Friday 23 January 2009

విరహ భోగం...

డాబా మీదకి వచ్చాను. వెన్నెల పాలిపోయి ఉంది. చంద్రుని వైపు చూడబుద్ధి కాలేదు. చూస్తే మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతాడు. పక్కగా ఓ గాలి తెమ్మెర వెళ్ళింది. నువ్వు వెనుకగా వచ్చి నడుముకి చేయి జార్చి, చెవుల మీది కురులను సవరించి చెంపకి చెంప ఆనించిన అనుభవాన్ని తట్టి లేపింది. దానిని గమనించనట్టే ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను. ఆ మాత్రం గాలివిసురుకే చున్నీ ఎగిరి పక్కనున్న గులాబీ మొక్కకి చిక్కుకుంది. హే!.. దీనికో పువ్వు పూసింది. ఆప్యాయంగా ముఖాన్ని గులాబీకి దగ్గర చేశాను. ఉచ్ఛ్వాస గులాబీ పరిమళాన్ని పూసుకోగానే గుండె గదుల్లో నీ మందహాస సమ్మోహనం పొగమంచులా ప్రవేశించింది. తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది. ఈ బాధ వలనైనా శరీరానికి కొంచం స్పృహ వస్తుందని అలాగే పట్టిఉంచాను. కానీ నీ మత్తు మహత్తు చేసిన తిమ్మిరికి ఈ నొప్పి ఎలా తెలుస్తుంది.

స్నానం చేసి మనసు కొంచం తేలికపడ్డాక పడుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. షవర్ నీరు కురుల మీదుగా శతాధిక పాయలుగా చీలి తనువంతా పారుతుంటే దేహం కోటి తంత్రుల ఘోషగా మారింది. షవర్ నీటికి ముఖాన్ని ఎదురుగా పెట్టి, చేతులతో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఓసారి తమకంతో నా చేతికండని పంటితో గిచ్చాను. బట్టలు వేసుకుంటున్నప్పుడు చూస్తే, ఆ భాగం ఎర్రగా కంది ఉంది. పదహారణాల సిగ్గుకి పూసంత మురిపెం కలిసి నా ముఖంలో మెరిసింది.

బాహ్యంగా పవళించినా పలవరింతలు మాత్రం ఆగలేదు. కుడి చేయి తివాచీ పరచి ఆహ్వానిస్తున్నట్లుగా పరచుకొని ఉంది (నీకోసమేమీ కాదబ్బాయ్!.). ఏ అధఃపాతాళానికో జారిపోతున్నట్లు గుండెలు నీ ఆసరా కోసం కొట్టుకుంటున్నాయి. నడుము దొంతరల మధ్య నీ చేయి కాకుండా గాలి దూరినందుకు నడుము ఉక్రోషంతో విలవిలపోతోంది. కొంటె ఊహల పీయూషాన్నిఎదబిందెలు పట్టలేకపోతుండడంతో పెదవులు అర్థపావు విచ్చుకొని ఉన్నాయి. ఎద ఎగిసిపడేకొలదీ ప్రతిగా నాభి నడుము లోపలికి పోతోంది. తరంగమైపోతానేమోనని ఇరుపాదాల వేలికొసలని నొక్కిపట్టి దేహానికి జారుముడి వేసాను. అయినా లాభం లేదాయే!.

పరుపు మెత్తదనం శత్రువయ్యిందని కటికనేల మీదకి చేరితే అది నీ బాహువుల కాఠిన్యాన్ని గుర్తుచేసింది. ఇది నిజంగా టార్చర్ తెలుసా. ఇలా కాల్చే కన్నా గుండెల్లో ఓ పిడిబాకుని దింపి ఒక్కసారిగా చంపెయ్యొచ్చుగా. ఇలా మధురూహలతో పోరాడి, అలసి ఎప్పటికో నిద్రపోయాను.

పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. తయారయ్యాక ఏమి చెయ్యాలో తెలియక గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపయ్యిందో అమ్మ తట్టి లేపేవరకూ తెలిసిరాలేదు. ఇది ఏ ధ్యానమో.. పరధ్యానమో!..

ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

19 Comments:

Blogger Kiran said...

This post has been removed by the author.

23 January, 2009 12:31 PM  
Blogger Kiran said...

మురారి గారు ! చాలా బాగుంది

23 January, 2009 12:33 PM  
Blogger మోహన said...

మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(

23 January, 2009 12:46 PM  
Blogger ఫణీంద్ర said...

''తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది.'' Loved it .

23 January, 2009 10:49 PM  
Blogger మురారి said...

@ Kiran, @ ఫణీంద్ర,

థాంక్యూ.

@మోహన,

>>మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(
ఎందుకండీ అలా అన్నారు?

24 January, 2009 12:00 AM  
Blogger గోపాళం said...

"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?."

ఆహా... ఎంత రొమాంటిక్గా రాశారండి?

26 January, 2009 11:37 PM  
Blogger బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. "
అద్భుతంగా ఉంది.
విరహంలో ఉండే భాధని, ఆనందాన్ని, ఎదురుచూపుని, మొత్తాన్ని అద్భుతంగా ఒక్క వాక్యంలో చెప్పేసారు.

27 January, 2009 2:02 AM  
Blogger మురారి said...

@గోపాళం, బ్రహ్మి గార్లకి,

థాంకులు. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.

27 January, 2009 7:08 PM  
Blogger Siri said...

ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

చాలా బాగా రాసారండి :)....నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం

7 February, 2009 8:33 AM  
Blogger నాగన్న said...

కళ్ళకు కట్టినట్లు రాసారు. చాలా బాగుంది.

7 February, 2009 9:43 PM  
Blogger మురారి said...

@siri, @నాగన్న

థాంక్సండి.

14 February, 2009 4:26 AM  
Blogger saras said...

This post has been removed by the author.

7 August, 2009 12:08 AM  
Blogger saras said...

chala chala chala baga rasaru...nanu already chadevasanu ede, most of da gals feel lik tht nly...correct ga rasaru...

7 August, 2009 12:19 AM  
OpenID bonagiri said...

ఎంత మనోహరమైన వ్యాపకమో!.

suuper..

7 August, 2009 4:28 AM  
Anonymous Anonymous said...

చాలా బాగా వ్రాసారు.మీకు ఆలోచనలు అప్రయత్నంగా అలా వస్తూంటాయా లేక ప్రయత్నించాలా? ఐనా ఇంత మంచి శైలి ఎలా వస్తుంది? నిజంగా మీ ప్రజ్ఞ కి నా జోహార్లు.

Just wanted to understand the workings of your mind...if, thats possible. :)

Good Going!

25 August, 2009 11:38 PM  
Blogger arien said...

This post has been removed by the author.

25 August, 2009 11:39 PM  
Blogger మురారి said...

@saras, Bonagiri
Thank you.

@ Anonymous,
మీ వాఖ్య కి మునగ చెట్టు ఎక్కేసాను. అప్రయత్నంగా కలిగిన స్పందన ఈ టపాని రాయించింది. నేను గనుక ఒక రొమాంటిక్ పాట పిక్చరైజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న అలోచన ఇలా వచ్చింది. అదన్నమాట. మీ స్పందనకి ధన్యవాదాలు.

27 August, 2009 10:11 AM  
Blogger kalpa latika said...

viraha vaedanani chaala baaga rakti gattinchharu.okonamlo krishna vamsee direction pratibha kanipistoondi meelo

10 September, 2009 1:42 AM  
Blogger మురారి said...

కృష్ణవంశీ రొమాన్సుని బాగా తీస్తాడు. ఇప్పుడు ఏమయ్యిందో గానీ ఒకప్పుడు సింధూరం, అంతహ్ పురం, నిన్నే పెళ్లాడుతా వంటివి చాలా బాగా తెరకెక్కించాడు. మీ స్పందనకి ధన్యవాదాలు.

10 September, 2009 9:22 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home