Saturday, November 28, 2009

Inner Dimensions: The wife speaks..

పైశాచిక ఆనందమంటే ఏమిటో నాకిప్పుడే.. దానిని అనుభవిస్తుంటే అర్ధమౌతోంది... త్వరలో అతన్ని మానసికంగా హింసించబోతున్నాను. నా భర్త పరాయి స్త్రీతో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం నేనీమధ్యనే రహస్యంగా కనిపెట్టాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తుంటే.. ఇన్నాళ్ళకి ఓ తప్పుకి దొరికాడు. దీనిని ఎత్తి చూపిస్తూ రేపటి నుండీ అతన్ని ఎంతలా టార్చర్ పెట్టబోతున్నానో తలచుకుంటుంటే ఓ రాక్షస తృప్తి కలుగుతోంది.

ఎందుకిలా ఉద్వేగంతో ఊగిపోతున్నాను?.. నేను నిజంగా ఈ విషయానికి ఆనందపడుతున్నానా?.. అతను నన్ను మోసగించాడన్న బాధ నాకేమాత్రమూ లేదా?..

నిజం చెప్పాలంటే.. మోసగింపబడ్డానన్న బాధ తాలూక స్పృహ అయితే ఇప్పటివరకూ కలుగలేదు. కానీ మనసు మాత్రం తాను ఆరాధించిన విలువల మేరుశిఖరం కూలిపోయిన విషయాన్ని వెంటనే అంగీకరించలేక, తన ఆత్మగౌరవాన్ని శిధిలాల్లో వెతుకుతూ కుమిలిపోతోంది. బాధే లేకుంటే నా ఆనందం 'పైశాచికం' ఎలా అవుతుంది?.. బాధతో కూడిన ఆనందం వలన వచ్చిన శాడిజం ఇది. !!..

Its sheer 'hatred'. అతన్ని ఎందుకు అంతలా ద్వేషిస్తానో నాకు తెలియదు. కారణాలు వెతకను కూడా. వెతకలేని నా అశక్తత బయటపడిపోతే నేను భరించలేను. వంటగదిలో చాకుని చూసిన ప్రతీసారీ I feel like hurting myself. చాకు ఎడమచేయి చర్మాన్ని లోతుగా కోస్తుంటే, ఆ బాధతీవ్రత నా ద్వేషాన్ని అధిగమించిన కొన్ని క్షణాల పలాయనం కోసం హాయిగా కోసుకోవచ్చు కూడా. కానీ ఇది నన్ను మరింత మూర్ఖంగా చూపిస్తుందని నన్ను నేను సంభాళించుకుంటాను.

తీక్షణమైన తృణీకారభావమేదో అతని సమక్షంలో నన్ను కాల్చేస్తూ ఉంటుంది. నిజానికి అతను ఎటువంటి తృణీకారభావాన్నీ చూపించడు. 'నువ్వు తప్పు' అని నేను చెప్పడానికి వచ్చిన ప్రతీసారీ నేను చెప్పేదీ వింటున్నట్టే.. నా భావాల్ని గౌరవిస్తున్నట్టే కనపడతాడు. కానీ నాకుమాత్రం అతని రీజనింగ్ ముఖం మీద చాచి లెంపకాయ కొట్టినట్టే అనిపిస్తుంది. లెంపకాయే చాలా సున్నితమేమో!.

పెళ్లికి ముందు నాకతనంటే హీరో-వర్షిప్. Future technologies మీద ఇన్వెస్టర్లకి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటుచేసిన ఓ సెమినార్లో నేను అతన్ని మొదటిసారిగా కలిసాను. ఇందులో ప్రసంగించడానికి అతను వక్తగా వచ్చాడు. మా CEO నాకు అందరితో పాటు అతన్నీ పరిచయం చేసాడు. ఒక అనాధ బాలుడి స్థాయి నుండి ప్రముఖ చిప్ మాన్యుఫేక్చరింగ్ కంపెనీ అధినేతగా ఎదిగిన అతని సక్సెస్ స్టోరీని నేనిదివరకే చదివాను. ఎదుటివారి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడీ మనిషి. ఎదుటివారిలోని కల్మషం లేని మానవస్ఫూర్తిని పలకరించడానికి వెతుకుతున్నట్లుగా ఉంటుంది అతని చూపు. మామూలుకన్నా ఓ రెండు క్షణాలు ఎక్కువగా మా చూపులు కలిసి వీడాయి. తరువాత ప్రసంగాలు మొదలయ్యాయి. అతని ప్రసంగం క్లుప్తంగా.. ఓ focused strategy తో సాగింది. But the words used, the visuals presented and the thoughts projected were very radical in sense. అతని తర్వాత వచ్చిన వ్యక్తి ప్రసంగం వినడానికి మెదడు కొంచం టైం తీసుకొంది. లంచ్ టైంలో ఇద్దరం ఆక్సిడెంటల్ గా పక్కపక్కన కూర్చున్నాం. 'Your talk is quite outstanding.'- కితాబిచ్చాను. కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు. కాసేపటికి తలెత్తి చూస్తే అతను నన్ను దీక్షగా చూస్తున్నాడు. 'మీరు చాలా అందంగా ఉన్నారు.' - నాకిచ్చిన మొదటి కాంప్లిమెంట్. సిగ్గు గుప్పుమంది. ఆ రోజు కొన్ని గంటలపాటు ఏవో ఆదర్శాల గురించో, ఆశయాల గురించో మాట్లాడుకున్నాం.

'సత్యం పలుకవలెను.' అన్న ఆదర్శం గురించి మాట్లాడుకోవడం బానే ఉంటుంది.. కానీ దానిని నిజంగా ఆచరించేవారిని చూస్తే.. 'ridiculous!!' అనిపిస్తుంది. పెళ్లయ్యాక అతని గురించి నాకలాగే అనిపించింది. అలాగని అతను సమాజం నిర్దేశించిన ఆదర్శాలని పట్టించుకునే టైప్ కాదు. ఎదుగుతున్న క్రమంలో తాను పరిశీలించి, విశ్వసించిన ఆదర్శాలనే పాటిస్తాడు. పాటించడమేమిటి.. ఆ ఆదర్శాలే అతను. సమాజంలో పదిమందితో మెలిగే తీరు, కనీస మర్యాద ఇవేవీ మనోడికి తెలియవు. తనకి నచ్చని లేదా ఇబ్బంది కలిగించే ఏ పనీ.. అది ఎంత చిన్నదైనా చెయ్యడు. ఊరకనే లాభాన్ని ఆశించడు.. తీసుకోడు. He is totally insane. A little hypocrisy, adjustment, manipulation.. ఇవి లేని మనిషి మనిషే కాడు.

పెళ్లయిన కొత్తలో అతను పెట్టబోయే కొత్త ప్లాంట్ కోసం ఇద్దరమూ కలిసి వర్క్ చేసాము. ఆ టైంలో రోజులెలా గడిచాయో తెలియలేదు. అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకించి పని చేస్తున్నట్టుగా అనిపించదు.. It was as if we both were instrumental in a greater spirit. ఇంతలో తనకి సడన్ గా వేరే ప్రాజెక్ట్ రావడంతో ప్లాంట్ కి సంబంధించిన మిగిలిన మేనేజిరియల్ పనులని నాకొదిలేసి క్లైంట్ లొకేషన్ కి మూవ్ అయ్యాడు. రెండు నెలల తర్వాత అతను వచ్చిన మొదటిరోజునే నన్ను టెర్మినేట్ చేసేసాడు. 'You dont suit our work culture.' - ఈ ఒక్క స్టేట్మెంటే అతను నాకిచ్చిన explanation. టెర్మినేషన్ ని భరించగలిగానేమో కానీ ఆ తర్వాత అతను ఏమీ జరగనట్టు, ఎటువంటి గిల్టీ ఫీలింగులూ లేకుండా నాతో ఎప్పటిలా ఉండటాన్ని మాత్రం అస్సలు భరించలేకపోయాను.

నాకు లోలోపల ఒకటే కోరిక - అతను కృంగిపోతుంటే, బాధపడుతుంటే చూడాలి. మొదట్లో ఈ విషయాన్ని నేనే ఒప్పుకోలేకపోయాను. కానీ క్రమంగా ఆ కోరికే నా అస్తిత్వమయ్యింది. అతన్ని దెబ్బతీయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తునే ఉన్నాను. తద్వారా అతనికో పాఠం నేర్పించాలి. అసలు అందుకు కూడా కాదు.. నన్ను నేను సమర్ధించుకోవడానికి అతను ఫెయిలవ్వాలి. కానీ ఒక పని తాలూకా ఫలితమెప్పుడూ అతన్ని కృంగదీయదు. తనవంతుగా 'పూర్తి ప్రయత్నం చేసానా..' అన్నదే అతని concern. So, ఫలితాన్ని ప్రభావితం చెయ్యడం ద్వారా అతన్ని దెబ్బతీయలేం. పోనీ చేతులు, కాళ్లూ, నోరూ తీసేస్తే.. Damn him!.. I cant control his mind.

నిద్రమాత్రల సీసాని రెడీగా పెట్టుకున్నాను. వచ్చాక అతని భాగోతం నాకు తెలిసిపోయిన విషయాన్ని బయటపెట్టి, సూటిపోటి మాటలాడి, వీటిని మింగేయడానికి- just to see him broke with guilt. అతనొచ్చాడు. wardrobe దగ్గరనుండి తన ఈల సన్నగా వినబడుతోంది. నేనున్న గదిలోకి వచ్చాడు. 'హాయ్..' అంటూ నా భుజం మీద చేయి వేసి పక్కన కూర్చున్నాడు. నా ఊపిరి వణుకుతోంది. 'ఏంటి!.. ఒళ్లు కాలుతోంది.. ఒంట్లో బాలేదా?..' అంటూ కొంచం వడిగా నా నుదిటి మీద, మెడ మీద అరచేతిని పెట్టి చూస్తున్నాడు. నేను తలెత్తి చూసాను. అతని కళ్ళలో నా పట్ల concern కనపడింది. ఎటువంటి అపరాధభావమూ లేదు. గొంతులోనూ, చేతి స్పర్శలోనూ మార్ధవముంది. 'ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతీసారీ మీరు కొత్తగా, ఫ్రెష్ గా కనపడతారు. ఏదో తెలియని మార్దవం కనపడుతుంది.' అనుకున్నట్టే మొదలెట్టాను గానీ అంతలోనే డీవియేట్ అవ్వడాన్ని గ్రహించాను. ప్రతిగా కళ్ళలో చిన్న ఆశ్చర్యంతో మనస్పూర్తిగా నవ్వాడు. అతని సమక్షంలో అప్రయత్నంగా నాలో పూర్తి వైరుధ్య భావాలు ఆక్రమణ చేసాయి. ఎందుకు ఇంతలా అతన్ని హింసిస్తున్నానని ఓ క్షణానికి అనిపించింది. వేరొకరి దగ్గరైనా స్వాంతన పొందుతున్నాడని momentarily I felt happy for him. నాకు నేనే క్రూరంగా కనిపించాను. ఈరోజతన్ని హింసించలేను అని అర్ధమైపోతుంది. మరోవైపు లోలోపల ఏదో బాధ తన్నుకొస్తోంది. అతని ముందు బయటపడడం ఇష్టం లేక లేచి, వడిగా నా రూమువైపు అడుగులేసాను. 'డాక్టర్ ని పిలవనా?..' అని అతనేదో అడుగుతున్నాడు. 'అవసరం లేదు. crocin వేసుకుంటే సరిపోతుంద'ని ముక్తసరిగా సమాధానమిచ్చి రూంలోకి వెళ్లి, బెడ్ మీద పడిపోయాను. కళ్ళ నుండి నీటి ధార ఆగట్లేదు. అలా ఎంతసేపయ్యిందో. లేచి ముఖం కడుక్కున్నాను.
ఈరోజు తప్పించుకున్నావు. See you tomorrow Mr. Businessman.