Skip to main content

కొడుకిచ్చిన బహుమతి

ఆమె రోజూ హైదరాబాద్ సంతల్లో చేపలు శుభ్రం చేస్తూ పొట్ట పోషించుకుంటుంది. ముఖ్యంగా
ఆదివారం మంచి గిరాకీ ఉంటుంది. కస్టమర్లు తెచ్చే రొయ్యలు, పీతలు, మెత్తళ్లు, కొరమీను వంటి
చేపల తొక్క/పొలుసులు తీసి, కడుపుని కోసి, శుభ్రం చేసి అందిస్తుంది. అందుకు కేజీ చేపలకి 40 రూపాయిలు వసూలు చేస్తుంది. పొద్దున్నే ఊరి నుంచి బయలుదేరి ఎక్కడ సంత ఉంటే అక్కడకి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నానికల్లా ఇంటికి చేరుకుంటుంది. ఆదివారాల్లో కాస్త లేటవుతుంది. ఆదివారం రోజు తోడుగా ఏడేళ్ళ కొడుకు కూడా వస్తాడు. భర్త లేడు.. వదిలేసి పోయాడు. ఏ గుర్తింపూ
లేని జీవితాన్ని ఆమె నిస్సారంగా గడుపుతోంది. 

ఒకరోజు మధ్యాహ్నం ఇంటికొచ్చాక "అమ్మా, హ్యాపీ బర్త్‌డే!" అంటూ కొడుకు ఆమెని కౌగిలించుకుంటాడు.
సిద్ధంగా ఉంచుకున్న ఒక కేకు ముక్కని ఆమెకి తినిపిస్తాడు. ఊహించని ఈ ఘటనకి ఆనందపడుతుంది.
నిజానికి తన పుట్టినరోజెప్పుడో ఆమెకి తెలియదు. ఒక్కగానొక్క కొడుకు పుట్టినరోజు మాత్రం ఉన్నంతలో
బాగా చేస్తుంది. ఒకసారి కొడుకు తను పుట్టిన తేదీ గురించి పదేపదే అడిగేసరికి.. అప్పుడు నోటికొచ్చిన
తేదీని చెబుతుంది. కానీ కొడుకు ఆ తేదీని ఇంతలా గుర్తుంచుకొని తనకోసం ఇలా చేస్తాడని
ఊహించలేదు. ఆమెకి చాలా ఆనందమేసింది. కొడుకుని హత్తుకొని ముద్దాడింది. ఇంతలో కొడుకు
చేతులు వెనుకగా పెట్టి ఏదో దాస్తున్నట్టు గమనించింది. అదేంటని అడిగితే మెళ్ళగా తీసి ఒక గిఫ్ట్‌ప్యాక్
చూపించాడు. ఆమె మరింత పొంగిపోయింది. ఆతృతగా దానిని తీసిచూసేసరికి ఆమె ముఖంలో నవ్వు
మాయమై దాని స్థానంలో సందిగ్ధం గోచరించింది. కొడుకు తనకిచ్చిన బహుమతి - ఒక లిప్‌స్టిక్. 

ఆ బహుమతిని చూసిన ఆమెకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. లిప్‌స్టిక్‌ని బహుమతిగా
ఎందుకిచ్చావు? అనడిగితే.. "మనకి చేపలు చెయ్యమని ఇచ్చే ప్రతీ ఒక్కరూ కార్లలో వచ్చినవారైనా
మనతో బేరాలాడుతారు కదా.. ఇరవైకి చెయ్యు, ముప్పైకి చెయ్యు అని.. అదే పెద్ద షాపుల్లో ఐతే ఎవరూ
బేరమాడరు. అలా ఎందుకని నిన్ను ఒకసారి అడిగితే.. ఆ షాపుల్లోని ఆడాళ్లు లిప్‌స్టిక్ పూసుకొని స్టైల్‌గా
ఉంటారు. అందుకే బేరమాడరు అని చెప్పావు. నువ్వు లిప్‌స్టిక్ రాసుకుంటే రేపట్నిండీ మనతో కూడా
ఎవరూ బేరమాడరు కదా.. అందుకే ఇది గిఫ్టిచ్చా!" అంటాడు. చిన్నవాడైనా కొడుకు ఇంత నిశితంగా
ఆలోచించినందుకు ఆశ్చర్యపోతుంది. కానీ తాను లిప్‌స్టిక్ వాడలేదు. అలా అని కొడుకిచ్చిన మొదటి
బహుమతిని పక్కన పడెయ్యలేదు. ఇలా రెండు రోజులు సతమతమయ్యాక మరుసటి రోజు సంతకి
బయల్దేరుతూ కొడుకిచ్చిన లిప్‌స్టిక్‌ని పెదాలకి రాసుకుంటుంది. సంతలో తనప్లేస్‌లో అన్నీ సర్దుకుంటూ
కొత్తగా చిన్న కర్ర, అట్టముక్కతో చేసిన ప్లకార్డుని కూడా పెడుతుంది. ఆ ప్లకార్డు మీద ఒక చదువుకున్న
కుర్రాడితో ఇలా రాయిస్తుంది - "లిప్‌స్టిక్ రాసుకున్నా. కాబట్టి బేరాలాడకండి". 

ఆ ప్లకార్డుని చూసి అర్ధంకాక ఎవరైనా అడిగితే తన కొడుకు చెప్పిన లాజిక్కే చెబుతుంది - "పెద్ద పెద్ద
షాపుల్లో లిప్‌స్టిక్ రాసుకున్న ఆడోళ్లతో మీరు బేరాలాడరు కదా సారూ!.." అని. ఇలా ప్లకార్డు పెట్టిన
రెండ్రోజులకి ఒక ఔత్సాహిక కస్టమర్ ఈమెని, ప్లకార్డుని ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెడతాడు. అది వైరల్
అవుతుంది. ఒక జర్నలిస్ట్ వచ్చి, ఆమెని ఇంటర్వ్యూ చేసి, ఆర్టికల్ రాస్తాడు. ఈమెకి సాయం చేసి
డిజిటల్ మీడియాలో తన ఇమేజ్‌ని పెంచుకుందామని ఆలోచించిన ఒక పెద్దమనిషి వల్ల తను చేపలు
శుభ్రం చేసే స్థాయినుంచి చేపలు అమ్మే స్థాయికి చేరుకుంది.

ఐతే లిప్‌స్టిక్ రాసుకోవడం మాత్రం ఆమె ఏరోజూ మర్చిపోదు.

Comments