Friday, April 18, 2008

వెన్నెల సంగీతం

వెన్నెల రేయి.. సన్నని దారి.. దారికిరువైపులా గుబురుగా పెరిగిన
చెట్లు.. గాఢాంధకారం. కానీ దారిన మాత్రం చెట్లకొమ్మలు వడకాచిన
వెన్నెల వెలుగు.. ఎంత బాగుందో!!. ఆ దారిలో సాహితీ, నేనూ
నడుస్తున్నాము. ఒకరంటే ఒకరికి ఇష్టమని ఇద్దరికీ తెలుసు
(గుండెల్లోని ప్రేమని కన్నులు ఒలికిస్తాయి కదా!.). కానీ మాటల్లో
ఇంకా చెప్పుకోలేదు. చల్లగాలి ఇద్దర్నీ హత్తుకుంటోంది. పక్కన
నడుస్తుంటే, తన జడను సింగారించిన సన్నజాజుల పరిమళం
నన్ను అప్పుడప్పుడూ కమ్మేస్తుంది. నడకను అనుసరించి తన
చెవి జూకాలు కదులుతున్నాయి. కాళ్ల పట్టీలకున్న చెరొక
సిరిమువ్వ లయబద్ధంగా ‘ఘల్’మంటోంది. ఇంత ఏకాంత ప్రదేశంలో
మేమిద్దరమే ఉన్నామన్న ఆలోచన రాగానే, ఏవేవో ఊహలు నా
మనసుతో బంతాడుకున్నాయి. నడుస్తూ ఏటి వద్దకు వచ్చేసాము.
ఇప్పుడు పడవ మీద అవతలి వైపుకి వెళ్తే అదే మా ఊరు.
జాతరకని ఇక్కడకి వచ్చాము. అందరూ బస్‌లో ఊరికి వెళ్తామంటే
మేమిద్దరమూ పడవలో వస్తామని ఇలా వచ్చాము. పడవ వచ్చేసరికి
ఇంకొక అరగంట పడుతుంది. వెన్నెల మబ్బుల వలువలు విడిచి
ఏరంతా పరుచుకుంది. ఒడ్డున నీళ్లలో కాళ్లు పెట్టుకొని
కూచున్నాము. తను నీళ్లలో పాదాలు ఆడిస్తోంది..అందమైన
లేత పాదాలు.. వాటిని చూస్తూ దగ్గరికొచ్చాను. తన పాదాన్ని నా
అరచేతిలోకి తీసుకున్నాను. మరుక్షణం నా గుండె నా అరచేతిలోకి
వచ్చేసినట్టుగా ఉంది. ఇంకొక చేతితో నీటిని తీసుకొని పరవశంగా
తన పాదం మీద పోసాను. తను ఆశ్చర్యంగా చూసింది. నేను
ఆర్తిగా ఆ పాదాల్ని ముద్దాడాలనుకున్నాను. కానీ ధైర్యం చాల్లేదు.
తరువాత ఏవో మాట్లాడుకున్నాము. నే వేసిన జోకులకి తను
నవ్వుతోంది. తను నవ్వుతుంటే ఆ అందం చుట్టూరా
పరుచుకుంటున్నట్లుగా ఉంది.. ఈ ఏరంతా.. ఆ ఆకాశమంతా..
అందులో నేను నిండుగా మునిగిపోతున్నాను.

పక్కన చిల్లిగవ్వలు ఏరి కప్పగంతులు వేస్తున్నాము. "ఎవరు
ఎక్కువ వేస్తారో!.. పందెం?" అంది. సరేనన్నాను. నేనే గెలిచాను.
"మరి ఏమిస్తావు?" అనడిగా. "ఏం కావాలి?" అంది.
"ఏదో ఒకటి.. నీకు నచ్చింది ఇవ్వు" అన్నాను కాజువల్‌గా.
"సరే!.. వెళ్లేముందు ఇస్తాను" అంది. పడవ ఎక్కాము.
పక్కపక్కన కూర్చున్నాము. పడవ కుదుపులకి మా భుజాలు
తగులుతున్నాయి. ఇదేదో త్రిశంకు స్వర్గం‌లా ఉంది. గాలికి
తన కురులు అప్పుడప్పుడూ నా ముఖాన్ని తాకుతున్నాయి.
ఆ కురుల చివర్న నా మనసు చిక్కుకొని వాటితోపాటూ ఊగుతోంది.
పడవ ఒడ్డుకి చేరుకొంది. మేము విడిపోతుండగా అడిగాను
"ఏదో ఇస్తానన్నావుగా!" అని. చుట్టూ ఎవరూ లేరు.
తను నా చెయ్యి చాచమంది. చాచాను. తను మెళ్లగా వచ్చి
నా అరచేతిని ముద్దాడింది. నేను శిలలా ఉండిపోయాను. తను
పరిగెత్తి వెళ్లిపోయింది. తర్వాత నేను ఇంటికి వెళ్లాను.. ఇంట్లో
వాళ్లతో కొంచం మాట్లాడాను.. భోంచేసాను.. కానీ ఏంచేస్తున్నా
తను ముద్దాడిన ఆ కొన్ని ఘడియలలోనే బ్రతుకుతున్నాను.
వర్తమానంలో అసలు లేనే లేను. ఆ క్షణాలే స్లోమోషన్‌లో
మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తను ముద్దాడిన చేతిని గుండెపై
వేసుకొని పడుకున్నాను. ఇంటిపైకప్పు వెన్నెలని అడ్డుకున్నా,
నా మానసంలో మాత్రం వెన్నెల వర్షిస్తోంది..
శ్రావ్యమైన సంగీతంలా..