పూలమత్తుని ఘ్రాణించి, ఉన్మత్తలైన మరీచికలతో మోహనంగా కృష్ణవర్ణాన్ని కౌగిలించుకుంటోన్న సంధ్యాకాంత.. నిన్ను కలుస్తున్నానని సాయంత్రం సింగారించుకుందా?.. లేదా నేనే అందంగా చూస్తున్నానా?.. మనసు తీగ నీ తలపు కొమ్మని చుట్టుకొని మురిసి కంటున్న సన్నజాజి ఊహలు.. నువ్వీ క్షణం ఏం చేస్తుంటావో.. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంతలా రంజింపజేస్తుంటావో.. నీ పాదాల్ని భూమి ఎంత మెత్తగా హత్తుకుంటుందో.. గాలి నీ కురులని ఎంత సుతారంగా సవరిస్తుందో.. నీ చిరుచెమటని తడిమి తనలోకి లాక్కుంటున్న చుడీదార్‌ది ఎంత అదృష్టమో!.. ఒకరి కోసం ఆలోచించడం ఇంతటి కమ్మని మైకమా!.. ఇప్పుడే అనుభవమౌతోంది. నీకోసం ఏదేదో చేసెయ్యాలన్న ఆరాటం.. కానీ ఏం చేసినా నీ సాహచర్యం నాకిచ్చే ఆనందం ముందు అదెంత?.. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ముఖం మీది కురులను చేతివేళ్లతో వెనక్కి తోసుకుంటూ నన్ను చూస్తావు కదా.. గుండె గుప్పున పరవశంలో మునిగిపోతుంది. యధాలాపంగా తగిలే వేలికొనలు యదని ఝుమ్మనిపిస్తాయి.. గుండె త్వరణం పెరిగేసరికి మెదడు వెనక్కి రమ్మని ఆదేశాలిచ్చినా అర్ధం చేసుకునే స్థితిలో అవి ఉంటేనా?.. గిటారు మీటినట్లు అంత సన్నగా ఎలా నవ్వుతావో?.. అప్పుడప్పుడు నా పట్...