Sunday, May 26, 2013

ప్రార్ధన


తండ్రీ!..

         'నేను' అంటూ ఒక అస్థిత్వాన్ని కల్పించావు. 'నేను' లేని శూన్యత ఎలా ఉండేదో కానీ, 'నేను' అని అనుకోగలగటం ఎంత బావుందో!. అసలు పుట్టుకే ఎంత గొప్ప అనుభవమో!.. చూడడం, కదలడం, సంభాషించడం, స్పృశించడం, రుచులను తెలుసుకోవడం.. ఓహ్‌!..ఎన్ని అద్భుతాలో!..

         వీటన్నింటినీ మించి.. 'రసస్పందన'. ఎక్కడుందో తెలియని మనసులో ఒక 'భావన' మెదలడం.. ప్రేమ, కరుణ, విరహం, దు:ఖం వంటి భావనల సృజన.. మనిషిగా పుట్టినందుకు ఈ జీవితమెంత రసాత్మకంగా ఉందో!..

         సీతాకోకచిలుకలు, ఉడుతలు, చెట్లు, సెలయేళ్లు, వెన్నెల, నక్షత్రాలు.. ఇలా విశ్వమంతా వ్యాపించిన నీ చైతన్య స్రవంతిలో నేనూ ఒక భాగమవ్వడం... ఓహ్!!..

         ఈ బ్రతుకు నీవిచ్చిన బహుమతి ప్రభూ!.. ఇతరులని సాధ్యమైనంతవరకూ నొప్పించకుండా నిరంతరంగా ఈ బహుమతిని ఆనందంగా అనుభవించడమే నేను నీకిచ్చే గౌరవం.

         ఈ గమనంలో ఎదురుపడేది ఏదైనా నువ్విచ్చినదే కదా!..దానిని సంతోషంగా, ధైర్యంగా, వినమ్రత తో స్వీకరించగలగాలి. నీవు నాకై నిర్దేశించిన ఆటని నావంతుగా స్వేచ్చగా, నిర్భయంగా, మనస్పూర్తిగా ఆడగలగాలి.

         మనిషి ఏర్పరుచుకున్న సమాజం, కట్టుబాట్లు, డబ్బు.. మొదలైన అంశాలు నా బుద్ధిని కప్పిపుచ్చకుండా చూడు తండ్రీ!. భయాన్ని కలగనివ్వని బుద్ధి అనుక్షణం ఈ జీవితాన్ని ఒక ఆనందప్రయోగాల పరంపరగా మార్చనీ.

         భవబంధాలు, అహంభావాలు బాధిస్తాయి. కానీ నాకున్న భవము, బంధమూ నువ్వే.. విశ్వమంత నువ్వే.. ఒక్క నువ్వే.. అనేకమైన నువ్వే. ఇక బాధ ఎక్కడిది?.. దేనికోసమని బాధ. ఈ స్పృహ ఎల్లవేళలా నాకు ఎరుకలో ఉండనీ.

         చివరిగా.. చావు ఏ క్షణాన ఎదురుపడినా ఒక మారు సంతోషంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు.