నీవు భావస్పందనల హృదయరాగానివి. కనులు మూసినంతనే ఊహల వినీలాకాశంలోంచి ధవళవస్త్రాలతో సమ్మోహనంగా ఏతెంచుతావు. నిదురిస్తున్న నా వక్షస్థలం వేదికగా మోహినిలా నాట్యమాడుతావు. నీ ప్రతి పదఘట్టనకీ - నాలో ఒక్కో కవిత విరబూసుకుంటుంది... హృదయములో సంగీతం సెలయేరై పారుతుంది... భావం గుండెలోంచి ఒలికి భౌతికతని సంతరించుకుంటుంది. నీ సౌందర్యం ఆవిష్కరిస్తున్నకొలదీ అనంతమనిపిస్తుంది. అమ్మ ఒడి కమ్మదనంలా.. కవ్వించే ప్రేయసిలా.. బడుగు బ్రతుకుల ఆక్రోషంలా.. ఎండుటాకులు చెప్పే తాత్వికతలా.. ఇలా నీవు కామరూపిణివి. హృదయేశ్వరీ!, నీ వీణామృతనాదంలో మునుగుతూ అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ.