Wednesday, August 9, 2017

ప్రియమైన అక్కకి..

ప్రియమైన అక్కకి..

ఎన్నో ఏళ్లు.. అలల్లా ఎప్పుడొచ్చి వెళ్లిపోయాయో!..
కాలంతో పాటు.. మన మధ్య దూరం కూడా చాలా సహజంగా ఎదిగింది.

చిన్నప్పుడు నువ్వంటే కోపం..

ఎప్పుడూ చదువుకోవాలని.. ఆటలొద్దని.. తిట్టేదానివి.
మనది పెద్ద కుటుంబం కావడంతో.. చిన్నప్పుడే నువ్వు బాధ్యతల్ని తీసేసుకొని.. నీ బాల్యాన్ని మా అందరి కోసం త్యాగం చేసావేమో!..

నేనెప్పుడూ నిన్ను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చూడలేదు.

ఇప్పుడొక బిడ్డకు తండ్రిగా అలా ఉండడమెంత కష్టమో అర్థమౌతోంది.

ఇప్పుడు నీ ప్రపంచం - నీ ఇల్లు, నా ప్రపంచం - నా ఇల్లు ఐపోయాయి గానీ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జీతమంతా మా అవసరాలకే ఖర్చు పెట్టిన రోజులు నా మదిలో నిక్షిప్తంగా ఉన్నాయి.

అలాంటి సందర్భాల ప్రేరణతో 'నాకు ఉద్యోగమొచ్చాక మా అక్కని బాగా చూసుకోవాలి ' అన్న ఆలోచన హైస్కూలు రోజుల్లోనే నాలో మొలకెత్తింది. ఐతే నేనూ అందరిలాంటి తమ్ముడిని ఐపోతానని అప్పుడు అస్సలు ఊహించలేదు.

ఇంజనీరింగ్ అయ్యాక కూడా బాగా సంపాదించి నీకు, నీ కుటుంబానికి ఏదో చెయ్యాలని చాలా అనుకునేవాడిని. ఆ దిశగా కొన్ని అడుగులు పడ్డాయి కూడా.

ఐతే చదువయ్యి, ఉద్యోగజీవితంలోకి వచ్చాక మనసుకి, చేస్తున్న పనికి, నా ఊహలకి పొంతన కుదరక.. కొన్ని తొందరపాటు నిర్ణయాలతో కెరీర్ అస్తవ్యస్తమయ్యింది. నీకేమీ చెయ్యలేకపోయాను. కానీ అంతకుమించిన మరొక బాధ ఈ మధ్యనే కొత్తగా కలుగుతోంది - మనిద్దరికంటూ చక్కని జ్ఞాపకాలు, భావోద్వేగ క్షణాలు ఎక్కువ లేవని.

ఇంట్లో మనమెప్పుడూ ఒకరితో ఒకరం మనసు పంచుకొనే సమయం ఉండేదే కాదు. మన మధ్యతరగతి కుటుంబాల్లో "చదువు.. చదువు.." అనుకుంటూ మన చుట్టూ జైళ్ళని తయారుచేసుకుంటామేమో. రోజూ అందరం కలిసి ఒక అరగంట మాట్లాడుకోవడం ఉండదు.. ఆటపాటలుండవు.. విహారయాత్రలుండవు.

వెనక్కి చూసుకుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది - కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడే నీతోగానీ మనసుకి నచ్చిన ఇంకెవరితోనైనా గానీ నా భావాలు స్వేచ్చగా పంచుకోగలిగితే ఇలా అయ్యేది కాదేమో!..

నాలాగే నీకూ అలాంటి భావనలు మనసు లోతుల్లో ఉండిపోయాయేమో నాకు తెలియదు.. తెలుసుకోవాలన్నది నా అభిమతం.

నాకిప్పుడనిపిస్తోంది - చదువు, డబ్బు కన్నా ముఖ్యమైనవి అందమైన క్షణాలని. వెనక్కి తిరిగి చూసుకుంటే మన మధ్య అలాంటి క్షణాలు చాలా తక్కువ. మార్కులతో సంబంధం లేకుండా బాగా స్థిరపడినవారున్నారు. డబ్బుతో సంబంధం లేకుండా ఆనందంగా ఉన్నవారున్నారు. డబ్బు, చదువు ఉన్నా.. నెమరువేసుకోవడానికి కొన్నైనా అందమైన జ్ఞాపకాలు లేని జీవితం జీవితమేనా?..

ఇప్పుడివన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మన ముందు తరం కోసం. నా మేనళ్లుడు, మేనకోడళ్లని, నా పిల్లలని పెంచేటప్పుడు ఇవి దృష్టిలో మనం ఉంచుకోవాలని.

ఇప్పుడు నీలో ఈ దిశగా మార్పు వస్తుందో రాదో తెలియదు. నువ్వింకా సమాజం నిర్దేశించిన చట్రంలోనే కూరుకుపోతున్నావనిపిస్తోంది. నీ కొడుకు, కూతుళ్లని గొప్ప స్థితిలో చూడాలన్న తాపత్రయంతో వాళ్ల మనసుల్ని కష్టపెడుతున్నావేమో అనిపిస్తోంది. పిల్లలే ప్రపంచంగా చేసుకొని, నీ కోసం నువ్వు బతకడం మానేసావేమో అనిపిస్తోంది. చిన్నప్పుడు నీ చెల్లెళ్లు, తమ్ముడి కోసం నీ బాల్యం.. ఇప్పుడు నీ పిల్లల కోసం మిగిలిన జీవితాన్నీ త్యాగం చేసేస్తున్నావని నాలో ఒక అపరాధ భావన.

వారానికొక ఫోన్‌కాల్ - ఇదీ మన మధ్య ఇప్పుడున్న బంధం.

ఏదైనా కష్టమొస్తే వెంటనే నువ్వు గుర్తురావు. అప్పటికప్పుడు ఎవరితోనో పంచుకున్నా, నీతో పంచుకుంటే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది. ఫలానా వ్యక్తికి ఎందుకు చెప్పుకున్నానా అన్న లెక్కలు, తూకాలు నీ దగ్గర వేసుకోనవసరం లేదు.

రక్తసంబంధం గొప్పతనమే అది కదా!.

ఎక్కడో మూలనున్న ఫోటో ఫ్రేములా మారిపోయిన మన బంధాన్ని మళ్లీ ముంగిట్లోకి.. వర్తమానపు క్షణాల్లోకి తెచ్చుకోవాలన్నది నా ఆశ. కాలాలు మారినా అప్పటి నువ్వు-నేను ఇప్పటికీ అలానే ఉన్నామని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకొని, పలకరించుకుందాం.

చివరిగా మన బంధానికి మరికొన్ని అందమైన క్షణాలని అద్దుకుందాము.

ఇవన్నీ ఆచరణలో జరుగుతాయో, జరగవో కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాఅక్కా - "నాకు మన బంధమెంతో విలువైనది".

ఇంక ఉంటాను.

ఇట్లు,
నీ తమ్ముడు.