె వెంటనే తొణకలేనట్లుగా ఆ స్థానే నిశ్వాసలు అధికమై, పొడి పొడి మాటలు పల్లవించాయి.
'వచ్చేసావా?'
'ఊ!.. నీ పరీక్షలు అయిపోయాయా?'
'ఊ..'
ఇద్దరివీ సమాధానం తెలిసిన ప్రశ్నలే. కానీ మనసులు అటూ, ఇటూ ప్రవహించడానికి భౌతికమైన ఏదో సంధి ఏర్పడాలిగా.

ఇద్దరం పక్కపక్కన ఇసుకలో కూర్చున్నాం. మేమెప్పుడూ కలిసే ఏకాంత సాగరతీరమిది. కాసేపటికి నా కాళ్ల మీద తలపెట్టుకొని తను.. ఇంకాసేపటికి తన కాళ్లమీద తల పెట్టుకొని నేను. కాలం కరుగుతోంది. మాటల తలంబ్రాలు, స్పర్శలు రేపే నూనూగు కాంక్షల మేళాల నడుమ హృదయాల కళ్లాపులు.

నా కళ్లకెదురుగా ఆకాశం.. అవధుల్లేకుండా. పగలు, రాత్రి మాలాగే ప్రేమికులై ఇప్పుడే కలుసుకుంటున్నారేమో. ఆకాశంలో అందమైన సంధ్య ఆవిష్కృతమౌతోంది. తన తోడుగా నా ప్రపంచం ఇప్పుడింత అందంగా ఉందన్న విషయం ఒక్కసారిగా అనుభవంలోకి వచ్చింది. ఈ భావన నిజమేనని నిర్ధారించుకోడానికో ఏమో తన అరచేతిని తీసుకొని నా చెంపకి తాకించాను. వెచ్చగా, నిబ్బరంగా అనిపించింది. తనేవో మాట్లాడుతోంది. చెంప మీదున్న అరచేతిని కాస్త ముందుకు జరిపి మనస్పూర్తిగా ముద్దాడాను. మా చూపులు కలిసాయి. తన చేయి నా నుదురు మీదుగా పోయి జుట్టుని నిమిరింది. చెంపకి చేతిని అలానే ఆనించి ఉంచి అడిగాను-
'నా ప్రపంచాన్నిఇంత అందంగా ఎప్పుడు మార్చేసావు?' అని.
'నీ ప్రపంచం ఎక్కడిది. అది నాది కదా!.' అంటూ నవ్వింది.
నేను లేచి, కిందకి జరిగి, తన పాదాల పక్కకి వచ్చి పడుకొని ఆమె అరిపాదాలను నా గుండెల మీద చేతులతో బంధించాను. ఎప్పటినుంచో ఇలా చెయ్యాలని ఉంది. కానీ నేనకున్న ఫీల్ రావట్లేదు. షర్ట్ బటన్స్ విప్పి నగ్నమైన ఛాతి మీద తన పాదాల్ని వేసి రెండు చేతులతో పట్టుకున్నాను. అంతే!.. అనిర్వచనీయమైన సౌందర్యభావన 'నేను' అనే ఉనికిని తటాలున ఖండించింది. నేను లేను.. తనూ లేదు..ఈ ప్రపంచమూ లేదు.. కేవలం అనుభూతి సౌందర్యమే మిగిలింది.. విశ్వమంతా. ఇంతలో తన చేయి నా చెవి వెనుక జుట్టుని బలంగా పట్టి ఒక్క ఉదుటున నా తలని తన ఒళ్ళోకి తెచ్చుకొని ఆమె గుండెల మధ్య బిగపెట్టి కౌగిలించుకొంది. కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయామో లేదా కాలమే స్థంబించిందో తెలియదు.

ఇక టైమవుతుందని విడిపోవడానికి సిద్ధపడ్డాము. సడన్ గా సాహితి సైలంటయిపోయింది. బై చెపుతున్నప్పుడు చూసాను- తన కళ్ళల్లో సన్నని నీటి పొర. తననెప్పుడూ అలా చూడలేదు. ఎప్పుడూ మానసికంగా చాలా స్థైర్యవంతురాలిగా కనపడుతుంది. ఇలా చూసేసరికి ఆందోళనతో దగ్గరకి వచ్చాను. అదే సమయంలో తను నా
కోసమని ఇలా బేలపడిందన్న విషయం గొప్పగా అనిపించింది. నేను గమనించానని గుర్తించగానే తను తలదించుకుంది. కనురెప్పలు వాలాయి. ఎడమకన్ను నుండి ఓ నీటి చుక్క అపురూపంగా కిందకి జారింది. చప్పున పెదవులతో దానిని అందుకున్నాను. నోటికి ఉప్పుగా తగిలింది.

ఎవరు చెప్పారు ఉప్పు తియ్యగా ఉండదని?.

14 comments:

మోహన said...

సాహితి వచ్చిన ప్రతి సారీ వెన్నెలలు కురిపిస్తుంది. ఆమె చిలికే పున్నమి కోసం ఒక్కటేమిటి, కొన్ని వందల అమావాస్యల నిశిని సైతం భరించచ్చు.

సాహితి ప్రేమకు స్పందిస్తూ, ఆమెను అభిమానిస్తూ మీ కథానాయకుడు ఆమెను అలవోకగా మరో స్థాయికి తీసుకెళ్ళాడు.

చిత్రీకరణ అమోఘం. ప్రతి పదం, ప్రతి భావం ఎంతో మృదువుగా, అందంగా పేర్చి అలంకరించారు. అలరించారు. అభినందనలు.

kalpa latika said...

mee talapula madilo aksharamu vittai,molakai,maanai,akaasamanta vyaapinchaga nenu choosanu.mee kaavyeekaran maa kallaku chitreekaranaga maarindi.

ee akshara arnavamlo naenu oka neetu binduvu nainanduku santasistuu....


......saelavu

శేఖర్ పెద్దగోపు said...

మీ టపా చదివినంతసేపు ఓ అద్భుతదృశ్యం కళ్ళముందు ఆవిషృతమైంది మురారి గారు. చాలా చక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు.

కొత్త పాళీ said...

very well done

Purnima said...

Wow and a Wow!

But as usual my complain remains the same. You create a brilliant picture of nature and love, but somewhere in between you dilute it by your language at some points.

"వావ్!.. సూపర్బ్ గా ఉంది.. ఈ ఫీల్." -- for me, this doesn't go with the rest of the post. Beloved's feet on the naked part of the chest.. isn't it beyond a wow and a superb? :)

I know, I get very picky with your posts, but that's only because they are mesmeric.

Another "WOW" to end! :)

మురారి said...

@మోహన, kalpa latika, శేఖర్ పెద్దగోపు, కొత్తపాళి
నా టపా మీకు నచ్చినందుకు చాలా ఆనందమేసింది. స్పందనకి ధన్యవాదాలు.

@Purnima,
>>"వావ్!.. సూపర్బ్ గా ఉంది.. ఈ ఫీల్." -- for me, this doesn't go with the rest of the post.

నేనూ మీతో ఏకీభవిస్తాను. రాసాక ఓసారి చూసుకుంటే నాకూ ఇలానే అనిపించింది. ఇంకా బాగా వర్ణించుండాల్సింది. మీ స్పందనకి ధన్యవాదాలు.

cartheek said...

well done .........

మురారి said...

Thanks Cartheek.

S said...

Good one.

మురారి said...

@S,
Thank you.

vatsavi said...

preeyasiloni premani, kontetanaanni; priyuniloni aaraadhanani meeru anoohyamga varnimchaaru.
inta sunnitamaina bhavalu kalagatam oka varamaitee, aa bhaavaalanu vyaktaparachatam kuda oka kala ani naa abhimatam.
yeemainaa ilaanti jantalu visaala prapamchamloo arudu idi naa abhiprayam tappuga vrastee kshaminchagalaru

మురారి said...

@ వాత్సవి,
'.. క్షమించగలరు.'అంత modesty ఎందుకండీ?..
మనసులు సంక్లిష్టమైపోతే చెప్పలేను గానీ.. ఇవి ప్రేమికుల సహజమైన భావోద్వేగాలు. మరీ 'అరుదు' అని నేను అనుకోను.
నా టపా మీకు నచ్చినందుకు సంతోషం.

నిషిగంధ said...

భయంకరంగా నచ్చేసిందండీ! ఛాతిమీద తన పాదాలను బంధించి పట్టుకోవడం అనే భావనే ఎంత బావుందో! ఇకపోతే పూర్ణిమ చెప్పిన వాక్యమే కాకుండా, 'హృదయపు కళ్ళాపులు ' ప్రయోగం కూడా అంతగా కుదిరినట్లు అనిపించలేదండీ! :-)

మురారి said...

@నిషిగంధ,
మీకు నచ్చినందుకు నాకు కూడా అమితానందం కలిగింది. పూర్ణిమ చెప్పిన విషయంతో నేనూ ఏకీభవిస్తాను. ఇక 'హృదయాల కళ్ళాపులు' నాకు భావయుక్తం గానే అనిపించింది. బహుశా నా దృష్టికోణం అలా ఉందేమో.

మీ స్పందన కి ధన్యవాదాలు.