ఆమెకి బాల్యంలో కోపిష్టి ఐన తండ్రంటే భయం.
ఏడేళ్ళకే పక్కింటి అన్నయ్య ఎవరూ లేనప్పుడు ఆబగా తడిమేస్తుంటే.. ఆ నిస్సహాయత.. ఆమెకి
పరిస్థితులపై పోరాడే స్ఫూర్తిని చంపేసింది.
17 ఏళ్లకి ఇంటిలో దొరకని ప్రేమని, ప్రేమపై అందమైన భాష్యాలు చెప్పే కాలేజి లెక్చరర్‌లో
వెతుక్కుంది. ఆమె ఇచ్చిన తొలిముద్దుని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసేసరికి హతాశురాలైంది. ఆమె
ఊహించుకున్న అందమైన ప్రపంచం ముక్కలైపోయింది. చనిపోదామనుకున్నా చావుకన్నా
భయంకరమైన మానసికవేదనే తనకి సరైన శిక్ష అనుకుంది. అసలు తన జీవితానికి సంబంధించి
ఎలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యమూ ఆమెలో లేదు.. అది ఆత్మహత్యైనా సరే.
21 ఏళ్లకి ఇంట్లో వాళ్లు పెళ్ళిచేసేసారు. అప్పట్నించి రాత్రైతే నరకం. మనసుని తాకని భర్త తనువుని
తాకుతుంటే ఏ స్పందనా కలిగేది కాదు. విసిగిపోయిన భర్త ఒకరోజు తన లవర్‌ని తన బెడ్‌రూమ్‌కి
తెప్పించుకొని 'ఈమెని చూసి నేర్చుకో.. మగాడ్ని ఎలా సుఖపెట్టాలో' అంటూ రెచ్చిపోయాడు. 'వీడియో
తీసుకొని మరీ చూసి తెలుసుకో' అన్నాడు. ఆమె వీడియో తీసింది. తరువాతిరోజు నుంచీ ప్రతీ రాత్రి
ఒకటే పోరు - 'ఆ వీడియోలోని అమ్మాయిలా స్పందించాలి' అంటూ. ఓరోజు విసిగెత్తి 'ఇలా వేధిస్తే ఆ
వీడియోని మీ వాట్సప్ గ్రూప్‌లో పెడతాను' అని బెదిరిస్తుంది. ఏదో ఆవేశంగా నోరుజారానా అని
అనుకునేలోపు భర్త కళ్ళలో ఆమె చూసిన 'భయం'.. ఆమె జీవితంలోని అత్యంత అద్భుతమైన క్షణంలా
అనిపించింది. నిస్పృహ, నిర్లిప్తతలతో గడిచిపోతున్న తన బతుకులోకి ఆ భయం ఒక మెరుపులాంటి
ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకూ పనిచెయ్యని మెదడు పాదరసంలా పనిచేసి ఆ వీడియోని
ఫోన్‌లోనే కాకుండా చాలా బ్యాకప్‌లు కూడా తీసుకుంది. రోజూ మొగుడు కనపడితే వీడియోని షేర్
చేస్తానని బెదిరించడం, మొగుడు భయపడుతుంటే తెలియని ఆనందాన్ని పొందడం.. ఆమెకి తన
జీవిత లక్ష్యం అర్ధమైంది.
తేనె మాటలు నేర్చుకుంది. మెళ్లగా ఒక ఉద్యోగం వెతుక్కుంది - ఉమన్స్ కాలేజిలో అటెండర్‌గా. మగ
కొలీగ్స్‌తో ఎంతో తీయగా మాట్లాడే ఆమెకి నిజానికి మగాళ్లంటే అసహ్యం. మగాళ్లతో సరదాగా తిరిగే
అమ్మాయిలన్నా అసహ్యం. పద్ధతిగా, అబ్బాయిలకి దూరంగా ఉండే అమ్మాయిలని డిస్టర్బ్ చెయ్యదు.
విలాసాలు కావాలనుకునే అమ్మాయిలకి వలవేస్తుంది. ఆడాళ్లంటే చొంగకార్చుకునే తన కొలీగ్స్ పక్కల్లోకి
పంపిస్తుంది - రహస్య కేమెరాలతో. ఆ తర్వాత వాళ్లని బ్లాక్‌మెయిల్ చేస్తుంటే ఆ ప్రాసెస్ ఆమెకెంత
ఇష్టమో!!. కాళ్ళబేరానికి వచ్చిన మగాడి రెండు తొడలపై తన పేరుని పచ్చబొట్టు పొడిపిస్తుంది -
"యమున".
Comments
==Sree