నేను దేని గురించి వెతుకుతున్నానో తెలియదు. యే విజయపు వేకువ కోసమో తెలియదు. అసలు విజయమన్నదే లేదు, ప్రతీదీ గొప్ప అనుభవమేనన్న పరిణితి కోసమో ఏమో నేనైతే వెతుకుతున్నాను. నేను స్వార్థపరుడినో, ప్రేమమూర్తినో తెలియదు. మంచి చేసావు అని ఇతరులు చెప్పే ప్రతి పనిలోనూ నా అంతస్స్వార్ధమే కనపడుతుంది. స్వార్ధం పెరిగి ప్రేమవుతుందా లేక స్వార్ధం కరిగి ప్రేమ పుడుతుందా?.. నాకు తెలియదు. నేను వెతుకుతున్నాను. నేనెవరిని సమాధానపరచాలనుకుంటున్నానో తెలియదు. నా వాళ్లు, నా చుట్టూ ఉన్నా ప్రపంచానికా .. లేక నాకు నేనేనా?.. ఆత్మసాక్షికే అయితే ప్రత్యేకించి సమాధానం చెప్పనవసరం లేదు కదా!. బహుశా ఈ సమాధానం చెప్పనవసరం లేదు అన్న జ్ఞానం ఇచ్చే స్థితి కోసమేనేమో నేను వెతుకుతున్నాను. ప్రతీ అందానికీ ప్రతిస్పందిస్తాను. దానిని నాదాన్ని చేసుకొని, అనుభవించి, పరవశించి తేలికవ్వాలో లేక ఆ అందం లోనూ నన్నే చూసుకొని మురిసిపోవాలో తెలియదు. నేను... జ్ఞానముండీ మాయ కమ్మేస్తుంది. ప్రతిక్షణం ఏమరుపాటుగా ఉండి మాయతో పోరాడాలో లేక మాయలో ఆర్తిగా మునిగిపోయి, రమించి ఆ తీక్షణత కు మాయ కరిగినప్పుడు బోసినవ్వులా బయటపడాలో ఏమో.. నేనైతే...