నా ఇంట్లో ఆ రూముని నేనెప్పుడూ తెరవలేదు. ఆ రూము నుంచి ఎప్పుడూ ఏవో ఏడుపులు, మూలుగులు, అరుపులు వంటి భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రూమన్నా, అందులో ఉండే ఆ పిచ్చిదన్నా నాకు చాలా భయం. అసలు నా ఇంటిని నేను పెద్దగా పట్టించుకోను. ఇంట్లో మిగిలినవారి గురించి, ఆ రూము గురించి చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందేమో.. తెలిస్తే వారేమనుకుంటారో.. అని ఎప్పుడూ ఇంటికి తాళం వేసి బయటనే తిరుగుతా. కానీ ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగు వచ్చేస్తుంటుంది. నాకు నేనే డొల్లగా కనపడతా.. ఏదో వేషం వేసుకున్నట్లు. ఆ రూములో పిచ్చిది ఎందుకో నన్ను కలవడానికి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ నేను ఆ రూము తలుపు తీయనుగా. నేను స్పృహలో ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా తను రాలేదు. అందుకే నేను నిద్రలోకి జారినప్పుడు తను వస్తుంది- ఓ పీడకలలా. ఇంటిలో ఓ చిన్నమ్మాయి కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. దానికీ, వరండాలో కూర్చొని ప్రపంచాన్ని చూసే బామ్మకి అస్సలు పడదు. కానీ ఆ చిన్నమ్మాయి అంటే నాకు భలే ఇష్టం. దానితో ఉంటే నాకూ పిల్లచేష్టలు వచ్చేస్తాయి. మళ్ళీ పదిమందీ నన్ను చూసి నవ్వుతారేమోనని భయం. అందుకే ఎవాయిడ్ చేస్తా. మరొక రూములో లంగా- వోణీ, తలలో పూలు, వాలు జడ, పట్టీల...