ఈ మధ్యన నా బ్లాగు నేనే సాంతం చదువుకున్నాను. ఎందుకో అంతగా నచ్చలేదు. పెద్ద స్కూలు బ్యాగు మోసుకొని, ఇసకలొ ఆడుకొని, చింపిరి జుట్టు, చీముడి ముక్కుతో స్కూలు నుంచి వచ్చిన పాపలా అనిపించింది. నా పాపకి నలుగు పెట్టి, కుంకుడికాయ రసం తో తలంటు పోసి, పట్టు లంగాజాకెట్టు వేసి ముస్తాబు చెయ్యాలి అనిపించింది. ఆ ప్రయత్నమే - ఈ 'సాహితి' సృష్టి. .... ఆ రోజు కార్తీక ఏకాదశి. Engg. course లో ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. చాలా రోజుల తర్వాత నిన్ననే ఇంటికి వచ్చాను. అమ్మ పొద్దున్న 5 గం.ల కే గుడికి వెళ్ళడానికి నిద్ర లేపేసింది. బయట చలి, లావుపాటి కంబలి లో కమ్మని వెచ్చదనం, పక్కన పడుకున్న నాన్న మీద చెయ్యి వేసుకుంటే నాన్న బొజ్జ రిథమిక్ గా శ్వాసని అనుసరించి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. ఇలాంటి ambience ని వదిలిలేవడానికి అస్సలు మనసు రాలేదు. 'ఇంకొక 5 నిమిషాలు అమ్మా!' అంటూ మళ్లీ ముసుగుతన్నాను. కాసేపటికి మా చెల్లి మెల్లగా దుప్పటి ముఖం మీద నుంచి తీసి చల్లని తడి చెయ్యి నా ముఖం మీద పెట్టింది. నేను దిగ్గున లేచాను. తాను పరిగెత్తిన్ది. ఇంక తప్పదన్నట్లు లేచి టూత్ బ్రష్ అందుకున్నాను. చలిలో వేన్నీళ్ళ స్నానం భలే ఉంది. ... అమ్మ, నేన...