Tuesday, December 14, 2010

బింబాధరాల సరిహద్దున కన్నీటిచుక్క..

This moment is ridiculously painful. I am gasping for you.

బాధని చూపించడానికి నా దగ్గర ఏ గుర్తూ లేదు- కళ్ళలో మాటిమాటికీ ముసురుకునే చెమ్మ తప్ప.

పరితపించడమన్నది కేవలం హృదయానికే చెందిన భావనలా లేదు.. శరీరంలోని ప్రతీ రేణువూ నిన్ను కోరుకునే విరహాగ్నిలో మండిపోవడానికే ప్రాణం పోసుకుంటున్నాయి. My very existence is nothing but longing you.

ఈ ఝాము భారంగా.. అనంతంగా గడుస్తోంది. మరుక్షణానికి ఇతర విషయాలతో కాస్త తేలికపడతానేమో!.. కానీ ఈ క్షణానికీ వేదన నిజమైనది.

ఇంత వేదనలోనూ కొన్ని జ్ఞాపకాలు నవ్వు తెప్పిస్తాయి.. నవ్వు ముగుస్తుందనగా నీ లేమి మరింత తీక్షణంగా గుండెని మెలిపెడుతుంది.. నవ్వు తేలకుండానే కళ్ళు జలజలా వర్షిస్తాయి.. ఆ తర్వాత వెక్కుతూ దుఃఖం.

ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ.

ఇప్పటివరకూ ప్రపంచాన్ని పట్టించుకోనందుకు అది నిన్ను వేరుచేసి ఇలా కసితీర్చుకుంటోంది. విధి ఇంత కాఠిన్యమని నేనూహించలేదు. ఆఖరి కోరికకి కూడా ఆస్కారమివ్వలేదు.

కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు ముప్పెరుగొంటాయి. నిన్ను పొందని జీవితాన్ని త్యజించాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నీకోసం తపించేదెలా?..

మన కొద్దికాలపు పరిచయాన్ని శ్వాసిస్తూ బ్రతికే నా మిగిలిన ముప్పావు జీవితానికి చుక్కాని నీ మూడక్షరాల పేరు- సాహితి.

* * * *

దూరంగా ట్రాఫిక్ ధ్వనుల మధ్య మధ్యాహ్నపు నిశ్శబ్దం నాలానే ఒంటరిగా తోచింది. ఈ క్షణాన ఎందుకో మేం విడిపోయినప్పటి కలయిక గుండెల్లో మెదిలింది. నిశ్శబ్దమా!.. నీతో పంచుకోనా..

మలిసంధ్య.. ఆకాశం నిశి భారంతో క్రిందకి కృంగుతూ విరిగిపోయేలా ఉంది. తను నా దగ్గరకి వస్తూ కనపడింది. ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఎండిపోయాయన్న విషయం తెలుస్తోంది. నేనింకా పరిస్థితిని అంగీకరించని స్థితిలో ఉన్నాను. కళ్ళు ఉబ్బిపోయి, ముఖం పీక్కుపోయినట్టుగా ఉన్నా తనలో ఏదో కొత్త కాంతి.. ఆకర్షితుడినయ్యాను. ఇలాంటి నేపధ్యంలో కూడా కలిగిన క్షణకాలపు భౌతిక ఆకర్షణ తన మనస్థితిని గ్రహించేసరికి ఆవిరయ్యింది.

తను ముఖం అటువైపుగా పెట్టి పొడిపొడిగా ముగింపు వాక్యాలని ముక్తాయించింది. మరణశాసనాన్ని వింటున్న ముద్దాయిలా నిలుచున్నాను. దూరంగా తీరం వద్ద అలల ఘోష అనంతమైన రోదనలా ఉంది.

'నాకోసమైనా నన్ను మరచిపోయి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తావా?..' అని అడిగి తల దించుకొంది. కన్నీటికి బరువెక్కువ.

'ఊహు!.. నేనుండను..' చివరికి నా గొంతు పెగిలింది.

'లేదు.. ఉండాలి..' అంటూ తను మళ్ళీ వాదనకి దిగింది. నేను మొండిగా ఉన్నాను. కాసేపటికి ఇక లాభం లేదని తను వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అడుగులేసింది. నేను వచ్చి తన భుజం పట్టుకొని ఆపాను. 'ఇటు నుండి ఇటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం..పద..' అని ఒక మొండి నిశ్చయానికి వచ్చి, తనని బలవంతంగా నా వైపుకి లాగుతూ వడిగా వేరొకవైపుకి తీసుకెళ్దామని ప్రయత్నించాను. 'చెయ్యి వదులు..' అన్నా పట్టించుకోలేదు. మూర్ఖావేశంతో లాగుతున్నా. తను ప్రతిఘటించింది. హిస్టీరిక్గా ఏడుస్తూ, నన్ను రక్కుతూ విడిపించుకోవాలని చూస్తోంది. నాలో దుఃఖం, కోపం ఒకేసారి ఎగిసాయి. స్పృహలో లేను. తన చేతిని వదిలి, ధాటిగా ఒక చెంపదెబ్బ కొట్టాను. అరుస్తున్నదల్లా ఆగింది. ఇంకా రొప్పుతోంది. ఏం చేసానో అర్ధమైన నా కళ్ళు వర్షిస్తున్నాయి. తను తలెత్తి నన్ను చూసింది. ఇద్దరం ఎదురుపడ్డాం. తను నన్ను చూస్తూ మెళ్లగా స్థిమితపడుతోంది. నేను కూడా నిస్తేజంగా తనని చూస్తున్నాను.

ఏమైందో.. తను దగ్గరగా వచ్చింది.. బలంగా నన్ను హత్తుకొని, ముఖమంతా ముద్దులు పెట్టింది. అప్పటివరకూ ఉబుకుదామని ప్రయత్నిస్తున్న బాధకి ఊతం దొరికింది. ఇద్దరం ఏడుస్తూ ఒకరినొకరు చుట్టేసుకున్నాము.

మా పెదవులు కలిసాయి.. గాఢంగా.. ఆవేశంగా.. ఆర్తిగా.. జీవితానికి మిగిలింది ఈ ఒక్క క్షణమే అన్నట్టు అధరాలు జంటగా హృదయాలని మేళవించి తడుముకుంటూ తపించాయి. ఇరుకనుల కన్నీరు బింబాధరాల సరిహద్దులని స్పృశించాయి.

ఇంకేమీ మాట్లాడుకోలేదు.. విడిపోయాము.

* * * *

తన మాటలు వినని, తన నవ్వులు కనని, తన ముద్దులు దొరకని రేపటిని పొడిచి, పొడిచి చంపాలనుకున్నాను. కానీ కాలమే మరుక్షణం నుంచీ నన్ను పొడిచి, పొడిచి చంపుతోంది.

నిశ్శబ్దం మాట్లాడలేదు. కానీ నన్ను మళ్లీ వెతుక్కునేలా చేసింది.. తన జ్ఞాపకాల్లో.

Saturday, November 13, 2010

అమ్మకి పూలు పూచాయి

సాక్షి దినపత్రిక వారి ఆదివారం అనుబంధం- 'ఫన్ డే' లో ప్రచురించబడిన నా కధ 'అమ్మకు పూలు పూచాయి ' పూర్తి భాగాన్ని దిగువున చదువగలరు..

అమ్మకి పూలు పూచాయి
అలా ఉండకూడదనుకున్నా నాలో ఎందుకో అసహనం, కోపం వచ్చేస్తున్నాయి. నేను గొప్పగా భావించుకున్న నా ఆదర్శం నన్నిపుడు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. 'బాలు' ని ఇంటికి తీసుకువచ్చి మూడు రోజులవుతుంది. మేం వాడిని దత్తత తీసుకున్నాం. ఒక బిడ్డని కని, దేశజనాభాని ఒకటి హెచ్చించి, వాడిని పెంచడం కన్నా ఏ ప్రేమకూ నోచుకోని ఒక అనాధకి తల్లిదండ్రులవ్వడం మంచి ఆదర్శమని మా అభిప్రాయం. మా ఇద్దరి అభిప్రాయం అని చెప్పడం కన్నా నా అభిప్రాయమని చెప్పడమే కరెక్టేమో. ఎందుకంటే ఈ విషయమై నా భార్య ప్రణవికి సంవత్సరకాలంగా నచ్చజెప్పుతూ చివరికి ఒప్పించాను. తనకి ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ నా మీదున్న గౌరవం దానిని కప్పేసిందనుకుంటా. అనాధాశ్రమానికి వెళ్లి, బాలు ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాం గానీ వాడు అప్పటినుంచి మాతో సరిగా కలవట్లేదు. ముభావంగా ఉంటున్నాడు. ప్రణవి తన వంతుగా మంచి వంటలు, బొమ్మలతో వాడిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం కనపడట్లేదు. మేము ముందే వాడికోసం 'టాం అండ్ జెర్రీ' వాల్ పెయింటింగ్స్ తోనూ, ఆటబొమ్మలు, డ్రాయింగ్ సామాగ్రి వగైరా వాటితో ఒక చిన్న రూం ని సిద్ధం చేసాం. కానీ మా ప్రయత్నాలలో వేటిని కూడా బాలు అప్రీషియేట్ చెయ్యట్లేదు. ఈరోజు ఉదయం ప్రణవి 'గులాబ్ జాం' ని తయారుచేసి బాలు దగ్గరకి వచ్చి స్పూన్ తో వాడి నోట్లో పెడదామని ప్రయత్నిస్తే వాడు తన చేతిని ఆపి మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రణవి నావైపు అదోలా చూసి లోపలికి వెళ్లిపోయింది. ఆఫీషుకి వెళ్లినా ఆ చూపు నా ఆలోచనల్ని వీడలేదు. నన్ను ప్రశ్నిస్తునే ఉంది. నవమాసాలు గర్భంలో మోసి కనడంలోని మాతృత్వపు మధుర్యాన్ని తనకి దూరం చేసానన్న అపరాధభావం నన్ను అప్పటికే వేధిస్తూ ఉంది. దానికితోడు బాలు తనకి దగ్గరకాకపోవడం మరింత అసౌకర్యంగా ఉంది. అనాధపిల్లాడిని దత్తత తీసుకుంటామన్న మా నిర్ణయాన్ని బంధుమిత్రులు ఎంతగానో అభినందించారు. పైగా వాడికోసం మేం ముందే బొమ్మలు, కధల పుస్తకాలు వంటివి కొనడం; ఇద్దరం చైల్డ్ సైకాలజీకి సంబంధించిన పుస్తకాలని చదవడం వంటివి చూసి అందరూ మా ఆదర్శానికి ఆశ్చర్యపోయేవారు. వీటన్నింటితో వచ్చే పిల్లాడు కూడా మా ప్రేమకు ఇట్టే కరిగిపోతాడన్న ధీమా, ఒకవిధమైన గర్వం నాలో వచ్చేసాయేమో. నా కొండంత గర్వాన్ని ఒక చిన్నపిల్లాడు తన ప్రవర్తనతో పటాపంచలు చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పనిమీద దృష్టి నిలవకపోవడంతో లీవ్ తీసుకొని కారెక్కి రోడ్డు మీద పడ్డాను. ఎక్కడకి వెళ్లాలని ఏమీ నిర్ణయించుకోలేదు. అలా ఏదో ఆలోచించుకుంటూ బాలు ఉండే అనాధాశ్రమం వైపుకి వెళ్లాను. లోపలికి వెళ్లాలనిపించింది. 'ఏం చెప్పి లోపలికి వెళ్లాలా?' అని ఆలోచిస్తుంటే పూర్తి చెయ్యాల్సిన కొన్ని మైనర్ ఫార్మాలిటీస్ గుర్తుకు వచ్చాయి. లోపలికి వెళ్లి వార్డెన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఎందుకో సడన్ గా ఇక్కడ ఆడవాళ్లెవరూ పని చెయ్యడం లేదన్న విషయం స్ఫురణకి వచ్చింది. 'ఆడవాళ్లుంటే పిల్లల్ని ఇంకా ఆప్యాయంగా చూస్తారు కదా!..' అని అనిపించింది. ఆలోచనలు అలా వెళుతూ, వెళుతూ అంతకుముందు మొదటిసారిగా ఇక్కడకి వచ్చిన సందర్భాన్ని గుర్తుకు తెప్పించాయి.

ఆ రోజు మేం ఇక్కడకి వచ్చాక కొంతమంది పిల్లల్ని చక్కగా తయారుచేసి మా ముందుంచారు. అందరూ బాగున్నారు. కానీ ఖచ్చితంగా నిర్ణయించుకోలేకపోతున్నాం. ఏదో మిస్సింగ్. లంచ్ చేసి వస్తామని చెప్పి పక్కనున్న తోటలోకి వెళ్లి, మేం తెచ్చుకున్న క్యారియర్ ని ఓపెన్ చేసి తింటున్నాం. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు అటుగా వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. ఓ 13-15 ఏళ్ల వయసువారై ఉంటారు. 'అడాప్ట్ చేసుకోడానికి ఎవరో వచ్చారంటరా. అందుకే హడావుడిగా ఉంది.' అన్నాడొకడు. 'ఏముందిరా!. వాళ్లంతా అందంగా ఉన్నవాళ్లనే తీసుకెళ్తారు. సార్ కూడా వాళ్లనే శుభ్రంగా తయారుచేసి చూపిస్తాడు.' అన్నాడు పక్కబ్బాయి. వీళ్ల సంభాషణ మమ్మల్ని ఆలోచనలో పడేసింది. మా దృష్టికోణాన్ని విశాలం చేసింది. లంచ్ చేసాక మళ్లీ రిసెప్సన్ రూంకి వచ్చి కూర్చున్నాం. ఆఫీషు వాళ్లెవరూ లేరు. ఇక్కడ పిల్లలందరికీ పంచాలని మేం తెచ్చిన స్కెచ్ పెన్సిల్ సెట్ లు, డ్రాయింగ్ పుస్తకాలు, ఎరేజర్లు ఆ రూంలో మాకు దూరంగా ఓ మూలన ఉన్నాయి. ఇంతలో ఓ మూడునాళుగేళ్ల అబ్బాయి అక్కడకి వచ్చాడు. స్కెచ్ పెన్సిళ్ల దగ్గరకి వచ్చి అటూ, ఇటూ చూసాడు. తర్వాత ప్రణవి దగ్గరకి వచ్చి, ఆ పెన్సిల్ సెట్స్ ని చూపిస్తూ 'అవి నీవా?' అనడిగాడు. ప్రణవి నవ్వుతూ కాదంది. వాడు మళ్లీ అటూ, ఇటూ చూసి టెంప్టేషన్ ని ఆపుకోలేక ఓ పెన్సిల్ సెట్ ని పట్టుకొని లోపలికి పరుగెత్తాడు. వార్డెన్ వచ్చాక అతని పర్మిషన్ ని తీసుకొని రూములన్నీ చూడటం మొదలుపెట్టాం. ఆదివారం కావటం చేత అందరు అబ్బాయిలు (అది బాయ్స్ హాస్టల్.) రూముల్లో ఉన్నారు. ఆ పిల్లాడి రూంకి వెళ్లేసరికి మనోడు తనలో తానే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పెన్సిళ్లతో బొమ్మలేస్తున్నాడు. కొంచం పక్కన మరొక అబ్బాయి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. వీరిని డిస్టర్బ్ చెయ్యడమెందుకని వెళిపోతుండగా, 'ఏయ్!..' అని పిలిచాడు. ప్రణవిని చూసి, 'మరొక పెన్సిల్ సెట్ అక్కడుంది కదా.. తేవా?' అని ముద్దుగా అడిగాడు. 'నీ దగ్గర ఒకటి ఉందిగా' అని అంటే, 'ఇంకొకటి నా ఫ్రెండ్ కి ఇస్తాన'ని పక్కన పడుకున్న అబ్బాయిని చూపించాడు. మేమిద్దరం ఒకర్నొకరు చూసుకున్నాం. ఏకీభవించిన మా ఎంపికకి కళ్లతోనే ఆమోదం తెలుపుకున్నాం. ఆ పిల్లాడే బాలు.

నా ఆలోచనలని బ్రేక్ చేస్తూ ఒకబ్బాయి నేనున్న గదిలోకి వచ్చాడు. బాలు కన్నా కొంచం చిన్నవాడే అనుకుంటా. గోడలని తడుముకుంటూ ఎటో చూస్తూ రావడం వలన తను గుడ్డివాడని గ్రహించాను. 'సార్..' అని పిలిచాడు. 'ఊ..' అన్నాను. నా గొంతుని బట్టి నేనున్న ప్లేస్ ని ఊహించి, దగ్గరకి వచ్చి, 'ఇవి బాలువి. వాడికి ఇచ్చేయండి.' అని ఓ ప్లాస్టిక్ కవర్ న చేతికిచ్చి వెళిపోతుండగా 'నీ పేరేంట'ని అడిగాను. 'రాజు' అని బదులిచ్చాడు. ప్లాస్టిక్ కవర్లో చూస్తే ఓ గోళీకాయల డబ్బా, కొన్ని ఆటసామాన్లు ఉన్నాయి. ఇంతలో వార్డెన్ వచ్చాడు. మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తిచేసాను.

ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యాక బాలు రూంకి వచ్చాను. ఒక్కడే ఏదో ఆడుకుంటున్నా డల్ గానే ఉన్నాడు. కవర్ గుర్తొచ్చి పట్టుకొచ్చి ఇచ్చాను. కవర్ ఇప్పి చూసాక బాలు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 'మా హస్టల్ కి వెళ్లావా?.. రాజు ఇచ్చాడా?..' అని ఆతృత గా అడిగాడు. అవునన్నాను. కవర్ లోని బొమ్మలని ఒక్కొక్కొటీ ఆప్యాయంగా చూస్తూ ఆడుతున్నాడు. నేను వాడిని అలానే చూస్తూ నిలబడ్డాను. మా దగ్గరికి వచ్చాక మొదటిసారి వాడినింత ఆనందంగా చూస్తున్నాను. వాడి చర్య నాకొక పాఠం చెబుతున్నట్లుగా అనిపించింది. ఇంట్లో అన్నీ ఉన్నాయని వాడిని కట్టుబట్టలతో తీసుకొచ్చేసాం. కానీ వాడికి అప్పటివరకూ తాను గడిపిన పరిసరాలతో, మనుష్యులతో, వస్తువులతో కొంత అటాచ్మెంట్ ఉంటుందన్న ఆలోచనే మాకు రాలేదు. దత్తత తీసుకొని వీడిని మేమేదో ఉద్ధరిస్తున్నామన్న అహంభావం మాలో ఉందేమో. దానివలనే వాడివైపు నుంచి మేం ఆలోచించలేకపోతున్నామేమో.

'హాస్టల్ నుంచి తెచ్చిన ఆటవస్తువులతో బాలు చక్కగా ఆడుకుంటున్నాడ'ని చెబితే ప్రణవి ఆనందంగా, ఏదో వింతని చూడాలన్నట్లు గబగబా వాడి రూంకి పరుగుతీసింది. కాసేపయ్యాక వాడి రూంకి వెళ్లి చూస్తే ఇద్దరూ ఆడుకుంటున్నారు. బాలు సాహచర్యాన్ని ప్రణవి ఎంజాయ్ చేస్తున్నంతగా వాడు ఆమె సాహచర్యాన్ని ఎంజయ్ చెయ్యట్లేదని తెలుస్తోంది. 'కానీ కొంతలో కొంత నయమే కదా' అనుకొని వంటని మనమే పూర్తి చేసేద్దామని కిచెన్ లోకి నడిచాను. వంట పూర్తి చేసి, ప్లేట్స్ లో భోజనం పట్టుకొని వెళ్లి, వాడి రూంలోనే అందరం కలిసి తిన్నాం. భోజనాలయ్యాక పడుకోవడానికి వెళ్తుంటే ప్రణవిని బాలు కొంగు పట్టుకొని ఆపాడు. ఏంటన్నట్టు వాడి వైపు చూస్తే, ఓ రెండు సెకన్ల మౌనం తర్వాత 'నేను నీ పక్కన పడుకుంటాన'ని ప్రణవిని అడిగాడు. వద్దని వారించబోయి నేను ప్రణవిని చూసి ఆగిపోయాను. తను వాడి నుదుటిన ఓ ముద్దిచ్చి, ఎత్తుకొని బెడ్ రూం వైపు నడిచింది.

తరువాత రోజు బాలుని వాడి పాత హాస్టల్ కి ఓసారి తీసుకెళ్దామనుకున్నాం. వాడు అక్కడి ఫ్రెండ్స్ ని, హాస్టల్ వాతావరణాన్ని మిస్ అవుతున్నాడేమోనని మా అనుమానం. కారులో బయలుదేరిన కాసేపటికి మనం హాస్టల్ కి వెళుతున్నామని బాలుకి చెప్పాను. ఆ నిమిషం కొండంత ఉత్సాహం కనపడింది వాడిలో. ఇది నేను ఊహించినదే. కానీ ఊహించని విధంగా కాసేపయ్యాక బాలు దిగాలుగా అయిపోయాడు. 'నేను మళ్ళీ వెనక్కి రాను. అక్కడే ఉండిపోతా.' అన్నాడు. మేమిద్దరం ఒక్కసారిగా షాక్ తిన్నాం. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత నేనే కొంచం స్థిమితపడి అడిగాను- 'నీకిక్కడ నచ్చలేదా?' అని. 'ఇక్కడ ఆడుకోడానికి నా ఫ్రెండ్ రాజు లేడు. వాడు నాకన్నీ చెబ్తాడు. నాకోసం అన్నీ దాస్తాడు. నేను లేకపోతే గుడ్డివాడని వాడినందరూ ఏడ్పిస్తారు. వాడు ఏడుస్తాడు.' అంటూ బాలు సడన్ గా ఏడవటం మొదలుపెట్టాడు. ప్రణవి బాలుని దగ్గరకు తీసుకొని, 'మనమిప్పుడు రాజుని కలుస్తాం కదా!.. ఏడవకు.' అంటూ సర్దిచెప్పసాగింది. అయినా బాలు ఏడుస్తునే ఉన్నాడు. ఏడుస్తూనే రాజు గురించిన విషయాలను ప్రణవి అడుగుతుంటే చెబుతున్నాడు. వాడు మెల్లగా ఏడుపు ఆపేసరికి హాస్టల్ వచ్చేసింది. కారు దిగుతూనే రాజు దగ్గరకి పరిగెత్తాడు. మేం వచ్చేసరికి రాజు రూంలో వాళ్లిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ద్వారం దగ్గరున్న మమ్మల్ని చూసి, 'రాజు!.. అమ్మరా.. ' అంటూ బాలు ప్రణవిని దగ్గరకు పిలిచాడు. ప్రణవి దగ్గరకి వచ్చి వారి ముందు కూర్చుంది. బాలు రాజు చేయిని పట్టుకొని వచ్చి ప్రణవి భుజం మీద వేసాడు. రాజు  దగ్గరకి వచ్చి తడుముకుంటూ ప్రణవి బుగ్గ మీద చెయ్యి వేసాడు. 'అమ్మ మెత్తగా ఉందిరా!' అన్నాడు అపురూపంగా. 'అమ్మ మనలాగే ఉంటుందిరా.' అని బాలు సమాధానమిచ్చాడు. అప్పుడు నాకు అర్ధమయ్యింది- చిన్నప్పటి నుంచి అమ్మ అంటే ఏంటో.. ఎలా ఉంటుందో తెలియకపోవడం వలన రాజు ప్రణవిని ఏదో అద్భుతంలా పరిశీలిస్తున్నాడని. ఆ తర్వాత వాడి చేయి ప్రణవి జడని పైనుంచి కిందవరకూ తడిమింది. 'ఒరేయ్!.. అమ్మ జుత్తుజుత్తుగా ఉందిరా..' అంటూ ఆశ్చర్యపోసాగాడు. వాళ్ల హాస్టల్ లో ఆడవాళ్లు లేకపోవడం వలన తన జడ వాడికి ఒక వింతలా అనిపిస్తోంది కాబోలు. ప్రణవి ఏమీ మాట్లాడటం లేదు. తన కళ్ళలోని నీటిపొర మాత్రం తన మనస్థితి ని నాకు చెప్పింది. ఇంతలో రాజు ప్రణవికి వెనుకగా వచ్చి తను పెట్టుకున్న సన్నజాజుల దండని తడుముతున్నాడు. 'అవి పువ్వులురా..' - బాలు చెప్పాడు. రాజు పూలదండకి ముఖం దగ్గరగా పెట్టి, వాసన చూసి నిర్ధారించుకొని, ఏదో అద్భుతాన్ని కనుగొన్నట్లు 'హాయ్.. అమ్మకి పూలు పూచాయి.. అమ్మకి పూలు పూచాయి..' అంటూ తప్పట్లు కొడుతూ గెంతుతున్నాడు. బాలు కూడా వాడితో కలిసి తప్పట్లు కొడుతున్నాడు. ప్రణవి కళ్ళ నుంచి నీరు జలజలా రాలాయి. ఉద్వేగాన్ని ఆపుకోలేక వాళ్లిద్దరినీ గట్టిగా హత్తుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. నేను దగ్గరగా వచ్చి తన భుజం మీద చేయి వేసాను. తను నావైపు తల తిప్పింది. మా చూపులు కలిసాయి.

ఆ తర్వాత బాలు, రాజులిద్దరూ మా పిల్లలయ్యారు (రాజుని కూడా మేం దత్తత తీసుకున్నాం.). మాది చక్కని కుటుంబమయ్యింది.

Wednesday, September 1, 2010

పూలపల్లకి

ఈమాట లో ప్రచురితమైన నా 'పూలపల్లకి' కధని ఇక్కడ చూడగలరు.

Friday, March 5, 2010

Inner Dimensions: 'She' speaks..

మేఘంలా నేనెప్పుడూ కరిగిపోతానో నాకే తెలియదు.

ప్రాతహ్ నిశీధిలో ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?..

వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే.

దారిలో ఎవరో పాదాల కింద నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది. కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఖం కూడా కలగదు.

రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది. నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి.

నాకు సముద్రమంత ప్రేమ కావాలి..

చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను. కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే. వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను. విఫలమయ్యాక ఒంటరినయ్యాను.

విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎంత గొప్పదో!).

ఇస్తూ ఇస్తూ.. సముద్రమయ్యాను.

ఒక అనాధ పిల్లల ఆశ్రమాన్ని నడుపుతున్నాను. పిల్లలంటే నాకిష్టం.. ఏ కల్మషమూ లేని సహజమైన భావోద్వేగాలు వారివి.. వారి నవ్వులు, కేరింతలు, కోపాలు.. అన్నీ అపురూపంగా అనిపిస్తాయి. వారి సామాజికస్థాయి తో సంబందం లేకుండా పిల్లలందరికీ చక్కని విద్యాబుద్ధులు, ఆరోగ్యకరమైన ఆహారం, వాతావరణం అవసరమని నేను నమ్ముతాను. అందుకు శాయశక్తులా కృషి చేస్తాను. కృషి అని చెప్పేకన్నా.. its my way of life అని చెప్పడం సబబేమో.

పిల్లలనే కాకుండా సహజమైనది ఏదైనా నన్ను ఆకట్టుకుంటుంది.

కానీ సమాజమే బోలెడు కట్టుబాట్లని, ఆంక్షలనీ, prejudice నీ పెట్టి మనుషుల్ని సహజత్వం నుండి దూరం చేస్తుంటుంది.

సమాజం నాకు నచ్చదు.. కానీ తేలికగా భరించగలను.

ఒక పనిని ఎక్కువమంది మనుషుల ద్వారా.. ఎక్కువకాలం నడవగలిగేలా చెయ్యాలంటే అందుకు ఒక system ని రూపొందించాలి. system.. ఆ తర్వాత rules n regulations.. ఇవన్నీ ఎప్పుడొస్తాయో అప్పుడు అది జీవచైతన్యాన్ని కోల్పోతుంది. end purpose నెరవేరుతుందేమో కానీ spontaneity ఉండదు. Lack of spontaneity is fatal to living.

నేను కూడా అనాధాశ్రమమనే system ని నడుపుతున్నాను. చాలాసార్లు i wont exhibit my usual self. ఎదుటివ్యక్తిని బట్టే ఉంటాను. బయటకి చాలా rigid గా, emotionless గా సముద్రగర్భంలా గంభీరంగా కనపడతాను.

ఈ external exhibition నాకు నచ్చకపోయినా.. అవసరం. The end goal motivates me. బయటి మేకప్ నాలోపలి మనిషిని కలుషితం చెయ్యకుండా over time, I developed a sense of detachment.

నాతో ఇంటరాక్ట్ అయ్యే చాలామంది నాలోని లోపలి మనిషిని కనీసంగా కూడా చూడలేరు.. గుర్తించలేరు. గుర్తిస్తే ఏమవుతారో అన్న ఆలోచన కలిగి ఒక్కోసారి వారితో ఉండగానే లోలోపల తెగ నవ్వేసుకుంటుంటాను.. వీళ్ళు నన్ను అస్సలు భరించలేరు. తట్టుకోలేరు. నిజానికి సహజంగా ఉండడం అదేమంత కష్టమైన విషయం కాదు.. It is the easiest state to be and the most difficult thing to practice.

ఆరోజు చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాను. మా పిల్లలు చేసే ప్రోడక్ట్స్ కి ఒక పేరున్న కంపెనీ బ్రాండింగ్ కోసం సంప్రదింపులు జరిపాను. ఇది వారికీ లాభసాటిగా ఉంటుందని నేను నమ్మినా వాళ్ళు వేరే ఆబ్లిగేషన్స్ మూలంగా ఒప్పుకోలేదు. ఆ ఆబ్లిగేషన్స్ సిల్లీగా అనిపించడం నా ఫ్రస్ట్రేషన్ కి కారణమయ్యుండొచ్చు. కారణమేమిటని నేనెక్కువగా ఆలోచించను. I just let the emotion flow. ట్రైన్లో కొచ్చి నా సీట్లో కూలబడ్డాను. ఓ గంట తర్వాత నా స్పృహ చుట్టూ ఉన్న ప్రపంచం మీదకి వచ్చింది. కంపార్ట్మెంట్ లోని సైడ్ బెర్త్ లో ఓ ఇద్దరు కాలేజ్ కుర్రాళ్లు నా మీద ఏదో కామెంట్ చేస్తూ నవ్వుకుంటున్నారని అర్ధమయ్యింది. ట్రైన్లో జనాలు చాలా పలచగా ఉండడంతో వారు ధైర్యంగా, వినబడేట్టుగా కామెంట్ చెయ్యగలుగుతున్నారు. నా ఎదురుగా 'అతను' కూర్చున్నాడు. మేమిద్దరం, కాలేజి కుర్రాళ్లు తప్పితే కంపార్ట్మెంట్ లో ఇంకెవరూ లేరు. అతను వెకిలిగా ఆ కుర్రాళ్లని సమర్ధించడం గానీ లేదంటే నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి నా మీద జాలి చూపించడం గానీ చెయ్యట్లేదు. కుర్రాళ్లని ఆపడానికి నేను ఏదన్నా చెయ్యొచ్చు కానీ దానికి కూడా మూడ్ లేదు. ఒక్కోసారి అంతే. కాసేపటికి అప్రయత్నంగా కొంగుని భుజాలమీదకి లాక్కున్నాను. 'అరే!.. ఆంటీ సిగ్గుపడుతోంది రా.. దాస్తోంది రా!..' అంటూ ఎక్కువచెయ్యడం మొదలుపెట్టారు. అయినా నాలో స్తబ్దత పోలేదు. ఎదురుగా అతను ఇబ్బందిగా కదలడంతో అసంకల్పితంగా అతని వైపుకి చూసాను. చూపు ఆసక్తిగా అతని దగ్గరే ఆగిపోయింది. అతనిలో నాపట్ల concern కనపడింది. నేనేదో చెయ్యాలన్నట్టు.. వేరే ఏమీ ఆశించని virgin concern. ఆ భావం నన్ను కదిలించింది. లేచి, విసురుగా కుర్రాళ్ల దగ్గరకి వెళ్లాను. నూనూగు మీసాల ప్రాయంలో ఉన్నారు. నేనలా సడన్ గా వచ్చేసరికి గుటకలు మింగారు. ఎందుకో అనుకోకుండా ఆ క్షణంలో వారిపై నాకు జాలి కలిగింది. 'కూర్చోవచ్చా?..' అని అడగడంతో వారు గాభరపడుతూ సీట్ ఆఫర్ చేసారు. నేను వారితో కూర్చొని క్యాజువల్ గా మాటలు కలిపాను. సాటి మనుషుల మీదుండే సహజమైన అభిమానం, గౌరవం తో వాళ్ల గురించి అడిగాను. నా గురించి చెప్పాను. ప్రపంచాన్ని అప్పుడే తెలుసుకుంటున్న వారి ఉద్వేగం, సందిగ్ధతలని చూసి అప్పటి నేనుతో ఐడెంటిఫై చేసుకున్నాను. వాతావరణం తేలికయ్యింది. సరదాగా కొన్ని జోకులు దొర్లాయి. తిరిగి నా సీటు కొచ్చి కూర్చున్నాను. కుర్రాళ్లు ఆ తర్వాత మరి కామెంట్ చెయ్యలేదు. స్త్రీని కాస్తైనా తెలుసుకోనంతవరకే అవహేళనగా చూడగలరు. కొంచం అర్ధం చేసుకున్నా జీవితాంతం ఆ సంభ్రమాశ్చర్యాలతో బతికెయ్యొచ్చు.

అతను నావైపు అభినందనగా చూసాడు. నేను కళ్ళతోనే స్వీకరించినట్టుగా తెలిపాను. సాయంత్రమౌతోందనగా బ్యాగ్ లోంచి కేమెరా తీసి అతను ఖాళీగా ఉన్న సైడ్ లోయర్ బర్త్ దగ్గరకి వెళ్లాడు (అంతకుముందు స్టేషన్లోనే కుర్రాళ్లు దిగిపోయారు). కిటికీ నుండి చూస్తే సాయంత్రం అందంగా ముస్తాబవుతోంది. భానుడితో విరహం తప్పదని తెలిసినా ఆ ఉన్న కాసిన్ని క్షణాలలో అతన్ని మురిపించడానికి ఆరాటపడుతోంది గగనకాంత. ఓ కొసన నల్లని దుఖం ఉబుకుతున్నా గడిపిన క్షణాల గుబాళింపుని తలచుకొని వర్ణాలీనుతుందేమో!.. మెల్లగా చీకటి అలుముకుంది.

'మీకొకటి చూపించాలి..' నా ఎదురుగా కూర్చుంటూ అడిగాడతను. తన కేమెరాని ల్యాప్ టాప్ కి కనెక్ట్ చేసి చూపించాడు. కిటికీ నుండి సంధ్యని చూస్తున్న నా ఫోటో అది. సైడ్ ప్రొఫైల్.. క్లోజ్ షాట్. కొంచం మసకచీకటిలో లైట్ అక్కడక్కడ తచ్చాడుతూ ఆర్టిస్టిక్ గా ఉంది. ఫోటోలో నన్ను ఆకట్టుకున్న అంశమేంటంటే ముఖం పూర్తిగా కనపడకపోయినా expression స్పష్టంగా కనపడటం.. కళ్ళల్లో ఒకరకమైన తాదాత్మ్యత.. కిటికీ ఊచలని సున్నితంగా చుట్టిన చేతివేళ్లు.. అరపావు విచ్చుకున్న పెదవులు.. కిటికీ ఆవల పొలాల మీదుగా నారింజవర్ణపు పశ్చిమ ఆకాశంలోకి కృంగుతున్న సూరీడు.. ఎవరో మనిషిని కాకుండా ఒక భావనని అందంగా ఒడిసిపట్టినట్టనిపించింది. అభినందనగా చూసాను. అతను మోచేతికి గడ్డాన్ని ఆనించి నా స్పందన కోసమే ఆసక్తిగా చూస్తున్నట్టున్నాడు. చూపులు ఎదురుపడ్డాయి. నేనేంటో అతనికి ఆ క్షణంలోనే తెలిసిపోయినట్టుగా అనిపించింది. లేదు!.. నేను నేనుగా ఉండగలిగే తేలికైన స్థితికి అతని సాహచర్యమేదో ప్రోత్సహించిందేమో. యధాలాపంగా మా మధ్య మాటలు ముచ్చటించాయి. ఆ పరిచయం అలవోకగా మరిన్ని కలయికలని అల్లుకుంది.

శిశిరం నుండి ప్రకృతి వసంతంలోకి సడిలేకుండా జారిపోయినట్టు మా మధ్య దూరం తెలియకుండానే ఎప్పుడు కరిగిపోయిందో.. చనువు లేలేత వాలుకిరణాల్లా ఎప్పుడు చొరబడిందో..

నేనిలా ఉంటాను.. ఇలాంటి మనిషిని.. ఈరోజు ఇలా అనిపించింది.. ఆ రోజు అలా జరిగింది.. అని చెప్పడానికి; నా జీవితానికి, నేను జీవించే ఉన్నానని తెలియడానికి సాక్ష్యంలా ఒకరు కావాలన్న అవసరం నాలో ఎప్పుడో మూగబోయిందనుకున్నా.. అదిప్పుడు పచ్చగా చిగురించింది.. బండరాయి చీలిక నుండి వేళ్లూనుకున్న లేతమొక్కలా.

నేను ప్రవాహమైతే.. అతను గాఢత. మేమిరువురం భావాలని ఒళ్లబోసుకునే శైలి వేరు. ఒక్కోసారి అతను ప్రవాహమైతే నేను పల్లం.

సముద్రమంత ప్రేమని నాకివ్వట్లేదు కానీ.. నా సముద్రమంత మనసుని అతను భరించగలడు.

నేను స్వయంగా అతన్ని కలవాలని ప్రయత్నించను. అతనే చొరవచేసి నన్ను కలుసుకోవాలి. మళ్లీ ఎప్పుడు కలవాలని కూడా అనుకోము. ఇలా మా మధ్య రూలేమీ లేదు. ఓసారి నన్ను కలవడానికి అతనికి సంవత్సరాలే పట్టింది. నాకు అతను ఉన్నాడన్న ఊహ చాలు ఒంటరితనంలో ఎన్నిసార్లైనా ఆహుతవ్వడానికి. మరీ గుబులుని ఆపుకోలేకపోతే దూరం నుండి అతన్ని చూసి నిశ్శబ్దంగా వెనుదిరుగుతాను.

ఇంత స్వార్ధపరురాలిని నేను సోషల్ వర్కర్ గా ఈ అనాధపిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నానని మొదట్లో అనిపించింది. కానీ ఈ స్వార్ధమే.. ఈ బంధమే.. నన్ను ప్రపంచాన్ని మరింతగా ప్రేమించేలా చేస్తుందని గ్రహించాక మరెప్పుడూ ఆ ఘర్షణ కలగలేదు.

మా బంధాన్ని సమాజం నుండి భయపడి దాచుకోవట్లేదు. చెప్పాలనిపించేంత స్వేచ్చ, గౌరవం దానిపట్ల మాకు లేవు.   

Friday, January 8, 2010

భావి సమాజమా!.. నన్ను క్షమించు.

చుట్టూ భవనాలు, గుడిసెలు, రోడ్లు, మోటారు చక్రాలు..
మనుషుల చేతులు, కాళ్ళు కదులుతున్నాయి.. ముఖాలు మాట్లాడుతున్నాయి..
భవనాలు, చేతులు-కాళ్ళు, చక్రాలు, ముఖాలు తమని నియంత్రిస్తున్న పరాయి పైశాచిక శక్తి యొక్క వికృత, విశృంఖల నాట్యాన్ని నగ్నంగా చూపిస్తున్నాయి.
తనని తాను కాల్చుకునే మూర్ఖావేశం, బలహీనమైనవాటిని ధ్వంసం చేసి సమర్థించుకునే కుటిల రాక్షసత్వం చుట్టూ కారుచిచ్చులా రాజుకుంటున్నాయి.
రాజకీయం వ్యక్తి స్వార్ధానికి పరాకాష్టగా మారి సంఘాన్ని బలత్కరిస్తోంది.
విలువలు నేర్పని, మనిషిని చేయలేని విద్య తన డొల్లతనాన్ని కఠోరంగా డప్పుకొడుతోంది.
భయం.. స్వార్ధం.. కుటుంబం.. వంటి బంధాల, భావాల పిరికితనంతో నిండిన మానసిక నపుంసకుడిని నేను.
నా రక్తం నిజానికి ఎర్రగానే లేదు.
మరిగే స్వభావం కోల్పోవడంతో రక్తమాంసాదులు కుళ్లు కంపుకొడుతున్నాయి.
భావి సమాజమా!.. నన్ను క్షమించు.