నేను నిద్రపోయాక రాత్రంతా మనసు నీ దగ్గరే తచ్చాడుతుందేమో . పొద్దున లేవగానే ఊహని స్పృశించే మొదటి రాగం నీ తలపే. నా సబ్కాన్షస్ పెట్టె నిండుగా నీ సుగంధంతో తొణుకుతుంటే అహం బిత్తరపోయి అంతలోనే సర్దుకుంటుంది. గంభీరమయిపోతాను. కొన్నిసార్లు నా గంభీరతని చూసి నేనే ఫక్కున నవ్వేసుకుంటాను. బాత్రూమ్ లోకి బద్ధకంగా దూరాక, బకెట్ లోని నీటి మీద వేలితో అప్రయత్నంగా నీపేరు రాస్తాను. అది చెరిగిపోతుంది. కానీ అందులో నీ పేరుందని నాకు తెలుసు. ఓసారి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక చిన్నమ్మాయి నన్ను వింతగా చూసినప్పుడు అర్థమయ్యింది- నువ్వు గుర్తొచ్చి నా ముఖం ముద్దుగా నవ్వుతోందని. వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని పట్టుకొని ఫాస్ట్ గా ఓ ముద్దిచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తా. రాత్రి మేడ మీద తిరుగుతున్నప్పుడు నువ్వెప్పుడూ పాడే పాట గుర్తొస్తుంది. నీకస్సలు పాటలు పాడటం రాదు. ఆ పాటనైతే దారుణంగా ఖూనీ చేస్తావు. అప్పుడు వెక్కిరించాను గానీ ఇప్పుడు నీ పాట నాకెంతిష్టమో!!. నువ్వు పాడినట్లే పాడుతూ మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాను. నవ్వుకుంటున్నా సరే ఓ నీటితెర నా కళ్ళని అడ్డుగా కప్పేస్తుంది.