Skip to main content

విరహ భోగం...

డాబా మీదకి వచ్చాను. వెన్నెల పాలిపోయి ఉంది. చంద్రుని వైపు చూడబుద్ధి కాలేదు. చూస్తే మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతాడు. పక్కగా ఓ గాలి తెమ్మెర వెళ్ళింది. నువ్వు వెనుకగా వచ్చి నడుముకి చేయి జార్చి, చెవుల మీది కురులను సవరించి చెంపకి చెంప ఆనించిన అనుభవాన్ని తట్టి లేపింది. దానిని గమనించనట్టే ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను. ఆ మాత్రం గాలివిసురుకే చున్నీ ఎగిరి పక్కనున్న గులాబీ మొక్కకి చిక్కుకుంది. హే!.. దీనికో పువ్వు పూసింది. ఆప్యాయంగా ముఖాన్ని గులాబీకి దగ్గర చేశాను. ఉచ్ఛ్వాస గులాబీ పరిమళాన్ని పూసుకోగానే గుండె గదుల్లో నీ మందహాస సమ్మోహనం పొగమంచులా ప్రవేశించింది. తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది. ఈ బాధ వలనైనా శరీరానికి కొంచం స్పృహ వస్తుందని అలాగే పట్టిఉంచాను. కానీ నీ మత్తు మహత్తు చేసిన తిమ్మిరికి ఈ నొప్పి ఎలా తెలుస్తుంది.

స్నానం చేసి మనసు కొంచం తేలికపడ్డాక పడుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. షవర్ నీరు కురుల మీదుగా శతాధిక పాయలుగా చీలి తనువంతా పారుతుంటే దేహం కోటి తంత్రుల ఘోషగా మారింది. షవర్ నీటికి ముఖాన్ని ఎదురుగా పెట్టి, చేతులతో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఓసారి తమకంతో నా చేతికండని పంటితో గిచ్చాను. బట్టలు వేసుకుంటున్నప్పుడు చూస్తే, ఆ భాగం ఎర్రగా కంది ఉంది. పదహారణాల సిగ్గుకి పూసంత మురిపెం కలిసి నా ముఖంలో మెరిసింది.

బాహ్యంగా పవళించినా పలవరింతలు మాత్రం ఆగలేదు. కుడి చేయి తివాచీ పరచి ఆహ్వానిస్తున్నట్లుగా పరచుకొని ఉంది (నీకోసమేమీ కాదబ్బాయ్!.). ఏ అధఃపాతాళానికో జారిపోతున్నట్లు గుండెలు నీ ఆసరా కోసం కొట్టుకుంటున్నాయి. నడుము దొంతరల మధ్య నీ చేయి కాకుండా గాలి దూరినందుకు నడుము ఉక్రోషంతో విలవిలపోతోంది. కొంటె ఊహల పీయూషాన్నిఎదబిందెలు పట్టలేకపోతుండడంతో పెదవులు అర్థపావు విచ్చుకొని ఉన్నాయి. ఎద ఎగిసిపడేకొలదీ ప్రతిగా నాభి నడుము లోపలికి పోతోంది. తరంగమైపోతానేమోనని ఇరుపాదాల వేలికొసలని నొక్కిపట్టి దేహానికి జారుముడి వేసాను. అయినా లాభం లేదాయే!.

పరుపు మెత్తదనం శత్రువయ్యిందని కటికనేల మీదకి చేరితే అది నీ బాహువుల కాఠిన్యాన్ని గుర్తుచేసింది. ఇది నిజంగా టార్చర్ తెలుసా. ఇలా కాల్చే కన్నా గుండెల్లో ఓ పిడిబాకుని దింపి ఒక్కసారిగా చంపెయ్యొచ్చుగా. ఇలా మధురూహలతో పోరాడి, అలసి ఎప్పటికో నిద్రపోయాను.

పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. తయారయ్యాక ఏమి చెయ్యాలో తెలియక గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపయ్యిందో అమ్మ తట్టి లేపేవరకూ తెలిసిరాలేదు. ఇది ఏ ధ్యానమో.. పరధ్యానమో!..

ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

Comments

Kiran said…
This comment has been removed by the author.
Kiran said…
మురారి గారు ! చాలా బాగుంది
మోహన said…
మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(
''తన్మయత్వానికి చేతి వేళ్లలో తన్యత పెరిగిందేమో గులాబీ ముల్లు వేలిలో దిగింది.'' Loved it .
@ Kiran, @ ఫణీంద్ర,

థాంక్యూ.

@మోహన,

>>మీకు ఇది న్యాయం కాదు మురారి గారూ.. :(
ఎందుకండీ అలా అన్నారు?
Gopala said…
"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?."

ఆహా... ఎంత రొమాంటిక్గా రాశారండి?
"ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?. "
అద్భుతంగా ఉంది.
విరహంలో ఉండే భాధని, ఆనందాన్ని, ఎదురుచూపుని, మొత్తాన్ని అద్భుతంగా ఒక్క వాక్యంలో చెప్పేసారు.
@గోపాళం, బ్రహ్మి గార్లకి,

థాంకులు. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.
Siri said…
ఈ భోగమెంతటి వైభోగమైన నరకమో!.

చాలా బాగా రాసారండి :)....నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం
Naga said…
కళ్ళకు కట్టినట్లు రాసారు. చాలా బాగుంది.
@siri, @నాగన్న

థాంక్సండి.
Anonymous said…
This comment has been removed by the author.
Anonymous said…
chala chala chala baga rasaru...nanu already chadevasanu ede, most of da gals feel lik tht nly...correct ga rasaru...
Anonymous said…
ఎంత మనోహరమైన వ్యాపకమో!.

suuper..
Anonymous said…
చాలా బాగా వ్రాసారు.మీకు ఆలోచనలు అప్రయత్నంగా అలా వస్తూంటాయా లేక ప్రయత్నించాలా? ఐనా ఇంత మంచి శైలి ఎలా వస్తుంది? నిజంగా మీ ప్రజ్ఞ కి నా జోహార్లు.

Just wanted to understand the workings of your mind...if, thats possible. :)

Good Going!
Unknown said…
This comment has been removed by the author.
@saras, Bonagiri
Thank you.

@ Anonymous,
మీ వాఖ్య కి మునగ చెట్టు ఎక్కేసాను. అప్రయత్నంగా కలిగిన స్పందన ఈ టపాని రాయించింది. నేను గనుక ఒక రొమాంటిక్ పాట పిక్చరైజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న అలోచన ఇలా వచ్చింది. అదన్నమాట. మీ స్పందనకి ధన్యవాదాలు.
kalpa latika said…
viraha vaedanani chaala baaga rakti gattinchharu.okonamlo krishna vamsee direction pratibha kanipistoondi meelo
కృష్ణవంశీ రొమాన్సుని బాగా తీస్తాడు. ఇప్పుడు ఏమయ్యిందో గానీ ఒకప్పుడు సింధూరం, అంతహ్ పురం, నిన్నే పెళ్లాడుతా వంటివి చాలా బాగా తెరకెక్కించాడు. మీ స్పందనకి ధన్యవాదాలు.
Indeevara said…
viraha veedana kudaa inta teeyaga untundani meeru varninchi teeru adbhutamga undi
@ వాత్సవి,
ధన్యవాదాలు.
"పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!"
SO TRUE!!!

టపా అంతా బావుంది ముఖ్యంగా ఈ ఆఖరి పేరాగ్రాఫ్!!
:-)
@నిషిగంధ,

ఆఖరి పేరాగ్రాఫ్ లో ఆ అమ్మాయికి అతని పట్ల ఉన్న ప్రేమంతా కనబడుతుంది.

>>గుమ్మం దగ్గరకి వచ్చి ద్వారానికి చెంపని ఆనించి అలా చూస్తూ ఉండిపోయాను.

ఇది రాస్తున్నప్పుడు మనసులో ఓ బాపు చిత్రం మెదిలింది.

మీ స్పందన కి థాంకులు.
too too too tooooooooooo
good..
caalaa naccindi
"....దేహానికి జారుముడి వేసాను."

ఈ ఒక్క వాక్యం చాలు, విరహం ఎంత బలమైనదో, భౌతికమైన దూరం మనిషిని ఎంత తీవ్ర ఉద్వేగానికి గురి చేసేస్తుందో చెప్పడానికి. అక్షర లక్షలు ఇచ్చేద్దామని ఉంది మాస్టారూ!
మనసుకి చాలా తెలుసు. శరీరం చేత సంజ్ఞలు చేయించడం వాటిలో ఒకటి. అది అర్ధం చేసుకోడానికే ప్రత్యేకమైన దృష్టి అవసరం అయితే, అక్షరాల్లో పెట్టడగలగడం మహాద్భుతమైన కళ. Wonderful job!
@సవ్వడి,
మీకు నచ్చినందుకు సంతోషమండి. ధన్యవాదాలు.

@కొత్తావకాయ,
మాష్టారూ!.. అని నాకు బాగా దగ్గరయిన ఒక వ్యక్తి పిలుస్తారు. మళ్లీ మీరు నన్ను అలా సంబోదించడం నచ్చింది. స్పందనకి ధన్యవాదాలు.