వెన్నెల రేయి.. సన్నని దారి.. దారికిరువైపులా గుబురుగా పెరిగిన చెట్లు.. గాఢాంధకారం. కానీ దారిన మాత్రం చెట్లకొమ్మలు వడకాచిన వెన్నెల వెలుగు.. ఎంత బాగుందో!!. ఆ దారిలో సాహితీ, నేనూ నడుస్తున్నాము. ఒకరంటే ఒకరికి ఇష్టమని ఇద్దరికీ తెలుసు (గుండెల్లోని ప్రేమని కన్నులు ఒలికిస్తాయి కదా!.). కానీ మాటల్లో ఇంకా చెప్పుకోలేదు. చల్లగాలి ఇద్దర్నీ హత్తుకుంటోంది. పక్కన నడుస్తుంటే, తన జడను సింగారించిన సన్నజాజుల పరిమళం నన్ను అప్పుడప్పుడూ కమ్మేస్తుంది. నడకను అనుసరించి తన చెవి జూకాలు కదులుతున్నాయి. కాళ్ల పట్టీలకున్న చెరొక సిరిమువ్వ లయబద్ధంగా ‘ఘల్’మంటోంది. ఇంత ఏకాంత ప్రదేశంలో మేమిద్దరమే ఉన్నామన్న ఆలోచన రాగానే, ఏవేవో ఊహలు నా మనసుతో బంతాడుకున్నాయి. నడుస్తూ ఏటి వద్దకు వచ్చేసాము. ఇప్పుడు పడవ మీద అవతలి వైపుకి వెళ్తే అదే మా ఊరు. జాతరకని ఇక్కడకి వచ్చాము. అందరూ బస్‌లో ఊరికి వెళ్తామంటే మేమిద్దరమూ పడవలో వస్తామని ఇలా వచ్చాము. పడవ వచ్చేసరికి ఇంకొక అరగంట పడుతుంది. వెన్నెల మబ్బుల వలువలు విడిచి ఏరంతా పరుచుకుంది. ఒడ్డున నీళ్లలో కాళ్లు పెట్టుకొని కూచున్నాము. తను నీళ్లలో పాదాలు ఆడిస్తోంది..అందమైన లేత పాదాలు.. వాటిని చూస్తూ దగ్గరి...