చుట్టూ భవనాలు, గుడిసెలు, రోడ్లు, మోటారు చక్రాలు.. మనుషుల చేతులు, కాళ్ళు కదులుతున్నాయి.. ముఖాలు మాట్లాడుతున్నాయి.. భవనాలు, చేతులు-కాళ్ళు, చక్రాలు, ముఖాలు తమని నియంత్రిస్తున్న పరాయి పైశాచిక శక్తి యొక్క వికృత, విశృంఖల నాట్యాన్ని నగ్నంగా చూపిస్తున్నాయి. తనని తాను కాల్చుకునే మూర్ఖావేశం, బలహీనమైనవాటిని ధ్వంసం చేసి సమర్థించుకునే కుటిల రాక్షసత్వం చుట్టూ కారుచిచ్చులా రాజుకుంటున్నాయి. రాజకీయం వ్యక్తి స్వార్ధానికి పరాకాష్టగా మారి సంఘాన్ని బలత్కరిస్తోంది. విలువలు నేర్పని, మనిషిని చేయలేని విద్య తన డొల్లతనాన్ని కఠోరంగా డప్పుకొడుతోంది. భయం.. స్వార్ధం.. కుటుంబం.. వంటి బంధాల, భావాల పిరికితనంతో నిండిన మానసిక నపుంసకుడిని నేను. నా రక్తం నిజానికి ఎర్రగానే లేదు. మరిగే స్వభావం కోల్పోవడంతో రక్తమాంసాదులు కుళ్లు కంపుకొడుతున్నాయి. భావి సమాజమా!.. నన్ను క్షమించు.