Friday, December 26, 2008

మిస్సింగ్ యు..

నేను నిద్రపోయాక రాత్రంతా మనసు నీ దగ్గరే తచ్చాడుతుందేమో. పొద్దున లేవగానే ఊహని స్పృశించే మొదటి రాగం నీ తలపే. నా సబ్కాన్షస్ పెట్టె నిండుగా నీ సుగంధంతో తొణుకుతుంటే అహం బిత్తరపోయి అంతలోనే సర్దుకుంటుంది. గంభీరమయిపోతాను. కొన్నిసార్లు నా గంభీరతని చూసి నేనే ఫక్కున నవ్వేసుకుంటాను.
బాత్రూమ్ లోకి బద్ధకంగా దూరాక, బకెట్ లోని నీటి మీద వేలితో అప్రయత్నంగా నీపేరు రాస్తాను. అది చెరిగిపోతుంది. కానీ అందులో నీ పేరుందని నాకు తెలుసు.
ఓసారి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక చిన్నమ్మాయి నన్ను వింతగా చూసినప్పుడు అర్థమయ్యింది- నువ్వు గుర్తొచ్చి నా ముఖం ముద్దుగా నవ్వుతోందని. వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని పట్టుకొని ఫాస్ట్ గా ఓ ముద్దిచ్చేసి అక్కడి నుంచి పరిగెత్తా.
రాత్రి మేడ మీద తిరుగుతున్నప్పుడు నువ్వెప్పుడూ పాడే పాట గుర్తొస్తుంది. నీకస్సలు పాటలు పాడటం రాదు. ఆ పాటనైతే దారుణంగా ఖూనీ చేస్తావు. అప్పుడు వెక్కిరించాను గానీ ఇప్పుడు నీ పాట నాకెంతిష్టమో!!. నువ్వు పాడినట్లే పాడుతూ మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాను. నవ్వుకుంటున్నా సరే ఓ నీటితెర నా కళ్ళని అడ్డుగా కప్పేస్తుంది.

Friday, December 5, 2008

Inner Dimensions: The businessman speaks..

రాత్రి ఒంటిగంటన్నర. నిద్ర రావట్లేదు. చలికాలం కావడం చేత ట్రైన్ లో అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు. ఇంకొన్ని గంటల్లో తనని కలవబోతున్నాను. మనసులో ఏదో హుషారు ఈల. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. స్టేషన్లో ఓ చిల్లర వ్యాపారి టీ కంటైనర్ ని పక్కన పెట్టుకొని బెంచి మీద కునుకు తీస్తున్నాడు. టీ తాగాలనిపించింది. ట్రైన్ దిగి వాడిని లేపి టీ అడిగాను. టీ ఇచ్చి ఎప్పటిలాగే నాలుగు రూపాయలు తీసుకున్నాడు. 'ఇంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని సెర్వ్ చేస్తున్నాడు. extra చార్జ్ చెయ్యొచ్చు కదా.' అనుకున్నాను. నేను స్వతహాగా business man ని కావడంతో ఇలాగే ఆలోచిస్తాను. అతను ఎక్కువ చార్జ్ చేసుంటే అతనిమీద గర్వపడేవాడిని. ఒక సిగరెట్ కూడా తీసుకున్నాను. నాకు సిగరెట్ అలవాటు కాదు. అప్పుడప్పుడూ తీసుకుంటాను. materialistic things కి గానీ, మానవ బంధాలకి గానీ బానిసవడం, నన్ను నేను కోల్పోవడం నాకు నచ్చవు. ప్రశాంతమైన ఈ అర్థరాత్రి పూట చలిగాలిలో ఛాయ్ తాగుతూ దమ్ము లాగుతుంటే బాగుంది. I fucking loved this moment. స్టేషన్లో దూరంగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బయటవాళ్లెవరికీ నేను సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా నా ముఖంలో ఎటువంటి భావాలూ కనపడవు. ఇది నా పర్సనల్ ఆనందం. నా ఆనందానికి ఎంత value ఇస్తానంటే పంచుకునేవారికి కూడా అదెంత valuable అని గ్రహించగలిగి ఉండాలి. ట్రైన్ కూత పెట్టడంతో ఎక్కాను.

నా గమ్యం వచ్చింది. ట్రైన్ దిగాను. చుట్టూ ఉన్న జనాలు పలచనయ్యాక తను కనపడింది. ఆమె కళ్ళలో నేను రానేమో, కనపడనేమో అన్న ఆలోచనల తాలూక ఒత్తిడి ఏమాత్రమూ లేదు. తను నా భార్య కాదు. నా భార్యకి బిజినెస్ పని మీద ముంబై వెళుతున్నానని చెప్పి ఈమెను కలవడానికి వచ్చాను. మేమెప్పుడూ పలకరించుకోం. కలిసి రెండు నెలలవుతున్నా గతక్షణమే మాట్లాడుకొని కంటిన్యూ చేస్తున్నట్లుగా మాట్లాడుకుంటాం. నేను దగ్గరకి వచ్చాను. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. 'My desire is peaking.' అని కళ్ళలోకే చూస్తూ చెప్పాను. తను నవ్వింది. చిన్న pause. మళ్ళీ నవ్వింది. ఈసారి నవ్వుతో పాటు తన కళ్ళలో కోరిక కూడా. నా కళ్ళు హర్షాన్ని తెలిపాయి. నా గెస్ట్ హౌస్ కి వెళ్లి మా కోరిక తీర్చుకున్నాం.

సుమారుగా ప్రతి రెండు నెలలకొకసారి మేం కలుసుకుంటాం. ఓ రెండుమూడు రోజులు కలిసుంటాం. తను ఓ సోషల్ వర్కర్. ఒక NGO ని నడిపిస్తోంది. నేను వ్యాపారిని. నాకు సోషల్ వర్క్ మీద ఆసక్తి లేదు. తనకి కూడా బిజినెస్ చెయ్యాలన్నఇంటరెస్ట్ లేదు. మా మధ్య ఆర్ధిక లావాదేవీలేమీ లేవు. మా ఇద్దరికున్న common point ఒక్కటే. మా వృత్తులపట్ల మాకున్న భావాలు. వ్రత్తి అని చెబితే వేరుచేసినట్లవుతుందేమో. నా గురించి నేను ఊహించుకున్నప్పుడల్లా నా బిజినెస్సే కనపడుతుంది. నారూపం కనపడదు. బయటవారందరికీ నేను ఏ ఫీలింగ్సూ లేని ఒక business man ని. కానీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు - నేనూ, నా వృత్తి వేరుకామని. తను కూడా అంతే. social work కి అవరోధమవుతుందని పెళ్లి, కుటుంబాన్ని వద్దనుకుంది. ' ఎప్పుడూ ఎమోషనల్ కాని ఈమెకేం తెలుసు social work. ', 'ఈవిడొక చండశాశనురాలు.' .. ఇలా తెలియనివారు ఈమె గురించి చెబుతుంటారు. మేము తొందరగా emote కాము ఎందుకంటే emotions మాకు చాలా విలువైనవి. ఇలాంటి చెప్పుకోని భావాలే తనని, నన్నుదగ్గర చేసాయి. మేం కలిసున్నరోజులు తిరగడం, తినడం తప్పిస్తే ఇంక చేసేవి రెండే పనులు- మాట్లాడుకోవడం, సెక్స్. మేము sweet nothings మాట్లాడుకోము. ఫ్యామిలీ విషయాలు అసలే ఉండవు. కేవలం మా పనుల గురించి, మా గురించే మాట్లాడుకుంటాము. ఇక సెక్స్ విషయానికొస్తే రెండు నెలలకొకసారి కలిసిన ఫస్ట్ టైం violent గా ఉంటుంది. మా frustrations reflect అవుతాయనుకుంటా. చివర్లో విడిపోయేముందటి కలయిక మాత్రం ఒక స్పూర్తివంతమైన అనుభవం. soft గా.. మాట్లాడుకుంటూ.. సున్నితంగా intimacy ని అద్దుకుంటూ.. నిన్నటి గాయాల, రేపటి భయాల ఉనికి లేకుండా.. really ఒక charging experience అది. మాది ప్రేమనా, వ్యామోహమా.. అని ఒక పేరు ఇవ్వడానికి, define చెయ్యడానికి నేను ప్రయత్నించను. ఎందుకిలా జరిగింది.. తను పరిచయం కాకపొతే ఏంటి?.. లాంటి ప్రశ్నలకి సమాధానాల కోసం వెతకను. irrational feelings కి నేను logic apply చెయ్యను. ఆలోచించేదల్లా నాకు కరెక్టా.. కాదా..అని. ఇప్పటి డెసిషన్ కి ఫ్యూచర్ లో బాధ పడతానా.. లేదా అని. నా కొడుక్కి 18 ఏళ్ళు వచ్చేవరకూ తండ్రి అవసరమని భావించాను. అందుకే తను, నేను దగ్గరయ్యామన్నవిషయం అనుభవంలోకి వచ్చాక (అప్పుడు నా కొడుక్కి 14 సంవత్సరాలు) నాలుగు సంవత్సరాల వరకూ మేము కలుసుకోలేదు. ఈ ప్రపంచానికి మా వ్యవహారం తెలిసినా మేమిద్దరం భయపడం, బాధపడం. నా భార్య నుండి విడిపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నో ఏళ్లుగా మేమిద్దరం కేవలం బాధ్యతలని మాత్రమే షేర్ చేసుకుంటున్నాం. నా విషయం ఎప్పటికయినా తెలియాల్సిందే. నేను చెప్పకపోతే తను కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. విషయం తెలిస్తే తను బాధపడుతుంది. నా ద్వారా కాకుండా వేరే విధంగా బయటపడితే ఇంకొంచం ఎక్కువ బాధపడుతుంది. ఈ ఇంకొంచం ఎక్కువ బాధపడడాన్ని, చెప్పకపోవడం వలన తనకి దొరికే కొద్ది రోజుల ప్రశాంతతని కంపేర్ చేస్తే రెండవదే ఎక్కువ తూగింది. అందుకే నేనుగా ఈ విషయం తనకి చెప్పలేదు. ఇది తప్పని, ఒప్పని అనుకోకపోవడం వలన నాకెటువంటి గిల్టీ ఫీలింగ్ కూడా లేదు.

రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి పక్క మీద నా భార్య ఇలా అంది- 'ముంబై ట్రిప్ నుండి వచ్చిన ప్రతీసారీ మీరు కొత్తగా, ఫ్రెష్ గా కనపడతారు. ఏదో తెలియని మార్దవం కనపడుతుంది.'. తనింతలా expressive గా మాట్లాడటాన్ని, లోతుగా విశ్లేషించడాన్నినేను చాలారోజుల తర్వాత గమనించాను. తనని చూస్తూ అప్రయత్నంగా నా ముఖంలో ఒక మందహాసం మెరిసి మాయమయ్యింది.

Friday, October 24, 2008

ముసుగు లోపల..

ఉరుకుతూ బస్సెక్కాను. చీర చెమటతో తడిసిపోయింది. పొద్దంతా కూలి చేసి, సాయంత్రం ఆ డబ్బులతో మా చంటోడికి బట్టలు కొని, మా ఊరి బస్సెక్కేసరికి రాత్రి తొమ్మిది దాటింది. కండెక్టరు టికేట్ ఇచ్చాక చేతిలో రెండు రూపాయలే మిగిలాయి. ఊరెళ్ళాక పనికొస్తాయని దాచుకున్నాను. బాగా ఆకలేస్తుంది. పనితో ఒళ్ళు హూనమైనా నిద్ర పట్టట్లేదు. పొద్దుట్నుంచి తిండి లేదు. ఇంకేమీ చెయ్యలేక కళ్లు మూసుకున్నాను. ముందు సీట్లో ఒక బట్టతల ఆయన ప్రక్కవాళ్లకి దేవుని గురించి అందరికీ వినిపించేలా చెబుతున్నాడు. 'మనిషికి భగవంతుని మీద తప్ప మరే విషయం మీద అనురక్తి ఉండకూడదు.' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అందరూ ఆసక్తిగా వింటున్నా నాకేమీ ఎక్కట్లేదు. వాళ్ళెవరికీ ఆకలి లేదు. నాకుంది. కడుపు నిండాకే దేవుడు.

బస్ లో లైట్లాపేశారు. బయట కూడా చీకటిగానే ఉంది.మధ్యలో ఆగినప్పుడు ఒకాయన బస్సెక్కి నా పక్కన కూర్చున్నాడు. కొంచం కళ్ళెత్తితే ఆయన బూట్లు కనపడ్డాయి. మళ్ళీ చీకటి. కాసేపటికి ఆయన నా వైపుకి ఒరుగుతున్నాడు. నిద్రలో ఉన్నాడో ఏమో. నాకు అతన్ని పక్కకి తోసే ఓపిక ఎంత మాత్రం లేదు. ఆకలిని జయించడానికి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేసాను. ఇంకాసేపటికి అతని చెయ్యి నా ఒంటి మీదకు చేరింది. నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. పైగా వచ్చే స్టాపులో అతని ద్వారా ఏమన్నా తినడానికి దొరుకుతుందన్న ఆశ కలిగింది. నా ఒంటి మీద అతని చెయ్యి కదులుతోంది. ఒళ్ళంతా చెమటతో, కండరాలు పీకుతూ నా శరీరం నాకే అసహ్యంగా ఉంది. కానీ నాకు అసహ్యమైన శరీరమే అతనికి అమృతప్రాయంలా ఉంది. అసలు నిజంగా వెలుగులో నేనతనికి నచ్చుతానా?.. అయినా ఆకలి గా ఉన్నప్పుడు ఏమి దొరికింది అని చూడము కదా. ఒక్కోసారి చీకటి (అజ్ఞానం)లో కూడా ఆనందముంటుంది. ఇంతలో బస్సాగింది. లైట్లు వెలిగాయి. అతని వయస్సు ముప్పై పైనే ఉంటాయి. చామనచాయితో ముఖమంతా మొటిమలున్నాయి. ఆకలేస్తుందని చెప్పాను. రెండు గారెలు, ఒక టీ ఇప్పించాడు. కడుపు తృప్తి పడింది. మళ్ళీ బస్సు కదిలింది. అలాగే అతని చెయ్యి నా ఒంటి మీద. కానీ నాకిప్పుడు అయిష్టం, కంపరం కలుగుతున్నాయి. ఇంతకుముందు 'కొంచం తిండి పెడితే చాలు వీడేమి చేసుకున్నా.' అని భావించిన నేను ఇప్పుడేంటి అస్సలు భరించలేకపోతున్నాను. అవసరం తీరిందనా?.. శారీరక అవసరాలు తీరాక మానసిక అవసరాలు వస్తాయేమో. అతని చేతిని పక్కకి తోసాను. మళ్ళీ చేయి వేయబోయాడు. 'ఏంటిది?' అని గట్టిగా అరిచాను. మానుకున్నాడు.


బస్సు కీచుమంటూ సడెన్ బ్రేకుతో ఆగేసరికి ముందు సీటుకి గుద్దుకునేంత పనయ్యింది. నిద్ర చిటికేసినట్టు ఎగిరిపోయింది. అందరూ ఏంటని అనుకుంటూ ఉండగానే వినపడింది ఓ గాండ్రింపు. చెవులు, గుండె రెండూ అదిరిపదేలా. ఆ గాండ్రింపుకి బస్సు అద్దాలు కూడా వణుకుతున్నాయి. అందరూ నోరెళ్ళబెట్టి అలాగే ఉండిపోయారు. ఎదురుగా హెడ్ లైట్ల వెలుగులో పెద్దపులి. ఆ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండటం వలన పులి ఇలా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిందేమో. అందరి ముఖాలు భయముతో బిగుసుకిపోయి తెల్లగా పాలిపోయాయి. కండక్టరు శబ్దం చెయ్యొద్దని అందరికీ సైగ చేసాడు. పులి గాండ్రింపు ఆపింది. కానీ అక్కడే నిలబడి బస్ వైపు చూస్తూ ఉంది. కండక్టరు నెమ్మదిగా అందరి దగ్గరకు వచ్చి, 'ఎవరూ కదలకండి. అందరూ కలిసి ఉంటే పులి ఏమీ చెయ్యదు.' అని లోగొంతుకలో చెప్పాడు. ఇంజన్ సౌండ్ తప్పించి మరే శబ్దమూ లేదు. ఇంతలొ పులి కదిలింది. మెల్లగా, ఠీవిగా అడుగులేస్తూ బస్ దాటింది. కానీ పులి మా కుడి వైపుకి రాసాగింది. అప్రయత్నంగా మేమంతా ఎడమవైపుకి జరిగాము. ఈ ప్రయత్నంలో కొంత శబ్దమయ్యింది. దేవుని గురించి మాట్లాడిన బట్టతలోడు గాభరాగా ఎడమవైపున్న డోర్ ని చేరుకున్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. ఇంతలో పులి గాండ్రు మంటూ కుడివైపున్న కిటికీని పంజాతో కొట్టింది. అంతేమరుక్షణం బస్సులో ఎవరూ లేరు. అందరూ తలొక దిక్కు పరిగెత్తారు. అందులో ముందున్నది ఆ బట్టతల భక్తుడే. నేను నా మీద చెయ్యి వేసిన ఆ మొటిమలవాడిని అనుసరించాను. కొంతదూరం పరిగెత్తాక ఆయాసంతో రొప్పుతూ ఒక దగ్గర ఆగిపోయాము. వెన్నెలరాత్రి కావడంతో కొంచం కనపడుతోంది. మాకు కొంచం దూరంలో ఒక ముగ్గురు నలుగురి గుంపు కూడా ఆగి సేద తీర్చుకుంటున్నారు. ఇంతలో ఎవరో మా దారినే వస్తున్న శబ్దం వినపడింది. అతికష్టంగా నడుస్తున్నట్టు తెలుస్తూంది. దగ్గరికి వచ్చాక చూస్తే అతనికి ఒక కాలు కొద్దిగా కుంటి. తనని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళమని మొటిమలవాడిని అడిగాడు. కాసేపటికి పదివేలకి బేరం కుదిరింది. డబ్బుకి బదులుగా వంటి మీదున్న బంగారం ఇస్తానన్నాడు. భుజం మీద కుంటివాడిని వేసుకొని మేము బయలుదేరబోతుండగా పులి ఎదురు గుంపు మీద దాడి చేసినట్టుంది. ఒక్కసారిగా పులి ఘర్జనలు, అరుపులు, పరుగులు. మేం కూడా పరుగులంకించుకున్నాం. ప్రాణం మీదున్న తీపికి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా నొప్పి తెలియట్లేదు. కాసేపటికి మొటిమలోడు సంభాలించుకోలేక పడిపోయాడు. దాంతో అతని భుజం మీదున్న కుంటివాడు ఎగిరిపడ్డాడు. దగ్గర్లోని చెట్టుకు తల తగలడంతో 'అమ్మా!.. ' అని గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతని తల చిట్లి రక్తం కారుతోంది. ఇంతలో మాకు చాలా దగ్గరలోనే పులి గాండ్రింపు వినపడింది. సగం ప్రాణాలు పైకెగిరిపోయినట్టు అనిపించింది. ఏదన్నా చెట్టెక్కమని మొటిమలోడు చెప్పాడు. దగ్గర్లోని చెట్లన్నీ పొడవుగా ఉన్నాయి. ఎక్కడమవ్వట్లేదు. ఇంతలో మొటిమలోడు కుంటివాడి బాడీ ని ఒక చెట్టు కింద పెట్టి వాడి మీద కాలు వేసి చెట్టెక్కాడు. నేను ఘోరమనుకుంటూ నిలబడ్డాను. ఇంతలో మళ్ళీ మా వెనుకగా పులి గాండ్రింపు. భయంతో వెన్ను జలదరించేసరికి నేను కూడా కుంటోడి బాడీ మీదెక్కి చెట్టేక్కేసాను. గుండె మీద కాలు వేస్తున్నప్పుడు అతని నోటి నుండి భళ్ళున రక్తం రావడం నా కంట పడింది. దగ్గర్లో కాసేపు పులి గాండ్రింపులు, జనాల హాహాకారాలు వినపడ్డాయి. కాసేపటికి మళ్ళీ నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా చెట్టు మీదే ఒక మూడు గంటలు బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాం. క్రిందన కుంటోడి తల నుంచి చిక్కటి నెత్తురు వెన్నెల వెలుగులో నల్లగా కనపడుతోంది. తరువాత చాలా సేపటి వరకూ పులి శబ్దాలు వినిపించకపోవడంతో చెట్టు దిగాము. ముందుగా దిగిన మొటిమలోడు కింద బాడీని చూసి చచ్చిపోయాడని చెప్పాడు. కుంటోడి శ్వాసని కూడా పరీక్షించలేదు. నాకు అనుమానమే.. కానీ అనుమానాన్ని పాతర వేసాను. ఒకవేళ బ్రతికి వుంటే గనుక ఆ కుంటివాడికి నేనే సహాయపడాలి. నా పక్కనున్నోడు పట్టించుకునేలా లేడు. ఇప్పుడా బాధ్యతని తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. ఎందుకీ లేనిపోని తలనొప్పి. అదే చనిపోయాడని మనసుని సర్దిచెప్పుకుంటే .. ఇంకేం చెయ్యలేమని ముందుకి వెళ్ళవచ్చు. అందుకే కనీసం అతనివైపైనా చూడకుండా మొటిమలోడినిఅనుసరించాను. ఒక నాలుగు అడుగులు వేసాక నా ముందు నడుస్తున్న మొటిమలోడు ఆగి వెనక్కు వెళ్ళాడు. నేనూ వెనక్కి తిరిగి చూసాను. బహుశా ఆ కుంటివాడికి హెల్ప్ చేయ్యదానికేమో అనుకున్నా. కాని మొటిమలోడు కుంటివాడి మెడలో ఉన్న రెండు గోల్డ్ చైన్లు, వేళ్లకున్న మూడు ఉంగరాలు జేబులో వేసుకున్నాడు.

అందరం బస్సుని చేరుకున్నాం. ఒక్క కుంటివాడు తప్ప. కుంటివాడిని మేం చూడలేదని చెప్పాం. కాసేపు చూసి బస్సు కదిలింది. తెల్లారేసరికి మా ఊరి దగ్గరకి వచ్చేసాం. అటూ ఇటూ కాకుండా పట్టిన నిద్రకి మనసు కొంచం తేలిక పడింది. ఆ కుంటోడి సంఘటనని మనసులోంచి చేరిపెసాను. నాకు నేనే ఆ కుంటివాడు లేకుండా రాత్రి సంఘటనలని విజువలైజ్ చేసుకొని అవే నిజమని మనసుని హిప్నటైజ్ చేసేసాను. ఎంతలా అంటే నాకు నేనే నమ్మేంతలా. ఇంతలొ ఒకటి గుర్తొచ్చింది. పక్కన కూర్చున్న మొటిమలోడితో కుంటివాడి మెడలోని ఒక చైను నాకిమ్మని బ్లాక్మైల్ చేశాను. వాడు బెదిరి ఇచ్చేసాడు. మనసుకి ఇప్పుడొక కొత్త విజువల్ని ఆడ్ చేశాను - దారిలో నాకీ చైను దొరికినట్టు.


మా ఊరొచ్చింది. నాతోపాటు బట్టతల భక్తుడు, మరికొందరు దిగారు. బట్టతలోడు పక్కవాళ్ళకి ఇదంతా దైవనాటకమని చెబుతున్నాడు. నాకు మనిషి ముసుగేసుకొని ఆడుతున్న నాటకంలా అనిపించింది. ముసుగులోపల మనిషి ఒక ప్రాధమిక జంతువే. ఒక్క క్షణం పాటు నా మీద, మనుషుల మీద విపరీతమైన చీత్కారం కలిగింది. మరుక్షణం బిగ్గరగా నవ్వాను.


బేతాళుడు పట్టువదలని విక్రమార్కుడిని అడిగాడు - 'రాజా!.. కధ విన్నావు కదా. ఇంతకీ ఆవిడ ఎందుకలా నవ్వింది?'.

Friday, September 26, 2008

ఆ రూము..

నా ఇంట్లో ఆ రూముని నేనెప్పుడూ తెరవలేదు. ఆ రూము నుంచి ఎప్పుడూ ఏవో ఏడుపులు, మూలుగులు, అరుపులు వంటి భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ రూమన్నా, అందులో ఉండే ఆ పిచ్చిదన్నా నాకు చాలా భయం. అసలు నా ఇంటిని నేను పెద్దగా పట్టించుకోను. ఇంట్లో మిగిలినవారి గురించి, ఆ రూము గురించి చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందేమో.. తెలిస్తే వారేమనుకుంటారో.. అని ఎప్పుడూ ఇంటికి తాళం వేసి బయటనే తిరుగుతా. కానీ ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగు వచ్చేస్తుంటుంది. నాకు నేనే డొల్లగా కనపడతా.. ఏదో వేషం వేసుకున్నట్లు. ఆ రూములో పిచ్చిది ఎందుకో నన్ను కలవడానికి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ నేను ఆ రూము తలుపు తీయనుగా. నేను స్పృహలో ఉన్నప్పుడు నా పర్మిషన్ లేకుండా తను రాలేదు. అందుకే నేను నిద్రలోకి జారినప్పుడు తను వస్తుంది- ఓ పీడకలలా.

ఇంటిలో ఓ చిన్నమ్మాయి కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. దానికీ, వరండాలో కూర్చొని ప్రపంచాన్ని చూసే బామ్మకి అస్సలు పడదు. కానీ ఆ చిన్నమ్మాయి అంటే నాకు భలే ఇష్టం. దానితో ఉంటే నాకూ పిల్లచేష్టలు వచ్చేస్తాయి. మళ్ళీ పదిమందీ నన్ను చూసి నవ్వుతారేమోనని భయం. అందుకే ఎవాయిడ్ చేస్తా. మరొక రూములో లంగా- వోణీ, తలలో పూలు, వాలు జడ, పట్టీలేసుకొని ఒకమ్మాయి. పక్క రూంలోనే స్లీవ్లెస్ జాకెట్, మినీ స్కర్ట్, చింపిరి జుట్టేసుకొని సిగరెట్ కాలుస్తూ మరొక అమ్మాయి. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవే. ఎవరిని సమర్థించాలో అర్థం కాదు.

ఒకసారి వరండాలో బామ్మ ఒడిలో తలపెట్టుకొని కలలుకంటూ అడిగా - 'నా రాకుమారుడుని ఎలా కనిపెట్టడం?' అని. 'ఎవరైతే నీ ఇంటికి వచ్చి ఆ రూము తలుపు తీయగలడో వాడే నీ రాకుమారుడు' అని. అప్పటినుంచి చాలామంది అబ్బాయిలను ఇంటికి తెచ్చా. కొందరు బామ్మ చాదస్తానికి, అది దాటినవారు చిన్నమ్మాయి అల్లరికి పారిపోయారు. మరికొందరు లంగా-వోణీ అమ్మాయి దగ్గర, ఇంకొందరు చింపిరి జుట్టు చోరీ దగ్గర బోల్తాలు పడ్డారు. ఇంతలో మావోడు పరిచయమయ్యాడు. వీడే వాడు అని గుర్తించేలోపే బామ్మని ఇంప్రెస్ చేసేసి, చిన్నపిల్లతో చెమ్మచెక్కలాడాడు. లంగా-వోణీని ముగ్గులోకి దించాడు. సిగరెట్ పాపతో డేటింగ్ కూడా చేసాడు. ఒకరోజు సడన్ గా ఆ రూముని నా(తన) సమక్షంలో తెరిచాడు(ను). లోపల ఒకమ్మాయి రోగంతో బాధపడుతూ కనపడింది. నాకు భయం వెయ్యాలా. ఎందుకో భోరున ఏడ్చేసాను. తనపై చాలా జాలి కలిగింది. ఆశ్చర్యంగా నావాడు నన్ను అర్థం చేసుకున్నాడు. అప్పట్నుంచి నేను నా ఇంటివాళ్ళతో చక్కగా గడపటం మొదలుపెట్టాను. దాంతో ఆ రూములోని అమ్మాయి బాగా కోలుకోంది. నా చొరవతో బామ్మ, చిన్నమ్మాయి, లంగా-వోణీ, సిగరెట్, జబ్బుది అందరూ ఒకరితో ఒకరు దగ్గరవ్వసాగారు. వాళ్ల మధ్య పూర్తి సఖ్యత కుదిరాక ఒక గమ్మత్తైన క్షణంలో అందరూ నాలో కలిసి మాయమయిపోయారు. నేను నేనుగా.. నిండుగా అయిపోయాను. భలే ఆనందమేసింది. పరిగెత్తుకొని వెళ్లి నా రాకుమారుడిని కౌగిలించుకున్నాను. అంతా హ్యాపీస్. కధ కంచికి .. మనమింటికి.

నోట్: ఇక్కడ 'నా ఇల్లు' అనేది నా మనసుని (స్పెసిఫిక్ గా ఒక అమ్మాయి మనసుని ) సూచిస్తుంది. ఇంటిలోని ఇతర పాత్రలు నా మనసులో ఉండే భిన్న పార్శ్వాలు.

Monday, September 15, 2008

నెచ్చెలీ!.. నువ్వొస్తావని..

జీవితపు దారిలో నడుస్తూ ఈ చోట నీకోసమని ఆగిపోయాను. నేను వచ్చిన దారిలో విరిసిన ప్రతి పువ్వునీ కోసి అపురూపంగా పట్టుకువచ్చాను. మరి నీకు నచ్చుతాయో.. లేదో. అందుకున్నప్పుడు వాటి ముళ్ళు నిన్ను గాయపరుస్తాయేమోనన్న భయం కూడా ఉంది.

నా కాంప్లెక్సుల ఒంటరి వసారాని ఇంపుగా సంపంగెవై అల్లుకుంటావని...
ఉబుసుపోని ఉక్కబోతలోకి బిగిసిపోయే బంధాల గంధమై వస్తావని ... నీకోసం ఆగిపోయాను.

నాదొక ఒంటరి క్షణం.. నీదొక ఒంటరి క్షణం.. కలిసిన క్షణమది కమనీయమవుతుందని...
నాదొక మాట.. నీదొక మాట.. మురిపాల మూటలై మనసుల్ని వడకాస్తాయని...

నాలోని దాగుండిపోయిన పసివాడు నీ సమక్షంలో బయటకి వచ్చినప్పుడు వాడి మారాన్ని, కేరింతలని కాకిఎంగిలి చేసి పంచుకుంటావని...
నా అనురాగాన్నంతటినీ ముద్దులు చేసి ముద్దలుగా నీకు కొసరి, కొసరి తినిపించాలని...
నీకోసం ఆగిపోయాను.


అలసిపోయి ఇంటికొచ్చిన సూరీడు పశ్చిమప్రౌఢ గుండెల్లో తలదాచుకున్నాడు.
గూటికి చేరుకున్న గువ్వలు జంటగా సేదతీరుతున్నాయి.
ఆరుబయలు ఏటిలో వెన్నెల నగ్నంగా ఆరబోసుకుంది.
నేను ఒంటరిగా నీ తలపులతో తపించాను. ఎదోనాడు ఈ క్షణం మనదవుతుందని...
కాగిన దేహాలు కరిగిన సాక్షిగా మన జీవితలక్ష్యాలకి ఒకరికొకరం ఆజ్యమవుతామని...

Friday, September 5, 2008

ఓ రోజు ...

నేను నడుస్తూ ఉన్నాను. నా నడక వెనక ఎటువంటి మోటివ్ గానీ లాజిక్ గానీ లేవు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వాకింగ్. కానీ నడిచేకొద్దీ నా ఈ ప్రయాణానికి ఏదో సిగ్నిఫికన్స్ ఉందన్న ఊహ బలపడసాగింది. ఎవరిదో గొంతు నన్ను ముందుకి వెళ్ళమని చెబుతున్నట్లుంది. అలా నడుస్తూ చెట్లూ, మొక్కలతో కంచె వేయబడిన ఒక ప్రాంతానికి చేరుకున్నాను. నేను లోపలకి వెళ్లబోయాను. లోపలికి వెళ్లేముందు పర్మిషన్ తీసుకోమని ఆ గొంతు నన్ను హెచ్చరించింది. చుట్టూ మనుష్యులెవరూ లేరు. మరి ఎవర్ని పర్మిషన్ అడగాలా అని చుట్టూ ఉన్నా చెట్లూ, మొక్కల్ని చూసాను. సడన్ గా అవన్నీ జీవం తెచ్చుకున్నట్లుగా అనిపించాయి. వాటిని కూడా సహజీవులుగా చూడటమనేది నాకు ఒక రివేలేషన్ లా అనిపించింది. వాటిని చూసి మనసులోనే పర్మిషన్ అడిగాను. సన్నగా గాలికి చెట్ల కొమ్మలు ఊగాయి. వాటినుండి వచ్చిన గాలి నా ముఖాన్ని తాకింది. ఐ గాట్ మై మెసేజ్. లోపలకి వెళ్లాను. ఏదో తోటలా ఉంది. ఎన్నో ఏళ్లుగా నా రాక కోసం వేచి ఉన్నట్లు అనిపించిందా ప్రదేశం. ప్రకృతి కాంత ఎక్కడిదో ఓ ఆలాపన అందుకొంది. అది చాలా మిస్టీరియస్ గా, చిన్న విషాదపు జీరతో ఉండి వింటున్న కొలదీ నన్ను మరింత ఉద్విగ్నతకు లోనుచేసింది. 'అవును. ఈ రాగమే నన్ను జన్మజన్మలుగా వెంటాడుతోంది 'అన్నఫీలింగ్.. నడుస్తూ ముందుకు వెళ్లాను. ఓ పెద్ద భవంతి ఎదురయ్యింది. నేను వెతుకుతున్నదేదో ఇక్కడే ఉన్నట్లనిపించింది. ప్రధాన ద్వారం ముందరి రాతి మెట్లను ఎక్కుతుంటే అవి నా పాదాల్ని చల్లగా తాకాయి. మెట్లను దాటి నా చేయి ముఖద్వారానికున్న తలుపుని తాకగానే అంత పెద్ద తలుపు కూడా మృదువుగా తెరచుకుంది. లోపలంతా చీకటిగా పాడుబదినట్లుగా ఉంది. కానీ ఎవరో ఆ చీకట్లో రహస్యంగా నన్ను పిలుస్తున్నారు. లోపలకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా చుట్టూ వెలుగుతో నిండిపోయింది. లోపలంతా కొత్తగా రంగురంగుల అద్దాలతో, గాజుదీపాలతో శోభాయమానంగా రాజమందిరంలా మారిపోయింది. రాజుల కాలంలా ఉంది ఆ వాతావరణం. ఎవరో వాగ్గేయకారుడు తన్మయత్వంతో పాడుతూ ఉంటే నలుగురు నాట్యకారిణిలు నృత్యం చేస్తుండగా మరికొందరు వాద్యసహకారం అందిస్తున్నారు. వారెవరికీ నా ఉనికి కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఆ వాగ్గేయకారుడు నాకు మల్లెఉన్నాడు. నా రూపానికి ఓల్డ్ వెర్షన్ లా. ఆ నలుగురు డాన్సర్స్ లో ప్రధాన నర్తకి వాగ్గేయకారుని పాటకి అంతే తన్మయత్వంతో నాట్యం చేస్తున్నది. వాళ్ల చూపులూ, దేహప్రతిస్పందనల వలన వారిరువురి మధ్య గాఢమైన ప్రేమపాశం ఉందని చెప్పకనే తెలుస్తూంది. ఇవన్నీ కాకుండా దూరంగా ఉన్న ఓ శిల్పం నన్ను విపరీతంగా ఆకర్షించింది. నేల మీద కూర్చొని నాట్య భంగిమ లో ఉన్న ఓ ముసలి నర్తకి శిల్పమది. కానీ ఆశ్చర్యంగా ఆమె కళ్లు సజీవంగా ఉండి నన్నే చూస్తున్నాయి. అప్రయత్నంగా నా అడుగులు తన వైపుకి నడిచాయి. ఆశ్చర్యం!.. నేను దగ్గరవుతున్న కొలదీ ఆ శిల్పం ఓ యవ్వనవతిలా మారసాగింది. నేను వెతుకుతున్న ఆత్మబంధువు తనే అన్న భావన ఆమె కళ్ళను చూస్తే కలుగుతోంది. జీవితమంతా ఈ క్షణం కోసమే వేచానేమో. నేను దగ్గరవుతున్న కొలదీ తనకి ఆ ప్రధాన నర్తకి ఛాయలు రాసాగాయి. కానీ ఆమె కళ్లు తప్ప మిగిలినవేవీ జీవం లేకుండా శరీరం అదే భంగిమలో ఉంది. ఆమె కళ్లు నా మీద తన ప్రేమని వర్షిస్తున్నాయి. ప్రేమభావం నన్ను ఉప్పెనలా ముంచెత్తింది. ఆర్తిగా ఆమె పెదవులను ముద్దాడాను. . తనలో కొద్దిగా చలనం వచ్చింది. తన పెదవులను తాకిన నా పెదవులు స్వర్గపు కవాటాలను తెరిచాయి. మరింత ఆవేశంగా చుంబించాను. ఇంతలొ గొల్లున నవ్వు వినపడింది. ఆ వాగ్గేయకారుడూ, డాన్సర్లూ మా చుట్టూ చేరి నవ్వుతున్నారు. అప్పుడు అర్ధమయ్యింది- తను ముద్దుతో పాటు నా జీవాన్ని కూడా లాక్కొని తను బ్రతుకుతోందని. అందుకే నేను ఫూల్ నయ్యానని వాళ్ళంతా నవ్వుతున్నారు. ఒక క్షణం సందిగ్ద పడ్డాను. తన కళ్ళలో అప్పటిలాగే ప్రేమభావం, నిరీక్షణ కనపడ్డాయి. ఈ ఏకత, పరిపూర్ణతల కోసమే ఇన్నాళ్ళూ పరితపించాను. ప్రేమ ఇవ్వడం, పొందడంలోని మాధుర్యాన్ని అనుభవించిన రెండు నిమిషాల బతుకు చాలు అని డిసైడయ్యాను. నా జీవితంలో నేను తీసుకున్న గొప్ప డెసిషన్ ఇది అని అనిపించింది. మళ్ళీ తన కౌగిలి బంధనంలో మమేకమయ్యాను. ప్రేమ అనే అందమైన రంగు కరిగిపోతూ దాని స్థానే తెల్లటి వెలుగు చోటు చేసుకుంటున్న భావన.. మెల్లగా నాలో జీవం పోయింది. ఇప్పుడంతా ప్రకాశమే!.. హాయిగా, తేలికగా ఉంది. అంతలోనే ఒక డౌట్ వచ్చి నన్ను నిలువునా కుదిపేసింది. నేను చనిపోయాక మరి ఎలా ఆలోచించ గలుగుతున్నాను? నా మెదడు ఎక్కడుందీ అని. చాలా గాభరా వేసింది. అంతే. ఆందోళన పెరిగి దిగ్గున లేచాను. కల చెదిరింది. ప్రాతః భానుడు పక్కనే ఉన్న కిటికీలను వెలిగిస్తున్నాడు. ఇంతలొ నా భార్య వచ్చి 'ఏమైందండీ!.. అలా లేచారు. కొంపదీసి నేనేమన్నా కలలోకి వచ్చానా ?' అంటూ నవ్వుతూ అడిగింది. తను నవ్వుతూ ఉంటే ఆ ప్రధాన నర్తకి ముఖచాయలు తనలో లిప్తకాలం పాటు తలుక్కున మెరిసాయి. గుండె ఆగిపోబోయి సంభాలించుకున్నాను. అన్నట్టు చెప్పడం మరిచాను. నా శ్రీమతి పేరు - 'కల్పన'.

Thursday, July 24, 2008

సెర్చ్ ..

నేను దేని గురించి వెతుకుతున్నానో తెలియదు. యే విజయపు వేకువ కోసమో తెలియదు. అసలు విజయమన్నదే లేదు, ప్రతీదీ గొప్ప అనుభవమేనన్న పరిణితి కోసమో ఏమో నేనైతే వెతుకుతున్నాను.

నేను స్వార్థపరుడినో, ప్రేమమూర్తినో తెలియదు. మంచి చేసావు అని ఇతరులు చెప్పే ప్రతి పనిలోనూ నా అంతస్స్వార్ధమే కనపడుతుంది. స్వార్ధం పెరిగి ప్రేమవుతుందా లేక స్వార్ధం కరిగి ప్రేమ పుడుతుందా?.. నాకు తెలియదు. నేను వెతుకుతున్నాను.

నేనెవరిని సమాధానపరచాలనుకుంటున్నానో తెలియదు. నా వాళ్లు, నా చుట్టూ ఉన్నా ప్రపంచానికా .. లేక నాకు నేనేనా?.. ఆత్మసాక్షికే అయితే ప్రత్యేకించి సమాధానం చెప్పనవసరం లేదు కదా!. బహుశా ఈ సమాధానం చెప్పనవసరం లేదు అన్న జ్ఞానం ఇచ్చే స్థితి కోసమేనేమో నేను వెతుకుతున్నాను.

ప్రతీ అందానికీ ప్రతిస్పందిస్తాను. దానిని నాదాన్ని చేసుకొని, అనుభవించి, పరవశించి తేలికవ్వాలో లేక ఆ అందం లోనూ నన్నే చూసుకొని మురిసిపోవాలో తెలియదు. నేను...

జ్ఞానముండీ మాయ కమ్మేస్తుంది. ప్రతిక్షణం ఏమరుపాటుగా ఉండి మాయతో పోరాడాలో లేక మాయలో ఆర్తిగా మునిగిపోయి, రమించి ఆ తీక్షణత కు మాయ కరిగినప్పుడు బోసినవ్వులా బయటపడాలో ఏమో.. నేనైతే...

Friday, July 11, 2008

పరవశం

రాత్రి ఒంటిగంట. గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది. చంద్రుడు చుక్కలతో దొంగాట ఆడుతూ మా పెరటి చెట్టు వెనక్కి నక్కాడు. నేను సబ్దం చెయ్యకుండా పెరటి తలుపు తీసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడెక్కాను. మా మేడని ఆనుకొని ఉన్న ఇంకొక రెండు మేడలని దాటేసరికి సాహితి వాళ్ల మేడ వచ్చేసింది. తను ఇంకా రాలేదు. గత కొన్ని రోజులుగా మేమిలాగే కలుసుకుంటున్నాము. కలిసి చేసేది కూడా ఏమీ లేదు. మనసులని కాసిన్ని కబుర్లతో ఆరబోసుకుంటాము. కొన్ని నవ్వులు విచ్చుకుంటాయి. ఈ కేరింతల నడుమనే కలహాలు కూడా మొదలవుతాయి. ఇక మూతి విరుపులు.. కోర చూపుల బాణాలు.. అరనిమిషపు అలకలు. గుండెల్లోని తొలిప్రేమ భావాలు, ఆకర్షణ, మైకం, పద్దెనిమిదేళ్ళ ప్రాయపు ఉద్విగ్నత ఇవన్నీ కలిసి అందంగా బయటపడాలని ప్రయత్నించి , విఫలమయ్యి ఇలా సిల్లీ కబుర్లు, అర్థం లేని తగాదాలుగా మారిపోతాయి. అయితేనేం.. మనసు కన్వే చెయ్యాలనుకున్నది అండర్ కరెంటు గా కన్వే అయిపోతుంది. తను వచ్చి చూస్తే వెంటనే కనపడకూడదని వాళ్ల మేడని, పక్క మేడని కలిపే పిట్టగోడ వెనక దాగున్నాను. ప్రపంచమంతా నిద్దురపోతోంది. అప్పుడప్పుడూ విసురుగా వచ్చే గాలి దగ్గర్లోని కొబ్బరి చెట్టు ఆకుల్లోకి దూరి ఒక వింత శబ్దం చేస్తుంది. ఇంతలోనే సన్నగా ఓ సిరిమువ్వ ఘల్ మంటూ నా చెవిన పడింది. తను చప్పుడు చెయ్యకుండా వద్దామని ప్రయత్నిస్తున్నా తన పట్టీల కున్న నా ఫేవరేట్ సిరిమువ్వ నాకు సిగ్నల్ ఇస్తూ ఉంది. తను నేనున్న దగ్గరికి వచ్చింది. నేను కనపడకుండా గోడ వెనక కదలకుండా అలాగే కూర్చున్నాను. ఒక్క క్షణం రెండువైపులా నిశ్శబ్దం. ఇంతలొ ఒక్కసారిగా తన కురులు నా ముఖాన్ని కప్పేసాయి. వెనుకగా తన నవ్వు .. సన్నగా.. తెరలు..తెరలుగా. ఆమె రెండు చేతులు నా రెండు చెక్కిళ్ళను పట్టేసాయి. అలా తన కురులు నన్ను కమ్మేస్తూ ఉంటే.. ఎంత బాగుందో.. లేచి మాట్లాడుకున్నాం. పరికించి చూస్తే .. రెండు ఆత్మలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి గాల్లో చెట్టపట్టాలు వేసుకుని కనపడతాయి. అవి ఏంటి మాట్లాడుతున్నాయని చెవి పెట్టారనుకోండి .. మౌనం లోనుంచి ఓ మోహనరాగం విశ్వజనీనమై మిమ్మల్ని పలకరిస్తుంది.

టైము గాడు బండిని సర్రున లాగించేసాడు. జెలసీ ఫెలో. మేము వెళ్ళిపోవాల్సిన టైము వచ్చేసింది. లేచి నిల్చున్నాం. నేను సాయంత్రం రాజాం వెళ్ళిపోతున్నానని చెప్పా. నేను వేరే ఊర్లో(రాజాం లో) ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెలవులకని ఇంటికి వచ్చా. మళ్ళీ బయల్దేరాలి. తను నా కళ్ళలోకి చూసింది. దగ్గరగా వచ్చింది. ఇంకా దగ్గరగా వచ్చి కౌగిలించుకుంది. ప్రియురాలి మొదటి కౌగిలింత. ఫస్ట్ భయమేసింది. మెల్లగా కళ్లు మూసుకున్నాను. భయం కొంచం తగ్గింది. నా చేతులను తన చుట్టూ వేసాను. భయం మాయమయ్యింది. తన చెక్కిలికి నా చెక్కిలి చేర్చాను. అంతే.. ఆ క్షణం అనంతమయ్యింది. ఒక్క అనుభూతి సౌందర్యం తప్ప మరేమీ లేదు. 'నేను' అన్న ఉనికి కూడా లేదు. గురుత్వాకర్షణ ప్రభావం కోల్పోయి లైట్ గా అయిపోయాను. క్షణం కరిగింది. కౌగిలి విడింది. ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోయాం.

సౌందర్యం క్షణికమే కావచ్చు.. కానీ క్షణం సత్యమ కదా!.

Thursday, June 26, 2008

లలిత ప్రియ కమలం - నా సరస్వతి

నీవు భావస్పందనల హృదయరాగానివి. కనులు మూసినంతనే
ఊహల వినీలాకాశంలోంచి ధవళవస్త్రాలతో సమ్మోహనంగా
ఏతెంచుతావు. నిదురిస్తున్న నా వక్షస్థలం వేదికగా మోహినిలా
నాట్యమాడుతావు. నీ ప్రతి పదఘట్టనకీ -
నాలో ఒక్కో కవిత విరబూసుకుంటుంది... హృదయములో
సంగీతం సెలయేరై పారుతుంది... భావం గుండెలోంచి ఒలికి
భౌతికతని సంతరించుకుంటుంది.

నీ సౌందర్యం ఆవిష్కరిస్తున్నకొలదీ అనంతమనిపిస్తుంది.
అమ్మ ఒడి కమ్మదనంలా.. కవ్వించే ప్రేయసిలా..
బడుగు బ్రతుకుల ఆక్రోషంలా.. ఎండుటాకులు చెప్పే
తాత్వికతలా.. ఇలా నీవు కామరూపిణివి.
హృదయేశ్వరీ!, నీ వీణామృతనాదంలో మునుగుతూ
అహాన్ని మరచి నా ఈ జన్మ ఇలానే తరించనీ.

Monday, June 16, 2008

ఒంటరి ఆలాపన

నిస్పృహతో భూమిలో దాగిన మొలకని పులకింపజేయడానికి
ఆనందంగా వచ్చే తొలకరి చినుకు యొక్క హర్షాతిరేకాన్ని నేను.
తర్వాత నాకేమవుతుంది అన్న ఆలోచన, భయమూ నాకు లేవు.

నేను ఈ క్షణపు సౌందర్యాన్ని.

నేను గాలి యొక్క చిలిపితనాన్ని. భూమి కన్న ఓర్పును. కనులలో
కనపడని నీటి ఉద్రేకాన్ని కూడా. ఎప్పుడు బయటపడతానో
నాకే తెలియదు.

నేను కోయిల గొంతు శ్రావ్యాన్ని. తుమ్మెద రొదల అభద్రతని కూడా.

నేను చంద్రుని కోసం ముస్తాబయిన కొలనులోని కలువ భామని.

నేను పండువెన్నెల పంచిన విశ్వజనీన ప్రేమని. అమావాస్య
చీకటిలో ఒంటరి ఆలాపనని కూడా.

Thursday, May 22, 2008

సుప్రజ..5 ..The End

ఇటు మా వ్యాపారం కూడా పుంజుకుంది. మా కంపెనీ ప్రారంభించి
అప్పటికి ఎనిమిది నెలలు అయ్యింది. రాజు, రంగమ్మ ఇద్దరూ
అద్భుతంగా పని చేస్తున్నారు. రాజు బయట నుంచి ఆర్డర్‌లు
బాగా తీసుకొచ్చేవాడు.అంతకుముందు ఆటపట్టించిన అమ్మాయిలే
ఇప్పుడు రాజు పట్ల అభిమానం, గౌరవం చూపిస్తున్నారు.
మా ఉత్పత్తులకి ఆదరణ పెరిగి, మంచి పేరు వచ్చింది. ఇతర
రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఇంకా చాలా మంది
మహిళలు మాతో కలిసారు. కొందరైతే పొరుగూరు నుంచి
కూడా ఇక్కడకి వచ్చి పని చేస్తున్నారు. చిన్నగా ప్రారంభించిన
మా కంపెనీ ఎనిమిది నెలలలోనే పదిహేను లక్షల టర్నోవర్‌ని
చేరుకుంది. ఒక ప్రముఖ దినపత్రిక మా కంపెనీ గురించి ఆర్టికల్
వేసింది. నా ఫోటో, రంగమ్మ, రాజుల ఫోటోలు కూడా వేసారు.
మా ఊరి ప్రెసిడెంట్ ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు
చేసారు. మమల్ని అభినందించటానికి రామ్మూర్తి మామయ్య,
అత్తయ్య వచ్చారు. సభలో రాజు ఎందుకో కొంచం నీరసంగా, ఎక్కడో
కోల్పోయినట్లుగా అనిపించాడు. నేను, రంగమ్మ మాట్లాడాక
రాజుని ప్రసంగించమని అడిగారు. రాజు తడబడుతూ మైకు
అందుకున్నాడు. ఒక రెండు నిమిషాలు నోరు పెగల్లేదు. అప్పుడు
అర్థమయ్యింది-రాజు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడని. "ఒకప్పుడు
నేను అసలు మనిషినే కాదు. పశువులా ప్రవర్తించి జైలుకి కూడా
వెళ్లాను. ఇప్పుడు నేను మైకు అందుకుంటే ‘మన రాజుగాడు రా!..
మన రాజు గాడు!!’ అని ఎంతోమంది అభిమానంతో చూస్తున్నారు.
నా పేరు పేపర్లోకి ఎక్కింది. మా అమ్మా, నాన్నా వచ్చారు నన్ను
చూడటానికి." తన కంటి నుంచి నీరు తన్నుకొస్తుంది.
ఏడ్చేస్తున్నాడు. నేను దగ్గరకి వచ్చి తన భుజం మీద చెయ్యి వేసాను.
రాజు సర్దుకొని మళ్లీ మైకు అందుకొని, "నేను ఇప్పుడిలా
మారడానికి కారణం ఓ స్త్రీ మూర్తి. నా సంకుచిత దృష్టిని
విశాలం చేసి, నా జీవితాన్ని ఆనందమయం చేయటానికి తన
ఉద్యోగాన్ని సైతం వదులుకొని వచ్చిన ఆమె మరెవరో కాదు. మన
మ్యానేజింగ్ డైరెక్టర్-సుప్రజ." నాకేమి అర్థం కాకుండా అలాగే
నిలబడ్డాను. రాజు నాదగ్గరికి వచ్చి, "నన్ను క్షమించు" అని
నా కాళ్ల మీద పడబోయాడు. నేను " ఏంటి బావా ఇది? చిన్న
పిల్లాడిలా.." అని భుజాలు పట్టుకొని తనని ఆపేసాను.
ఆశ్చర్యంగా నా కళ్లు కూడా వర్షించేస్తున్నాయి. వాటిని
తుడుచుకుంటూ రంగమ్మని చూసాను. రంగమ్మ నిండుగా నవ్వింది.
వంశీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. వంశీకి ఎప్పటికప్పుడు
ఇక్కడి విషయాలు తెలియజేస్తూ ఉంటాను. తను "సుప్రజా!..
నిన్నుచూస్తుంటే నాకు గర్వంగా ఉంది." అన్నాడు.
నాకు భలే అనిపించింది.

పిల్లలందరూ చుట్టూ చేరేసరికి నేను గతంలోంచి బయటకి వచ్చాను.
"రాజు వెళ్లిపోయాడు. ప్యాకెట్‌లో ఏముందో చూడు." అని పిల్లలు
గోల చేస్తుంటే ప్యాకెట్ తెరచి చూసాను. చూస్తే, కర్రతో చేసిన
వంశీకృష్ణుని బొమ్మ. చాలా బాగుంది. ఇంతలో వంశీ బస్సు దిగాడు.
కృష్ణుని బొమ్మ ముఖానికి అడ్డం పెట్టుకొని మెల్లగా బొమ్మని జరిపి
ఒక కన్నుతో చూసాను- ఎదురుగా నా వంశీకృష్ణుడు.

...................................శుభం.........................................

సుప్రజ..4

రాజు వసతి మా చిన్నాన్న గారి దగ్గర పెట్టించాను. మా చిన్నాన్న
వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లు. మనుషులే కాకుండా, చెట్లు,
పక్షులు, కుందేళ్లు అన్నీ ఆనందంగా సహజీవనం చేస్తాయి అక్కడ.
చిన్నాన్న మా ఊరి ప్రాధమిక పాఠశాల హెడ్‌మాస్టరు.
అప్పుడప్పుడు ఊరి ప్రజలకోసం ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తుంటారు.
రాజు గురించి చిన్నాన్న వాళ్లకి చూచాయగా చెప్పాను. ఇంక మా
ఆఫీషులో అందరూ ఆడవాళ్లే ఒక్క రాజు తప్పించి. అందులోనూ
యువత శాతం సగానికి పైగానే. ఎప్పుడూ అమ్మాయిలతో పెద్దగా
మాట్లాడని రాజు ఇప్పుడు ఈ పల్లెటూర్లో.. మా మహిళల మధ్య
ఉద్యోగిగా ..ఎలా వుంటాడో, అది తనకి మంచి చేస్తుందో లేదో
అని నాకు సందేహాలు ఉన్నా రెండు కారణాలు నాలో
విశ్వాసాన్ని నింపేవి. ఒకటి మా లిల్లీస్ గ్రూపు లీడర్ రంగమ్మ.
మరొకటి స్వచ్ఛమైన మా పల్లెటూరి వాతావరణం.

రంగమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. తనని చూస్తే
పరిచయం లేకపోయినవారికైనా ఆత్మీయరాలుగా కనపడుతుంది.
మన బాధలన్నీ తనతో పంచుకోవాలనిపిస్తుంది. నాకైతే
తను ఒక మనిషిని చూస్తే ఆ వ్యక్తి యొక్క అలోచనలు,
భయాలు, అభద్రతా భావాలు ఇవన్నీ మరుక్షణం తనకి
తెలిసిపోతాయెమో అనిపిస్తుంది. ఎప్పుడూ చాలా సంతృప్తిగా
కనపడుతుంది. ఒకే సమయంలో చలాకీగానూ, నిర్మలంగానూ
ఉండటం తనకే చెల్లుతుందేమో. తను ఊర్లో ఉత్సవాలకి
బుర్రకధలు చెబుతుంది. ఊర్లో వాళ్లందరూ బుర్రకథలు
చెప్పాలంటే రంగమ్మే అంటారు. ఇంక రంగమ్మ, వాళ్లాయన
ఇద్దరినీ కలిసి చూడాలి. ఇద్దరూ చిన్నపిల్లల్లా ఆటలూ,
పాటలూ, అలకలూ, కోట్లాటలూ.. ఏమంటే, "మాకు పిల్లలు
లేరు కదమ్మా. అందుకే తనకు నేను, నాకు తను
చిన్నపిల్లలమైపోతాము." అంటారు.

ఆలాగే మా ఊరు కూడా. ఇంకా పట్నపు వాసనలు సోకని
పదహారణాల పల్లె మాది. ఒకరి ఇంట్లో చిన్న సమస్య వస్తే
అది వీధిలో అందరి సమస్య అవుతుంది. ఎప్పుడూ ఏదో సందడి
వాతావరణమే. పండగలు,తిరునాళ్లు, వ్రతాలు, మహాశివరాత్రి,
భీష్మ ఏకాదశి, రథసప్తమి ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే
ఉంటుంది. పిల్లలు చాలా స్వేచ్ఛగా ప్రకృతి ఒడిలో పెరుగుతారు.
ఆత్మీయతలూ, అనుబంధాలు ఇంత అందంగా ఉంటాయని
మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇంకొకరితో మాటలు కలపడానికి
సందేహించటం, లోపల ఒకలా, బయట మరొకలా ఉండటం..
ఇలాంటివి ఎలా ఉంటాయో కూడా చాలామందికి తెలియదు.

మొదట్లో రాజు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కేవలం ఆఫీషు
విషయాల గురించే మాట్లాడేవాడు-అదీ నాతోనే. నేను తనని
ఒక దోషిగా చూస్తున్నట్టు భావించేవాడు. మా కంపెనీలో తన
ఉద్యోగం మీద కూడా తనకి చులకన భావమే ఉంది. నేను కూడా
ఆఫీషు పనుల గురించే మాట్లాడేదాన్ని. "ఇంకా వివరాలు
కావాలంటే, రంగమ్మని అడుగు." అని చెప్పేదాన్ని. అలా రంగమ్మతో
మాట్లాడేవాడు. చిన్నాన్న వాళ్ల ఇంట్లో కూడా అంతే. కానీ చిన్నాన్న,
పిన్నీ విసుగు పడకుండా చక్కగా చూసుకునేవారు. ముభావంగా
ఉండటం వలన కొన్నాళ్లకి చుట్టుపక్కల వాళ్లు రాజుని
ఏడిపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వీధిలోని అల్లరి పిల్లలు
ఇంక ఆఫీషులో అమ్మాయిలు. ఈ ఏడిపించటం రోజురోజుకీ
ఎక్కువయ్యింది. ఆఫీషులో శృతిమించకుండా రంగమ్మ చూసుకొనేది.
కానీ వీధిలో పిల్లలు మాత్రం అస్సలు క్షమించేవారు కాదు. వీధిలో
రాజు నడుస్తూ ఉంటే, వెనకాల పిల్లల గ్యాంగు తన మీద ఏదో
పాట కట్టి ఏడిపించేవారు. రాజులో కూడా ఈ విషయంలో విసుగు,
చికాకు పెరుగుతున్నట్టు గమనించాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని
సందేహించసాగాను. రంగమ్మతో చర్చిస్తే కొంచం ఓపిక
పట్టమంది.

అది గాలిపటాల సీజను. వీధిలో పిల్లలందరూ గాలిపటాలు
ఎగరేస్తున్నారు. గౌతమ్ (మా చిన్నాన్న చిన్న కొడుకు) గాలిపటం
చెట్టుకొమ్మకి చుట్టుకొని తెగిపోయింది. అది చూసి రాజు వాడికోసం
తనే సొంతంగా ఒక గాలిపటాన్ని తయారు చేసాడు. ఆ గాలిపటం
డిజైన్ అదీ కొత్తగా ఉండి వీధిలో అందరి గాలిపటాల కన్నా
ఎత్తుగా ఎగిరింది. దాంతో పిల్లలందరూ "నాకొకటి చెయ్యవా?"
అంటూ రాజు వెంటపడ్డారు. రాజు వాళ్లందరికీ మంచి మంచి
డిజైన్లు, రంగులతో కొత్త, కొత్త గాలిపటాలు తయారు
చేసిచ్చాడు. వాళ్లకీ తయారు చెయ్యడం నేర్పించాడు. దీంతో వీధి
పిల్లలందరికీ రాజు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. తనని
ఏడిపించడం మానెయ్యడమే కాదు, ఇప్పుడు దేనికైనా
రాజు, రాజు అంటూ వెంటతిరుగుతున్నారు. రాజు కూడా మెళ్లగా
వాళ్లకి క్రికెట్ బ్యాట్‌లు తయారు చేసి ఇవ్వడమూ, వాళ్లతో
అప్పుడప్పుడూ క్రికెట్ ఆడటమూ మొదలుపెట్టాడు. రాజులో
ఇదివరకటి విసుగు లేదు. కొన్నాళ్లకి ఊర్లో గ్రామదేవత
ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాలన్నిటి
కన్నామన ఊర్లో బాగా జరగాలన్నట్టు అందరూ సన్నాహాలు
చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ మా చిన్నాన్న చేపట్టారు. రాజుకి
అక్కడి లైటింగు ఏర్పాట్లు అస్సలు నచ్చలేదు. తను చేస్తానన్నాడు.
చిన్నాన్న "సరే" అన్నారు. రాజు సిటీకి వెళ్లి, కావల్సినవన్నీ
కొనుక్కొని, ఇక్కడ పిల్లలు, కొందరు ఆర్టిస్ట్‌లతో కలిసి
కర్రలతో పెద్ద పెద్ద దేవుళ్ల ఆకారాలు చేసి దానికి లైటింగు
ఏర్పాట్లు చేసాడు. చాలా అద్భుతంగా వచ్చింది. ఊరు ఊరంతా
రాజు పేరు మార్మోగిపోయింది. ఈ రెండు సంఘటనలు రాజుని
బాగా ప్రభావితం చేసాయి.మొదట వీధిపిల్లలతో ఆటలు.. నెమ్మదిగా
తన ఈడు వారితోనూ, పెద్దలతోనూ ఊర్లో చిన్న చిన్న
కార్యక్రమాల నిర్వహణ.. ఇలా కలుపుగోలుగా మారాడు. ఆఫీసు
పని కూడా ఉత్సాహంగా చేస్తున్నాడు. ఆఫీసులో అమ్మయిలతో
కూడా కొద్ది, కొద్దిగా మాట్లాడసాగాడు. రంగమ్మ, తను అయితే
స్నేహితుల్లా కలిసిపోయారు. రాజులో ఏదో కొత్త వెలుగు.
తనని తాను సరికొత్తగా తెలుసుకుంటుండటం వల్లనేమో.

సుప్రజ..3

నేను రాజు ఎందుకిలా తయారయ్యాడు అని ఆలోచించసాగాను.

వంశీ, నేను కలిసి మా అత్తా, మామయ్యలతోనూ, తన ఫ్రెండ్స్‌

తోనూ తనని గురించి విచారించాము. మా అత్తా, మామయ్యలకు

తను ఒక్కడే కొడుకు. రాజు వాళ్ల నాన్న అంటే మా రామ్మూర్తి

మామయ్య పెళ్లైన కొత్తలోనే బంధువులందరూ ఉన్నమా ఊరు

వదిలి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మేమందరమూ మా

ఊర్లో కలుపుగోలుగా చాలావరకూ సత్సంబంధాలతో ఉంటాము .

రామ్మూర్తి మామయ్యకీ మిగిలిన బంధువులకీ మధ్య రాకపోకలు

కూడా తక్కువే. అవసరమయితేనే కనపడతాడు అని చెబుతూ
ఉంటారు. ఇక రాజు పెరిగిన తీరు విషయానికి వస్తే, మా అత్తా,

మామయ్యలు ఎప్పుడూ ‘చదువు, చదువు’ అని బలవంతపెట్టటమే

కానీ ‘పిల్లలు వ్యక్తిత్వపరంగా ఎలా ఎదుగుతున్నారు? వాళ్ల

భావోద్వేగాలు ఏంటి?’ అని పట్టించుకొనే వాళ్లుగా నాకు

అనిపించలేదు. రాజు క్లాస్‌మేట్స్‌నీ, కొలీగ్స్‌నీ విచారిస్తే వాళ్లు

తను చాలా రిజర్వ్‌గా ఉంటాడనీ, తన ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు

ఎవ్వరూ లేరని చెప్పారు.దానికి తోడు రాజు ఇంటర్‌మీడియట్

వరకూ కో‌ఎడ్యుకేషన్ విధానంలో చదువుకోలేదు. తనకి

కొంచం దగ్గరయిన ఒక ఫ్రెండ్‌ని అడిగితే రాజు తనతో

అమ్మాయిలు ఎవ్వరూ మాట్లాడరని బాధపడుతుంటాడని చెప్పాడు. రాజు
భవిష్యత్తు ఏంటని అప్పుడు ఆలోచిస్తే, తను హైదరాబాద్‌లో ఇంక
కొన్నాళ్లవరకూ ఉద్యోగం చెయ్యలేడని అనిపించింది. పొనీ వేరే
సిటీలో ఉద్యోగం చూసుకున్నా, ఆ రోజు జరిగిన సంఘటనలు,
వాటి పరిణామాలు (తను జైలుకెళ్లడం, ఉద్యోగం పోవడం)
వీటన్నింటివలన తను అమ్మాయిలని మరింత ద్వేషించుకుంటాడు.
అమ్మాయిల పట్ల తనకున్న అపోహలు, ఆత్మన్యూనతా భావము
అలానే ఉండిపోతాయి. బాగా ఆలోచించి ఒక నిర్ణయం
తీసుకున్నాను. వంశీకి చెప్పాను. అది చాలా రిస్క్ అని తను
మొదట్లో ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పించగలిగాను. తర్వాత ఈ
విషయం గురించి మా అత్తా, మామయ్యలతో మాట్లాడాము. వారు
నిర్లప్తంగా ‘సరే’ అన్నారు. నేను రాజు దగ్గరికి వెళ్లి "నీకు మా
ఊర్లో ఉద్యోగం ఇప్పిస్తాను. నాతో వస్తావా?" అనడిగాను. కాసేపు
మౌనంగా ఉండి, ‘సరే, వస్తాన’న్నాడు. ‘ఏ ఉద్యోగం?
ఎలాంటి పని?..’ లాంటి కనీస వివరాలు కూడా అడగలేదు.

ఇంక మా ఊరు వచ్చి నేను ఒక చిన్న కంపెనీ ప్రారంభించాను.
నాకు ఎప్పటినుంచో ఈ ఆలోచన ఉన్నా అంత త్వరగా
చేస్తాననుకోలేదు. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలలోని
నాకు తెలిసిన ఒక ఇరవై మంది సభ్యులుగా చేరారు. రంగమ్మ
వీళ్ల గ్రూపు లీడరు. మొదట ఉన్ని ఉపయోగించి శాలువాలు
తయారుచెయ్యడం, వాటి మీద ఆర్ట్ వర్క్ వెయ్యటం, కర్ర మరియు
గ్లాసు ఉపయోగించి గృహాలంకరణ వస్తువులు, అందమైన
హాండ్‌బ్యాగులు తయారుచెయ్యటం తదితర అంశాలపై శిక్షణ
ప్రారంభించాము. మా కంపెనీకి ‘లిల్లీస్’ అని పేరు పెట్టాము. రాజు
మా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముభావంగానే
బాధ్యతలు చేపట్టాడు. వంశీ ఉద్యోగనిమిత్తము యూరప్ వెళ్లవలసి
వచ్చింది. మా ప్రేమ విషయం తను అటునుంచి వచ్చాక ఇరువర్గాల
పెద్దలకీ చెబుదామనుకున్నాము.

సుప్రజ...2

"ఏంటి వంశీ కోసం వెయిటింగా?" అనడిగాడు. అవునన్నట్టు


నవ్వాను. "నువ్వేంటి ఇక్కడ .. ఇలా?" అనడిగాను.


"నీకోసమే" అన్నాడు. రాజు ఎప్పుడూ అలా మాట్లాడడు.


అప్పుడు గమనించాను రాజు కళ్లు చాలా అశాంతిగా కనిపించాయి.


చూపులు అటూ, ఇటూ కదులుతున్నాయి. "ఊ.. చెప్పు బావ..
ఏంటి సంగతులు?" అనడిగాను. కాసేపాగి


"సుప్రజా!!, హాపీ వాలెంటైన్స్ డే." అన్నాడు. ఆశ్చర్యంగా, రాజు


గొంతు వణుకుతోంది. అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నా వంతు


అయ్యింది. కొంచం నవ్వడానికి ప్రయత్నిస్తూ థాంక్స్ చెప్పి,


"ఏంటి బావా.. అలా ఉన్నావు?" అని అనునయంగా భుజం మీద


చెయ్యి వేసి అడిగాను. "వద్దూ!!" అంటూ ఒక్కసారిగా నా చెయ్యి


విదిల్చేసాడు. "ఇలా మాట్లాడే నువ్వు నన్ను మోసం చేసావు."


రాజు ఊగిపోతూ ‘నన్ను మోసం చేసావు’ అన్న అదే మాట మళ్లీ
మాట్లాడుతున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. మెదడు పనిచెయ్యటం


ఆగిపోయినట్లుగా ఉంది. కొంచం సంభాళించుకొని, "ఏంటి బావా..


నేను మోసం చెయ్యడమేంటి.. ఏమి మాట్లాడుతున్నావు నువ్వు?"
అన్నాను. "ఆపు!!" అంటూ చేతుల్ని గాలిలోకి బలంగా కొట్టాడు.


"ఏమీ తెలియనట్టు ఈ అమాయకపు నటనలు వద్దు. వద్దుఇంక..


అసలు మీ ఆడవాళ్లందరూ ఇంతే. అంతా చేసి చివరికి నేను


నీ గురించి అలా ఫీలవ్వలేదంటారు." అని వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.


నేను అలా స్తబ్దుగా ఉండిపోయాను. ఇంతలో వంశీ మెసేజ్


వచ్చింది-‘ఇంకొక 10 నిమిషాలు లొ వచ్చేస్తాను అని’. "నేనంటే నీకు


ఇష్టమే కదా" అన్న మాటలు వినపడి చూస్తే మళ్లీ రాజు.


"చూడు బావ.. నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నావు.


మొదట నువ్వు నిదానంగా ఉండు.." అని ఇంకా చెప్పబోతుంటే,


"మరి నాకు ఫోన్ చేసి అభిమానంగా ఎందుకు మాట్లాడతావు?


నా బర్త్‌డేకి గ్రీటింగు, గిఫ్టులు ఎందుకు తెచ్చావు? గ్రీటింగులో
నేను ‘వెరీ స్పెషల్’ అని లేదూ.. అంటే దాని అర్థమేమిటి .. చెప్పూ..


ఇవన్నీ ఇష్టం లేకుండానే చేసావా?.. నాకున్నది నువ్వొక్కదానివే


అనుకున్నాను. నువ్వు కూడా నన్ను మోసంచేసావు!!.." అని


ఆవేశంగా ఏవేవో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు తన సమస్య


కొంచం అర్థమవ్వసాగింది. "నేను ఇక్కడికి వచ్చాక హైదరాబాద్‌లో


నాకున్న బంధువులు మీరొక్కరే. మరి మీతో కాకుండా మరెవరితో


మాట్లాడతాను? నువ్వు బాగా చదువుతావని, మంచి క్రమశిక్షణతో


నడచుకుంటావని నాన్న నీ గురించి చెబుతుండటం వలన నాకు నీ


మీద చాలా మంచి అభిప్రాయం, గౌరవం, అలాగే బావవన్న అభిమానం


ఉన్నాయి. అందుకే బర్త్‌డేకి గ్రీటింగ్ కార్డ్స్ అవీ ఇచ్చాను. ఇంక


గ్రీటింగ్ కార్డ్‌లో వెరీ స్పెషల్ అని ఉండటం చాలా క్యాజువల్. దానిని


నువ్వు వేరే విధంగా.." ఇంకా ఏదో చెప్పబోతుండగా తను దగ్గరగా


ముఖం మీదకు వచ్చి, నా మాటలను కట్ చేస్తూ, "క్యాజువలా.. ఆ వెరీ


స్పెషల్ అన్నమాట నన్ను ఎన్ని ఊహల్లో ఎగరేసిందో.. నా ప్రపంచాన్ని


ఎంతలా మార్చేసిందో నువ్వు కనీసం ఊహించావా.. అయినా దాని


అర్థం నీకు మాత్రం తెలియదూ.. ప్లీజ్ సుప్రజా!!.. నన్నర్థం చేసుకో.


నాకు నువ్వు కావాలి. ఇంతవరకూ నాకు దగ్గరయ్యింది నువ్వొక్కదానివే.


నువ్వు నాకు కావాలి." అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు. తను


ఆవేశంతో గట్టిగా మాట్లాడటం వలన చుట్టుపక్కల వాళ్ల దృష్టి


మా మీద పడింది. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. నాకు చాలా


ఇబ్బందిగా అనిపించింది. నేను కోపంగా చెయ్యి విదిల్చి, దూరం


జరగబోయాను. తను నా చున్నీ పట్టుకొని నన్ను దగ్గరకు


లాగాడు. ఆ హఠాత్పరిణామానికి గట్టిగా అరిచాను. నా చున్నీ తన


చేతులోకి వచ్చేసింది. రాజు మృగంలా మారిపోయాడు. నేను


అరవటం గమనించిన రాజు నన్ను పట్టుకొని నా నోరు


నొక్కేయబోయాడు. నేను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే,


నా రెండు చేతులూ బలవంతంగా వెనక్కి విరిచి, ఒక చేత్తో వాటిని


పట్టుకొని మరొక చేత్తో నా నోరు నొక్కేస్తూ "అరవకు.

చంపేస్తాను" అని బెదిరించాడు. నేను తన కబంధ హస్తాల్లో

గింజుకుంటున్నాను. ఈలోపు చుట్టుపక్కల వాళ్లు వచ్చి, రాజుని

నా నుంచి విడదీసి తనకి దేహశుద్ధి చేయసాగారు. నేను

అవమానంతో అక్కడే కూలబడిపోయాను. ఇంతలో నా భుజం

మీద ఒక చెయ్యి పడింది. తలెత్తి చూస్తే వంశీ. ఒక్క ఉదుటన

తనని కావలించుకొని భోరున ఏడ్చేసాను. కాసేపటికి

పోలీసులు వచ్చారు. రాజుని తీసుకెళ్లారు. మమ్మల్ని తరువాత

రమ్మన్నారు.


రాజు మీద ఈవ్ టీజింగ్ మరియు హత్యాప్రయత్నము నేరాల మీద

కేసు నమోదు అయ్యింది. కొంత జరిమానా, కొన్ని రోజుల జైలు

శిక్ష పడింది. మర్నాడు ప్రముఖ వార్తాపత్రికల జిల్లా ఎడిషన్‌లలో

ఈ వార్త రాజు ఫోటోలతో సహా పడింది. రాజుని వాళ్ల కంపెనీ

ఉద్యోగంలోంచి తొలగించింది. మామయ్య తనని బెయిల్ మీద

విడిపించారు. మరుసటి రోజు తను ఆత్మహత్యా ప్రయత్నం చేసి

హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి నేను, వంశీ వెళ్లాము. రాజు ఆపరేషన్

రూంలో ఉన్నాడు. ఏం జరిగిందని మామయ్యని అడిగాను. రాజు

ఇంటికి వచ్చాక ‘నన్ను ఎక్కడికైనా పంపించెయ్య’మని అడిగాడట .

‘నువ్వు చేసిన పనికి ఇక్కడే ఉండి అనుభవించు’ అని మామయ్య

నిష్ఠూరంగా అన్నారట . తరువాత చూస్తేబాత్‌రూంలో పురుగుల

మందు తాగేసి పడి ఉన్నాడట. రాజు హాస్పిటల్ నుంచి డిస్‌ఛార్జ్

అయ్యేవరకూ అత్తకు తోడుగా నేనూ తనకి సేవలు చేసాను.

సుప్రజ...1

మనోహరంగా నిద్రలేచాను.. ఈ రోజు వంశీ వస్తున్నాడు. తన
ఆలోచనలతోనే పడుకున్నాను. వాటితోనే నిద్ర లేచాను. వాకిలి
తలుపులు తెరచి బయటకు వచ్చాను. జనవరి మాసపు
ఉదయం ఐదు కావస్తూంది. చల్లగాలి చెలికత్తెలా సంబరంగా
చుట్టుముట్టింది. నక్షత్రాలు అందమైన స్మృతులను
గుర్తుతెచ్చుకొని తమలో తాము నవ్వుకుంటునట్లుగా ఉన్నాయి.
కళ్లాపు చల్లి ముగ్గువెయ్యటం మొదలుపెట్టాను. ముగ్గు వేసానో
లేక నా మనసే గీసానో, వేసాక చూసుకొని గారాలు పోయాను.
ఎందుకో ప్రతీ పనీ ఎంతో అపురూపంగా మురిసిపోతూ చేస్తున్నాను.
పూలు కోసాను. ఆ వంశీకృష్ణునికో ... నా వంశీ కృష్ణునికో..
స్పష్టంగా చెప్పలేను. ఇంక తలంటు స్నానం ... నీ ప్రేమ నన్ను
ఏంచేసిందో గానీ నన్ను నేను మరింతగా ఇష్టపడుతున్నాను.
ఎంత గొప్ప అనుభవమో ఇది!!. స్నానం చేసాక లంగా, వోణీ
వేసుకొని, తడిచిన జుత్తుని తువాలులో చుట్టి, ముడివేసి,
కాళ్ల పట్టీల మువ్వలు సవ్వడి చేస్తుండగా వాకిలి తెరచి
తులసి చెట్టు ముందు దీపం వెలిగించాను. కొంచం దూరం
వెళ్లిచూస్తే, తూరుపు తెలతెలవారుతుండగా చిరు దీపపు
కాంతిలో తులసి మా తల్లి ఎంత శోభగా ఉందో. తర్వాత
అమ్మతో కలసి దేవుడి గదిలో పూజ. ఆ తర్వాత జుత్తు
ఆరబోసుకోడానికి అమ్మ సాంబ్రాణి ధూపం వేసింది.
నా ఊహలో నువ్వున్నప్పుడు ఈ దేహం సుగంధంతో
తొణుకుతుంటుంది కదా.. మరి ఈ ధూపాలెందుకు అనిపించింది.
పిచ్చి అమ్మ .. తనకు తెలియదు కదా!. అప్పటికే ఇంట్లో మిగిలిన
పిల్లలూ, పెద్దలూ అందరూ ఒక్కొకరుగా లేవటం మొదలుపెట్టారు.
ఇంక గమ్మున తెళ్లారింది.

నేను కనకాంబ ఆలయం పక్కన రావి చెట్టు దగ్గర నిల్చొని
చూస్తున్నాను. మా ఊరికొచ్చే బస్సులు అక్కడే ఆగుతాయి. రత్నం
మామయ్య, శిరీష అప్పటికే వచ్చేసారు. అన్నట్టు చెప్పడం మరిచాను
కదా..వంశీ నాకు బావ అవుతాడు.. రత్నం మామయ్య కి కొడుకూ
.. శిరీషకి అన్నయ్యానూ. బయట ఆడుకుంటున్న పిల్లలు నా
చుట్టూ మూగారు. ఇంతలో నాగరాజు బావ వచ్చాడు. తనని నేను
రాజు అని పిలుస్తుంటాను. "వంశీ గురించి వెయిటింగా?"
అనడిగాడు. అవునన్నట్టుగా నవ్వాను. తను కవర్‌లోంచి ఒక
ప్యాకెట్ తీసి నా చేతికిచ్చి, “నేను వెళ్లిపోయాక ఓపెన్ చెయ్యు” అని
చెప్పి వెనక్కి మళ్లాడు. నేను వెళ్లిపోతున్న రాజునే చూస్తున్నాను...

గత సంవత్సరపు మాట. నాకు స్పస్టంగా గుర్తుంది-ఆ రోజు
ప్రేమికుల రోజు. నేను వంశీ గురించి ఈరోజులాగే హైదరాబాద్‌లో
నిరీక్షిస్తున్నాను. వంశీ ముంబాయిలో ఒక ప్రముఖ న్యూస్ చానెల్ కి
పనిచేస్తున్నాడు. నేను సైకాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి
ఇక్కడ హైదరాబాద్‌లో ఒక పర్సనల్ కౌన్సిలింగ్ కన్సల్టెన్సీలో
పనిచేస్తున్నాను. కొన్ని నెలల తర్వాత కలవబోతున్నాము. తను
అక్కడ నుంచి బయలుదేరిన ప్రతీ గంటకీ మొబైల్‌కి మెసేజ్
పంపిస్తున్నాడు. ఇంతలో రాజు వచ్చాడు.

Friday, April 18, 2008

వెన్నెల సంగీతం

వెన్నెల రేయి.. సన్నని దారి.. దారికిరువైపులా గుబురుగా పెరిగిన
చెట్లు.. గాఢాంధకారం. కానీ దారిన మాత్రం చెట్లకొమ్మలు వడకాచిన
వెన్నెల వెలుగు.. ఎంత బాగుందో!!. ఆ దారిలో సాహితీ, నేనూ
నడుస్తున్నాము. ఒకరంటే ఒకరికి ఇష్టమని ఇద్దరికీ తెలుసు
(గుండెల్లోని ప్రేమని కన్నులు ఒలికిస్తాయి కదా!.). కానీ మాటల్లో
ఇంకా చెప్పుకోలేదు. చల్లగాలి ఇద్దర్నీ హత్తుకుంటోంది. పక్కన
నడుస్తుంటే, తన జడను సింగారించిన సన్నజాజుల పరిమళం
నన్ను అప్పుడప్పుడూ కమ్మేస్తుంది. నడకను అనుసరించి తన
చెవి జూకాలు కదులుతున్నాయి. కాళ్ల పట్టీలకున్న చెరొక
సిరిమువ్వ లయబద్ధంగా ‘ఘల్’మంటోంది. ఇంత ఏకాంత ప్రదేశంలో
మేమిద్దరమే ఉన్నామన్న ఆలోచన రాగానే, ఏవేవో ఊహలు నా
మనసుతో బంతాడుకున్నాయి. నడుస్తూ ఏటి వద్దకు వచ్చేసాము.
ఇప్పుడు పడవ మీద అవతలి వైపుకి వెళ్తే అదే మా ఊరు.
జాతరకని ఇక్కడకి వచ్చాము. అందరూ బస్‌లో ఊరికి వెళ్తామంటే
మేమిద్దరమూ పడవలో వస్తామని ఇలా వచ్చాము. పడవ వచ్చేసరికి
ఇంకొక అరగంట పడుతుంది. వెన్నెల మబ్బుల వలువలు విడిచి
ఏరంతా పరుచుకుంది. ఒడ్డున నీళ్లలో కాళ్లు పెట్టుకొని
కూచున్నాము. తను నీళ్లలో పాదాలు ఆడిస్తోంది..అందమైన
లేత పాదాలు.. వాటిని చూస్తూ దగ్గరికొచ్చాను. తన పాదాన్ని నా
అరచేతిలోకి తీసుకున్నాను. మరుక్షణం నా గుండె నా అరచేతిలోకి
వచ్చేసినట్టుగా ఉంది. ఇంకొక చేతితో నీటిని తీసుకొని పరవశంగా
తన పాదం మీద పోసాను. తను ఆశ్చర్యంగా చూసింది. నేను
ఆర్తిగా ఆ పాదాల్ని ముద్దాడాలనుకున్నాను. కానీ ధైర్యం చాల్లేదు.
తరువాత ఏవో మాట్లాడుకున్నాము. నే వేసిన జోకులకి తను
నవ్వుతోంది. తను నవ్వుతుంటే ఆ అందం చుట్టూరా
పరుచుకుంటున్నట్లుగా ఉంది.. ఈ ఏరంతా.. ఆ ఆకాశమంతా..
అందులో నేను నిండుగా మునిగిపోతున్నాను.

పక్కన చిల్లిగవ్వలు ఏరి కప్పగంతులు వేస్తున్నాము. "ఎవరు
ఎక్కువ వేస్తారో!.. పందెం?" అంది. సరేనన్నాను. నేనే గెలిచాను.
"మరి ఏమిస్తావు?" అనడిగా. "ఏం కావాలి?" అంది.
"ఏదో ఒకటి.. నీకు నచ్చింది ఇవ్వు" అన్నాను కాజువల్‌గా.
"సరే!.. వెళ్లేముందు ఇస్తాను" అంది. పడవ ఎక్కాము.
పక్కపక్కన కూర్చున్నాము. పడవ కుదుపులకి మా భుజాలు
తగులుతున్నాయి. ఇదేదో త్రిశంకు స్వర్గం‌లా ఉంది. గాలికి
తన కురులు అప్పుడప్పుడూ నా ముఖాన్ని తాకుతున్నాయి.
ఆ కురుల చివర్న నా మనసు చిక్కుకొని వాటితోపాటూ ఊగుతోంది.
పడవ ఒడ్డుకి చేరుకొంది. మేము విడిపోతుండగా అడిగాను
"ఏదో ఇస్తానన్నావుగా!" అని. చుట్టూ ఎవరూ లేరు.
తను నా చెయ్యి చాచమంది. చాచాను. తను మెళ్లగా వచ్చి
నా అరచేతిని ముద్దాడింది. నేను శిలలా ఉండిపోయాను. తను
పరిగెత్తి వెళ్లిపోయింది. తర్వాత నేను ఇంటికి వెళ్లాను.. ఇంట్లో
వాళ్లతో కొంచం మాట్లాడాను.. భోంచేసాను.. కానీ ఏంచేస్తున్నా
తను ముద్దాడిన ఆ కొన్ని ఘడియలలోనే బ్రతుకుతున్నాను.
వర్తమానంలో అసలు లేనే లేను. ఆ క్షణాలే స్లోమోషన్‌లో
మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తను ముద్దాడిన చేతిని గుండెపై
వేసుకొని పడుకున్నాను. ఇంటిపైకప్పు వెన్నెలని అడ్డుకున్నా,
నా మానసంలో మాత్రం వెన్నెల వర్షిస్తోంది..
శ్రావ్యమైన సంగీతంలా..

Monday, March 24, 2008

dark corner..7..The End.

నాకు ప్రపంచంలో నా అంత అద్రుష్టవంతుడూ, అలాగే నా అంత
దురదృష్టవంతుడూ ఉండరనిపించింది. అద్రుష్టవంతుడని
ఎందుకంటే కోరుకున్న అమ్మాయి దగ్గరవ్వబోతోంది.
దురదృష్టవంతుడని ఎందుకంటే ఈ రోజే చనిపోబోతున్నాను
కాబట్టి. ఒక్క క్షణం ఈ దెయ్యం ఎపిసోడ్ అంతా కల అయ్యుంటే ఎంత
బాగుండో అనిపించింది. కానీ అలా కాదుగా. ఈ రోజంతా కూడా ఆ
దెయ్యం అమ్మాయి నా చుట్టూ తిరుగుతూ కనపడింది. నేనే
పట్టించుకోలేదు. కానీ దీనివలన నా జీవితమే మారిపోయినట్టు
అనిపించింది. ఈ దెయ్యమే నా జీవితంలోకి రాకుంటే ఈ రోజు ఇంత
అద్భుతంగా గడిచేది కాదు. అసలు నేను తనకి ఎప్పుడూ
propose చేసేవాడినే కాదేమో. తను హాపీగా ఇంకొకడిని పెళ్లి
చేసుకొనేది. అసలు ఎప్పుడూ నేను ఈ రోజంతలా ధైర్యంగా,
నేను నేనుగా, నన్ను నేను ఇష్టపడుతూ జీవితాంతం కూడా
గడిపేవాడిని కాదేమో. అలాంటి బ్రతుకు బ్రతికీ ఏమి ప్రయోజనం?
అర్థవంతమైన ఈ ఒక్కరోజు చాలు. ఇకనైనా బ్రతికితే ఇలాగే
బ్రతకాలి. ఈ రోజు ఉదయం వరకూ వ్యర్ధమనుకున్న బ్రతుకు
చీకటి పడేసరికి ఎంత అందంగా తయారయ్యిందో. ఇలాంటి
అనుభూతినిచ్చిన ఆ దెయ్యానికి థాంక్స్ చెప్పాలనిపించింది.
చుట్టూ చూస్తే తను కనపడింది. ఎందుకో భయమనిపించలా.
తన వైపు చూసి థాంక్స్ థాంక్స్ అని అరిచాను.
తను ఏమీ అనలేదు. రూముకి బయలుదేరాను. ఈ మధ్యలో
అమ్మకి ఫోన్ చేసాను."ఊరకనే చేశాన"న్నాను. నీకొక విషయం
చెప్పాలి అని "నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మా!!" అని చెప్పాను. అమ్మ కాసేపు ఎమీ మాట్లాడలేదు. తర్వాత "నువ్వక్కడ బాగానే
వున్నావు రా?.." అని అడిగింది. "బాగానే ఉన్నానమ్మా." అని చెప్పా.
కంటి నుంచి నీరు ఉబుకుతోంది. కాసేపు మాట్లాడాక పెట్టేసాను.
చాలా హాపీగా అనిపించింది. రూమ్ కి వచ్చేసాను.
చాలా ఆత్మలు నాకోసం wait చేస్తునట్టు అనిపించింది. స్నానం
చేసుకున్నాను. అప్పటికి రాత్రి 9 కావచ్చింది. నేను అమ్మకి రాసిన
లెటర్ టేబుల్ మీద పెట్టి ఇంక నన్ను చంపుకోండి అనుకొని
పడుకున్నాను. ఏవో ఆత్మలు నా మీద వాలినట్లుగా శరీరం
బరువెక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. అన్నివైపులనుంచీ నల్లని
ఆకారాలు పాక్కుంటూ నన్ను చుట్టుముడుతున్నట్లుగా ఉంది.
నా ముఖాన్నీ, గొంతుని ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్లుగా ఉంది.
ఊపిరి తీసుకోవడం కష్టమైపోతోంది. గాలి ఆడట్లేదు. గాలి కోసం
నా కాళ్లూ, చేతులూ కొట్టుకుంటున్నాయి. ఆత్మలు నా కాళ్లనూ,
చేతులనూ నొక్కిపట్టేస్తున్నాయి. గాలి అందకపోవడం చాలా
భయంకరంగా ఉంది. నేను కొట్టుకుంటున్నకొలదీ నా మీద బరువు
పెరిగిపోతోంది. ఇలా ఎప్పటికో స్పృహ కోల్పోయానో, లేదా చచ్చిపోయానో
తెలియదు కానీనేను అన్న భావన, ఆలోచనలు ఉనికి కోల్పోయాయి.

కళ్లు తెరిచాను. కళ్లముందంతా ప్రకాశం. ఒళ్లంతా తేలికగా ఉంది.
లేచి చూస్తే నా రూమే. నేను ఆత్మనై ఇంకా రూములోనే
ఉన్నానేమో అనుకున్నా. నా శరీరం నాకు కనపడుతున్నది.
తడుముకుంటే స్పర్శ తెలుస్తూ ఉంది. ఆత్మలకి ఇలాగే ఉంటుంది
కాబోలు. అద్దం ముందుకొచ్చి చూస్తే అద్దం మీద దెయ్యం రాత
ఇలా రాసి ఉంది-
" నేను నీకొక కొత్త జీవితాన్ని ఇచ్చాను. Live it up fully."
అంటే నేనింకా బ్రతికే ఉన్నానన్నమాట. తను కనపడుతుందేమో
అని చుట్టూ చూసాను- థాంక్స్ చెబుదామని. కనపడలేదు.
ఆనందంతో ఒక పావుగంట వరకూ గట్టిగా అరుస్తూ ఉన్నాను.
పక్కింటాయన కంగారుపడి వచ్చేసాడు. ఏమీ లేదని పంపించేసాను.
హుషారుగా స్నానం చేసుకొని అద్దం ముందు తల దువ్వుకుంటున్నాను.
నా ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ...
నా కళ్లు ఒక క్షణం పాటు నీలంగా మెరిసాయి.

dark corner..6

సీటులో కూర్చొని ఏమి చేద్దామా అని అటూ, ఇటూ చూసాను.
బద్దకంగా పరిశీలించి నా మొబైల్ తీసుకొని, ఫ్రెండ్స్ అందరికీ కాల్
చెయ్యడం మొదలుపెట్టాను. ఇదయ్యేసరికి మళ్లీ టీ బ్రేకు.
టీమ్ మేట్సు అందరమూ కూర్చున్నాము. సుమన, శ్రీకాంత్ కూడా.
ఈ రోజు శ్రీకాంత్ గాడి షర్ట్ కలర్, సుమన డ్రెస్సు కలర్ కొద్దిగా
మ్యాచ్ అయ్యాయి. దానికి మిగిలిన వాళ్లు వాళ్లిద్దరినీ టీజ్ చెయ్యటం
మొదలుపెట్టారు. నాకు ఎప్పటిలాగే మండిపోతోంది. ఈ ముసుగులో
గుద్దులాట అనవసరం అనిపించింది. నేను సుమనని ఒక ఐదు
నిమిషాలు నీతో మాట్లాడాలని పిలిచాను. తనని కొంచం దూరంగా
తీసుకెళ్లాను. “ఏంటి మాట్లాడాలన్నావు” అని అడిగింది.
కాసేపు మౌనం. తర్వాత సూటిగా చూస్తూ చెప్పాను-
" నువ్వంటే నాకు చాలా ఇష్టం సుమనా!."అని.
“ప్రొపోజ్ చెయ్యడానికి ఈ ambience బాగోదు అని తెలుసు.
కానీ ఆ శ్రీకాంత్ గాడితో నిన్ను జత కట్టి టీజ్ చేస్తుంటే తట్టుకోలేక
ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది.” అని చెప్పాను. తను ఏమీ మాట్లాడలేదు.
బాగా ఎమోషనల్ అయ్యానేమో- నా శ్వాస వణుకుతోంది. కొంచం
కంట్రోల్ లోకి వచ్చి “ఇప్పుడే నీ అభిప్రాయం కనుక్కోవాలని కాదు.
కొంచం టైమ్ తీసుకొని నీకు నచ్చినప్పుడు నిర్మొహమాటంగా చెప్పు.
ఇప్పుడున్న మన రిలేషన్ ని ఈ విషయం ప్రభావితం చెయ్యదని
భావిస్తున్నాను. “చెప్పాను. తను సరే మనం తర్వాత మాట్లాడదాము
అని వెళ్లిపోయింది. మా గాంగ్ ఇంకా అక్కడ బాతాఖానీ కొడుతున్నారు.
నేను వాళ్ల దగ్గరికి వెళ్లి, శ్రీకాంత్ ని చూసి - "శ్రీకాంత్!
నువ్వు సుమన విషయంలో సీరియస్సా?" అని అడిగాను. వాడు
కొంచం కన్ ఫ్యూజ్డ్ గా నవ్వి, "అదేమి లేదు" అని, ఎందుకని తి
రిగి ప్రశ్నించాడు. "నేను సీరియస్. అందుకని." అన్నాను నవ్వుతూ.
అందరికీ ఒక క్షణం అర్థమ్ కాలేదు. తర్వాత అందరూ
మూకుమ్మడిగా "ఓహో!!" అంటూ నన్ను చుట్టుముట్టేసారు.
తర్వాత కాసేపు టైమ్ పాస్ చేసాక లంచ్ బ్రేక్. ఆ తర్వాత సీటుకి
వచ్చేసాను.

ఒకరోజులో సగం అప్పుడే అయిపోయింది. ఇంకా ఏమి చెయ్యాలా
అని అలోచించి, అమ్మకి నా చివరి లెటర్ రాద్దామని
నిర్నయించుకున్నాను. ఇంక లెటర్ రాయడం మొదలుపెట్టాను.
మెళ్లగా చుట్టుప్రక్కలనిమరచి రాయడంలో మునిగిపోయాను.
నా పెన్ నా మనసుననుసరించి ఏవేవో అనుభూతులు,
ఆశలు,ఊహల రాగాలని స్పృశిస్తూ... నా అదుపు లేకుండా.
చాలా పెద్ద లెటర్ అయ్యింది. రాసాక తెలిసింది నా కళ్ల నుంచి నీరు
చాలాసేపటినుంచి జారుతూ ఉందని. అప్పటికే బాగా
సాయంత్రం అయిపోయి చీకటి పడింది. ఇంతలో సుమన నా
దగ్గరికి వచ్చి, "మనం ఎక్కడికైనా వెళ్దామా?" అని అడిగింది.
నేను ఆశ్చర్యంగా తన వైపు చూసాను. తన కళ్లు అభిమానంగా
నవ్వుతున్నాయి. దగ్గరలోని కాఫీడే కి వెళ్లాము. తను
మాట్లాడుతోంది. "నీకు తెలుసా ఇంజనీరింగ్ రోజుల నుంచి ఫ్రెండ్స్
అందరూ నన్ను నీ పేరు పెట్టి ఏడిపించేవారు. ఎందుకంటే నేను
ఏ నోట్సులు కావాలన్నా, ఏ డౌటులున్నా నిన్నే అడిగేదాన్నని.
నేనప్పుడు నిన్ను మంచి ఫ్రెండ్ గానే అనుకున్నాను. తర్వాత
జాబ్ లైఫ్. జాయిన్ అయినప్పుడు నాకు ఆఫీషు లొ తెలిసినవాడివి
నువ్వొక్కడివే అవ్వటం వళ్లనేమో నేను నీతో చాలా షేర్
చేసుకొనేదాన్ని-నా పర్సనల్ విషయాలూ, నా భయాలూ, నా
ఆనందాలూ అన్నీ. నువ్వు ఓపికగా వినేవాడివి. నీతో చెప్పుకున్నాక,
మనసు తేలికగా అనిపించేది. అలా నీ మీద నాకు స్నేహ భావం
మరింత పెరిగిపోయింది. కానీ నీ మీద నాకెప్పుడూ బలమైన
ఆకర్షణ కలగలేదు. ఒకరితో జీవితం పంచుకోవాలంటే అలాంటి
బలమైన ఆకర్షణ ఇద్దరి మధ్యన ఉండాలని నా అభిప్రాయం.
బహుశా నీ గురించి నాకు పూర్తిగా తెలియకపోవటం వల్లనేమో.
ఎప్పుడూ నీ కళ్లను చదవటానికి ప్రయత్నించడం తప్పితే, నీ
ఆనందాలు ఇవీ, నీ భయాలు ఇవీ, నువ్వు ఇలా ఫీల్ అవుతావూ
ఇవేమీ నాకు తెలియవు. ఈ రోజు నువ్వు ప్రొపోజ్ చేసాక
ఫష్ట్ టైమ్ నీ గురించే ఆలోచిస్తూ గడిపాను. నాకింకా టైమ్ కావాలి
శీనూ!!. నీ మనసేంటి అని నేనింకా తెలుసుకోవాలి. ఐ థింక్ వి
షుడ్ స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్. నా పరంగా ఒక అబ్బాయితో
ఇలా మాట్లాడటం సాహసమే. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్
లేవని చెప్పి నేను "నో" చెప్పొచ్చు. కానీ ఎందుకో తెలియదు నిన్ను
తెలుసుకోకపోవటం వలన నేను ఏదన్నా మిస్ అవుతానేమో
అనిపిస్తోంది." ఇలా చెప్పి ముగించింది. నేను తనని చూస్తూ
ఉండిపోయాను. ఒక్కసారి ఎంతో ఆనందము వచ్చేస్తేఎలా రియాక్ట్
అవాలో తెలియనట్లుగా ఉంది నా పరిస్థితి. కారణాలు తెలియదు
గానీ నేను తనని పొందగలను అన్న విశ్వాసం నాకెప్పుడూ లేదు.
అలాంటిది ఇప్పుడు తను ఇంత పోజిటివ్ గా మాట్లాడేసరికి చాలా
ఆనందమేసింది. నా మీద నాకే ఇష్టం కలిగింది. బయటకి
వచ్చాక "యేహ్!!" అంటూ గాలిలోకి ఎగిరాను. నా ఆనందాన్ని
తనకి చెప్పాను. ఒకరితో పంచుకుంటే ఇంత బాగుంటుందా అనిపించింది.
ఇంకాసేపటికి తను వెళ్లిపోయింది.

dark corner..5

చదివాక నేను ఉన్న స్థలంలోనే నెమ్మదిగా పట్టు కోల్పోతున్నట్లుగా
కూర్చుండిపోయాను. చాలాసేపు అలానే ఉండిపోయాను.
నేనేమీ ఏడ్వలా. లేచి ఆఫీషుకి బయలుదేరాను. మెల్లగా నేను ఈ
మెంటల్ సఫరింగ్ నుంచి రిలీవ్ అవుతున్నట్లు అనిపించింది.
అంతిమ గమ్యము తెలిసిన బాటసారి, ఆ బాటలో ఎలా కంఫర్టబుల్ గా
నడుచుకుంటూ పోతాడో అలా నేనూ నడుస్తున్నాను. రేపు నా ప్రాణం
పోతుందన్నవిషయం తెలిసిపోయాక ఎందుకో నాకు పెద్దగా బాధ
కలిగించట్లేదు. భయం కూడా వెయ్యట్లేదు. బహుశా చనిపోవడం వలన
నేనేమీ కోల్పోవడం లేదేమో. అసలు నా లైఫ్ లో గర్వించదగిన
క్షణాలు అంటూ ఏమీ లేవేమో. చిన్నప్పటి నుంచీమా అమ్మ ఎప్పుడూ
దేనికీ గర్వపడకూడదని నూరిపోసేది. చిన్నప్పుడు మాది దిగువ
మద్యతరగతి కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలు, తర్వాత నేను. మా నాన్న
ఏ బాధ్యతలూ పట్టని మనిషి, తాగుడు అలవాటు ఉంది. అమ్మ మమ్మల్ని
చాలా స్ట్రిక్ట్ గా పెంచేది. అమ్మ తను కోల్పోయినవన్నీ మమ్మల్నీ మంచి
స్థితిలో పెట్టడం ద్వారా సాధిద్దామనుకుందేమో. నాకు
ఇప్పటికీ గుర్తు- 4వ తరగతిలో నాకు లెక్కల్లో యాభైకి నలభై నాలుగు
వచ్చాయి. నేనే ఫస్టు. స్కూల్ అయ్యాక పరిగెత్తుకొంటూ ఇంటికెళ్లి అమ్మకి
చెప్పాను. ఇంకా ఎక్కువ తెచ్చుకొవాలి అంది నిర్లిప్తంగా. నేను తర్వాత
పక్కింటిలో టేప్‌రికార్డర్ లో ఎదో పాట వస్తూంటే హుషారుగా అరుగు మీదకి వచ్చి డాన్స్ చేస్తున్నాను. అమ్మ వచ్చి చీపురు కట్టతో ఒక్కటేసింది.
ఏదో యాభైకి యాభై వచ్చినోడిలా ఎందుకలా ఇరగబడుతున్నావు అని.
ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎమ్‌సెట్ లో మంచి ర్యాంక్ వస్తే,
ఏదో ఐ.ఐ.టి లో సీట్ వచ్చినట్లుగా ఫీల్ అవ్వకు అనేది. ఇలా నేను
కూడా దేనినీ సాధించినట్టు ఫీల్ అయ్యేవాడిని కాదు. నేను సాధించిన
చిన్న చిన్న విజయాలను కూడా నేనెప్పుడూ ఆస్వాదించలేదు. ఐ డిడింట్
ఎవర్ గివ్ మైసెల్ఫ్ ఎనీ డామ్ వర్త్.. అందుకేనేమో నేను
సుమన కి ఇంతవరకూ ప్రొపోజ్ చెయ్యలేకపోయాను. ఏంటి!.. ఈ రోజు
ఆలోచనలు ఎటో వెళ్లిపోతున్నాయి.. సరే వెళ్లనీ అని వదిలేసాను.
అమ్మ గుర్తుకివచ్చింది మళ్లీ. ఏంటో.. అమ్మ ఈ రోజు తెగ
గుర్తుకివస్తుంది.. అమ్మ ఎప్పుడూ నామీద అభిమానం చూపించేది కాదు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ అమ్మ నన్నుదగ్గరగా తీసుకొని
ముద్దులివ్వడమూ, ప్రేమగా మాట్లాడటం ఎప్పుడూ లేదనుకుంటాను.
కానీ అమ్మకి నేనంటే ప్రాణం. అందులో డౌట్ లేదు. నేను కూడా అంతే.
అంత expressive కాను. నేనెప్పుడూ ఊహించుకుంటుంటాను అమ్మ
నా తలను తన ఒడిలో పెట్టుకొని సరదాగా ఊసులు చెప్పినట్టూ... నా
తల అలా నిమురుతూ ఉంటే నేను హాయిగా నిద్రలోకి జారుకున్నట్టూ..
ఎందుకో అమ్మకి ఫోన్ చేసి "నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా! " అని
చెప్పాలనిపించింది. చూస్తుండగానే, ఆ ఆలోచన చాలా బలీయమైపోయింది.
ఫోన్ చేసాను. చేసి అవీ,ఇవీ మాట్లాడాను కానీ అసలు విషయం
చెప్పలేకపోతున్నాను. చివరికి "అమ్మా!, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను
నీ గురించి చాలా అలోచిస్తూ ఉంటాను." అని ఏదో అసందర్భంగా
చెప్పగలిగాను. కానీ ఆ మాత్రం చెప్పినందుకే కొంచం హాపీగా
అనిపించింది. ఈ ఒక్కరొజూ ఫుల్ బిందాస్ గా బతకాలి అనిపించింది.
నా ఇన్సెక్యూరిటీస్, భయాలూ, మన మీద చుట్టుప్రక్కలవాళ్ల ప్రభావాలూ
ఇవన్నీ వదిలేసి నాకు నేనుగా పూర్తిగా ఈ రోజుని ఆస్వాదించాలనిపించింది.

… నాలో ఏదో తేజస్సు నిండిన ప్రశాంతత.

ఆఫీషులోకి అడుగుపెట్టాను. దూరంగా మా ప్రోజెక్టు మానేజర్
కనపడ్డాడు. వెళ్లి పలకరించాను. ఏమి మట్లాడాలో ప్లాన్ చేసుకోలేదు.
అలా కలిశేసానంతే. "ఈ రోజు నాకు పని చెయ్యాలనిలేదు.. కానీ బోర్
కొడుతుందని ఆఫీషుకి వచ్చాను. ఈ రోజు నాకు లీవ్ వితౌట్ పే
కావాలి "అని చెప్పాను. మా మానేజర్ నా వైపు ఆశ్చర్యంగా చూసి,
"సరే" అన్నాడు. మా మానేజర్ తో నేను వ్యవహరించిన తీరు నాకు
బాగా నచ్చింది. ఎప్పుడూ ఇంత ధైర్యంగా, నిజాయితీగా మాట్లాడలేదు.
నా సీటు దగ్గరికి వచ్చి కూర్చొని ఇటూ, అటూ చూస్తున్నాను. దూరంగా
హైమ కనపడింది. అప్పుడే వచ్చినట్టుంది. ఎప్పటిలాగే తన అందాలు
నన్ను ఊరించాయి. తను వచ్చినవెంటనే టీ తాగడానికి వెళుతుంది.
నేను తన దగ్గరికి వడిగా వెళ్లి, "షల్ ఐ జాయిన్ యు ఫర్ టీ?" అని
అడిగాను. మాకు ముఖపరిచయం ఉంది కానీ మేమెప్పుడూ
మాట్లాడుకోలేదు. తను కొంచం ఆశ్చర్యంగా చూసి తర్వాత ముఖమంతా
నవ్వు చేసుకొని నాతో నడిచింది. "నాకు నీమీద కోరిక ఉంది." అని
చెప్పాలనుకున్నాను.
కాంటీన్ లో కూర్చున్నాము.
తనే ఏదో టాపిక్ మొదలుపెట్టింది. అలా మాట్లాడుతునే ఉంది. తను
సల్సా నేర్చుకుంటునట్టూ, తను కాలేజ్ లో మిస్ లయోలా గా
ఎంపికయినట్టూ, తనకి బొద్దింకలు అంటే చాలా భయమనీ, తనకి
అభిషేక్ బచ్చన్ అంటే పిచ్చి అని.. ఇలా కొంచం ఎక్కువయిన
హావభావాలతో వాగుకుంటూ పోయింది. కాసేపటికి నాకు
ఆకర్షణ స్థానే బోరు కొట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు
అమ్మాయి కనిపించట్లేదు .. ఆ స్థానంలోనే ‘ప్రతీ ఒక్కరూ నా అందాన్నీ,
నన్నూ గుర్తించాలి’ అన్న తన ఇన్సెక్యూరిటీ కనపడింది. మెల్లగా
ఎలాగోలా తన నుంచి బయటపడి నా సీటు దగ్గరికి వస్తుంటే
‘ఆ అమ్మాయి ఆకర్షణనుంచి పూర్తిగా బయటపడ్డాను’ అన్న
సంతృప్తికరమైన ఫీలింగు కలిగింది. నాకు అంతకన్నా బాగా
అనిపించిన విషయం ఏంటంటే- ‘నన్ను నేను ఎప్రీషియేట్ చేసుకొవడం’. ఉదయం మా మానేజర్ తో వ్యవహరించిన తీరు, హైమా ఆకర్షణని
ధైర్యంగా ఎదుర్కోవటం లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా. చాలా
తేలికగా అనిపించింది- ‘బ్రతకడం ఇంత సింపులా?’ అన్నట్లుగా.

dark corner..4

తను అందంగా ఉంది కానీ పాలిపోయిన తెలుపు. కళ్లు మాత్రం చాలా

వెరైటీగా ఉన్నాయి. కనుపాపలు గాఢనీలం రంగులో ఉండి, కళ్లు

ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా చాలా మిస్టీరియస్‌గా ఉన్నాయి. నేను అలా

చూస్తూండగా ఎప్పుడు మాయమైపోయిందోగానీ ఇంక కనపడలేదు.

దమ్ము చివరికి వచ్చేసింది. ఏదో సినిమాలో చూపించినట్టు ఈ

ఆత్మలు మనుషులని తాకలేవు కాబోలు.. అందుకే నన్ను ఏమీ

చెయ్యలేదు అని అనుకుంటుండగానే వెనక నుంచి నా భుజం మీద

ఎవరిదో చెయ్య పడింది. పరిగెడదామనిపించింది. కాళ్లు

కదలలేకపోతున్నాయి. విజ్జుగాడిని లేపడానికి అరవాలనిపించింది.

నోరుపెగలట్లేదు. ఎవరో గొంతుని గట్టిగా పట్టేసినట్లనిపించింది.

ఊపిరి ఆడట్లేదు. ఇంకొక పదినిమిషాలు అలాగేఉంటే చచ్చిపోతానేమో

అనిపించింది. "ఏరా!! నిద్ర పట్టట్లేదా? " అన్న విజ్జుగాడి గొంతు వెనక

నుంచి విని అర్థమయ్యింది చెయ్యి వేసింది వాడేనని. మళ్లీ

బ్రతికినట్టనిపించింది. అప్పటికీ ఇంకా గొంతు పూర్తిగా రావట్లేదు.

అవునన్నట్టు వాడివైపు చూసాను. నా ఒళ్లంతా చెమటలు పట్టేసాయి.

నన్ను చూసి, "హే!!, ఆర్ యు ఆల్‌రైట్?" అని దగ్గరికి వచ్చి

అడిగాడు. "యా.. ఐ యామ్ ఫైన్" అని జరిగింది వాడికి చెబుదామని

వాడి వైపు చూసాను. వాడి కళ్లు ఒక్క క్షణం పాటు నీలంగా మారి మళ్లీ

మామూలుగా అయిపోయాయి.నీలంగా మారినప్పుడు అచ్చంగా ఆమె

కళ్లలా కనిపించాయి. నా బుర్రలొ భయపు నీలి నీడలు మళ్లీ

ప్రవేశించాయి. వాడికి ఇంకేమి చెప్పలేకపోయాను. వాడు నన్ను విచిత్రంగా

చూసి నా భుజాన్ని తట్టి అదొకలాంటి స్మైల్ విసిరేసి వెళ్లి

పడుకున్నాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది.


ఉదయం నేను నిద్రలో ఉంటుండగానే విజ్జుగాడు నాకు చెప్పి

వెళ్లిపోయాడు. లేచి ముఖం కడుక్కున్నాను. నాకు రూములో నాతో

పాటు ఇంకెవరో ఉంటున్నారు అన్న ఫీలింగు మాత్రం మెదులుతూ ఉంది.

సోప్ అయిపోయింది. బయటకు వెళ్లి, సోప్ కొనుక్కొని రూములోకి

వచ్చాను. నేను వచ్చిన గదిలో ముగ్గురు మనుషులు కుర్చీలు వేసుకొని

కంప్యూటర్ లో ఏదో సీరియస్ గా చూస్తున్నారు. నేను లోపలికి

వచ్చాక అందరూ నావైపు స్లో మోషన్ లో తలలు తిప్పి నన్ను ఎవరీ

కొత్త మనిషీ అన్నట్టు చూసారు.నేను వేరే రూముకి వచ్చాననుకొని

వెంటనే బయటకు వచ్చేసాను. బయటకి వచ్చి చూస్తే అది నా రూమే.

మా అపార్టుమెంటే. కింద రూములో అంకుల్ ని చూసి ఇంకొకసారి

కన్‌ఫర్మ్ చేసుకున్నాను. అసలు నాకేమి అవుతుంది అనిపించింది.

తల తిరుగుతోంది. నేను చూసిన మనుషులని ఒకసారి గుర్తుకు

తెచ్చుకుంటే వారిలో ఒక ముసలాయన

(వయసు 50-55 మధ్యలొ ఉంటుంది), ఒక చిన్నబాబు

(వయసు 8 ఏళ్లు ఉంటాయి) ఇంకా ఒక అమ్మాయి. అప్పుడు

గుర్తుకువచ్చింది ఆ అమ్మాయినే నిన్న నేను చూసిందని.

రూముకి వచ్చాను. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. నన్ను పట్టించుకోవట్లేదు.

నేను స్నానం చేసి ఆఫీషుకి బయలుదేరాను. నాకే ఎందుకిలా

అవుతుందోగానీ ఆ అమ్మాయి ప్రెజెన్స్ ని నేను అంతటా ఫీల్

అవుతున్నాను.. ఎక్కడికెళ్లినా సరే. నాకు ఆమెనే కాకుండా

మనుషులకి కనిపించని మిగిలినవాళ్లు కూడా కనపడుతున్నారు.

అప్పుడప్పుడు మనుషులు కూడా ఈర్ష్య, ద్వేషము,కోపం, భయమూ

లాంటి ఇన్సెక్యూరిటీస్ ఆవహించిన దెయ్యాల్లా కనపడుతున్నారు.

నాకు సాయంత్రం ఆఫీషు నుంచి వచ్చాక ఎవరైనా సైక్రియాట్రిస్ట్ ని

కలవడం బెటర్ అనిపించి ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లాను.

కాసెపు వెయిట్ చేసాక రిసెప్సనిష్ట్ లోపలికి వెళ్లమంది. తీరా

లోపలికి వెళ్లి వాడిని చూస్తే, వాడి కళ్లు కూడా నీలంగా మెరిసాయి.

వెంటనే బయటకి వచ్చేసాను. ఈ రాత్రికి నా రూముకి వెళ్లకుండా

వేరే రూముకి వెళ్తే ఎలా వుంటుంది అని ఇంకొక ఫ్రెండ్ రూముకి

వచ్చాను. కానీ ఆమె ఆ రూములో కూడా కనపడింది. ఆ రాత్రి కూడా

భయంకరమైన అనుభవాలతోనే గడిచింది. ఉదయం నా రూము కి

వచ్చాను. గత మూడు రోజులుగా ఈ దెయ్యం ఎపిసోడ్ లతో పూర్తిగా

విసిగిపోయాను. నిద్ర కూడా లేదు. ఒకరకమైన ఫ్రస్ట్రేషన్,

తెగువ వచ్చేసాయి. రూములో తను ఉంది. నేను పట్టించుకోలేదు.

స్నానము చేసేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకొంటున్నాను.

అద్దములో తను కనపడింది. నా వైపే సీరియస్‌గా చూస్తూ ఉంది.

అసలు ఎప్పుడూ నన్ను పట్టించుకోనట్లు వుండే తను ఇప్పుడు

నా వైపు కళ్లార్పకుండా సీరియస్‌గా చూస్తుండేసరికి నా గుండెలు

జారాయి. కాసేపటికి తను మాయమయ్యింది. కానీ అద్దము మీద

ఏవో అక్షరాలు నీటితో చెక్కబడినట్లుగా ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూసాను.

"ఈ రాత్రికి నువ్వు నాచే చంపబడుతున్నావు... ఎక్కడున్నా సరే!."

అని ఉంది.

Saturday, March 15, 2008

మధ్యాహ్నపు బోరుటెండ

పదిమంది మధ్యలో ఉన్నాను..
కానీ ఒంటరితనమొక్కటే నా సహచరిలా ఉంది.
మధ్యాహ్నపు బోరుటెండ నా మనస్థితిలా ఉంది.
దేనినుంచో తప్పించుకొని పారిపోవాలని ఉంది.
నేను నా ఇగో తో పోరాడుతున్నాను-
'I am missing you' అన్న నిజాన్ని ఒప్పుకోవటానికి.

dark corner..3

సాయంత్రం ఏడయ్యేసరికి ఆఫీషు నుంచి బయటపడ్డాను. రూము కి
వెళ్లాలనిపించలేదు. విజ్జు గాడికి కాల్ చేసాను- రూముకి రమ్మని.
ఫష్ట్ఎక్కడన్నా కలిసి తిందాము అన్నాడు. "సరే" అన్నాను. తినడము
అయ్యాక "సినిమా" అన్నాడు. షారూఖ్ ఖాన్ కొత్త సినిమా. అందులో
హీరోయిన్ చనిపోయాక ఆత్మగా మారి విలన్ మీద పగ తీర్చుకొంటుంది.
సినిమా నుంచి తిరిగివస్తూంటే ఈ ఆత్మల టాపిక్ మా మధ్య వచ్చింది.
వాడు చదివిన కాష్మొరా నవల లోని కొన్ని సన్నివేశాలు చెబుతున్నాడు.
ఆత్మలు మన చుట్టూ ఉంటాయనీ, అప్పుడప్పుడు అవి మనల్ని
ఆవహించి వాటి కోరికలు తీర్చుకుంటాయనీ ఏవేవో చెబుతున్నాడు.
ఇంతలో రూము వచ్చేసింది. అప్పటికే రాత్రి ఒంటిగంట కావస్తుండటంతో
ఇద్దరమూ పడకలు వేసాము. ఒక పదినిమిషాలు మాట్లాడుకొని
సైలెంట్ అయిపొయాము. అలామాట్లాడుకుంటున్నప్పుడు నాకేదో
పట్టీల చప్పుడు వినిపించినట్టయ్యింది. నేను దానిని పెద్దగా
పట్టించుకోలేదు. మా కింద రూము లో ఫేమిలీస్ ఉంటారు. అందులో
లేడీస్ ఎవరన్నా లేచారేమో అనుకున్నా. ఒక పావుగంట నిశ్శబ్దంగా
గడిచింది. విజ్జుగాడు పడుకున్నట్లు ఉన్నాడు. నిద్రలోకి
జారుకోబోతుండగా మళ్లీ ఘల్లు మంది. ఈసారి కొంచం దగ్గరగా…
గతుక్కుమన్నాను. పక్కన విజ్జు గాడు లేచి, "ఒరెయ్!! నాకెదో
పట్టీల చప్పుడు వినపడుతుంది రా. నీకూ వినపడిందా??" అని
అడిగాడు. వాడి భయం చూసి, ఏడిపించాలనిపించింది. "లేదు" అని
చెప్పా. "ఎక్కడ నుంచి వినపడుతుంది రా?" అని అడిగాను. వాడు
కింద నుంచి అని చెప్పాడు. "సరే కాసేపు చూద్దాము. మళ్లీ
వినిపిస్తుందేమో" అనుకొని ఇద్దరమూ ఒక పావుగంట wait చేసాము.
ఏ శబ్దమూ వినపడలేదు. ఇంక పడుకుందామని నేను సరదాగా
"ఒరేయ్!, కాసేపయ్యాక మనిద్దరిలో ఒకరికే ఆ శబ్దం వినిపిస్తుంది రా.
మెళ్లగా ఇంకా దగ్గరవుతున్నట్టుగా వినిపిస్తుంది చూడు." అన్నాను
వాడిని ఏడిపించడానికి. వాడు ఏమీ అనలేదు. 'అసలు ఈ డైలాగ్
ఎందుకు వేసానా?' అన్పించింది. ఎందుకో నే వేసిన డైలాగ్ నాకే నచ్చలేదు.

మగతగా నిద్రపడుతోంది అనగా మళ్లీ వినపడింది పట్టీల చప్పుడు.
ఈసారి చాలా క్లియర్‌గా. నేను విజ్జు గాడి వైపు చూసాను. వాడు
నిద్రపోతున్నాడు. అంటే, నా ఒక్కడికే వినిపిస్తోందా.. .నేను చెప్పిన
డైలాగ్ నా మీదనే పనిచేస్తోందా.. గుండె దడ దడా కొట్టుకుంటోంది.
తలుపు ముందర ఎవరో తచ్చాడుతున్నట్లుగా రెండు మూడు సార్లు
పట్టీల చప్పుడు వినపడింది. తరువాత చాలాసేపటివరకూ ఏ చప్పుడూ వినపడలేదు. హమ్మయ్య అనుకొని నిద్రలోకి జారుకున్నాను.
పట్టీల చప్పుడుకి మళ్లీ నిద్రనుంచిఉలిక్కిపడి లేచాను. కానీ ఈసారి
చప్పుడు తలుపు ముందర కాదు. మా గదిలోనే. కళ్లు తెరవాలంటే
భయం వేస్తోంది. ఊహే అయ్యుంటుంది అని సమర్ధించుకొని కళ్లు
తెరవలేదు. కానీ కొన్ని క్షణాలకే మళ్లీ ఘల్ మన్న పట్టీలు. భయం
ఇంత భయంకరంగా వుంటుందా అన్నది ఇప్పుడే అనుభవంలోకి
వస్తోంది. కనురెప్పలు పూర్తిగా కాకుండా చిన్నగా తెరచి శబ్దం
వినిపించినవైపు చూసాను. నాకు దగ్గర్లొ పట్టీలు కట్టుకొన్న రెండు
పాదాలు కనపడ్డాయి. నా గుండెలు ఆగిపోయినాయి. గట్టిగా
అరవాలనిపించింది. విజ్జుగాడిని లేపాలనిపించింది. కానీ ఏమీ చెయ్యలేని
పరిస్థితి. అలాగే కొయ్యముక్కలా ఉండిపోయాను. ఆ పాదాలు నా నుంచి
దూరంగా జరిగాయి. కనురెప్పలు కొద్దిగా ఇంకొంచం పైకెత్తి చూసాను.
పాదాల వరకూ తెల్లని గౌను వేసుకున ఒక అమ్మాయి. కిటికీ నుంచి
పడుతున్న మసక వెలుగులో లైట్ బ్లూయిష్ షేడ్‌లో కనపడుతోంది
ఆ ఆకారం. అదృష్టవశాత్తూ తను నా వైపు చూడట్లేదు. నాకు
తెలియకుండానే నేను వణుకుతున్నాను. ఈ భయంలో బ్రతికేకన్నా
ఈ నిమిషమే చనిపోతే బావుండుననిపించింది. తను ఎక్కడ నా వైపు
చూస్తుందేమోనని ఒకటే టెన్షన్. ఈ టెన్షన్ నా వల్ల కాదు అనుకొని
గట్టిగా కళ్లు మూసేసుకొన్నాను. మనసులో "శ్రీ ఆంజనేయం..
ప్రసన్నాంజనేయం." అనుకోసాగాను. ఎప్పుడూ మొక్కని దేవుడు
ఇప్పుడు మొక్కితే వస్తాడా అని డౌట్ వచ్చింది. ఇంక దేవుడిని
తలవటం ఆపేసాను. ఈ లోపున అడుగుల చప్పుళ్లు వంట
గదివైపుకి వెళుతున్నట్లుగా అనిపించింది. మెల్లగా కళ్లు తెరచి
చూసాను. తను లేదు. ఇప్పుడే ఏదో చెయ్యాలి అనిపించి, లైట్ వేస్తే
ఇంక దెయ్యాలు రావు అనుకొని పక్కనే ఉన్న ట్ ఆన్ చేసాను.
ఒక్కసారిగా రూము అంతటా వెలుగు. ఒకింత ధైర్యం వచ్చినట్టుగా
ఫీలయ్యా. నేను అనుకున్నట్లుగానే ఒక పావుగంట వరకూ ఆమె
లైట్ వున్న మా గదిలోకి రాలేదు. విజ్జుగాడు ఇవేవి
పట్టనట్లుగా పడుకొన్నాడు. వాడిని లేపాలనిపించిందికానీ ఇవన్నీ చెబితే
వాడు నవ్వుతాడేమో..ఇప్పుడు లేపడం అవసరమా.. లాంటి
సందెహాలు వచ్చి లేపలేదు. నిద్ర పట్టట్లేదు. లేచాను. TV మీద
విజ్జుగాడు సిగరెట్ ప్యాకెట్ ఉంది. సిగరెట్ తాగాలనిపించింది.
తాగుతాను కానీ నాకేమీ అలవాటు కాదు.సిగరెట్ వెలిగించుకున్నాను. సిగరెట్ వెలిగిస్తున్నప్పుడు గమనించాను-
చేతులు ఇంకా వణుకుతున్నాయని. బుర్ర అంతా బ్లాంక్ గా ఉంది.
దమ్ము లాగుతూ రిలాక్స్ అవుతున్నాను. ఈలోపు ఆమె వంటగది
నుంచి చాలా క్యాజువల్‌గా నడుచుకుంటూ మా గదిలోకి వచ్చేసింది.
బుర్ర రియాక్ట్ అవ్వడం మానేసి నేను అక్కడే శిలలా తనని
చూస్తున్నాను. తను నేనొక మనిషిని అసలు లేనట్లుగా గదిలో
తిరుగుతూంది. తను నన్ను పట్టించుకోకపోవడం నాకు కొంత
ధైర్యాన్ని ఇచ్చింది. భయపడుతూనే నేను తనని గమనించటం
మొదలుపెట్టాను.

dark corner...2


హైమా నన్ను వాళ్ల ఇల్లు చూపిస్తూ ఉంది. నేను వాళ్ల ఇల్లు
చూడటం కన్న తననే ఎక్కువ చూస్తున్నాను. టైట్ టీషర్ట్ లో
సెక్సీగా ఉంది. తన బెడ్‌రూమ్ కి తీసుకువచ్చింది. అంతవరకూ
మామూలుగా వున్న హైమ బెడ్‌రూమ్ లోకి వచ్చేసరికి తన
బాడీలాంగ్వేజ్ మారిపోయింది. మోహంతో రగులుతున్నట్లుగా నగ్నమైన
కోరికలా అనిపించింది నాకు. తను బెడ్ మీద పడుకొని నన్ను
రమ్మన్నట్లుగా కైపుగా చూసింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.
దగ్గరికి వచ్చాను. నాకు పిచ్చి ఎక్కిస్తున్న తన బ్రెస్ట్స్ వైపే చూస్తూ,
చేతులు వాటి మీద వేసాను. చేతులు వేసేసరికి అవి చిన్నవైపోయాయి.
ఏమిటిది?!! అని చూస్తే అక్కడ హైమ స్థానంలో నా ఫిగరు సుమన
ముఖం ఉంది. చాలా భయంకరంగా ఉంది…ముఖమంతా డార్క్ గ్రీన్
కలర్‌లో, కళ్లు రెడ్ గా నన్ను కోపంగా చూస్తున్నాయి. నేను
అదిరిపడి దూరం జరిగాను. చూడబోతె, ఆ బెడ్ చుట్టూ మా ఆఫీషు
వచ్చేసింది. మా ప్రొగ్రామ్ మనేజర్, ఇంకా కొందరు కొలీగ్స్ నన్ను
చూసి నవ్వుకుంటున్నారు. అందరికీ హైమ మీద నాకున్న
దురాలోచనలు తెలిసిపోయినట్లుగా ఉంది. “అబ్బా!!.. ఏమిటీ
ఘోర అవమానం!!.” అనుకున్నాను. ఈ పరిణామాన్ని అస్సలు
తట్టుకోలేకపోతున్నాను. దిగ్గున లేచాను. కల చెదిరింది.

" ఏమిటిది. రాత్రి అలా జరిగింది. పొద్దున్నే ఒక పీడ కల." అనుకుంటూ
తయారయ్యి, ఆఫీషుకి వెళ్లాను. రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం వలన
తలనొప్పిగా ఉంది. టీబ్రేక్‌లో మా కొలీగ్స్ అంతా నా ఫిగరు సుమనని,
ఆ శ్రీకాంత్ గాడిని సరదాగా లింక్ పెట్టి ఏడిపించడంతోనే అయిపోయింది.
వాళ్లు కూడా నవ్వేస్తున్నారు. నాకు ఎక్కడో కాలిపోతోంది.

Wednesday, January 23, 2008

Dark Corner..1


తలుపు శబ్దం చెయ్యకుండా తెరుచుకుంది. తలుపు తెరిచాక రూమ్
ఎందుకో ఎప్పటిలా నిర్జీవముగా అనిపించలేదు నాకు. చీకటి రూము,
మనసు మూలల్లోని చీకటి పొరలా ఉంది. నా ఆలొచనకి నాకే నవ్వు వచ్చింది. రూమ్మేట్ ఆన్ సైట్ కి వెళ్లాడు. ఇప్పుడు నేనొక్కడినే
రూంలో. బెడ్ మీద వాలి, టి.వి ఆన్ చేసాను. నిరాసక్తంగా ఛానెల్లు
మార్చుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ కాల్స్. రాత్రి 1.30
కావస్తూంది. ఇంక పడుకుందామని టి.వి, లైటు ఆఫ్ చెసాను.
రూం నిండా చీకటి పరచుకొంది. పక్క వీధి స్ట్రీట్ లైటు వెలుగు కిటికీ
గ్లాసు ద్వారా ఎదురుగా గోడ మీద గాఢ నీలపు కాంతిలో పడుతున్నది. అప్రయత్నంగా నా ద్రుష్టి ఆ వెలుగు మీద పడింది.
అక్కడ ఏవో నీడలు కదులుతున్నాయి. ఒక్కసారిగా గుండెలు అదిరాయి. ఇంత రాత్రి వేళ ఏంటి కదులుతూంది అని!. కొంచం
పరిశీలనగా చూస్తే నీడలు మనిషివి లా అనిపించలేదు. కొంచం
ధైర్యం వచ్చింది. ‘ఏంటి ఈ రోజు ఇలా భయపడుతున్నాను’
అనుకున్నాను. ‘కమాన్ శీనూ!!, నువ్వు భయపడటం ఏంటి?’
అని కొంచం మోటివేట్ చేసుకొని పడుకున్నాను. కిటికీని ఆనుకొని
వుంది పరుపు. మెల్లగా నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోబోతూండగా
ఎదో శబ్దం వినిపించింది. ఎవరో కిటికీ అద్దాన్ని వేలితో చిన్నగా
రెండుసార్లు తట్టినట్టుగా. ఒక్కసారి ఒళ్లంతా కంపించింది. వెంటనే
మళ్లీ సముదాయించుకొన్నాను. కిటికీ వైపుకి చూసాను. ఎవ్వరూ
లేరు. ఆ శబ్దం కేవలం నా ఊహేనా లేక నిజంగానే విన్నానా అన్న
డౌట్ వచ్చింది. ఊహేనేమో.. లేదంటే ఇంత రాత్రి వేళ కిటికీ తలుపు
ఎందుకు కొడతారు? అనుకొని మళ్లీ పడుకొన్నాను.

................

బుర్రని ఈ ఆలోచనలనుంచి మళ్లించడానికి ఆఫీషు వ్యవహారాల
వైపుకి తిప్పాను. ఈ రోజు ఆఫీషులో లిటరల్ గా ఉడికిపోయాను. నా
ఫిగర్ ని ఆ శ్రీకాంత్ గాడితో కొలీగ్స్ అందరూ ఏడిపిస్తున్నారు. తను
కూడా ఆ కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తను
ఈ విషయాన్ని క్యాజువల్ గా తీసుకొని నవ్వేస్తుందా లేదంటే
నా ఖర్మ కాలి తను కూడా వాడిని ఇష్టపడుతున్నదా అన్నది అర్ధం
కావట్లేదు. సుమన నాకు మొదటినుంచీ తెలుసు. నా ఇంజనీరింగు
క్లాస్ మేట్. ఇద్దరం కాంపస్ లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ వర్క్
చేస్తున్నాము. సుమన అంటే నాకు ఇంజనీరింగు రోజుల నుంచీ ఇష్టం.
కానీ ఎప్పుడూ చెప్పలేదు. భయం అని కాదు గానీ, తనకి నేను
సరిపోనేమో అన్న ఇన్ఫీరియర్ ఫీలింగు ఉంటుంది. నేను చూడటానికి
బాగానే ఉంటాను, తనకన్నా బాగా చదువుతాను. క్లాసులో నేను
టాపర్స్ లో ఒకడిని. అయినా ఎందుకో ఎప్పుడూ నన్ను నేను
తక్కువగా ఊహించుకుంటాను. తన విషయం లోనే కాదు..అన్ని
విషయాల్లోనూ. ఇంకా ఏవేవో ఆలోచనలు… ఈ రోజు హైమ ఆఫీషుకి
బుర్రపాడు డ్రెస్ వేసుకొని వచ్చింది. తన బ్రెస్ట్స్ భలే ఉంటాయి..
రౌండ్ గా, తన ఫిగరు కి వుండవలసిన దానికన్నా కొంచం ఎక్కువ గా,
గర్వం గా మగోడ్ని సవాల్ చేస్తున్నట్లు గా ఉంటాయి. ఆఫీషులో తను
నన్ను గమనించనప్పుడు దొంగతనంగా తనని కసి కసి గా
చూస్తుంటాను. కానీ సుమనని మనసులో పెట్టుకొని హైమని ఇలా
చూడటం నాకెందుకో గిల్టీగా అనిపిస్తుంటుంది. నాది నిజమైన ప్రేమ
కాదా అన్న డౌట్ కూడా వస్తుంటుంది. సడన్ గా నా ఆలోచనలు
ఆగిపోయాయి. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిపోయింది. గుండె
వేగంగా కొట్టుకోసాగింది.

… నేను మళ్లీ అదే శబ్దం విన్నాను.

కాసేపటికి లాజికల్ గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరైనా నన్ను
భయపెట్టడానికి ఇలా చేస్తున్నారా? దొంగ ఎవడైనా నన్ను
భయపెట్టి నాచేత తలుపు తీయించడానికి చేస్తున్న ప్రయత్నమా
ఇది.. ఇలా సాగుతున్నాయి అలోచనలు. నేను నెమ్మదిగా కిటికీ దగ్గర
నక్కి చూస్తున్నాను. ఈసారి ఆ సౌండ్ చేసినప్పుడు వాడు
కనపడతాడేమో అని. నేను అలా నిశితంగా చూస్తుండగానే మళ్లీ శబ్దం
వినిపించింది. కానీ అసలు ఎటువంటి ఆకారము వచ్చినట్టు కనిపించలేదు.
నా కళ్లూ, చెవులూ ఏమన్నా దొబ్బాయా అన్న డౌట్ వచ్చింది. ఏ
ఆకారమూ లేకపోతే మరి ఏమయినట్టూ?.. కొంపదీసి దెయ్యమా!!!...
ఆ ఆలోచన రాగానే వెన్నెముకలో సన్నని వణుకు మొదలయ్యింది. కొంచం
ధైర్యం తెచ్చుకొని నేను “ఎవరూ?!!” అని అరిచాను. ఏ సమాధానమూ
లేదు. చిన్న రాడ్ లాంటిది పట్టుకొని, తలుపు గడియ తీసి చూసాను.
ఎవరూ లేరు. కిటికీ దగ్గరకు వెళ్లాను. అక్కడ కూడా ఎవరూ లేరు.
శబ్దం ఎక్కడనుంచి వచ్చుండొచ్చు అని పరిశీలించసాగాను. కిటికీ కి
దగ్గరలో ఒక షర్ట్ ఆరేసి ఉంది. గాలికి ఊగుతున్నపుడు ఆ షర్ట్ గుండీ
కిటికీ గ్లాసుకి తగిలి ఆ సౌండ్ వస్తుందేమో అన్న డౌట్ వచ్చింది. షర్ట్
గుండీ తో గ్లాసు ని చిన్నగా ట్యాప్ చేసి చూసాను. కొంచం అలాంటిదే
శబ్దం వచ్చింది. ఇదే ఆ శబ్దం అని డిసైడయిపోయాను. మళ్లీ బెడ్ మీద
పడ్డాను. ఎందుకో అది షర్ట్ గుండీ తాలూకు సౌండ్ అని నేను
పూర్తిగా కన్విన్స్ కాలేదేమో. ఏ మూలనో ఒక థాట్ అది ఆ సౌండ్ కాదు
అని పొడుస్తూ ఉంది. దుప్పటి ముఖం మీద వరకు
కప్పేసుకోబోతూండగా, ఒక క్షణంలో నా కళ్లకి బెడ్ పక్కన ఉన్న
కుర్చీలో ఎవరో కూచున్నట్లుగా కనిపించింది. ఈ లోపునే దుప్పటి
నా కళ్లను కప్పేసింది. కాసేపు ఊపిరి తీసుకోవడం కూడా
మరచిపోయాను. ఒళ్లంతా భయంతో గట్టిగా బిగుసుకుపోయింది.
కాసేపటికి నా కళ్లు ఆ ఆకారాన్ని ఎలా చూసాయా అని
గుర్తుతెచ్చుకోసాగాను. ఆ ఆకారము కాళ్లు కుర్చీ లోపలికి
ముడుచుకొని చేతులు ముడుకుల మీద పెట్టుకొని వాటిపైన తల
ఆనించుకొని ఎటో చూస్తున్నట్టుగా నా మెదడు నాకు విజువలైజ్
చేయిస్తుంటే, ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. దుప్పటి తీసి
చూడటానికి అస్సలు ధైర్యం చాలట్లేదు. లైట్ ఉంటే దెయ్యం
పారిపోతుందని అనిపించి దుప్పటి తీయకుండానే, చేతితో
తడుముతూ బెడ్ సైడుకి ఉన్న లైట్ స్విచ్ ని ఆన్ చేసాను. లైట్
వెలిగాక నెమ్మదిగా ముఖం మీద దుప్పటి తీసి చూసాను. కుర్చీ
బోసిగా కనపడింది. గుండెల మీద నుంచి ఎంతో పెద్ద బరువు
తీసేసినట్లుగా అనిపించింది. లేచి నీరు తాగాలనిపించింది. లేచి
వంట గదిలోకి నడవబోయాను ఆ గది చీకటిగా ఉంది. దెయ్యం
అక్కడ దాగుందేమో అనిపించింది. ఇప్పుడు ఈ రిస్కు అవసరమా
అనుకొని ఆగిపోయాను. నేను ధైర్యం గా ఉన్నాను అని
తెలియజేయాలనిపించి, కేర్‌లెస్‌గా చేతులు ఇటూ,
అటూ ఊపి క్యాజువల్‌గా “గల గల పాడుతున్న గోదారిలా.." అని
పాట అందుకున్నాను. ఒక రెండు లైన్లు పాడాక నాకే
అనిపించింది- ఇంత రాత్రి వేల ఏంటి నేను ఇలా బిహేవ్
చేస్తున్నాను అని. అసలు దెయ్యం నన్ను ఆల్‌రెడీ ఆవహించేసిందా!!
అందుకే ఇలా ఇంత రాత్రి వేళ ఇలా పాడుతున్నానా అని
డౌట్ వచ్చింది. ఒకసారి నా పేరు, నేను పనిచేస్తున్నకంపెనీ పేరు
మననం చేసుకున్నాను కరక్టుగా. "ఓకే !!, నేను శ్రీనివాస్ నే" అని
కన్‌ఫర్మ్ చేసుకున్నాను. ఇంక లైట్ ఆర్పకుండా బలవంతంగా
పడుకున్నాను. ఏవొ ఆలోచనలు, భయాలూ, ఇన్సె‌క్యూరిటీస్
బుర్రలో నలుగుతూ ఉండగా మెళ్లగా నిద్రలోకి జారుకున్నాను.