2009 నవంబర్ నెల. ఆ రాత్రి ముసుగు కప్పుకున్న ఉన్మాదంలా ఉంది. కార్తీకపు కర్కశ చలికి బస్టాండ్‌లో మూలకి ఓ కుక్క ముడుచుకొని పడుకుంది. చివరి బస్సు వచ్చిన శబ్దానికి ఓమారు తల పైకెత్తి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. బస్సులోంచి ఆఖరిగా దిగిన విజయ్ ముఖంలో ఏదో తీవ్రమైన ఉద్వేగం ప్రతిఫలిస్తోంది. బస్సు దిగి.. ఇటు, అటు చూసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అతని భుజాల మీదున్న బ్యాగ్‌లో యాసిడ్ బాటిల్ ఉందన్న విషయం అతనికి మాటిమాటికీ గుర్తువస్తోంది. బస్టాండ్‌లోనే ఒక బెంచీ మీద కూర్చున్నాడు. రాత్రి 11 దాటుతుండడంతో ప్రపంచమంతా నిద్రలోకి జోగుతున్నా విజయ్‌ని మాత్రం ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 'తెల్లారగానే అనూష పెళ్ళి. పెళ్ళి జరుగుతుండగా అందరి మధ్యలో ఆమె ముఖం మీద యాసిడ్ పొయ్యాలి. ప్రతీకారం తీర్చుకోవాలి..’ ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు. విజయ్ చెయ్యబోతున్న మొట్టమొదటి క్రైమ్ ఇదే. . క్రైమ్ చెయ్యడమేంటి?.. 5 నెలల క్రితం వరకూ అలాంటి ఊహలు కూడా అతనకి వచ్చేవి కావు. విజయ్ తనలోని సంఘర్షణ మొద్దుబారడానికి దగ్గరలోనున్న వైన్‌షాప్‌కి వెళ్లి రెండు బీర్లు తాగాడు. తిరిగి బస్టాండ్ బెంచీ మీద కూర...