బ్లాగులో కొత్త టపా ( కధ) రాసి చాలా రోజులయ్యింది. ఈ మధ్యన ఐడియాలే రావట్లేదు. 'ఏమిటి.. నా బుర్ర వట్టి పోయిందా..ఇప్పటి వరకూ రాసినవి తప్పితే మరే స్టోరీ ఐడియాలు లేవా? .. రావా?..' ఇలా ఆత్మన్యూనతా భావాలు నన్ను పీడిస్తుంటే పేపరు, పెన్ను పట్టుకుంటే ఏదో ఐడియా తట్టకపోదా అని బలవంతంగా కూర్చున్నాను. రాయక ముందర ఆత్మన్యూనత; రాసాక నచ్చుతుందా, నచ్చదా.. కామెంట్లు వస్తాయా, రావా.. అన్న టెన్సన్లు; నచ్చకపోతే ఫ్రస్ట్రేషన్, నచ్చితే మరింత మంది మెచ్చాలన్నఉబలాటం.. ఇలా టపా రాసే క్రమంలో ఏ దశ కూడా బాగోదు ఒక్క - 'మెరుపులాంటి ఆలోచన మెదలడం, రాయడం' అన్న ఫేజ్ తప్పితే. ఇంకొంచం లోతుగా ఆలోచిస్తే ఆ 'మెరుపు మెరవడం, అదిచ్చే ప్రేరణ' లో కూడా నా గొప్పతనం ఏమీ లేదు. మరెందుకో ఈ పితలాటకం. కొంచం ఎక్కువ ఆలోచిస్తున్నానిపించింది. మళ్ళీ ఏదో కధ రాయాలన్న విషయం మీద దృష్టి పెట్టాను. బుర్రలో ఏ మెరుపూ మెరవట్లేదు. 'అలా కాకుండా ఎందుకు రాయలేను? ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరి.' అనుకొని ముందుగా ఒక కారెక్టర్ ని సృష్టించాను. మగవాడే. వాడికి 'శీను' అని పేరు పెట్టాను. వాడి కారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోస...