Skip to main content

Posts

Showing posts from 2011

రాజి

 (గమనిక: ఇది పెద్దవాళ్ళకి మాత్రమే) నిశిరాత్రి రంగులారబోస్తున్న సంధ్యని నిర్దాక్షిణ్యంగా లోబరుచుకొని కొన్ని గంటలౌతోంది. టార్పాలిన్‌ తో కప్పబడిన ఓ గుడిసె నుండి బయటకొచ్చింది రాజి. అలాంటి గుడిసెలే ఆ ప్రాంతంలో ఓ ముప్పై వరకూ రోడ్డు పక్కగా ఉన్నాయి. గుడిసె నుండి కొంచం దూరం నడిచి, రోడ్డు మీదకి వచ్చి పక్కగా ఉన్న భారీ సిమెంట్‌ పైప్‌ ఎక్కి కూర్చింది. పైప్‌ వెనుక ఎత్తుగా ఎదిగిన చెట్టుకొమ్మ నీడలు ఆమెపై తచ్చాడుతున్నాయి. రాత్రి 10 దాటడంతో ఆమె ఉండే స్లమ్‌ ఏరియా నిద్రలో జోగుతోంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల ఏడుపులు అక్కడి ప్రశాంతతని భగ్నం చేస్తున్నా అవి కాసేపటికే సద్దుమణుగుతున్నాయి. ఇటు రోడ్డు మీద అప్పుడప్పుడు కార్లు రివ్వున దూసుకుపోతున్నాయి. కొంచం దూరంలో ఒక పబ్‌, దానిపక్కన షాపింగ్‌మాల్స్‌, అర్బన్‌ టౌన్‌షిప్స్‌ ఉన్నాయి. అటువైపంతా లైట్ల ధగధగలతో ఇంకా హడావుడిగా ఉంది. రాజి కి ఆ లైట్లంటే ద్వేషం. ఐనా వాటిని చూడడానికి అప్పుడప్పుడూ రాత్రిపూట బయటకి వస్తుంటుంది. ఆడవాళ్ళు రెండు రకాలు- మగవాడిని మోహంలోకి నెట్టేవారు, నెట్టలేనివారు. రాజి మొదటి కోవకి చెందుతుంది. ఆమెకి 24 ఏళ్లు ఉండొచ్చు. చామనఛాయ. చూడగాన

Dairy Milk Silk

..ఆమెని కలవబోతున్నానన్న ఉత్కంఠ అతనిలో ఎప్పటిలానే ఉంది. ఈ విషయం స్ఫురణకి రాగానే అతనిలో కాస్త సాంత్వన.. ఆ వెంటనే కాస్త ఆందోళన.. ఈ రెండు భావావేశాలు దు:ఖమనే గాఢతలో సన్నని ఉపరితల ప్రకంపనాల్లా చినికి, సద్దుమణిగాయి. ఆమెకి వేరొకరితో పెళ్లయి అప్పటికి 15 రోజులు.. కలలు కూలిపోయాక కొన్నిసార్లు మనల్ని మనం శిక్షించుకోవడానికి బతుకుతాం. ఆమె వచ్చింది. పలకరింపుగా ఇద్దరూ తేలికగా నవ్వుదామని ప్రయత్నించి, విఫలమై, వాతావరణాన్ని భారం చేసారు. పక్కపక్కగా కూర్చున్నారు కానీ వారి మధ్య కోసుల దూరం అనుభవమౌతోంది. ఒకప్పటి దగ్గరితనం నేపధ్యంగా వెలిసిన ఈ దూరం వారి మధ్యనున్న నిశ్శబ్దంలోకి చొరబడి, వికృతంగా పరిహసిస్తోంది. 'ఎలా ఉన్నావు?..' అని అడుగుదామనుకున్నాడు. ఈ ప్రశ్న ఇంత అర్ధవంతంగా అతనికి మునుపెన్నడూ తోచలేదు. నోటివరకూ వచ్చాక చాలా చెత్త ప్రశ్నలా అనిపించి, ఆగిపోయాడు. నిశ్శబ్దం ఇద్దరిమధ్యా ఇరుకుగా కదిలింది. తను ఎప్పుడూ ఇచ్చే Dairy Milk Silk ని ఇచ్చి, కదలికని తీసుకొద్దామనుకున్నాడు. కానీ 'నా ప్రేమ ఇప్పటికీ అలానే ఉంది అన్న విషయాన్ని నిరూపించడానికి ఇస్తున్నానన్నట్టు తను భావిస్తుందేమో.. బాధ పడుతుందేమోన'న్న ఆల

ఔననా!.. కాదనా!..

పూలమత్తుని ఘ్రాణించి, ఉన్మత్తలైన మరీచికలతో మోహనంగా కృష్ణవర్ణాన్ని కౌగిలించుకుంటోన్న సంధ్యాకాంత.. నిన్ను కలుస్తున్నానని సాయంత్రం సింగారించుకుందా?.. లేదా నేనే అందంగా చూస్తున్నానా?.. మనసు తీగ నీ తలపు కొమ్మని చుట్టుకొని మురిసి కంటున్న సన్నజాజి ఊహలు.. నువ్వీ క్షణం ఏం చేస్తుంటావో.. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంతలా రంజింపజేస్తుంటావో.. నీ పాదాల్ని భూమి ఎంత మెత్తగా హత్తుకుంటుందో.. గాలి నీ కురులని ఎంత సుతారంగా సవరిస్తుందో.. నీ చిరుచెమటని తడిమి తనలోకి లాక్కుంటున్న చుడీదార్‌ది ఎంత అదృష్టమో!.. ఒకరి కోసం ఆలోచించడం ఇంతటి కమ్మని మైకమా!.. ఇప్పుడే అనుభవమౌతోంది. నీకోసం ఏదేదో చేసెయ్యాలన్న ఆరాటం.. కానీ ఏం చేసినా నీ సాహచర్యం నాకిచ్చే ఆనందం ముందు అదెంత?.. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ముఖం మీది కురులను చేతివేళ్లతో వెనక్కి తోసుకుంటూ నన్ను చూస్తావు కదా.. గుండె గుప్పున పరవశంలో మునిగిపోతుంది. యధాలాపంగా తగిలే వేలికొనలు యదని ఝుమ్మనిపిస్తాయి.. గుండె త్వరణం పెరిగేసరికి మెదడు వెనక్కి రమ్మని ఆదేశాలిచ్చినా అర్ధం చేసుకునే స్థితిలో అవి ఉంటేనా?.. గిటారు మీటినట్లు అంత సన్నగా ఎలా నవ్వుతావో?.. అప్పుడప్పుడు నా పట్