Skip to main content

అమ్మకి పూలు పూచాయి

సాక్షి దినపత్రిక వారి ఆదివారం అనుబంధం- 'ఫన్ డే' లో ప్రచురించబడిన నా కధ 'అమ్మకు పూలు పూచాయి ' పూర్తి భాగాన్ని దిగువున చదువగలరు..

అమ్మకి పూలు పూచాయి
అలా ఉండకూడదనుకున్నా నాలో ఎందుకో అసహనం, కోపం వచ్చేస్తున్నాయి. నేను గొప్పగా భావించుకున్న నా ఆదర్శం నన్నిపుడు వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. 'బాలు' ని ఇంటికి తీసుకువచ్చి మూడు రోజులవుతుంది. మేం వాడిని దత్తత తీసుకున్నాం. ఒక బిడ్డని కని, దేశజనాభాని ఒకటి హెచ్చించి, వాడిని పెంచడం కన్నా ఏ ప్రేమకూ నోచుకోని ఒక అనాధకి తల్లిదండ్రులవ్వడం మంచి ఆదర్శమని మా అభిప్రాయం. మా ఇద్దరి అభిప్రాయం అని చెప్పడం కన్నా నా అభిప్రాయమని చెప్పడమే కరెక్టేమో. ఎందుకంటే ఈ విషయమై నా భార్య ప్రణవికి సంవత్సరకాలంగా నచ్చజెప్పుతూ చివరికి ఒప్పించాను. తనకి ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ నా మీదున్న గౌరవం దానిని కప్పేసిందనుకుంటా. అనాధాశ్రమానికి వెళ్లి, బాలు ని చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకొచ్చాం గానీ వాడు అప్పటినుంచి మాతో సరిగా కలవట్లేదు. ముభావంగా ఉంటున్నాడు. ప్రణవి తన వంతుగా మంచి వంటలు, బొమ్మలతో వాడిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం కనపడట్లేదు. మేము ముందే వాడికోసం 'టాం అండ్ జెర్రీ' వాల్ పెయింటింగ్స్ తోనూ, ఆటబొమ్మలు, డ్రాయింగ్ సామాగ్రి వగైరా వాటితో ఒక చిన్న రూం ని సిద్ధం చేసాం. కానీ మా ప్రయత్నాలలో వేటిని కూడా బాలు అప్రీషియేట్ చెయ్యట్లేదు. ఈరోజు ఉదయం ప్రణవి 'గులాబ్ జాం' ని తయారుచేసి బాలు దగ్గరకి వచ్చి స్పూన్ తో వాడి నోట్లో పెడదామని ప్రయత్నిస్తే వాడు తన చేతిని ఆపి మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రణవి నావైపు అదోలా చూసి లోపలికి వెళ్లిపోయింది. ఆఫీషుకి వెళ్లినా ఆ చూపు నా ఆలోచనల్ని వీడలేదు. నన్ను ప్రశ్నిస్తునే ఉంది. నవమాసాలు గర్భంలో మోసి కనడంలోని మాతృత్వపు మధుర్యాన్ని తనకి దూరం చేసానన్న అపరాధభావం నన్ను అప్పటికే వేధిస్తూ ఉంది. దానికితోడు బాలు తనకి దగ్గరకాకపోవడం మరింత అసౌకర్యంగా ఉంది. అనాధపిల్లాడిని దత్తత తీసుకుంటామన్న మా నిర్ణయాన్ని బంధుమిత్రులు ఎంతగానో అభినందించారు. పైగా వాడికోసం మేం ముందే బొమ్మలు, కధల పుస్తకాలు వంటివి కొనడం; ఇద్దరం చైల్డ్ సైకాలజీకి సంబంధించిన పుస్తకాలని చదవడం వంటివి చూసి అందరూ మా ఆదర్శానికి ఆశ్చర్యపోయేవారు. వీటన్నింటితో వచ్చే పిల్లాడు కూడా మా ప్రేమకు ఇట్టే కరిగిపోతాడన్న ధీమా, ఒకవిధమైన గర్వం నాలో వచ్చేసాయేమో. నా కొండంత గర్వాన్ని ఒక చిన్నపిల్లాడు తన ప్రవర్తనతో పటాపంచలు చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పనిమీద దృష్టి నిలవకపోవడంతో లీవ్ తీసుకొని కారెక్కి రోడ్డు మీద పడ్డాను. ఎక్కడకి వెళ్లాలని ఏమీ నిర్ణయించుకోలేదు. అలా ఏదో ఆలోచించుకుంటూ బాలు ఉండే అనాధాశ్రమం వైపుకి వెళ్లాను. లోపలికి వెళ్లాలనిపించింది. 'ఏం చెప్పి లోపలికి వెళ్లాలా?' అని ఆలోచిస్తుంటే పూర్తి చెయ్యాల్సిన కొన్ని మైనర్ ఫార్మాలిటీస్ గుర్తుకు వచ్చాయి. లోపలికి వెళ్లి వార్డెన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఎందుకో సడన్ గా ఇక్కడ ఆడవాళ్లెవరూ పని చెయ్యడం లేదన్న విషయం స్ఫురణకి వచ్చింది. 'ఆడవాళ్లుంటే పిల్లల్ని ఇంకా ఆప్యాయంగా చూస్తారు కదా!..' అని అనిపించింది. ఆలోచనలు అలా వెళుతూ, వెళుతూ అంతకుముందు మొదటిసారిగా ఇక్కడకి వచ్చిన సందర్భాన్ని గుర్తుకు తెప్పించాయి.

ఆ రోజు మేం ఇక్కడకి వచ్చాక కొంతమంది పిల్లల్ని చక్కగా తయారుచేసి మా ముందుంచారు. అందరూ బాగున్నారు. కానీ ఖచ్చితంగా నిర్ణయించుకోలేకపోతున్నాం. ఏదో మిస్సింగ్. లంచ్ చేసి వస్తామని చెప్పి పక్కనున్న తోటలోకి వెళ్లి, మేం తెచ్చుకున్న క్యారియర్ ని ఓపెన్ చేసి తింటున్నాం. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు అటుగా వెళ్తూ మాట్లాడుకుంటున్నారు. ఓ 13-15 ఏళ్ల వయసువారై ఉంటారు. 'అడాప్ట్ చేసుకోడానికి ఎవరో వచ్చారంటరా. అందుకే హడావుడిగా ఉంది.' అన్నాడొకడు. 'ఏముందిరా!. వాళ్లంతా అందంగా ఉన్నవాళ్లనే తీసుకెళ్తారు. సార్ కూడా వాళ్లనే శుభ్రంగా తయారుచేసి చూపిస్తాడు.' అన్నాడు పక్కబ్బాయి. వీళ్ల సంభాషణ మమ్మల్ని ఆలోచనలో పడేసింది. మా దృష్టికోణాన్ని విశాలం చేసింది. లంచ్ చేసాక మళ్లీ రిసెప్సన్ రూంకి వచ్చి కూర్చున్నాం. ఆఫీషు వాళ్లెవరూ లేరు. ఇక్కడ పిల్లలందరికీ పంచాలని మేం తెచ్చిన స్కెచ్ పెన్సిల్ సెట్ లు, డ్రాయింగ్ పుస్తకాలు, ఎరేజర్లు ఆ రూంలో మాకు దూరంగా ఓ మూలన ఉన్నాయి. ఇంతలో ఓ మూడునాళుగేళ్ల అబ్బాయి అక్కడకి వచ్చాడు. స్కెచ్ పెన్సిళ్ల దగ్గరకి వచ్చి అటూ, ఇటూ చూసాడు. తర్వాత ప్రణవి దగ్గరకి వచ్చి, ఆ పెన్సిల్ సెట్స్ ని చూపిస్తూ 'అవి నీవా?' అనడిగాడు. ప్రణవి నవ్వుతూ కాదంది. వాడు మళ్లీ అటూ, ఇటూ చూసి టెంప్టేషన్ ని ఆపుకోలేక ఓ పెన్సిల్ సెట్ ని పట్టుకొని లోపలికి పరుగెత్తాడు. వార్డెన్ వచ్చాక అతని పర్మిషన్ ని తీసుకొని రూములన్నీ చూడటం మొదలుపెట్టాం. ఆదివారం కావటం చేత అందరు అబ్బాయిలు (అది బాయ్స్ హాస్టల్.) రూముల్లో ఉన్నారు. ఆ పిల్లాడి రూంకి వెళ్లేసరికి మనోడు తనలో తానే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పెన్సిళ్లతో బొమ్మలేస్తున్నాడు. కొంచం పక్కన మరొక అబ్బాయి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. వీరిని డిస్టర్బ్ చెయ్యడమెందుకని వెళిపోతుండగా, 'ఏయ్!..' అని పిలిచాడు. ప్రణవిని చూసి, 'మరొక పెన్సిల్ సెట్ అక్కడుంది కదా.. తేవా?' అని ముద్దుగా అడిగాడు. 'నీ దగ్గర ఒకటి ఉందిగా' అని అంటే, 'ఇంకొకటి నా ఫ్రెండ్ కి ఇస్తాన'ని పక్కన పడుకున్న అబ్బాయిని చూపించాడు. మేమిద్దరం ఒకర్నొకరు చూసుకున్నాం. ఏకీభవించిన మా ఎంపికకి కళ్లతోనే ఆమోదం తెలుపుకున్నాం. ఆ పిల్లాడే బాలు.

నా ఆలోచనలని బ్రేక్ చేస్తూ ఒకబ్బాయి నేనున్న గదిలోకి వచ్చాడు. బాలు కన్నా కొంచం చిన్నవాడే అనుకుంటా. గోడలని తడుముకుంటూ ఎటో చూస్తూ రావడం వలన తను గుడ్డివాడని గ్రహించాను. 'సార్..' అని పిలిచాడు. 'ఊ..' అన్నాను. నా గొంతుని బట్టి నేనున్న ప్లేస్ ని ఊహించి, దగ్గరకి వచ్చి, 'ఇవి బాలువి. వాడికి ఇచ్చేయండి.' అని ఓ ప్లాస్టిక్ కవర్ న చేతికిచ్చి వెళిపోతుండగా 'నీ పేరేంట'ని అడిగాను. 'రాజు' అని బదులిచ్చాడు. ప్లాస్టిక్ కవర్లో చూస్తే ఓ గోళీకాయల డబ్బా, కొన్ని ఆటసామాన్లు ఉన్నాయి. ఇంతలో వార్డెన్ వచ్చాడు. మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తిచేసాను.

ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యాక బాలు రూంకి వచ్చాను. ఒక్కడే ఏదో ఆడుకుంటున్నా డల్ గానే ఉన్నాడు. కవర్ గుర్తొచ్చి పట్టుకొచ్చి ఇచ్చాను. కవర్ ఇప్పి చూసాక బాలు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 'మా హస్టల్ కి వెళ్లావా?.. రాజు ఇచ్చాడా?..' అని ఆతృత గా అడిగాడు. అవునన్నాను. కవర్ లోని బొమ్మలని ఒక్కొక్కొటీ ఆప్యాయంగా చూస్తూ ఆడుతున్నాడు. నేను వాడిని అలానే చూస్తూ నిలబడ్డాను. మా దగ్గరికి వచ్చాక మొదటిసారి వాడినింత ఆనందంగా చూస్తున్నాను. వాడి చర్య నాకొక పాఠం చెబుతున్నట్లుగా అనిపించింది. ఇంట్లో అన్నీ ఉన్నాయని వాడిని కట్టుబట్టలతో తీసుకొచ్చేసాం. కానీ వాడికి అప్పటివరకూ తాను గడిపిన పరిసరాలతో, మనుష్యులతో, వస్తువులతో కొంత అటాచ్మెంట్ ఉంటుందన్న ఆలోచనే మాకు రాలేదు. దత్తత తీసుకొని వీడిని మేమేదో ఉద్ధరిస్తున్నామన్న అహంభావం మాలో ఉందేమో. దానివలనే వాడివైపు నుంచి మేం ఆలోచించలేకపోతున్నామేమో.

'హాస్టల్ నుంచి తెచ్చిన ఆటవస్తువులతో బాలు చక్కగా ఆడుకుంటున్నాడ'ని చెబితే ప్రణవి ఆనందంగా, ఏదో వింతని చూడాలన్నట్లు గబగబా వాడి రూంకి పరుగుతీసింది. కాసేపయ్యాక వాడి రూంకి వెళ్లి చూస్తే ఇద్దరూ ఆడుకుంటున్నారు. బాలు సాహచర్యాన్ని ప్రణవి ఎంజాయ్ చేస్తున్నంతగా వాడు ఆమె సాహచర్యాన్ని ఎంజయ్ చెయ్యట్లేదని తెలుస్తోంది. 'కానీ కొంతలో కొంత నయమే కదా' అనుకొని వంటని మనమే పూర్తి చేసేద్దామని కిచెన్ లోకి నడిచాను. వంట పూర్తి చేసి, ప్లేట్స్ లో భోజనం పట్టుకొని వెళ్లి, వాడి రూంలోనే అందరం కలిసి తిన్నాం. భోజనాలయ్యాక పడుకోవడానికి వెళ్తుంటే ప్రణవిని బాలు కొంగు పట్టుకొని ఆపాడు. ఏంటన్నట్టు వాడి వైపు చూస్తే, ఓ రెండు సెకన్ల మౌనం తర్వాత 'నేను నీ పక్కన పడుకుంటాన'ని ప్రణవిని అడిగాడు. వద్దని వారించబోయి నేను ప్రణవిని చూసి ఆగిపోయాను. తను వాడి నుదుటిన ఓ ముద్దిచ్చి, ఎత్తుకొని బెడ్ రూం వైపు నడిచింది.

తరువాత రోజు బాలుని వాడి పాత హాస్టల్ కి ఓసారి తీసుకెళ్దామనుకున్నాం. వాడు అక్కడి ఫ్రెండ్స్ ని, హాస్టల్ వాతావరణాన్ని మిస్ అవుతున్నాడేమోనని మా అనుమానం. కారులో బయలుదేరిన కాసేపటికి మనం హాస్టల్ కి వెళుతున్నామని బాలుకి చెప్పాను. ఆ నిమిషం కొండంత ఉత్సాహం కనపడింది వాడిలో. ఇది నేను ఊహించినదే. కానీ ఊహించని విధంగా కాసేపయ్యాక బాలు దిగాలుగా అయిపోయాడు. 'నేను మళ్ళీ వెనక్కి రాను. అక్కడే ఉండిపోతా.' అన్నాడు. మేమిద్దరం ఒక్కసారిగా షాక్ తిన్నాం. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత నేనే కొంచం స్థిమితపడి అడిగాను- 'నీకిక్కడ నచ్చలేదా?' అని. 'ఇక్కడ ఆడుకోడానికి నా ఫ్రెండ్ రాజు లేడు. వాడు నాకన్నీ చెబ్తాడు. నాకోసం అన్నీ దాస్తాడు. నేను లేకపోతే గుడ్డివాడని వాడినందరూ ఏడ్పిస్తారు. వాడు ఏడుస్తాడు.' అంటూ బాలు సడన్ గా ఏడవటం మొదలుపెట్టాడు. ప్రణవి బాలుని దగ్గరకు తీసుకొని, 'మనమిప్పుడు రాజుని కలుస్తాం కదా!.. ఏడవకు.' అంటూ సర్దిచెప్పసాగింది. అయినా బాలు ఏడుస్తునే ఉన్నాడు. ఏడుస్తూనే రాజు గురించిన విషయాలను ప్రణవి అడుగుతుంటే చెబుతున్నాడు. వాడు మెల్లగా ఏడుపు ఆపేసరికి హాస్టల్ వచ్చేసింది. కారు దిగుతూనే రాజు దగ్గరకి పరిగెత్తాడు. మేం వచ్చేసరికి రాజు రూంలో వాళ్లిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ద్వారం దగ్గరున్న మమ్మల్ని చూసి, 'రాజు!.. అమ్మరా.. ' అంటూ బాలు ప్రణవిని దగ్గరకు పిలిచాడు. ప్రణవి దగ్గరకి వచ్చి వారి ముందు కూర్చుంది. బాలు రాజు చేయిని పట్టుకొని వచ్చి ప్రణవి భుజం మీద వేసాడు. రాజు  దగ్గరకి వచ్చి తడుముకుంటూ ప్రణవి బుగ్గ మీద చెయ్యి వేసాడు. 'అమ్మ మెత్తగా ఉందిరా!' అన్నాడు అపురూపంగా. 'అమ్మ మనలాగే ఉంటుందిరా.' అని బాలు సమాధానమిచ్చాడు. అప్పుడు నాకు అర్ధమయ్యింది- చిన్నప్పటి నుంచి అమ్మ అంటే ఏంటో.. ఎలా ఉంటుందో తెలియకపోవడం వలన రాజు ప్రణవిని ఏదో అద్భుతంలా పరిశీలిస్తున్నాడని. ఆ తర్వాత వాడి చేయి ప్రణవి జడని పైనుంచి కిందవరకూ తడిమింది. 'ఒరేయ్!.. అమ్మ జుత్తుజుత్తుగా ఉందిరా..' అంటూ ఆశ్చర్యపోసాగాడు. వాళ్ల హాస్టల్ లో ఆడవాళ్లు లేకపోవడం వలన తన జడ వాడికి ఒక వింతలా అనిపిస్తోంది కాబోలు. ప్రణవి ఏమీ మాట్లాడటం లేదు. తన కళ్ళలోని నీటిపొర మాత్రం తన మనస్థితి ని నాకు చెప్పింది. ఇంతలో రాజు ప్రణవికి వెనుకగా వచ్చి తను పెట్టుకున్న సన్నజాజుల దండని తడుముతున్నాడు. 'అవి పువ్వులురా..' - బాలు చెప్పాడు. రాజు పూలదండకి ముఖం దగ్గరగా పెట్టి, వాసన చూసి నిర్ధారించుకొని, ఏదో అద్భుతాన్ని కనుగొన్నట్లు 'హాయ్.. అమ్మకి పూలు పూచాయి.. అమ్మకి పూలు పూచాయి..' అంటూ తప్పట్లు కొడుతూ గెంతుతున్నాడు. బాలు కూడా వాడితో కలిసి తప్పట్లు కొడుతున్నాడు. ప్రణవి కళ్ళ నుంచి నీరు జలజలా రాలాయి. ఉద్వేగాన్ని ఆపుకోలేక వాళ్లిద్దరినీ గట్టిగా హత్తుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. నేను దగ్గరగా వచ్చి తన భుజం మీద చేయి వేసాను. తను నావైపు తల తిప్పింది. మా చూపులు కలిసాయి.

ఆ తర్వాత బాలు, రాజులిద్దరూ మా పిల్లలయ్యారు (రాజుని కూడా మేం దత్తత తీసుకున్నాం.). మాది చక్కని కుటుంబమయ్యింది.

Comments

జయ said…
ఇప్పుడే చదివానండి. చక్కని భావాల ఆ స్పందన, అంత కమ్మని ముగింపు...చాలా బాగుందండి.
సున్నితమైన విషయాన్ని ఇంకా సున్నితంగా చెప్పారు.. చాలా బావుంది :-)
చాలా బాగుందండి.
chaalaa baagundi.
Nishi gaari abhipraayame naadi kudaa...
మోహన said…
sensitive point. Loved the title.
Congratulations.
and Happy Children's Day :)
@జయ, నిషిగంధ, మంజు, వేణు శ్రీకాంత్, సవ్వడి, మోహన,

నా కధ మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి. స్పందనకి థాంకులు.
Geetha said…
Chaduvuthunte kaneeru aagaledu naaku:(( Nannu ,naa feelings ni pranavi lo chusukunnattu undi:)
Edi mee anubhavamaa? or just imagine chesi raasaara?
Geetha said…
any way chala chala bavundi:)
@Geetha,

కధ చదివే పాఠకుడిని కదిలించగలిగితే రచయితకి అంతకి మించిన ఆనందమేముంది?..

ఇది స్వానుభవం కాదు.. ఊహించి రాసినదే. స్పందనకి ధన్యవాదాలు.
శిశిర said…
బాగుందండి.
మురారి గారూ.. ఏంటో అప్రయత్నంగా నా కళ్లలో కూడా నీరు. చెప్పలేకపోతున్నాను..
ఎన్ని సార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.. అయినా కళ్లలో నీరు మాత్రం ఆగట్లేదు.. మిమ్మల్ని ఎలా అభినందించాలో, మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు..
Sasidhar Anne said…
Chala baga rasaru.. meeku oka blog vundi ani teliyaka.. sakshi lo vacchina post ni naa blog lo paste chesa.. and daniki naa comments kooda petta.. chudagalaru..
http://sasi-anne.blogspot.com/2010/11/blog-post.html

inka meeru cheppina vidhanam.. adbutham..

Chivariga sisira gariki kooda thanks.. meeru kanuka naaku ee blog link ivvakapothey nenu srinivas gariki thanks cheppe chance vacchedi kadu..
@శిశిర,
థాంక్సండి.

@మనసు పలికే,
మీకింతలా నచ్చినందుకు సంతోషం. ఒక పిల్లాడిని దత్తత తీసుకోవాలని పర్సనల్ గా నాకున్న కోరిక. ఇలా దత్తత తీసుకున్నప్పుడు ఎలాంటి ఘర్షణ ఉండవచ్చు అన్న ఆలోచన ఈ కధకి ప్రేరణనిచ్చింది. మీ స్పందనకి ధన్యవాదాలు.

@Sasidhar Anne,
మీ బ్లాగ్ లో ఈ కధా పరిచయం బాగుంది. స్పందనకి ధన్యవాదాలు.
మురళి said…
'ఫండే' లో మీ పేరు చూసి చాలా సంతోష పడ్డానండీ.. రాజు పాత్ర వచ్చాక ముగింపుని కొంత ఊహించ గలిగాను.. మీ శైలిలో లలితలలితంగా.. బాగుంది కథ..
@మురళి గారు,
కామెంట్లలో మీ పేరుని చూసి నేను మురిసిపోయినట్టు మనం ఇష్టపడేవారి పేరుని పత్రికలలో చూసినప్పుడు సహజంగా ఆనందమేస్తుంది. మీ అభిమానానికి, కధ మీకు నచ్చినందుకు సంతోషం.
మురారి గారు, absolutely brilliant. కథకుడి మనసులో మెదుల్తున్న భావాల్ని, ఆత్మ పరిశీలనని చాలా చక్కగా చెప్పారు.
@కొత్తపాళీ గారు,
ధన్యవాదాలు.
eppude chadivaanu. chaalaa baagundi. nijamenemo anukunna antagaa baagundi....
@ చెప్పాలంటే గారు,
మీ స్పందనకి ధన్యవాదాలు.
కథ చాల బాగుంది...పాత్రలన్నీ కళ్ళ ముందే కదిలాయి సజీవం గా చదువుతున్నంత సేపు!!!
This comment has been removed by the author.
@Subhashini poreddy,

థాంకులు.
Anonymous said…
చక్కని కథని సరళంగా చెప్పారు.
పేరు చాలా బాగుంది.
ఔను. అమ్మకి రెండు పూలు పూచాయి.
అభినందనలు.
@bonagiri,

నిజమే!.. బాగా చెప్పారు.. అమ్మకి రెండు పూలు పూచాయి..:)
Unknown said…
e kadha nenu ennosarlu chadivanu. mimmalni ila kalusukovadam nijamga chala happy ga undi.chala adbhutamga rasaru.
@Kalluri Sailabala గారు,
నేను రాసిన వాటిలో నాకు ఈ కధ ఎంతో ప్రత్యేకమైనది. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.