..ఆమెని కలవబోతున్నానన్న ఉత్కంఠ అతనిలో ఎప్పటిలానే ఉంది. ఈ విషయం స్ఫురణకి రాగానే అతనిలో కాస్త సాంత్వన.. ఆ వెంటనే కాస్త ఆందోళన.. ఈ రెండు భావావేశాలు దు:ఖమనే గాఢతలో సన్నని ఉపరితల ప్రకంపనాల్లా చినికి, సద్దుమణిగాయి. ఆమెకి వేరొకరితో పెళ్లయి అప్పటికి 15 రోజులు.. కలలు కూలిపోయాక కొన్నిసార్లు మనల్ని మనం శిక్షించుకోవడానికి బతుకుతాం. ఆమె వచ్చింది. పలకరింపుగా ఇద్దరూ తేలికగా నవ్వుదామని ప్రయత్నించి, విఫలమై, వాతావరణాన్ని భారం చేసారు. పక్కపక్కగా కూర్చున్నారు కానీ వారి మధ్య కోసుల దూరం అనుభవమౌతోంది. ఒకప్పటి దగ్గరితనం నేపధ్యంగా వెలిసిన ఈ దూరం వారి మధ్యనున్న నిశ్శబ్దంలోకి చొరబడి, వికృతంగా పరిహసిస్తోంది. 'ఎలా ఉన్నావు?..' అని అడుగుదామనుకున్నాడు. ఈ ప్రశ్న ఇంత అర్ధవంతంగా అతనికి మునుపెన్నడూ తోచలేదు. నోటివరకూ వచ్చాక చాలా చెత్త ప్రశ్నలా అనిపించి, ఆగిపోయాడు. నిశ్శబ్దం ఇద్దరిమధ్యా ఇరుకుగా కదిలింది. తను ఎప్పుడూ ఇచ్చే Dairy Milk Silk ని ఇచ్చి, కదలికని తీసుకొద్దామనుకున్నాడు. కానీ 'నా ప్రేమ ఇప్పటికీ అలానే ఉంది అన్న విషయాన్ని నిరూపించడానికి ఇస్తున్నానన్నట్టు తను భావిస్తుందేమో.. బాధ పడుతుందేమోన'న్న ఆల...