అనంత సాగర గర్భాన్ని దాటుకొని తీరానికి పరుగులెత్తిన అలలా ఈ క్షణం కోసమే ఎన్నో బరువైన దాహపు ఝాముల్ని ఈది వచ్చాను. వర్షించే క్షణం కోసమే బతికిన మేఘం వర్షించాక మాయమైనట్టు ఈ క్షణం కోసమే.. ఈ క్షణం లోనే గడిపిన మునుపటి కాలమంతా గమ్మున తన అస్తిత్వాన్ని జారవిడుచుకుంది. నా ఎదురుగా.. సాహితి. * * * * * నిండు గుండె వెంటనే తొణకలేనట్లుగా ఆ స్థానే నిశ్వాసలు అధికమై, పొడి పొడి మాటలు పల్లవించాయి. 'వచ్చేసావా?' 'ఊ!.. నీ పరీక్షలు అయిపోయాయా?' 'ఊ..' ఇద్దరివీ సమాధానం తెలిసిన ప్రశ్నలే. కానీ మనసులు అటూ, ఇటూ ప్రవహించడానికి భౌతికమైన ఏదో సంధి ఏర్పడాలిగా. ఇద్దరం పక్కపక్కన ఇసుకలో కూర్చున్నాం. మేమెప్పుడూ కలిసే ఏకాంత సాగరతీరమిది. కాసేపటికి నా కాళ్ల మీద తలపెట్టుకొని తను.. ఇంకాసేపటికి తన కాళ్లమీద తల పెట్టుకొని నేను. కాలం కరుగుతోంది. మాటల తలంబ్రాలు, స్పర్శలు రేపే నూనూగు కాంక్షల మేళాల నడుమ హృదయాల కళ్లాపులు. నా కళ్లకెదురుగా ఆకాశం.. అవధుల్లేకుండా. పగలు, రాత్రి మాలాగే ప్రేమికులై ఇప్పుడే కలుసుకుంటున్నారేమో. ఆకాశంలో అందమైన సంధ్య ఆవిష్కృతమౌతోంది. తన తోడుగా నా ప్రపంచం ఇప్పుడింత అందంగా ఉందన్న విషయం ఒక్కసారిగా అ...