చుట్టూ గడియలేసి పహారా కాస్తున్న నా హృదయపు అంతఃపురం లోనికి వెన్నెల్లా నువ్వెప్పుడు వచ్చేసావో !.. పందిరిలా అల్లుకునేసరికి ఈ గోడలెపుడు వాటి గంభీర అస్తిత్వాన్ని కోల్పోయాయో !.. నీ ఉనికి తీరాన స్వాంతన పొందుతున్న నా పాదముద్రలు ఎప్పటికప్పుడు చెరిగిపోతున్నా దారిలో ఏరుకున్న గవ్వలు జ్ఞాపకాల పేజీల్ని ఇంకా అలంకరిస్తున్నాయి . సముద్రంలా నువ్వు లోపల ఉన్నావన్న నిజాన్ని ఆ కాపలావాడు అస్సలు భరించలేడు. లోపలికి ఎవరూ చొరబడలేదన్న భ్రమనే ఇంకా శ్వాసిస్తున్నాడు . నిజానికి కొన్ని భ్రమలే మనల్ని బ్రతికిస్తుంటాయి . లేదంటే నాలోని వాడు ఏమైపోయేవాడో .. నీ అవాజ్యమైన ప్రేమంటే నాకు గొప్ప భయం . ఓపలేను . అందుకే నా వైకల్యం కనపడనీకుండా నీనుంచి తప్పించుకు తిరుగుతుంటాను . కానీ నేను పారిపోతున్నది నానుంచే నని ఎప్పటికప్పుడు మర్చిపోతాను . ' నన్ను పరిహసించదానికే వచ్చావా ?.. పో !.. ' అని నిష్టూరమాడుతాను . కానీ నువ్వు నా కసురుని పట్టించుకోనట్లే కనబడతావు . అందుకు నాకు మరీ కోపం . నిన్ను స్వీకరిద్దామనుకుంటే నా అంత స్వార్ధపరుడు ఉండడు . వదులుకుందామంటే నా ...