Skip to main content

వేకువ రాగం

అంతా చీకటి. చుట్టూ ఏమీ లేదు సముద్ర ఘోష తప్ప. చంద్రుడు లేని ఆకాశం నల్లని చీర కట్టుకొని, పెద్దగా ఉన్న చీర కొంగుని అలాగే గాలికి వదిలేసి సముద్రపు ఒడ్డున తన ప్రియుని కోసం ఎదురు చూస్తున్న పడుచు లా ఉంది. అక్కడక్కడ మెరుస్తున్న నక్షత్రాలు ఆ చీర కొంగుకు అద్దిన చమ్కీల్లా ఉన్నాయి. తన ప్రియుడు రాబోతున్నాడని ఏ మేఘమో కబురంపినట్లు గా ఉంది దూరం గా తూర్పున ఒక చిన్న వెలుగురేఖ ఆశ లా విచ్చుకొంటోంది. వస్తూనే నన్ను ఎలా చుట్టెస్తాడా అన్న ఊహ వచ్చి బుగ్గలు ఎర్రబడినట్లు ఉన్నాయి. వెలుగురేఖ ఎర్ర నారింజ రంగు లోకి మారింది. ఆ ఊహల్లో ఉంటూండగానే చూసింది - దూరంగా అశ్వారూఢూడై వస్తున్నాడు సఖుడు. అరె! ఆకాశానికి ఎంత హర్షాతిరేకం!!. ఆనందంతో ఎన్ని రంగులు మార్చుకొంటోందో... ఎన్ని హోయలు వొలకబొస్తోందో... అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఏదో ఆహ్లాదమైన రాగాన్ని అందుకున్నట్లు గా ఉంది. నక్షత్రాలు బారులు తీరిన వయొలిన్ విద్వాంసుల్లా ప్రకృతి ఆలాపనకి వాయులీన సహకారం అందిస్తున్నారు. పిల్ళగాలి గాడు ఆ tunes కి అనుగుణంగా ఊగుతున్నాడు. ఆ రాగం.. ఒక క్రొత్త స్వాగతం లా... ఒక నూతన ఒరవడి లా... నిన్నటి బాధల నుంచి నేటి ఆనందాలకి నడిపించే దృక్పధం లా ఉంది.

సముద్ర గర్భం నుంచి భానుడు క్రొద్దిగా బయటకు వచ్చాడు అప్పటి వరకు అమ్మ ఒడిలోనే దాక్కొని పడుకొన్న చoటి బాబు ముఖం మీద దుప్పటి ని తొలగించి బయటకి చూస్తుంటే, అమ్మమ్మ వచ్చి "ఓయ్!! కన్నాలూ.. లెగిసిపోయావా!!" అని అడిగితే సమాధానం గా నవ్వినప్పటి నవ్వు వెలుగు లా ఉన్నాడు సూరీడు. ఇంక గమ్మున తెల్లారింది.

Comments

kalpa latika said…
మీ వర్నన చాల బాగున్ది
Indeevara said…
This comment has been removed by the author.
Indeevara said…
neenu novels yekkuvaga chaduvutaanu andaruu prakritini inchuminchu okeelaa antee yekuuvagaa ammaaito poolustaaru mee veekuva raagam vaatiki bhinnamgaa kasta krottagaa unnattanipinchindi
@కల్ప లతిక, వాత్సవి,
మీ స్పందన కి ధన్యవాదాలు.