Skip to main content
భావుకతా !...

నా అభౌతిక ప్రపంచం లోకి నువ్వు అనుకోని అతిధివి.
నీ స్పర్శ తో భావస్పందన లేని నా మనసు శిల సరససామ్రాజ్ని మోహిని గా మారింది.
ఇప్పుడు తనకి ఎంతటి సున్నితత్వము, ఎన్ని కేరింతలు, ఏమి లావణ్యము!...

నీ కళ్ళతో ఆ అమ్మాయిని చూశాను. తను నవ్వింది.
నువ్వు నా హృదయతంత్రి ని మీటావు.నా గుండె రాగాలు పలికింది.
స్నేహం విత్తు మొక్క అయ్యింది. ఆ మొక్కకి 'ప్రేమ' అనే భావం మొగ్గ తొడిగింది.
తన స్పర్శ కి నువ్వు అర్థాలు చెప్పావు.
పెదవుల ఆట గురించి అడిగితే 'తనకు నువ్వంటే పిచ్చి ఇష్టం' అన్నావు.
కౌగిలి దిగ్బంధనాన్ని 'నువ్వు లేకుండా నేనుండలేను' అని తర్జుమా చెప్పావు.
ప్రేమ నా హృదయగిరిని దట్టమైన మేఘంలా కమ్మేసింది.
ఆ అనుభూతి వర్షంలో నేను తడిసి ముద్దయ్యాను.

కొన్నాళ్ళకి కాలం నా వెర్రితనాన్ని ఆవిష్కరించింది.
'Be spontaneous yaar' అంటూ తను నన్ను విడిచిపోయింది.
నా పల్లెటూరి ప్రేమని తన పట్నం ప్రేమ ఎగతాళి చేసిపోయింది.
మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను మోసం చేశావు. భయంకరంగా దెబ్బ తీశావు.
కక్షతో నిన్ను నా మనసు నుంచి వెలివేద్డామనుకున్నాను.
కానీ నువ్వు దుఖంలో కూడా దాగివున్న అందాన్ని చూపించావు.
నేను మరింత పరిణితి పొందాను.
నిన్ను మరింతగా గుండెలకి హత్తుకున్నాను.

Comments

ఓపెనింగ్ బావుంది. ఆ రెండు లైన్ల తరవాత అంతా క్లిషే.
This comment has been removed by the author.