Friday, June 10, 2011

Dairy Milk Silk

..ఆమెని కలవబోతున్నానన్న ఉత్కంఠ అతనిలో ఎప్పటిలానే ఉంది.

ఈ విషయం స్ఫురణకి రాగానే అతనిలో కాస్త సాంత్వన.. ఆ వెంటనే కాస్త ఆందోళన.. ఈ రెండు భావావేశాలు దు:ఖమనే గాఢతలో సన్నని ఉపరితల ప్రకంపనాల్లా చినికి, సద్దుమణిగాయి. ఆమెకి వేరొకరితో పెళ్లయి అప్పటికి 15 రోజులు.. కలలు కూలిపోయాక కొన్నిసార్లు మనల్ని మనం శిక్షించుకోవడానికి బతుకుతాం.

ఆమె వచ్చింది. పలకరింపుగా ఇద్దరూ తేలికగా నవ్వుదామని ప్రయత్నించి, విఫలమై, వాతావరణాన్ని భారం చేసారు. పక్కపక్కగా కూర్చున్నారు కానీ వారి మధ్య కోసుల దూరం అనుభవమౌతోంది. ఒకప్పటి దగ్గరితనం నేపధ్యంగా వెలిసిన ఈ దూరం వారి మధ్యనున్న నిశ్శబ్దంలోకి చొరబడి, వికృతంగా పరిహసిస్తోంది.

'ఎలా ఉన్నావు?..' అని అడుగుదామనుకున్నాడు. ఈ ప్రశ్న ఇంత అర్ధవంతంగా అతనికి మునుపెన్నడూ తోచలేదు. నోటివరకూ వచ్చాక చాలా చెత్త ప్రశ్నలా అనిపించి, ఆగిపోయాడు. నిశ్శబ్దం ఇద్దరిమధ్యా ఇరుకుగా కదిలింది. తను ఎప్పుడూ ఇచ్చే Dairy Milk Silk ని ఇచ్చి, కదలికని తీసుకొద్దామనుకున్నాడు. కానీ 'నా ప్రేమ ఇప్పటికీ అలానే ఉంది అన్న విషయాన్ని నిరూపించడానికి ఇస్తున్నానన్నట్టు తను భావిస్తుందేమో.. బాధ పడుతుందేమోన'న్న ఆలోచన అతన్ని ఆపింది. 

అతనిని చూడగానే ఆమె మనసు భోరుమంది..అంతలోనే మనసు ముఖాన ప్రతిఫలించకుండా జాగ్రత్తపడింది. బాగా సన్నబడి.. ముఖం పీక్కుపోయి.. కళ్ళు అగాధంలో ఉన్నట్టు ఉన్న అతన్నిచూడగానే దగ్గరకొచ్చి, పట్టుకొని, ఇలా అయిపోయావేంటి?. అని ఏడవాలని గుండె కొట్టుకొంది. కానీ ఆగిపోయింది. ఒకరకమైన అపరాధభావం గొంతుకడ్డంగా.. నిశ్శబ్దానికి నిర్లిప్తత ఆసరా వచ్చింది. అతనేమన్నా మాట్లొడొచ్చు కదా అనుకొంది. యధాలాపంగా దృష్టి తన చేతికి పెట్టుకున్న మెహందీ మీదకు వెళ్లింది. వెంటనే 'ఎలా ఉంది?..' అని అడుగుదామనుకొని ముఖం తిప్పి చప్పున ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది. అది తన పెళ్లికి పెట్టుకున్న మెహందీ.. ఇన్నాళ్లవరకూ గమనించనే లేదు. ఎలా ఉందని వేరెవరినీ అడగనేలేదు.

'ఆఫీషు ఎలా ఉంది?.' చాలా సుత్తి ప్రశ్న అని అతనికి తెలుసు.

'ఆ..బానే ఉంది.. లీవ్‌ తర్వాత ఈ రోజే జాయినవ్వడం..' మాటలు మొదలవ్వడం ఆమెకి కాస్త తేలికగా అనిపించింది.

'హ్మ్!..'

'మీ డార్లింగ్‌ ఎలా ఉంది?..' (డార్లింగ్‌- ఆఫీషులో అతని లేడీ బాస్‌) ఆమె వాతావరణాన్ని మరింత తేలిక చేద్దామని ప్రయత్నించింది.

'హ్మ్!.. ప్రేమ కొద్దీ ఎక్కువ పని చేయించుకుంటుంది.' అతను క్యాజువల్‌గా ఆమె వైపు చూసి చెప్పాడు.

ఆమె నవ్వింది. అతనికి కొంచం రిలీవ్డ్‌గా అనిపించింది. తను ఎలా ఉంది అన్న బెంగ కొంచం తీరినట్టనిపించింది. కానీ రోజూ ఇలా కలవడం అవుతుందా?..అన్న ఆలోచన కరకుగా మెదిలింది.

'అవును.. నాగరాజు ఎలా ఉన్నాడు?.. చేతిలో ఓ బీర్‌ బాటిల్‌, వెనుకో కుక్కపిల్లని వేసుకొని తిరుగుతున్నాడా?..' (నాగరాజు- ఆఫీషులో ఆమెకి లైనేసే కొలీగ్) నవ్వుతూ అడిగాడు కానీ మొదటిసారిగా నాగరాజుని హేళన చెయ్యబుద్ధికాలేదు.

'అంతలేదు వాడికి.. ఇప్పుడు నన్ను వదిలేసి రమ్య వెంట పడ్డాడంట.'

'కానీ ఈ రోజు నువ్వు కనపడ్డాక ఎక్కడో గుచ్చుకొని ఉండుంటుంది వాడికి..' అన్నాడతను.

'లేదు.. జనరల్‌గానే మాట్లాడాడు.. ఇప్పుడు నన్ను ఆంటీ అంటున్నాడు.'

'హ్మ్!..' నాగరాజు ఆమెని టీజ్‌ చేయడమన్న విషయం అతనికి ఇప్పటికీ జీర్ణించుకునేలా లేదు.

ఒక అరక్షణం నిశ్శబ్దం.

'ఇంకేంటి?.. అవును..మీ దివ్య ఎలా ఉంది?..' (దివ్య- అతని ఆఫీష్ లోని అమ్మాయి.) అసలు దివ్య పేరుని ఎత్తడమే ఆమెకి ఇష్టముండదు.

'హ్మ్!.. బావుంది.. ఈ రోజు స్లీవ్‌లెస్‌ వేసుకుంది. బాగా డిస్టర్బ్‌ అయ్యాను.'

'ఓ!.. ' ఆమె ముక్తసరిగా నవ్వింది.

ఒకప్పుడు ఇలా చెబితే ఆమె రియాక్షన్‌ ఎలా ఉండేదో అతనికి తెలుసు. మీద పడి, పీక పిసికి, రక్కేసేది. అటువంటి పొసెసివ్‌నెస్‌ అతనికి బాగా నచ్చేది. ఇప్పుడు అందులో కొంచమైనా కనిపిస్తుందేమోనని ఆశించాడు. కానీ తను చాలా మామూలుగా తీసుకున్నట్టు కనపడింది. 'నా మీద ఇపుడు కొంచం కూడా ప్రేమ లేదా?..', 'అంత త్వరగా మనసులోంచి తీసేసిందా?..'.. లాంటి ఆలోచనలు అతన్ని కాల్చేస్తున్నాయి.

'దివ్య వీడికి నిజంగా నచ్చుతుందా?..', 'నేనే దూరం చేసానా?..', 'దాన్ని కన్నెత్తైనా చూడకు.. అని చెప్పే అధికారం ఇప్పుడు లేదు కదా!..'.. ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు.

'బుగ్గ మీద ఆ గాటేంటి?..మీ ఆయన చేసాడా?..' అడుగుతున్నప్పుడు చివర్లో గొంతు సన్నగా వణికింది. ఇంతకుముందే అడుగుదామనుకున్నాడు. కానీ నిష్ఠూరం ఇప్పుడు అడిగే ఉద్రేకాన్నిచ్చింది.

ఆమె బలహీనంగా నవ్వి ఊరుకొంది.

ఆమె నవ్వు అతడిని పూర్తిగా వివశుడిని చేసింది. 'వాడు ఆమెను తాకాడు..' అన్నఆలోచన గుండెని రంపంలా కోస్తోంది. 'నిజంగా తను వాడిని అంగీకరించిందా?.. అంత త్వరగానా?..అంటే నన్ను ప్రేమించలేదా?..వాడు ఆమెని తాకాడా లేదా తనే అవకాశమిచ్చిందా?.. పెళ్లయ్యాక చెయ్యకుండా ఉంటాడా ఏమిటి?..ఐనా నేనే కదా తనని వాడితో బాగుండమని చెప్పాను..ఇప్పుడెందుకు ఫీలవుతున్నాను?..'.. ఎవరి మీదనో తెలియని ఉక్రోషం అతన్ని ఊపేస్తోంది. సంభాళించుకోలేకపోతున్నాడు.

అతనిలో రేగుతున్న ఉద్వేగాన్ని అర్ధం చేసుకునే స్థితిలో ఆమె లేదు. దేనినుంచైతే తప్పించుకోవాలనుకుంటుందో.. ఏ అనుభవం తనని అత్యంత మానసికహింసకి గురిచేస్తుందో.. దానినే అతను గుర్తుచేయడం ఆమెకి ఇబ్బందిగా ఉంది. భర్త తాకిన ప్రతీసారి ప్రియుడు గుర్తుకొస్తున్నాడని ఆమె తనకి తాను కూడా చెప్పుకోలేదు.

అతను సన్నగా గొంతు సవరించుకున్నాడు. 'సరే.. ఇక నేను వెళ్తున్నాను'..ఉక్రోషంలో కలిగిన పలాయన చర్య. అరక్షణం నిశ్శబ్దం..'నువు జాగ్రత్త..'

'సరే.. నేను బావున్నా!.. నువు బావుండు.. కొంచం తిను..'

'హ్మ్!..bye..'

'bye..'

అతను వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆమె అక్కడే కాసేపు ఆగింది. సన్నగా వర్షం మొదలైంది.. వర్షం పడుతున్న స్పృహ అతనికి లేదు. నడుస్తున్న అతనికి సడన్‌గా పాకెట్‌లో ఉన్న 'Dairy Milk Silk' గుర్తుకొచ్చింది. తనకిద్దామా అని ఒక్క క్షణం ఆగాడు.. కానీ వద్దనుకున్నాడు.. జుత్తుని వెనక్కి తోసాడు. తనకెందుకివ్వాలి.. నేనే తింటా!.. అనుకున్నాడు.. గాభరాగా తీసి, ఒక ముక్క కొరికాడు. తింటుంటే ఏవో జ్ఞాపకాలు..గుండెలో వర్షంలా. ఎక్కడినుంచో ఏడుపు తన్నుకొస్తోంది..అది అరుపులా బయటకొచ్చింది. చాక్లెట్‌ని విసిరేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దూరంగా రోడ్డు పక్కన ఎంగిలైన Dairy Milk Silk.