Skip to main content

సంపంగి ఒడి


2009 నవంబర్ నెల.


ఆ రాత్రి ముసుగు కప్పుకున్న ఉన్మాదంలా ఉంది. కార్తీకపు కర్కశ చలికి బస్టాండ్‌లో మూలకి ఓ కుక్క
ముడుచుకొని పడుకుంది. చివరి బస్సు వచ్చిన శబ్దానికి ఓమారు తల పైకెత్తి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. 
బస్సులోంచి ఆఖరిగా దిగిన విజయ్ ముఖంలో ఏదో తీవ్రమైన ఉద్వేగం ప్రతిఫలిస్తోంది. బస్సు దిగి..
ఇటు, అటు చూసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అతని భుజాల మీదున్న బ్యాగ్‌లో యాసిడ్ బాటిల్
ఉందన్న విషయం అతనికి మాటిమాటికీ గుర్తువస్తోంది. బస్టాండ్‌లోనే ఒక బెంచీ మీద కూర్చున్నాడు.
రాత్రి 11 దాటుతుండడంతో ప్రపంచమంతా నిద్రలోకి జోగుతున్నా విజయ్‌ని మాత్రం ఆలోచనలు
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 'తెల్లారగానే అనూష పెళ్ళి. పెళ్ళి జరుగుతుండగా అందరి మధ్యలో ఆమె
ముఖం మీద యాసిడ్ పొయ్యాలి. ప్రతీకారం తీర్చుకోవాలి..’ ఇలా సాగుతున్నాయి అతని ఆలోచనలు.
విజయ్‌ చెయ్యబోతున్న మొట్టమొదటి క్రైమ్ ఇదే. .  క్రైమ్ చెయ్యడమేంటి?.. 5 నెలల క్రితం వరకూ
అలాంటి ఊహలు కూడా అతనకి వచ్చేవి కావు. 


విజయ్ తనలోని సంఘర్షణ మొద్దుబారడానికి దగ్గరలోనున్న వైన్‌షాప్‌కి వెళ్లి రెండు బీర్లు తాగాడు. తిరిగి
బస్టాండ్ బెంచీ మీద కూర్చున్న అతనిదృష్టిని అక్కడ కస్టమర్ల కోసం వెతుకుతున్న ఒక  వేశ్య
ఆకర్షించింది. పౌడర్ దట్టంగా పూసుకొని, బ్రైట్ లిప్‌స్టిక్ రాసుకొని చూడగానే సగటు వేశ్యలా అనిపించినా,
కాస్త తరచి చూస్తే ఆమె ముఖంలో ప్రశాంతత.. కళ్ళల్లో ఏదో వెలుగు. విజయ్‌కి ఆ వేశ్య తాను
అసహ్యించుకునే స్త్రీ జాతికి ప్రతిరూపంలా అనిపించింది. 'రేప్పొద్దున్న చెయ్యబోయే కిరాతకానికి సిద్ధం
కావాలంటే ఈ రాత్రి తాను మరింత చెడిపోవాలి..' అని నిశ్చయించుకున్నాడు.


విజయ్ ఆమె దగ్గరికి వెళ్లి పేరేంటని అడిగాడు. ‘మల్లి’ అని సమాధానమిచ్చింది. ఆమె తన కళ్ళల్లోకి
నిర్మలంగా చూస్తూ మాట్లాడడం విజయ్‌కి ఇబ్బంది కలిగించింది. రేటు మాట్లాడాడు. మల్లి ‘రూమ్ ఉందా?'
అనడిగింది. ‘లేద’న్నాడు విజయ్‌. 'మా ఇంటికి వెళ్దాం పదైతే' అని మల్లి అనేసరికి ఇద్దరూ నడుచుకుంటూ
బయల్దేరారు. వేశ్యతో గడపడం విజయ్‌కి మొదటిసారి ఐనప్పటికీ ఈ విషయమై అతనిలో పెద్దగా
ఉద్విగ్నత లేదు. ఏ మాటలూ లేకుండా ఇద్దరూ నిశ్శబ్దంగా నడుస్తుండగా మల్లి అడిగింది 'పెళ్ళైందా?'
అని. విజయ్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఈ ప్రశ్నతో తను అతనిలో ఏదో బాధని తట్టిలేపానన్న
విషయం మల్లికి అర్థమైంది. మగాడిని సగటు ఆడదానికన్నా ఒక వేశ్య బాగా అర్థం చేసుకుంటుందేమో!.
ఇటు గతం మళ్ళీ గుప్పుమనేసరికి విజయ్ సిగరెట్ వెలిగించుకున్నాడు.


పెళ్ళికి ముందు ఏ గర్ల్‌ఫ్రెండూ లేని ఏవరేజ్ అబ్బాయి విజయ్. చదువు, అందం.. అన్నింటిలో ఏవరేజ్‌గా
ఉండే తనది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి కౌలు రైతుగా జీవితం ప్రారంభించి.. అతి కష్టం
మీద రెండెకరాల పొలానికి యజమాని అయ్యాడు. డిగ్రీ వరకు ఏ లక్ష్యం లేకుండా తిరిగినా, ఆ తర్వాత
మెల్లగా తండ్రి కష్టం అర్ధమయ్యేసరికి హైదరాబాద్ వచ్చి, నెట్‌వర్కింగ్ నేర్చుకొని, రెజ్యూములు పట్టుకొని
ఎన్నో వాక్-ఇన్‌లకి తిరిగి రెండు సంవత్సరాలు కష్టపడి ఎట్టకేలకు ఓ ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ రోజు
తండ్రి కళ్ళల్లో చూసిన ఆనందం విజయ్ ఎప్పటికీ మర్చిపోలేడు. ఉద్యోగం వచ్చి ముచ్చటగా
మూడేళ్లయ్యేసరికి బ్రహ్మాండమైన సంబంధం వచ్చిందంటూ నాన్న ఓ రోజు ఫోన్ చేసారు. ఊర్లో గొప్ప
ధనవంతుల కుటుంబం ఏరికోరి నిన్ను అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటున్నారని గెంతులేసారు నాన్న.
అమ్మ మాత్రం ఆనందంగానే కనపడినా లోలోపల ఏదో బెంగగా కనపడేది. మిడిల్‌క్లాస్ మనుషులు
అదృష్ట లక్ష్మిని కూడా అనుమానంతో చూస్తారని భార్యని చూసి విజయ్ తండ్రి ఎగతాళి చేసేవాడు. ఎన్నో
ఊహలు, ఊహలకందని పెళ్ళి హడావుడి, సందిగ్ధతల మధ్య విజయ్ అనూష మెడలో మూడు ముళ్ళు
వేసాడు. 


పెళ్ళి సెలవులు అయిపోయాక విజయ్‌ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అనూషతో కలిసి కాపురం పెట్టడానికి
సింగిల్ బెడ్‌రూం అద్దె ఇంటి కోసం చూస్తుంటే మామగారి నుంచి ఫోను - తన కూతురు ఉండడానికి కనీసం
డబుల్ బెడ్‌రూం ఇల్లు కావాలని. సరేనని డబుల్ బెడ్‌రూం తీసుకున్నాక ఇంటికి కావాల్సిన ఫర్నిచర్,
ఇతర సామాన్లు కొనడానికి విజయ్ మామయ్య హైదరాబాద్ వచ్చాడు. ప్రతీ వస్తువు ఎంపిక అతనిదే. పక్కనే
విజయ్ ఉన్నా అతనిది ప్రేక్షక పాత్రే అయ్యింది. తన అసంతృప్తిని రాత్రి అనూషతో ఫోన్‌లో మాట్లాడుతూ
వ్యక్తపరిస్తే- "ఎలాంటి వస్తువులు కావాలో మా నాన్న కన్నా నీకు బాగా తెలుస్తుందా ఏంటి?.." అంటూ
సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఆమె మాటల్లో తనపట్ల తొంగిచూసే చులకనభావం చివుక్కుమనిపించేది.


చివరికొచ్చిన సిగరెట్ నిప్పు చేతివేళ్ళకి చురుక్కుమని తగిలేసరికి గత జ్ఞాపకాల నుంచి బయటకు
వచ్చాడు విజయ్. మెరుపుకలలు సినిమాలోని "అపరంజి మదనుడే అనువైన సఖుడులే..." పాటను
చిన్నగా పాడుకుంటూ తన పక్కగా నడుస్తోంది మల్లి. సిగరెట్ పీకని కింద పడేస్తూ ‘నీకు పెళ్ళైందా?..’
అనడిగాడు విజయ్. మరుక్షణమే తనని ఈ ప్రశ్న అడగడం ఎందుకో స్టుపిడ్‌గా అనిపించింది అతనికి.
"14 ఏళ్ళకే పెళ్ళి చేసుకున్నా- జీసస్‌ని." అని బదులిచ్చింది మల్లి. ఆమె జీవితం గురించి
తెలుసుకోవాలని ఆతనికేమాత్రం ఆసక్తి లేదు. మల్లి నడుస్తూ రోడ్డు పక్కన పెరిగిన మొక్కల
ఆకులపైనున్న మంచుని చూపుడువేలితో నిమురుతోంది. రోడ్డు పక్కన అప్పుడప్పుడు పలకరిస్తున్న
పారిజాతం చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ సువాసనని ఆస్వాదిస్తున్నట్టుగా ఆమె నడక మందగిస్తోంది.
ఏదో అటెన్షన్ కోసం చేస్తున్న పనుల్లా లేవవి. ఆమె చాలా గుంభనంగా ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఒక
వేశ్యలో ఇంత సున్నితత్వం ఉంటుందా అని అనుమానం రాకపోదు. 


మల్లిని ఎవరూ వేశ్య వృత్తిలోకి బలవంతంగా దింపలేదు. చిన్నప్పటినుంచీ ఆమె అలాంటి
వాతావరణంలోనే పెరిగింది. తన తల్లిది అదే వృత్తి. తండ్రెవరో తెలియదు. ఇరుగు పొరుగు గుడిసెల్లో
కూడా అదే వృత్తి. చిన్నప్పటినుంచి ప్రేమరాహిత్యమే కాదు శారీరక హింస కూడా ఆమెకి దైనందిన
విషయమే. ఐతే ఇలాంటి ప్రపంచాన్ని ద్వేషించకుండా ప్రేమించేలా చేసింది - అక్కడకి దగ్గర్లో వెలిసిన
చర్చి. పాపులని కూడా ప్రేమించే ఏసయ్య అంటే ఆమెకి చిన్నతనం నుంచి అత్యంత భక్తి, ఇష్టం
కూడానూ. ఆకలితో గడప ముందు బిచ్చమెత్తే బిచ్చగాడు, కామంతో గడప తొక్కే విటుడు ఒక్కలాగే
కనపడతారు ఆమెకి. రోజూ చేసే దైవప్రార్ధన ఆమెలో విశ్వజనీన ప్రేమని నింపుతుంది. తనలో నిండుగా
ఉన్న ప్రేమని విటులకి పంచుతుంది. అందుకే ఆమె దగ్గరకి వచ్చేవారికి శారీరక తృప్తికి మించినదేదో
దొరుకుతుంది. సాటి వేశ్యలు కూడా కష్టమొస్తే మొదట తలచుకునేది మల్లినే.


ఇద్దరూ మల్లి ఇంటిని చేరుకొని లోపలికి అడుగుపెట్టారు. సిమెంట్ వెయ్యని ఇటుక గోడలపై రంగులతో
గీసిన ముగ్గులు ఆ ఇంటికి ప్రత్యేకతని తీసుకొచ్చాయి. అక్కడక్కడ గోడలకి మేకులు కొట్టిన జీసస్
పటాలు ఏ మాత్రం దుమ్ము లేకుండా శుభ్రంగా ఉన్నాయి. నేల మీద చిన్న బొంతపై 10 నెలల వయసున్న
మల్లి కొడుకు పడుకొని ఉన్నాడు. పక్కన ఒక నులకమంచం ఉంది. లోపలికి వచ్చిన వెంటనే మల్లి
పడుకున్న బాబుని చేరుకొని, ముఖాన్ని నిమిరి, బాబు కప్పుకున్న దుప్పటిని సరిచేసింది. విజయ్‌కి ఇవేమీ
పట్టట్లేదు. అనూష ఆలోచనల్లోనే ఉన్నాడు. ద్వేషం అనే దెయ్యం పూనిన మనిషిలా ఉన్నాడు. ప్రతీ
స్త్రీలో అతనికి అనూషనే కనపడుతోంది. మల్లిని నులకమంచం మీద పడేసి, ఆబగా ఆమెపైకి వచ్చాడు.
మల్లి ముఖానికి దగ్గరగా విజయ్ ముఖం రాగానే ఆమె కొప్పులోంచి గుప్పుమన్న సంపంగి వాసన అతన్ని
సోకింది. ఒకప్పుడు సంపెంగలు తురుముకున్న అమ్మాయి కురుల్లో తన ముఖాన్ని దాచేసుకోవాలని
ఊహించుకునేవాడు విజయ్. సంపెంగ వాసనంటే అతనికి ఇష్టం. పెళ్ళయ్యాక ఓసారి సంపెంగలు
తెచ్చి అనూషకిస్తే, 'నువ్వు అసలు సిటీలోనే ఉంటున్నావా?.. పల్లెటూరి దద్దమ్మలా పువ్వులు
పెట్టుకోమంటావేంటి?.. నాకసలే తలనొప్పి” అని పక్కన పడేసింది. దానికి తోడు వాళ్లమ్మకి ఫోన్ చేసి
ఈ విషయాన్ని వెటకారంగా చెప్పడం విజయ్ మనసుని మరింత చివుక్కుమనేలా చేసింది. 'అప్పుడే
లాగి రెండు కొట్టాల్సింది' అనుకున్నాడు. మల్లి భుజాలపై పడిన అతని చేతులు గట్టిగా
బిగుసుకున్నాయి. పెళ్ళి గురించి ఎన్నో కలలు కన్నాడు విజయ్. రోజూ ఆఫీసు నుంచి వచ్చేసరికి
భార్య తనకోసం వేచి చూస్తూ ఉండాలని అనుకునేవాడు. ఐతే అనూష ఆ టైమ్‌కి ఫోన్‌లో మాట్లాడుతూ
తను వచ్చాడని ఏ మాత్రం పట్టించుకోకుండా మెసిలేది. పైగా తన కుటుంబం అంటే అనూషకి, వాళ్లింట్లో
వాళ్లకి ఒక వేళాకోళం ఆడుకునే విషయం. 'ఒసేయ్.. మీ అత్త ఈరోజు ఎలాంటి చీర కట్టుకుందో తెలుసా?..'
అని అటు అత్త మాట్లాడుతుంటే.. 'మీ అల్లుడికి ఈరోజు పళ్ళు తెమ్మంటే ఏం తెచ్చారో తెలుసా..
జామకాయలు.. బీద బతుకులు.'  అంటూ ఇటు భార్య పగలబడి నవ్వుతుంటే విజయ్‌కి కోపం నషాళానికి
ఎక్కేది. అమ్మ అప్పుడు ఎందుకు కొంచం బెంగగా ఉండేదో తెలిసివచ్చింది అతనికి. విజయ్ తాను ఆఫీసు
పని చేసి వస్తే, తన భార్య వంట చెయ్యాలని ఊహించాడు. కానీ అనూష తనకి వంట రాదంది.
అత్తగారేమో వంటమనిషిని పెట్టుకోమని సలహా ఇచ్చారు. వంటమనిషి రాని రోజు విజయ్‌నే వంట చేసి
ఆఫీసుకి వెళ్లేవాడు. అనూష కనీసం ఇంటిని శుభ్రం కూడా చేసేది కాదు. ఇద్దరిమధ్యా అప్పుడప్పుడు
మాటామాటా పెరిగేది. అనూష వాళ్లింట్లో వాళ్లకి చెప్పి సపోర్ట్ తెచ్చుకునేది. ఇలాంటివి చెబ్తే తన
ఇంట్లోవాళ్లు బాధపడతారని విజయ్ సైలెంట్‌గా ఉండేవాడు. ఒకసారి ఇలానే పనిమనిషి రాకపోతే
విజయ్ ఇల్లు శుభ్రం చేసి, వంట చేసాడు. ఆ తర్వాత ఇద్దరూ తిని గిన్నెలు ఎత్తి సింక్‌లో వేసారు. ఐతే
అనూష తాను తింటున్నప్పుడు పడిన ఎంగిలి మెతుకులని అలానే వదిలేసింది. 'తిన్నాక ఎంగిలి
తియ్యడం తెలియదా?.. మా అమ్మని చూడు ఇల్లు ఎంత నీట్‌గా ఉంచుకుంటుందో' అని అనూషపై
కాస్త చికాకు పడ్డాడు. అనూష వెంటనే 'ఐతే మీ అమ్మతోనే కాపురం చేసుకోవాల్సింది. అలాంటి ముష్టి
ముఖమే నీకు కరెక్ట్.' అని సమాధానమిచ్చింది. ఈ మాటలకి తట్టుకోలేక 'ఏం మాట్లాడుతున్నావసలు?'
అంటూ ఆమె ముఖంపై కొట్టలేక భుజం పై ఒకటిచ్చాడు. అంతే.. అనూష వెంటనే పుట్టింటికి ఫోన్
చేసింది. వాళ్ల నాన్న కారులో వచ్చి అనూషని తీసుకెళ్లాడు. తరువాతి రోజు విజయ్‌కి తన ఊరి ఎస్సై
నుంచి ఫోన్ వచ్చింది. ఊరికెళ్లి డైరెక్ట్‌గా స్టేషన్‌కి వెళ్తే, అక్కడి సెల్‌లో తన తల్లిదండ్రులని చూసిన
విజయ్‌కి దుఃఖమాగలేదు. తనని కూడా వేరొక సెల్‌లో వేసారు. 'గృహహింస చట్టం కింద కేసు వేసారు.
ఆధారాలు అవసరం లేదు. బెయిల్‌కి ప్రయత్నించకండి. ఇది నాన్‌బెయిలబుల్ కేసు.' అని పోలీసులు
తెలిపారు. మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నించి నచ్చచెప్పడంతో అనూష తండ్రి కేసు వాపస్
తీసుకున్నాడు. రెండ్రోజుల తర్వాత విజయ్, అతని తల్లిదండ్రులు జైలు నుంచి బయటకి వచ్చారు.
ఊర్లో అందరూ జైలు కెళ్లి వచ్చాక వారిని ప్రత్యేకంగా చూసేవారు. విజయ్ అత్తమామలు కట్నం డబ్బులు
వెనక్కి తీసుకొన్నాక పెద్దల సమక్షంలో ఇరువర్గాలు సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. అది
జరిగిన మరుసటి రోజు విజయ్ తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇటు పోలీస్ కేసులో
ఉన్నాడన్న కారణంగా విజయ్ ఉద్యోగం కూడా పోయింది. ఈ పరిణామాల్ని తట్టుకోలేని విజయ్
ఎవరితోనూ మాట్లాడకుండా మూగవాడిలా మారిపోయాడు. నాన్న కార్యక్రమాలు అయ్యాక విజయ్
ఉద్యోగం వెతుక్కోవడానికి హైదరాబాద్ బయలుదేరుతుంటే వాళ్ళమ్మ ఏడుస్తూ "ఒక నాల్రోజులు
ఉండరా కన్నా!" అని అడిగింది. విజయ్ సమాధానమివ్వకుండా బయల్దేరాడు. ఐతే రాన్రాను
అతనిలోని దుఃఖం ద్వేషంగా మారింది. ఇంతలో అనూషకి మరో పెళ్లి చేస్తున్నారన్న వార్త అతన్ని
దహించివేసింది. ప్రస్తుతం ఇవే ఆలోచనలు విజయ్ బుర్రలో తిరుగుతూ ఆ కోపం మల్లి దేహంపై
నఖక్షతాలై ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో మల్లి కొడుకు ఏడుపు అతని ఉన్మాదానికి కళ్లెం వేసింది. 


'బాబు పాల కోసం ఏడుస్తున్నాడు. ఐదు నిమిషాల్లో పాలిచ్చి వస్తాను.' అని అడిగింది. విజయ్
అన్యమనస్కంగా అంగీకరించినట్టు సైగ చేసాడు. మల్లి ఒక్క ఉదుటున బాబు దగ్గరకు వెళ్లి, లాలిస్తూ
చనుబాలు పడుతోంది. పిల్లాడు ఆత్రంగా తల్లిరొమ్ముని అందుకోవడాన్ని చూస్తున్నాడు విజయ్. పిల్లాడి
ఎడమ భుజంపై పెద్ద పుట్టుమచ్చ - తనకులాగే. 'తను కూడా చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఇలానే పాలు
తాగేవాడా?' అన్న ఆలోచన వచ్చింది విజయ్‌కి. మరుక్షణం ఒక స్ఫురణ పిడుగులా ఫెటీల్మని అతన్ని
తాకి నిరుత్తరుడిని చేసింది -.విజయ్‌కి తన తల్లి గుర్తొచ్చింది. నాన్న చనిపోయినప్పటి నుంచి అమ్మ
ఎలా ఉందో కూడా చూడలేదన్న నిజం చెంప ఛెల్లుమన్నట్టుగా తగిలింది. తండ్రి పోయినందుకే తనింత
బాధపడుతుంటే, భర్తని కోల్పోయినందుకు అమ్మ ఎంత బాధపడిఉంటుందో అని ఆలోచిస్తున్న విజయ్
కళ్ళల్లో కన్నీరు ఆగట్లేదు. అమ్మని కనీసం ఓదార్చను కూడా లేదు అన్న పశ్చాత్తాపం అమాంతం పెరిగి
వెక్కి, వెక్కి ఏడుస్తున్నాడు. ఎప్పుడూ తన కోసం ఏమీ అడగని అమ్మ 'ఒక నాల్రోజులు ఉండరా కన్నా'
అని అడిగిందంటే ఆమె శోకంలో ఎంత బేలగా ఉందో అన్న్ ఊహకి అతని గుండె తరుక్కుపోతోంది.
పరిసరాల్ని మరిచిపోయి ఏడుస్తూ ఎదురుగా తన తల్లి ఉన్నట్లుగా భావించి తల కొట్టుకుంటూ
క్షమాపణలు అడుగుతున్నాడు. అనూష పట్ల ద్వేషం కన్నతల్లినే మరిచిన కిరాతకుడిగా తనని
మార్చిందా అని కలత చెందాడు.


ఏడుస్తున్న విజయ్‌ని చూస్తూ మల్లి కళ్ళు కూడా వర్షించాయి. విజయ్ ఏడుస్తున్న తన బిడ్డలా
కనిపించాడామెకు. 'ఇలా రా, కన్నా!..' అంటూ మల్లి పిలిచేసరికి విజయ్ అప్రయత్నంగా ఆమె ఒడిని
చేరుకున్నాడు. ఆమె ఒడి.. అమాంతం అతన్ని దూదిపింజని చేసింది. అనంతమైన ప్రేమ కెరటం
తటాలున తనలో గూడుకట్టుకున్న క్రోధాన్ని కూల్చేసిన అనుభూతి.  తండ్రి చనిపోయినప్పటినుంచి
ఘనీభవించిన బాధ విజయ్‌ని వరదలా ముంచెత్తింది. ఏడుస్తూ ఏడుస్తూ అతని కళ్ళు ఆమె లాలి
పాటకి క్రమంగా నిద్రలోకి జారుకున్నాయి. మల్లి ఒడిలో ఉన్న ఇద్దరు బిడ్డలూ నిద్రలోకి జారుకున్నారు.
తల్లిపాలు తాగి ఒకరు.. ద్వేషం ద్రవించి మరొకరు.


తెల్లవారకముందే తెలివొచ్చిన విజయ్ లేచి, తన బ్యాగ్ సర్దుకున్నాడు. మల్లి కాళ్లకి నమస్కరించి, మల్లి
కొడుకుని ముద్దాడి అక్కడి నుంచి నిష్క్రమించాడు. దూరంగా కార్తీకమాసం సందర్భంగా కోవెల చుట్టూ
దీపాలు వెలుగుతున్నాయి. దారిలో కనపడిన చెత్తకుప్పలో బ్యాగ్‌లోని యాసిడ్ బ్యాటిల్‌ని తీసి
అందులోని యాసిడ్‌ని పారవేసాడు. సిగరెట్ వెలిగించుకుందామని నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల
వెలిగించాడు. మరుక్షణం ఎందుకో సిగరెట్ కాల్చబుద్ధి కాలేదు. వెలుగుతున్న అగ్గిపుల్లని చెత్తకుప్పపై
పడేసాడు. అక్కడున్న యాసిడ్‌కి నిప్పు అంటుకొని చెత్తకుప్ప శివాలయంలోని అఖండజ్యోతిలా
వెలిగింది.


విజయ్ బస్టాండ్ వైపుకి అడుగులు వేసాడు - అమ్మని చేరుకోవడానికి. ఆమెకి అండగా ఉండడానికి.


P.S: గృహహింస నిరోధక చట్టం వల్ల లబ్ధి పొందినవారు చాలామంది ఉండి ఉంటారు. అలాగే
అన్యాయమైన వారు కూడా కొందరున్నారు. అన్యాయమైన వారికి ఓదార్పునిచ్చే ఒక్క హృదయమున్నా
ఈ సమాజాన్ని క్షమించేయొచ్చు. అలాంటి హృదయం దేవాలయమే!.. అది వేశ్యదైనా సరే. 2005లో
వచ్చిన ఈ  గృహహింస నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందని గ్రహించిన ప్రభుత్వం 14 ఏళ్ల
తర్వాత ఈ మధ్యనే దానికి సవరణలు చేసింది. 

Comments

Anonymous said…
simply superb...
--sree
Thank you, Sree garu!.