నాకు ప్రపంచంలో నా అంత అద్రుష్టవంతుడూ, అలాగే నా అంత దురదృష్టవంతుడూ ఉండరనిపించింది. అద్రుష్టవంతుడని ఎందుకంటే కోరుకున్న అమ్మాయి దగ్గరవ్వబోతోంది. దురదృష్టవంతుడని ఎందుకంటే ఈ రోజే చనిపోబోతున్నాను కాబట్టి. ఒక్క క్షణం ఈ దెయ్యం ఎపిసోడ్ అంతా కల అయ్యుంటే ఎంత బాగుండో అనిపించింది. కానీ అలా కాదుగా. ఈ రోజంతా కూడా ఆ దెయ్యం అమ్మాయి నా చుట్టూ తిరుగుతూ కనపడింది. నేనే పట్టించుకోలేదు. కానీ దీనివలన నా జీవితమే మారిపోయినట్టు అనిపించింది. ఈ దెయ్యమే నా జీవితంలోకి రాకుంటే ఈ రోజు ఇంత అద్భుతంగా గడిచేది కాదు. అసలు నేను తనకి ఎప్పుడూ propose చేసేవాడినే కాదేమో. తను హాపీగా ఇంకొకడిని పెళ్లి చేసుకొనేది. అసలు ఎప్పుడూ నేను ఈ రోజంతలా ధైర్యంగా, నేను నేనుగా, నన్ను నేను ఇష్టపడుతూ జీవితాంతం కూడా గడిపేవాడిని కాదేమో. అలాంటి బ్రతుకు బ్రతికీ ఏమి ప్రయోజనం? అర్థవంతమైన ఈ ఒక్కరోజు చాలు. ఇకనైనా బ్రతికితే ఇలాగే బ్రతకాలి. ఈ రోజు ఉదయం వరకూ వ్యర్ధమనుకున్న బ్రతుకు చీకటి పడేసరికి ఎంత అందంగా తయారయ్యిందో. ఇలాంటి అనుభూతినిచ్చిన ఆ దెయ్యానికి థాంక్స్ చెప్పాలనిపించింది. చుట్టూ చూస్తే తను కనపడింది. ఎందుకో భయమనిపించలా. తన వైపు చూసి థాంక్స్ థాంక్స్ అన...