Skip to main content

Posts

Showing posts from 2010

బింబాధరాల సరిహద్దున కన్నీటిచుక్క..

This moment is ridiculously painful. I am gasping for you. బాధని చూపించడానికి నా దగ్గర ఏ గుర్తూ లేదు- కళ్ళలో మాటిమాటికీ ముసురుకునే చెమ్మ తప్ప. పరితపించడమన్నది కేవలం హృదయానికే చెందిన భావనలా లేదు.. శరీరంలోని ప్రతీ రేణువూ నిన్ను కోరుకునే విరహాగ్నిలో మండిపోవడానికే ప్రాణం పోసుకుంటున్నాయి. My very existence is nothing but longing you. ఈ ఝాము భారంగా.. అనంతంగా గడుస్తోంది. మరుక్షణానికి ఇతర విషయాలతో కాస్త తేలికపడతానేమో!.. కానీ ఈ క్షణానికీ వేదన నిజమైనది. ఇంత వేదనలోనూ కొన్ని జ్ఞాపకాలు నవ్వు తెప్పిస్తాయి.. నవ్వు ముగుస్తుందనగా నీ లేమి మరింత తీక్షణంగా గుండెని మెలిపెడుతుంది.. నవ్వు తేలకుండానే కళ్ళు జలజలా వర్షిస్తాయి.. ఆ తర్వాత వెక్కుతూ దుఃఖం. ఈ దుఃఖం నుంచి పారిపోవాలని ఉంది. కానీ నువ్వు లేనప్పుడు కనీసం నీకు సంబంధించిన దుఃఖమైనా నాకు తోడుగా ఉండనీ. ఇప్పటివరకూ ప్రపంచాన్ని పట్టించుకోనందుకు అది నిన్ను వేరుచేసి ఇలా కసితీర్చుకుంటోంది. విధి ఇంత కాఠిన్యమని నేనూహించలేదు. ఆఖరి కోరికకి కూడా ఆస్కారమివ్వలేదు. కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు ముప్పెరుగొంటాయి. నిన్ను పొందని జీవితాన్ని త్యజించా...

అమ్మకి పూలు పూచాయి

సాక్షి దినపత్రిక వారి ఆదివారం అనుబంధం- 'ఫన్ డే' లో ప్రచురించబడిన నా కధ 'అమ్మకు పూలు పూచాయి ' పూర్తి భాగాన్ని దిగువున చదువగలరు.. అమ్మకి పూలు పూచాయి అలా ఉండకూడదనుకున్నా నాలో ఎందుకో అసహనం, కోపం వచ్చేస్తున్నాయి. నేను గొప్పగా భావించుకున్న నా ఆదర్శం నన్నిపుడు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. 'బాలు' ని ఇంటికి తీసుకువచ్చి మూడు రోజులవుతుంది. మేం వాడిని దత్తత తీసుకున్నాం. ఒక బిడ్డని కని, దేశజనాభాని ఒకటి హెచ్చించి, వాడిని పెంచడం కన్నా ఏ ప్రేమకూ నోచుకోని ఒక అనాధకి తల్లిదండ్రులవ్వడం మంచి ఆదర్శమని మా అభిప్రాయం. మా ఇద్దరి అభిప్రాయం అని చెప్పడం కన్నా నా అభిప్రాయమని చెప్పడమే కరెక్టేమో. ఎందుకంటే ఈ విషయమై నా భార్య ప్రణవికి సంవత్సరకాలంగా నచ్చజెప్పుతూ చివరికి ఒప్పించాను. తనకి ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ నా మీదున్న గౌరవం దానిని కప్పేసిందనుకుంటా. అనాధాశ్రమానికి వెళ్లి, బాలు ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాం గానీ వాడు అప్పటినుంచి మాతో సరిగా కలవట్లేదు. ముభావంగా ఉంటున్నాడు. ప్రణవి తన వంతుగా మంచి వంటలు, బొమ్మలతో వాడిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం కనపడట్లేదు. మ...

Inner Dimensions: 'She' speaks..

మేఘంలా నేనెప్పుడూ కరిగిపోతానో నాకే తెలియదు. ప్రాతహ్ నిశీధిలో ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?.. వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే. దారిలో ఎవరో పాదాల కింద నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది. కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఖం కూడా కలగదు. రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది. నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి. నాకు సముద్రమంత ప్రేమ కావాలి.. చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను. కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే. వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను. విఫలమయ్యాక ఒంటరినయ్యాను. విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎ...

భావి సమాజమా!.. నన్ను క్షమించు.

చుట్టూ భవనాలు, గుడిసెలు, రోడ్లు, మోటారు చక్రాలు.. మనుషుల చేతులు, కాళ్ళు కదులుతున్నాయి.. ముఖాలు మాట్లాడుతున్నాయి.. భవనాలు, చేతులు-కాళ్ళు, చక్రాలు, ముఖాలు తమని నియంత్రిస్తున్న పరాయి పైశాచిక శక్తి యొక్క వికృత, విశృంఖల నాట్యాన్ని నగ్నంగా చూపిస్తున్నాయి. తనని తాను కాల్చుకునే మూర్ఖావేశం, బలహీనమైనవాటిని ధ్వంసం చేసి సమర్థించుకునే కుటిల రాక్షసత్వం చుట్టూ కారుచిచ్చులా రాజుకుంటున్నాయి. రాజకీయం వ్యక్తి స్వార్ధానికి పరాకాష్టగా మారి సంఘాన్ని బలత్కరిస్తోంది. విలువలు నేర్పని, మనిషిని చేయలేని విద్య తన డొల్లతనాన్ని కఠోరంగా డప్పుకొడుతోంది. భయం.. స్వార్ధం.. కుటుంబం.. వంటి బంధాల, భావాల పిరికితనంతో నిండిన మానసిక నపుంసకుడిని నేను. నా రక్తం నిజానికి ఎర్రగానే లేదు. మరిగే స్వభావం కోల్పోవడంతో రక్తమాంసాదులు కుళ్లు కంపుకొడుతున్నాయి. భావి సమాజమా!.. నన్ను క్షమించు.