సాక్షి దినపత్రిక వారి ఆదివారం అనుబంధం- 'ఫన్ డే' లో ప్రచురించబడిన నా కధ 'అమ్మకు పూలు పూచాయి ' పూర్తి భాగాన్ని దిగువున చదువగలరు.. అమ్మకి పూలు పూచాయి అలా ఉండకూడదనుకున్నా నాలో ఎందుకో అసహనం, కోపం వచ్చేస్తున్నాయి. నేను గొప్పగా భావించుకున్న నా ఆదర్శం నన్నిపుడు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. 'బాలు' ని ఇంటికి తీసుకువచ్చి మూడు రోజులవుతుంది. మేం వాడిని దత్తత తీసుకున్నాం. ఒక బిడ్డని కని, దేశజనాభాని ఒకటి హెచ్చించి, వాడిని పెంచడం కన్నా ఏ ప్రేమకూ నోచుకోని ఒక అనాధకి తల్లిదండ్రులవ్వడం మంచి ఆదర్శమని మా అభిప్రాయం. మా ఇద్దరి అభిప్రాయం అని చెప్పడం కన్నా నా అభిప్రాయమని చెప్పడమే కరెక్టేమో. ఎందుకంటే ఈ విషయమై నా భార్య ప్రణవికి సంవత్సరకాలంగా నచ్చజెప్పుతూ చివరికి ఒప్పించాను. తనకి ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ నా మీదున్న గౌరవం దానిని కప్పేసిందనుకుంటా. అనాధాశ్రమానికి వెళ్లి, బాలు ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాం గానీ వాడు అప్పటినుంచి మాతో సరిగా కలవట్లేదు. ముభావంగా ఉంటున్నాడు. ప్రణవి తన వంతుగా మంచి వంటలు, బొమ్మలతో వాడిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం కనపడట్లేదు. మ...